Tuesday, January 26, 2010

మంచితనం - మానవ సంబంధాలు

చాలా యేళ్ళ క్రితం ఉద్యోగం దొరికిన కొత్తల్లో రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో నరేంద్రుడనే అతను అనేక యాత్రలు జరిపి, చీనా దేశానికి చేరుకుని అక్కడ అనేక సేవాకార్యక్రమాలు చేస్తూ మరణిస్తాడు. అతడి వృద్ధాప్యంలో అతననుకుంటాడు. "ప్రజలు దీనులూ, దరిద్రులూ అయితేనే కదా, వాళ్ళకు సేవ చేసే అవకాశం లభించేది నాకు? అంటే పరోక్షంగా వాళ్ళు దీనులు కావాలని కోరుకుంటున్నానన్నమాటే కదా?" - ఈ వాక్యాలు చాలా కాలం గుర్తుండిపోయాయి.

మన మంచితనం వెనుక ఉన్నది స్వార్థమా? నిస్వార్థమా? అని ఓ అవిశ్వాసమూ, అపోహా నాకు. ధనసాయం కానివ్వండి, మాటసాయం కానివ్వండి, నైతిక మద్దతు కానివ్వండి, ఎంత ప్రతిఫలాపేక్ష ఆశించకపోయినప్పటికీ, మనుషులు చేసే మంచిపనుల్లోనూ అంతర్లీనమైన స్వార్థం ఉండకపోదని చాలాసార్లు అనిపిస్తుంది. స్పష్టంగా ఫలానా అని చెప్పలేకపోయినా, ఏదో అంతర్లీనమయిన స్వార్థం మటుకు ఉండి ఉండాలి.

కొన్నేళ్ళ క్రితం నాకో సహోద్యోగి ఉండేవాడు. చాలా ధనవంతుడు. ఉద్యోగం నామమాత్రమే. మామిడి తోటలూ, అవీ ఉండేవి వాడికి. వాడి భార్యా, ఉద్యోగస్తురాలే. DINK సంసారం. చీకూ చింతల్లేవు. ఆఫీసు వాళ్ళు ఏదైనా చారిటీ కార్యక్రమాలు అవీ ఏర్పాటు చేస్తే, వితరణల్లో వాడి పేరు మొదట నిల్చేది. వేలల్లో ఖర్చు పెట్టేవాడు. అయితే కారులో వెళుతూన్నప్పుడు మధ్య కూడలిలో ఎవరైనా అనాథలు కనబడితే చాలా అసహనం ప్రదర్శించేవాడు. నాకు అతగాణ్ణి చూసి విచిత్రం అనిపించేది.

ఓ రోజు నాకూ ఓ సందర్భం ఎదురయ్యింది. కాలు చెయ్యి బావున్నా, మాసిపోయిన గడ్డమూ, చింపిరిజుత్తూ ఉన్న ఒకతను చాలా దీనంగా అడుక్కుంటూ వచ్చాడు మా ఇంటిదగ్గరకు. అతడి కొడుకు చిన్నపిల్లాడట. భార్య రోగగ్రస్తురాలట. అతడు ఏదో పని చేసుకునే వాడు, కానీ పని వదిలేసి ఇలా ప్రత్యక్షమయాడో రోజు. అతణ్ణి చూడగానే సహాయం చెయ్యాలనిపించింది, కానీ తటపటాయింపు. ఆ డబ్బు అతడు తాగటానికి ఖర్చుపెడతాడేమో, లేకపోతే, అదంతా నాటకమనో ఇలా. అదే ఆఫీసు వాళ్ళో, మరొకళ్ళో ఎవరైనా డొనేషన్ అడిగితే ఆ అనుమానాలు రావు!. దానికి కారణం - ఎక్కడో, ఏ మూలనో "దానం చెయ్యడం" కన్నా, "నేను" దానం చేస్తున్నానన్న భావన మనకు ముఖ్యం. ఇది మంచితనమా? స్వార్థమా?

