Tuesday, February 9, 2010

మా ఊరి మాటలు

"మీనుంచీ మీ సీమోళ్ళ భాష వినబడుతుందేమోనని ఆశపడ్డా, డిసప్పాయింట్ చేశార"ని ఈ మధ్య ఒక యువ బ్లాగ్మిత్రుడన్నాడు. అంత రాక్సాలిడ్ మాట వింటే బాధ కలగాలి, కానీ కొంచెం ఆనందమేసింది. నా ఆనందానికొక చిన్న కనురెప్పపాటువెనుక (ఫ్లాష్ బ్యాక్) ఉంది.

నేను మా ఊరు విడిచి బయటపడకుండా, అక్కడే కూపస్థమండూకంలా, డిగ్రీ వెలగబెడుతున్న రోజుల్లోనే కొంత మంది ఇతర జిల్లా బాహ్యస్థ మండూకాలు సహాధ్యాయులుగా దొరికారు. వాళ్ళలో ఒకడు శ్రీకాకుళం వాడు, కొంతమంది నెల్లూరు వాళ్ళు, ఇశాపట్నమోళ్ళు, కరీంనగర్ వాళ్ళు ఇలా రకరకాలు. తెలుగులో అన్ని రకాలుంటాయని, ఒక్కో తెలుగు ఒక్కో రకంలా ఉండుద్దనీ, అప్పుడే ఎరికయ్యింది. ఆ తర్వాత వూర్ల మీద పడి తిరుగుతున్న రోజుల్లో ఎక్కువగా విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళూ రూమ్మేట్లు గావడంతో నా భాష మారిపోయింది. అదీ జరిగిన సంగతి.

ఫ్లాష్ ఫ్రంటుకొస్తే - మా సీమ భాష అట్లా మర్చిపోయినా, అప్పుడప్పుడూ అలా గుర్తొస్తా ఉంటుంది, రానారె మాటలు విన్నప్పుడూ, నామిని కతలు చదూతున్నప్పుడు వగైరా వగైరా. కానీ ఎక్కడో చిన్న అనుమానం. మా తెలుగు మంచి ప్రామాణికమైన తెలుగేనా అని. ఇది నా కాంప్లెక్సే గానీ, వ్యర్థమైన డౌటు రాజం అని చాలా సార్లు నాకునేను సర్దిచెప్పుకున్నా, అప్పుడప్పుడూ అది తొలుస్తా ఉంటుంది నాకు.

అలానే తెలంగాణా మాండలికంలో వాడబడే "ఉన్నిండ్రు", "ఉంటుండ్రు" వంటి పదాలు అప్పటమైన తెలుగు పదాలని తిరుమల రామచంద్రగారు చెబుతారొకచోట. ఆయన చెప్పిన మరో ప్రయోగం "సేపు". మామూలుగా సేపు అన్న పదం విశేషణాలతో కలిసి "కొంచెం సేపు", "చాలా సేపు" అని వాడబడుతుంది. కానీ కర్ణాటక సరిహద్దు సీమ ప్రాంతాల్లో "సేపెంతయ్యింది" అన్న వాడుక ఉంది.

సరే, కథ కొస్తే, ఈ మధ్య సీమ మాండలికంలో పదాలు ఓ రెండు ప్రబంధాల్లో కనబడ్డాయి. వాటి కథకమామీషు ఇది.

౧. కూపెట్టుట - చాలా ఏళ్ళక్రిందట, మా పక్కింట్లో దంపతులు బాడుగకు దిగారు. వారిది మా జిల్లానే అయినా, దూరప్రాంతం కర్ణాటక సరిహద్దు (మడకశిర) నుంచీ వచ్చారట. వాళ్ళ అమ్మాయి తమ్ముణ్ణిలా పిల్చింది, "రేయ్, అమ్మ కూపెడతా ఉంది. గొజ్జు చేసిందంట, రాల్లంట". అప్పుడు అక్కడ నేనూ, నాతో బాటూ మా అన్నయ్యా, ఇంకొంతమందికీ నవ్వొచ్చింది. కూపెట్టటమేంటి? అని. ఆ అమ్మాయి, ఆ అబ్బాయి సిగ్గుపడ్డారు మా నవ్వులు చూసి. (గొజ్జు అంటే - పులిహోర గొజ్జు)


అదుగో ఆ కూత ఇన్నాళ్ళకు మళ్ళీ ఇక్కడ.