(అతడిది నాటకం కాదని, అతడు నిజమే చెబుతున్నాడని తెలిసింది ఆ తర్వాత. అయితే తెలుసుకునేసరికి అతడి భార్యా, పిల్లాడు పోయారు. అతనూ పోయాడు కొన్ని రోజులకు)

నైతిక మద్దతు (moral support) కూడా అలాంటిదే. మొదట నైతిక మద్దతు ఇచ్చేందుకు ఎగబడతాము, అవతలి వాడు బాగుపడిన తర్వాత, నా వల్లే అతడు బాగుపడ్డాడని చెప్పుకోవడానికి సందేహించము. ఎవరైనా మనకు సహాయం చేయడానికి అవకాశం ఇస్తున్నారంటే, అది వారు మనతో అనుబంధం పెంచుకోవడానికి ఇస్తున్న అవకాశం తప్ప, వారి బలహీనత ఎంతమాత్రం కాదు.

కుటుంబసంబంధాలు పరస్పరం ఇలానే ఉండేవి క్రిందటి తరం వరకు. నా చిన్నతనంలో మా చిన్నాన్నలూ, మామయ్యలూ, ఇతర బంధువులూ ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాలు, ఆ తర్వాత తీర్చేయడాలూ, చాలా సాధారణంగా ఉండేవి. వాళ్ళలా ఉంటే, ఇప్పటి తరం వాళ్ళమయిన నేనూ, మా అన్నయ్యా, మా కజిన్స్ మాత్రం ఒకరిదగ్గర ఒకరు సహాయం అడగడం నామోషీగా భావిస్తున్నాం. నేను ఓ సారి అవసరమొచ్చినప్పుడు సిటీబ్యాంకు వాడి దగ్గర లోనుకెళితే, ఇంకొకరు సహాయం అవసరమని మాటవరసకైనా చెప్పరు. మా ఇంట ఏదైనా పండుగో పబ్బమో వస్తే, మా అత్తలూ, పిన్నమ్మలూ, ఇతరత్రా అందరూ వచ్చి కలిసికట్టుగా వంటపనుల్లో పాల్గొని పనులు చూసుకునే వారు. ఇప్పుడు మాత్రం వారిని పిలిచి వారి సహాయం అడిగి "చులకన" అవడం కన్నా ఏ క్యాటరింగు వాడికో పని వప్పజెబితే సరి!

మనిషికి డబ్బు తో బాటూ సమాంతరంగా మరొకటీ పెరుగుతూ పోతూంది. అది ఏకాకితనం (isolation). స్వార్థం అనేది బయటకు వ్యక్తమయే ఏకాకితనం. ఏకాకితనం అన్నది తెరమరుగున దాగిన కనబడని స్వార్థం. ఇది ప్రస్తుత కాలంలో కుటుంబంలో బంధువులమధ్య మొదలై, మెల్లమెల్లగా తండ్రీకొడుకుల మధ్యా పాకుతూ వస్తూంది. మెల్లగా అయినా స్ఫుటంగా ఇది భార్యాభర్తల మధ్యా వ్యాపిస్తూ ఉంది. ఎంత గొప్ప అనుబంధమైనా, ఏడేడు జన్మలబంధమైనా ఒకరికొకరికి మధ్య బలీయమైన మానసిక అవసరం లేకపోతే ఆ బంధంలో ఆపేక్ష తగ్గుతుంది. ఏ కారణం చేతయినా కానివ్వండి, స్త్రీ, పురుషుడి మీద ఆధారపడడం ద్వారా కుటుంబ బంధం బలంగా ఉండేది ఇదివరకటి రోజుల్లో. స్త్రీలకు విద్యా, పరిమితమైన ఆర్థిక స్వేచ్ఛా అవసరమే.అయితే ఉద్యోగం చేసే అవసరం మాత్రం రాకూడదు. వారి శారీరక, మానసిక సామర్థ్యాలకనుగుణంగా వారికంటూ నిర్దిష్టమైన గృహధర్మాలు ఉన్నవి.

కుటుంబసభ్యుల మధ్యే కాక, బయట సమాజంలోనూ ఈ స్వార్థం (ఏకాకితనం) బహిర్గతంగా ప్రకటితమవుతూ ఉంది. వీధికొకటి చొప్పున ఉదయిస్తున్న వృద్ధాశ్రమాలు, అమ్మమ్మల అవసరం లేకుండా పిల్లలను చదివించే ఆట ఇళ్ళూ (ప్లే హోమ్స్) వంటివి దీనికి ఉదాహరణలు.

ఇంట్లో డబ్బు సంపాదించేవాడి అవసరమెంతో, డబ్బు సంపాదించలేని వారి (అమ్మమ్మలూ, తాతయ్యలూ వగైరా) అవసరమూ మన ముందుతరంలో బాగా ఉండేది. చిట్టి మనవళ్ళనూ, మనవరాళ్ళను కాళ్ళమధ్యన బోర్లపడుకోబెట్టుకుని లాల పోసే అవసరం తో మొదలయి, వారి ఆలనాపాలనా చూస్తూ, వారికి భాషా, మంచిమాటలూ, పనుల్లో నేర్పూ అన్నీ దగ్గరుండి చెప్పించే వాళ్ళ అవసరం తగ్గిపోతూ వస్తూంది. "శాస్త్రీయ" పద్ధతుల్లో ఆటా, పాట నేర్పడానికి ప్లే హోమ్స్, రెండున్నరేళ్ళవగానే ఎగబడ్డానికి స్కూళ్ళూ ఉన్నాయి.

("శాస్త్రీయ" పద్ధతుల్లో పిల్లలను చూసుకుని, వారికి తగిన తర్ఫీదు ఇవ్వబడును. అని బెంగళూరులో ఓ బోర్డు చూశా మొన్నామధ్య)

నిజమైన సమస్య, కొడుకులు స్వార్థపరులవడమో లేక, వృద్ధులు పనికిరాకుండా పోవడమో కాదు. అది బయట కనిపించే చిహ్నం (symptom) మాత్రమే. అసలు కారణం ఒకరి మీద ఒకరికి ఆధారపడే అవసరం లోపించటము. ఆ అవసరానికి ముఖ్య ఆలంబన అయిన ధనపరమైన స్వాతంత్ర్యం సమాజంలో ఎక్కువవటమూనూ. అవసరం లేనిచోట అనుబంధం మనగలగటం కష్టం.

ఈ రకమైన సమస్యలు నిర్మూలించబడాలంటే కీలకం - అవసరాలు కల్పించుకోవడంలో ఉంది. మారుతున్న సమాజ, కుటుంబ సమీకరణాల్లో సహాయం చెయ్యటంకన్నా, సహాయం అడగటం గొప్పవిషయం. మన పెద్దలను, మన బంధువులను, మిత్రులను సహాయం అడగటం వల్ల, "చులకన" అవుతామేమో అన్నది ఓ అపోహ. తన సామర్థ్యం మీద నమ్మకం ఉన్నవాడెవడూ ఈ అపోహలు పెంచుకోడు. అలా ఎవరైనా నిజంగా చులకన చేసినా కూడా నవ్వుతూ దులిపేసుకుని పోతాడు తప్ప తలకెక్కించుకోడు. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడనేది పాతమాట. వలసినప్పుడు సహాయం అడిగి, ఆ తర్వాత కుదిరినప్పుడు తిరుగు సహాయం చేస్తూ, సాధ్యమైనంతవరకూ సంబంధాలను నిలుపుకునేవాడే ఇప్పటికి ధన్యుడు! అలాంటివాళ్ళ అవసరమే ఈ రోజు మనకు కావాలి.

25 comments:

 1. రవి గారూ ! మీరు చెప్పిన కోణం లోంచి చూస్తే ఔనన్నట్టే ఉన్నా ఎందుకో మీతో పూర్తి గా ఏకీభవించలేకపోతున్నా... కారణాలు రెండు.