ఏ పట్టున విసువక ర
క్షా పరుడవు గమ్ము ప్రజల చక్కి, విపన్నుల్
గూపెట్టిన విని తీర్పుము,
కాపురుషుల మీదనిడకు కార్యభరంబుల్

ప్రజల మీద విసుక్కోకు, ఆపన్నులు మొరపెట్టుకుంటే, శ్రద్ధగా ఆలకించు, చెడ్డవాళ్ళ మీద కార్యభారాలు వేయకు అని రాజనీతి సూత్రాలు చెబుతాడు ఒకాయన. ఆ పద్యం మా సీమకు పేరెట్టిన సీమ రాయడి కావ్యంలోనిది. కూపెట్టటమంటే పిలువడమూ, మొరపెట్టుకోవటమూనట.

౨. ఉడ్డ

మెత్తగ నూఱిన చుట్టుం
గత్తిన్ మధుకైటభోరు కంఠము లలనా
డొత్తిన హత్తిన చేదుం
దిత్తుల క్రియ దొడల నుడ్డ తిత్తులు వ్రేలన్.

ముందుగా ఒక ససందర్భ ప్రేలాపన. నామిని మిట్టూరోడి కతల్లో "అలిమేలు మంగమ్మకొక దండం" అన్న కతొకటుంది. ఆ కతలో ఓ వాక్యమిది.

"మడికాడికి ఆవును తోలకబోతా ఉండిన కర్రెక్కా, బోరింగు కాడ బోకులు తోముకుంటుండిన కడుపక్కా, మొగుడికి చద్ది పోస్తాపోస్తా ఉండిన నీలావొతీ అందురూ, చేపలగంప చుట్టూతా వుడ్డజేరిపొయినారు."

ఉడ్డజేరడం అంటే, గుంపు జేరటం అనే అర్థంలో మా ఊళ్ళోనూ నేను చిన్నప్పుడు విన్నాను., ఆ మాట వాడి ఉంటాను కూడాన అయితే ఈ మాట ఎక్కడా కనపడలేదు ఇన్నాళ్ళూ. మళ్ళీ ఆ పైన పద్యం లో "ఉడ్డ" ప్రస్తావన కనబడగానే కొంచెం ఛాతీ సైజు పెరిగింది నాకు.

ఆ పద్యం వివరణ ఇది.

ఆ పద్యం తాలూకు హీరో స్పష్టంగానే తెలుస్తూంది, పాండురంగడని. ఆ అయ్య ఆవులు కాస్తూ, కాస్తూ మధ్యలో సమయం దొరికినప్పుడు మిగిలిన గోపాలకులతో కలిసి గోళీలాడతాడట. అందుకోసం ఆయనకు నాలుగు గోళీకాయ (గచ్చకాయ) సంచులు మొలకు చుట్టుకుంటాడుట. వాటి వర్ణన ఆ పద్యం.

మెత్తగ నూరిన - బాగా పదునెట్టిన
చుట్టుం గత్తిన్ - చక్రం తోటి
మధుకైటభోరు కంఠములలనాడొత్తిన - మధుకైటభుల కంఠాలను తరిగిన (ఒత్తిన అంటే శబ్దం రాకుండా తరిగెయ్యటమట)
చేదుం దిత్తుల - చేదటానికి (గాలి తోడుకోవటానికి) పనికొచ్చే తిత్తులు అంటే ఊపిరితిత్తులట. మధుకైటభులు ఇద్దరివీ చెరో రెండ్రెండు, వెరసి నాలుగు సంచులు.
హత్తిన - లభించిన
క్రియన్ - యట్లుగా
తొడలన్ - తొడలకటూ ఇటూ
ఉడ్డ తిత్తులు వ్రేలన్ - నాలుగు సంచులు వ్రేలాడుతున్నవి.