  (1) రాహుల్ సాంకృత్యాయన్ పుస్తకం నేనూ చదివాను. కాకపోతే ఆ భావన నన్ను ఆట్టే ఆకట్టుకోలే. ప్రపంచం మొత్తం లో ఎవ్వరు ఎంత సహాయం చేసినా ఆ సాయం చేయగల మనుష్యులు బహుసా శత సహస్రాంశమో, ఎంతోనో... ఇంకా చేయవలసినది కొండంత. కాబట్టి సహాయం చేయ్యాలి అనే సత్సంకల్పం నిర్భాగ్యులు కలకాలం ఉండాలని కోరుకోవటానికి మూలం ఔతుంది అని భావించటం లేదు. ఒకవేళ నా ఆలోచనకే, నా కోర్కెకే అంత బలీయమైన శక్తే ఉంటే, లోకాస్సమస్తా స్సుఖినో భవంతు అని కోరుక్న్నందుకు అంతకు మించి మంచి జరగాలి.

  కాబట్టి కర్మణ్యేవాధికారస్తే అనుకుంటూ నేను నా విహిత కర్మ చేయటమే తప్ప.. అంతకు మించి భావనల్ని ఆపాదించటం.. నాదృష్టిలో శుధ్ధ దండగ.

  (2) హైదరాబాదులో రన్నింగు బస్సు ఎక్కుతూ పడిపోబోతున్నవాణ్ణి అక్కడే ఫుత్ బోర్డు మీదున్న వాడు వెంటనే చెయ్యిచ్చుకు పైకి లాగటం సర్వ సాధారణం. అక్కడ మంచితనమూ, స్వార్ధమూ.. గట్రా ఆలోచనలు రావు. నాణేనికి రెండోపార్శ్వం అన్నట్టు అదే వీధిలో ఏదైనా గలాటా జరుగుతూంటే ఆపి, సామరస్యం సాధించి శాంతి స్థాపించి కరుణామయులైపోయి మంచి మార్కులు కొట్టేయ్యాలని ఆ వొక్కరూ ఆలోచించరు. చోద్యం చూసినట్టు చూస్తూనే ఉంటారు.
  ఇక్కడ నేనివ్వదలచుకున్న సారూప్యం స్వార్ధం, మంచితనం వగైరా కాదు.. అవసరం లో ఉంటె ఆదుకోవటం, శక్తికి మించిన విషయాల్లో తలదూర్చకుండా ఉండటమే..

  జంతువులు కూడా తన తోటి వాటికి వీలైనన సహాయం చేస్తాయి. మనుష్యులకి కూడా చేస్తాయి విశ్వాసం అన పేరుతో ... మనిషి కూడా అల్లాచేయటం అన్నది ప్రకృతి సహజం. అది మర్చిపోయినవాళ్ళకి గుర్తు చేయటానికే, దాన ధర్మాలు గట్రా పెట్టారు అని నాభావన.

  (2) ఇంతకీ సరిగ్గా అర్ధం చేసుకుంటే స్వార్ధం అన్నది ప్రకృతి కల్పించిన ఒక చిన్న మాయ. నెల రోజులు కష్టపడి సంపాదించిన జీతం మనకోసం అనుకుంటాం. ఎవరికోసం? మనకోసమా???? 30 రోజులూ ఎవరేవరికోసమో వాళ్ళవాళ్ళ ఫైళ్ళ మీద పనులు చేసిపెడితేనే కానీ నెలాఖరుకి జీత రాళ్ళు అందవు. పోనీ అక్కడ చేసింది వాళ్ళకోసమైనా జీతం మనది అనుకుంటాం... నిజానికి చాకలి వాడికీ, పనిమనిషికీ, పాలవాడికీ, కూరగాయల వాళ్ళకీ, సరుకుల వాళ్ళకీ అందరికీ ఇచ్చాక మనకి మిగిలేది ఎంతశాతం? వాళ్ళందరికోసం సంపాదించు అంటే ఏ ఒక్కరైనా సంపాదిస్తాడా? అందుకే బయటకి నీకోసం అన్నట్టు పెట్టి అంతర్లీనంగా పరోపకారాన్ని ఇమిడ్చిందేమో ప్రకృతి. ఇది తెలియక నెలాఖరుకోసం ఈసురోమని బ్రతుకీడ్చటం, ఆజీతం లో ఎవరిది వాళ్ళకి ఇవ్వగా మిగిలింది చూస్కుని సంపాదించిది సరిపోవట్లేదు అని భోరున ఏడవటం మనిషి నైజం...

  పరిస్థితులు బాగోలేకపోతే గ్రహశాంతి చేయించు, ఇంట్లో శుభకార్యాలకి భోజనాలు, బట్టలు పెట్టు |మొ| అన్నవి తంతు గానే చేసేవాడికి సుఖం లేదు (డబ్బుల లెక్కలు తప్ప). సంతోషం గా చేస్తే కనీసం తృప్తి మిగులుతుంది....
  తిట్టుకుంటూ చేసినా పరోపకారమే అనుకో.... ఔనాన్నా కాదన్నా జరిగేది పరోపకారమే...

  పరోపకారార్ధ మిదం శరీరం అన్నది అర్ధమైతే దానిస్వరూపమే వేరు...

  ReplyDelete
 2. రవి గారి..దానం వేనుక స్వార్దం ఉంటూంది అని మీరు చేప్పినా మాట తేలియజేసిన విధానం ఒప్పుకోనే విధంగా ఉన్నా రియలిటి లో మాత్రం విరుద్దంగా ఉంటుంది దానం అంటె అర్దం నిస్వార్దం మే కదండి..
  టాపిక్ ఇస్ గుడ్

  ReplyDelete
 3. Your thoughts are very good. But looks like you tried to touch many aspects. I agree with you on the humanrelations and the way we are looking at them these days when compared to past days.
  About helping others I don't think what you said is not always true and with all.
  I wish I could type in telugu fast so that I can convey my thoughts in a way what I mean .

  ReplyDelete
 4. షికాగో డవున్టవునులో నాకు రోజూ కొంతమంది అడుక్కునేవారు కనిపిస్తారు కానీ వాళ్ళకు దానం చేయడం అంటే అలాంటివారిని ప్రోత్సహించినట్లే అని సమర్ధించుకొని సెంటు కూడా ఎప్పుడూ విదిలించకుండా వెళుతుంటాను. నేను చేసేది సక్రమమయినదేనా అని ధర్మసందేహం వస్తుంటుంది. ఆ సందేహం ఇంకా తీరలేదు - నేనెవ్వరికీ ఇంకా సెంటూ విదిలించనూలేదు.

  ReplyDelete
 5. ఇద్దరి అవసరాలపై ఆధారపడి కల్పించబడే ప్రేమలకన్నా ఇద్దరు ఒకరితో మరొకరికి అవసరం లేని వ్యక్తుల మధ్య కలిగె ప్రేమలే మెరుగైనవని నాభిప్రాయం.

  ReplyDelete
 6. "ఇంట్లో డబ్బు సంపాదించేవాడి అవసరమెంతో, డబ్బు సంపాదించలేని వారి (అమ్మమ్మలూ, తాతయ్యలూ వగైరా) అవసరమూ మన ముందుతరంలో బాగా ఉండేది."

  రవిగారూ, ఈ వాక్యంతో ఎక్కడో కదిలించివేశారు. ఇప్పుడు పిల్లలకు కథలు, ముచ్చట్లు చెప్పడానికి కూడా ఈ అమ్మమ్మకు, తాతయ్యలకు అవకాశం లేకుండా పోయింది. పెద్దవాళ్ల వద్ద పిల్లలను వదిలివేస్తే వారి చదువు అటకెక్కుతుందని ఇప్పటి సమాజం ఘనమైన అభిప్రాయం. పిల్లలకు శత్రువులు ఎక్కడో లేరు. ముందుగా ఇంట్లోనే ఉన్నారు. వాళ్లే తల్లితండ్రులు. తర్వాతే టీవీలు, స్కూళ్లు, సమాజం అని ఎక్కడో చదివాను. దశాబ్దాలుగా పిల్లల పోషణభారం చూసిన పెద్దలు చివరకు కుటుంబానికే భారంగా తయారైన పరిస్థితి.. మళ్లీ తాతమనవడు సినిమా చూడాలనిపిస్తుంది. తాతకు గొయ్యి తవ్వాలని నాన్న ప్రయత్నిస్తే, నాన్నకు కూడా ముసలివాడు కాకముందే ముందే గొయ్యి తవ్వాలని పుత్రుడు బయలుదేరతాడు. సమాజమే ఓ గొయ్యిలా మారిపోయింది. మీ వ్యాసం ఎక్కడో తగులుతోంది.