ఇక్కడ బేతవోలు రామబ్రహ్మం గారి వివరణ -

"ఉడ్డ" అనేది నాలుగు అనే అర్థంలో ఆచ్ఛికపదం. ఉడ్డాముగ్గురు అనేది రాయలసీమ వాడుక. ఏడుగురు అని.

ఉడ్డ అంటే నలుగురు అని విశేషమైన అర్థం తీసుకున్నాడు కవి. అయితే సామాన్యంగా వాడుకమాటల్లో గుంపు అని అర్థమనుకుంటాను.

ఈ పద్యమూ ప్రబంధ కవివరులదే. మొదటి పద్యకర్త పేరులో ఉన్న కృష్ణయ్యే ఈ కవి పేరులోనూ ఉన్నాడు!

(నెనర్లు - పద్యకవితా పరిచయం - బేతవోలు రామబ్రహ్మం గారు - అజోవిభో కందాళం వారి ప్రచురణ)

15 comments:

 1. బాగుందండీ మీ అబ్సర్వేషన్

  ReplyDelete
 2. అందుకనే రాయలసీమ మాండలీకం లోని పదాలు ప్రామాణికమా కాదా అని ఆలోచించకుండా నా టపాల్లో వాడటం ప్రారంభించాను. పిలకాయలు, లోటా, అయ్యోరు లాంటి పదాలు.

  ReplyDelete
 3. మన వూరు లో ఏది మాట్లాడితే అదే ప్రమాణం. :-) ప్రామాణిక తెలుగు ఇది అని ఎలా నిర్వచిస్తారో? అమెరికా లో ’నో గుడ్’ అనే పదం మంచి ఇంగ్లీషే.. కాబట్టీ నాకు అది కరక్టే. మీకు కాక పోతే పోని.. :-)

  ReplyDelete
 4. బాగుంది... :)

  ఐతే మీరు ఒక చిక్కుముడి విప్పాలె ఇప్పుడు. ఈ క్రిందిది చదివి, అర్థం చెప్పి చిరుమందహాసంతో ఏ తెలుగు ప్రామాణికమైందో చెపితే మీకు గండపెండేరం బహూకరించబడును. ఇది మీరు దొరకపట్టుకోలేకపోతే మీకు రేణిబళ్ళు, తీటగంజరి, యాలకబుడ్డలు ఇచ్చి హరట్లుకొట్టడం మానమని ఏడసాలలో గద్దలం గద్దలమే. ------

  ***********************************

  మరాసిలాఅజ్క బెహరి తహసీల్ తాలూకా శిరిశాలజిలె యెల్ గందర్వాక్కె బ 2 పర్వర్ది న్న 1306 సాలు నిషాన్ 374.

  బి.నరసింహారావు వుమీద్వార్ తహసీళజాకు తెలియపర్చనవుతుందికదా ఆలీజనాబ్ అవ్వల్తాలకాదార్ సాహేబ్ జిలె ఎల్గందల్ గారు బిల్ముషాఫాయలాటి హుకుం యిచ్చి ఉన్నారుకదా. నీకు మోజె నల్లగొందవకొరెపట్వారిగిరిపైన మాములచేయగలందులకు

  కావున హుకుం యివ్వనవుతాందికదా నీవు మొవాజాత్ మజ్కూర్కు నేడే హాజరయ్య దఫ్తర్పట్వార్గిరిజాయి జాహాసిల్ జేసుకొని ప్రతిదివసం మహాజాత్ మజ్కూర్లో హాజరుండి సర్కార్పని బహుజాగ్రత్తగా అదా చేస్తూ వుండావలసింది. లాకె ఇందుల్ఖులూ ఎజాయిదాద్ సర్కార్ ఖిద్మతు పైన ముస్తఖిలానా మామూరు చేయగలందులకు వేహాజ్చేయడం కాగలదు.

  ఇందువలన్ ముసన్నసాబక్ పట్వారికిచ్చి వ్రాయించేది యేమనగా నవుదఫ్తర్పట్వార్గిరిజాయిజా నరసింహారావుకిచ్చి నీవు అలగ్ కావలసింది.