  ReplyDelete
 7. సాధ్యమైనంతవరకూ సంబంధాలను నిలుపుకునేవాడే ధన్యుడు! అలాంటివాళ్ళ ఎంతమంది వున్నారంటారు?

  ReplyDelete
 8. రవిగారు.. చాలా బావుంది.. ముఖ్యంగా ఆఖరు రెండు పేరాలు.. Very convincing

  ReplyDelete
 9. యతికోసం టైటిల్లో "మంచితనం" అన్న మాట వేసారేమో కాని, "అవసరాలు - మానవ సంబంధాలు" అని పెట్టి ఉంటే ఇంకా సరిగ్గా ఉండేది :-)
  "దాతృత్వం - స్వార్థం", "అవసరాలు - మానవసంబంధాలు" అన్న రెండు టాపిక్కులని కలిపే ప్రయత్నం చేసారు. వీటి మధ్య బొత్తిగా సంబంధం లేకపోలేదు కాని విడిగా ఆలోచించడం సులువు.

  మనిషి తన భౌతిక, మానసిక అవసరాల రెండిటికీ పూర్వం తోటి మనుషుల మీద ఎక్కువ ఆధారపడేవాడు. ఇప్పుడు యంత్రాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది మంచా చెడా? అని అడిగితే, ఇదీ అని చెప్పలేమని నాకనిపిస్తుంది. నాలుగో అంతస్తులో ఉన్న ఆఫీసుకి లిఫ్టులో కన్నా మెట్లెక్కి నడిచి వెళితే శరీరానికి ఆరోగ్యమే, కొంచెం సమయం ఎక్కువపడుతుంది కాని. రోజూ ఆఫీసుకి ఏ బండి మీదో కారులోనో కాకుండా సైకిలు మీదో, నడుచుకునో వెళితే కూడా ఆరోగ్యమే! మరి అది సాధ్యమా? మనిషి ఆరోగ్యానికి కన్నా సుఖానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడనిపిస్తుంది. అవ్వా కావాలి బువ్వా కావాలని కోరుకుంటే, అది సాధ్యమయ్యే విషయం కాదు కదా!
  అలాగే మానసిక అవసరాలు కూడాను. ఇంతకు మునుపు ఒక మనిషికి నాకేమైనా ఫరవాలేదు, ఆదుకోడానికి ఉన్నారు అనే మానసికమైన స్థైర్యాన్ని కుటుంబం, బంధువులు ఇచ్చేవారు. ఇప్పుడది డబ్బు ఇస్తోంది. అనుబంధానికి అవసరం ఆలంబన అని మీరన్నది నిజమే. అయితే ఆ అవసరం భౌతికమైన అవసరం కాదు, కాకూడదు. మానసిక అవసరాల మీద ఏర్పడే అనుబంధాలు గట్టిగా ఉంటాయి. అయితే, ఈ మానసిక అవసరాలకి కూడా డబ్బు ఉపయోగపడినప్పుడు, అనుబంధాలకి విలువ తగ్గుతుంది. ఆర్థికస్థిరత్వం ఇచ్చే మానసిక సంతోషం ముందు, తలిదండ్రుల దగ్గరితనమిచ్చే మనస్స్థైర్యం ఇప్పుడు చిన్నదైంది. ఇంకా ఆలోచిస్తే, అది ఎప్పుడూ చిన్నదేనేమో. ఇంతకుముందు అలాంటి అవకాశాలు తక్కువగా ఉండేవి, ఇప్పుడు ఎక్కువయ్యాయి, అంతే తేడా! భార్యాభర్తల మధ్య, బంధువులతోనూ, మిత్రులతోనూ అనుబంధాలు కూడా ఇలానే.

  అయితే ఇది సమస్యని ఎందుకనుకోవాలి? దీనివల్ల ఎవరికి, ఎందుకు, ఎలా నష్టం?

  ReplyDelete
 10. రవి గారు. మంచి టాపిక్ బాగా ప్రెజెంట్ చేసేరు కాని పూర్తి గా అంగీకరించలేక పోతున్నా కాని ఎలా చెప్పాలో తెలియలేదు మీరు అంత స్ట్రాంగ్ గా చెప్పేక. అందుకే కామెంట్ ల కోసం వైట్ చేసా :-)
  మంచితనం వెనుక అన్ని సార్లు స్వార్ధం వుండదేమో. శ్రీపతి గారు చెప్పినట్లు బస్ లో పడి పోయే వాడినో కింద పడిన వాడిని లేవ దీయటం లోనో మనకేమి స్వార్ధం వుంటుంది కాని ధన సాయం లో ఎప్పుడూ అంతర్లీనం గా మన స్వార్ధం వుంటుంది. వాళ్ళు దీనులు కావాలని కోరుకక పోయినా పేరు కోసమో సాయం చేసేనన్న తృప్తి కోసమో, పర లోకం ల పుణ్యం కోసమో దేవుడికి దగ్గరవుతామన్న స్వార్ధం కోసమో ఏదో ఒక స్వార్ధం వుంటుంది అందుకే కదా ఎవరు చెప్పేరో గుర్తు లేదు కాని అంటారు నువ్వు ఎదుటి వాళ్ళకు సాయం చేస్తున్నావంటే ఆ అవకాశం దొరికినందుకు నువ్వే వాళ్ళకు కృతజ్నత గా వుండాలి అని. అది ఒక రకమైన స్వార్ధమే కదా.

  ఇక మానవ సంభందాలకొస్తే సహాయం అడగటం ప్రత్యేకం గా డబ్బు సంభందం చాలా సార్లు మనసుల మధ్య దూరాన్ని పెంచేస్తోంది. నాకు డబ్బులు కావాలి లోన్ కు వెళ్ళటం కంటే నా కజిన్ దగ్గర వుంటాయి ఆమె దగ్గర తీసుకుని లోన్ కట్టేస్తే ఇద్దరికి బాగుంటుంది కాని నా కజిన్ భయపడుతుంది ఇవ్వలేక పోతే ఐన వాళ్ళు ఏమనలేము దీనికంటే లేదు అంటే పోలా అని. (ఇద నాకు నిజం గా జరిగిందే) రెండు సార్లు అలా జరిగితే ఎవరికైనా తుడిచేసుకుని వెళ్ళటం కష్టం కదా బంధాలు స్ట్రైన్ అవ్వటం కంటే డబ్బు గోల లేకుండా వుంటే కనీసం బంధం నిలబడుతుంది కదా... ఏమంటారు?
  ఇంక మిగతా అన్ని తల్లి తండ్రుల విషయం లో, శారీరక శ్రమ పంచుకోవటం లో 100% నా అభిప్రాయం కూడా
  ఇంకో అసలు విషయమండోయ్... మీరు ఇంతకు ముందు రాసిన పోస్ట్ లు చదవటం వలన మీరు ఏ వుద్దేశం తో ఇవి రాసేరు అని అడగాలనిపించింది నా అభిప్రాయం చెప్పే ముందు. కొంచం బాధ వేసింది ఈ పేరా చదివితే.
  ఏ కారణం చేతయినా కానివ్వండి, స్త్రీ, పురుషుడి మీద ఆధారపడడం ద్వారా కుటుంబ బంధం బలంగా ఉండేది ఇదివరకటి రోజుల్లో. స్త్రీలకు విద్యా, పరిమితమైన ఆర్థిక స్వేచ్ఛా అవసరమే.అయితే ఉద్యోగం చేసే అవసరం మాత్రం రాకూడదు. వారి శారీరక, మానసిక సామర్థ్యాలకనుగుణంగా వారికంటూ నిర్దిష్టమైన గృహధర్మాలు ఉన్నవి.