  ముసన్నసానిదఫ్తర్నగదికి బగర్జెయీసాబోయిస్కి యివ్వడమైంది. ఫక్తు

  *********************************

  ReplyDelete
 5. చాలా బాగుందండీ. అయినా తెనాలివాడికి ఈ అచ్చమైన సీమ పదాలు ఎలా పట్టుబడ్డాయో! సీమలోనే పుట్టి పెరిగాడంటారా?

  ReplyDelete
 6. @వేణు, @రవిచంద్ర, @భావన, @విజయమోహన్ గారలు : ధన్యవాదాలు.

  @వంశీ: అది తిట్టుడా, పొగుడుడా కూడా సమజైతలేదు.

  @నాగమురళి: సంస్కృతాంధ్రాలు అవపోశన పట్టినాయనకు మాండలికం పదాలు నేర్చడం ఎంతసేపండి? పాండురంగ మహాత్మ్యం ఆయన రచనల్లో చివరిదని ఒక అనుకోలు. ఆ సరికి విజయనగర సామ్రాజ్యంలో స్థిరపడి ఈ భాష వంటబట్టించుకుని ఉంటాడు.

  ReplyDelete
 7. @ వంశీ
  అయ్యా!

  మీరు చూపెట్టిన పత్రం 'ఉర్దూ/పార్శీ' రాజభాషగా ఉన్న కాలం 'తాలూకా'!. అది 'ఫక్తు' తెలుగు కాకపోయినా , ఆ వాక్యాలు చదివినప్పుడు నేటి unofficial రాజభాషతో రాయబడే 'తెంగ్లీషు' కన్నా ఘోరంగా అయితే లేదు.

  మీరు 'మాగంటి.org' ద్వారా తెలుగు భాషకు చేస్తున్న సేవ నిరుపమానం. కానీ మాండలికాల మీద మీకున్న ఏహ్యభావం, నిరసన చాలా చోట్ల చూసి కించిత్ బాధతో ఈ వ్యాఖ్య!

  ReplyDelete
 8. With the exception of Tenglish sentiments, I echo with Dr Ismail.

  ReplyDelete
 9. @ రవి: అది రాసింది ఎందుకో తెలుసా? మీ అసలు పోష్టు సంగతి బాగుంది. అదే చెప్పాను. అది చెప్పాక మీ "ప్రామాణిక" సందేహం తీర్చటానికి వేసిన ముడి.

  పై కామెంటులో నేను రాసిన భాష ఒకప్పుడు ఇప్పటి మన రాష్ట్రంలోని ప్రాంతాల్లో రాజ్యమేలిన భాష. ఎంత ప్రామాణికమంటే ఈ క్రింద రాయలవారు అన్న "రాజ్యభాష"గానే కాక చాలామంది సామాన్యులు కూడా మాట్లాడేంత. ఐతే అప్పటి ప్రామాణిక భాష ఇప్పుడు ఎక్కడ? పెను మార్పుల సింధువులో ఒక బిందువుగా మిగిలిపోయింది. భాష, మాండలికాల ప్రామాణికతకొస్తే ఏదీ ప్రామాణికం కాదు. ఉపయోగం కన్నా అవసరం ఎక్కువ కాబట్టి "ప్రామాణిక" ముసుగు తగిలించారు. అందులో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరమూ లేదు. కానీ సామాన్యుడికి ఏది సుఖాన్నిస్తుందో, ఏది అవసరాలు తీరుస్తుందో వాడు అదే వాడుకుంటాడు. అదీ అవసరమున్నంతవరకే, మార్పు అనివార్యం అవనంతవరకే. సీమవాడైనా, తెలంగాణావాడైన, ఉత్తరాంధ్రంవాడైనా ఒకటే లెఖ్ఖ ఇందులో. సంస్కృతాన్ని వదిలేసి, మన భాషకొస్తే వంద సంవత్సరాల క్రితం వున్న ప్రామాణిక భాష ఇప్పుడు సీమలోఉన్నదా? తెలంగాణంలో ఉన్నదా? ఎక్కడ వున్నది ? ఇంకా రాసుకుంటూ పోవచ్చు, కానీ నా అసలు ఉద్దేశం అర్థమయ్యిందనే అనుకుంటున్నాను. కాలేదు అంటే చెప్పండి, మళ్ళీ తీరిగ్గా వచ్చి చెబుతాను. ఏతావాతా - మీరు సామాన్యులే కాబట్టి మీకు ఏది సుఖమో, ఆనందమో అందులో రాయటానికి వెనకాడొద్దు. :)

  ప్రామాణికత ఒక బుడగ. ఇంకో మాట, ఇప్పుడు నేను ఇక్కడ రాసిందంతా, మీకు సీమభాషలో రాసిపెట్టగలనూ, ఉర్దూ/పార్శీ భాషలో రాసిపెట్టగలను, ఇప్పటి తెలంగాణా భాషలో రాసిపెట్టగలను, ఉత్తరాంధ్రంలోనూ రాసిపెట్టగలను. :) అదండి సంగతి

  యథా అవసరం తథా ప్రజానీకం

  మీకిచ్చిన చిక్కుముడి చివరకు రాయలవారు విప్పారు. సంతోషం . :)

  ఇహ @ఇస్మాయిల్ : సేవ అని చాలా పెద్ద మాటనేసారే. :) దానికి మళ్లీ నిరుపమానం అని ఒక ఉప్మా తగిలించారు. దానికో తబ్బిబ్బు. దాదాపు ఐదేళ్ళ నుంచి మీతో ప్రత్యక్ష పరిచయం లేకపోయినా, రాత-కోత ద్వారా తెలుసు. ఒక రోగి నాడి పట్టుకుని వాడు ఏమీ చెప్పకముందే వాడి రోగమేమిటో చెప్పాల్సిన వృత్తిలో వున్నోరు, నా కామెంటులోని అర్థం పట్టుకోలేకపోయారంటే ఆశ్చర్యంగా వున్నది. ఆపైన ఏహ్యభావం అని అభాండం వేసారొకటి.. :) సహస్రావధానంలోని సహస్ర కృతజ్ఞతలు..

  మీకు కుదిరినప్పుడు రవి కిచ్చిన సమాధానం చదువుకోండి. సందేహాలు, ఇతర ఆరోపణలు నా ఈమెయిలు అడ్రస్సుకు పంపించండి. అక్కడ మాట్టాడుకుందాం. ఇక్కడ "రవి" ప్రదేశంలో "రచ్చ" ఎందుకు ? :)

  ReplyDelete
 10. చాలా బావుంది.
  యువకథా రచయిత సుంకోజి దేవేంద్ర మన మంచి ఆటలు అని ఒక ముచ్చటైన బుల్లి పుస్తకం రాశారు, విశాలాంధ్రవాళ్ళు వేశారు. అందులో తన పల్లెలో తన చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ చిత్తూరు మాండలికంలో రాశారు. పిల్లలందరూ గుంపు చేరినాము అనే అర్ధంలో ఉడ్డాగూడినాం అనే వాడుక చాలా సార్లు కనబడిందా పుస్తకంలో.

  ReplyDelete
 11. @వంశీ గారు: ప్రామాణికత అనేది పెద్ద బుడగ మీరన్నట్టు. ఈ పదం కాస్త పెద్దది, ఈ టపాకు సంబంధించి. అయితే ఏదో అలా వచ్చేసింది.

  పోనీలెండి. రాయలవారి, విసురు, మీ సమాధానం తర్వాత నాకు ఈ వీకెండు చదువుకోడానికి కాస్త సరుకు దొరికే చోటు దొరికింది.మీరూ, రాయల వారూ, ఏవైనా మెయిల్స్ అవీ ఈ విషయం మీద రాసుకుంటే, నాకూ ఓ కాపీ పెట్టడం మర్చిపోకండి.

  @కొత్తపాళీ గారు: మీరు చెప్పిన పుస్తకం విన్నాను. అది చిత్తూరు మాండలికంలో ఉందని ఇప్పుడే తెలుస్తూంది. ఈ సారి ఊరెళ్ళి వెతకాలి.

  ReplyDelete
 12. @ వంశీ
  అమంగళం ప్రతిహతమగుగాక! క్షమాపణలతో...

  ReplyDelete
 13. telugu gurchi telugu lo blogulu bagunnayi

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.