  ReplyDelete
 11. ఈ టపా రాసేప్పుడు ఏదో ఒక అంతర్మథనం తో రాసింది. బహుశా మరో సమయంలో నేనే ఈ టపాతో విభేదించనూ వచ్చు. ఇవి విస్పష్టమైన అభిప్రాయాలు కావు కనుక, సీరియస్ గా తీసుకోవద్దని మనవి.

  @శ్రీపతి గారు: రాహుల్జీ పుస్తకంలో నరేంద్రుడిది అంతర్మథనమే తప్ప తీర్మానం (assertion) కాదు.ఆయన బౌద్ధ సమర్థకుడు కాబట్టి అలా రాసాడు. కర్మణ్యేవాధికారస్తే అని విహితకర్మ చేయడం ఒక చింతన అయితే, ప్రతి విషయాన్ని ప్రశ్నించుకుంటూ వెళ్ళడం (నేతి, నేతి) మరో పద్ధతి. ఈ టపా అలా పూర్తిగా చింతనలా కాక, అలా పూర్తిగా భౌతికంగానూ కాక, త్రిశంకు స్వర్గంలో వేళ్ళాడింది కనుక, కన్ఫ్యూజన్.

  @పవన్, @వీరుభొట్ల వెంకటేష్, @సూర్యుడు, @మంచుపల్లకీ : నెనర్లు.
  @surabhi గారు : లేఖిని ఉపయోగించగలరు. This post is not to find truth, but to find which is not. anyway, Thank you.
  @శరత్ : ఓ సారి కాస్త ఎక్కువ మొత్తం విదిల్చి, అతడి మొహంలో ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చూడండి! :-)
  @Indian Minerva : Your thoughts have a deep implications, which is very complex to discuss.

  @రాజశేఖర రాజు గారు: చందమామలో ఓ జాతక కథ వచ్చింది, మీరు చెప్పిన తాతామనవడు కథపైన. చాలా బాధనిపిస్తుంది, మీరన్నట్టు.

  @ప్రేరణ : This post to show some angle in human relations. అలా అందరూ ఉండగలరు, ఆలోచిస్తే.

  @కామేష్ : టైటిల్ మీద మీరు చేసిన వ్యాఖ్య కరెక్టు.:-)

  "అయితే ఇది సమస్యని ఎందుకనుకోవాలి? దీనివల్ల ఎవరికి, ఎందుకు, ఎలా నష్టం?"

  కాస్త చిక్కు ప్రశ్నే వేశారు. ఇది కాస్త వ్యక్తిగతం కూడా. మానసిక అవసరాలు మనుషుల మధ్యలో ఉన్నంతకాలం, భావోద్వేగాలు (emotions) ఫ్లో అవుతూ ఉంటాయి. In other case, emotions will be outlet-ted. This may lead to drying out of emotions, which leads to superficial life. ఇదంతా ఏదో తత్వం లాగా ఆలోచించి చెప్పవలసి వస్తూంది, ఎందుకంటే, ఆ పరిస్థితి, స్పష్టంగా అనుభవించలేదు, మనం పూర్తిగా ఈ నమూనా చూడలేదు కాబట్టి. నేను చెప్పింది ఓ అంశం మాత్రమే. మీరు ఆ కోణంలో ఆలోచించడానికి ప్రయత్నించగలరు.

  @భావన గారు: అన్ని సార్లు స్వార్థం ఉండదు. కొన్ని సార్లయినా స్వార్థం ఉండకా పోదు. ఈ టపా వెనుక నా ఆలోచన చెబితే సులువవుతుందేమో. మనం చేసే పనులన్నీ ఖచ్చితంగా స్పృహలో ఉండి చేసేవి కావు. We are driven by our thoughts and mind. We are not conscious. స్వార్థం ఉంటుంది అంటే, దాని అర్థం, పనిగట్టుకుని స్వార్థం తోనే చేశాడని కాదు. The thought of helping somebody is be driven by our mind, which always seeks security (by it's very nature).ఇది కాస్త తలవాచే ఫిలాసఫీ. దీనికి భౌతిక విషయాలు జోడించడంతో, ఈ టపా కాస్త అవార్డు సినిమాలా అగుపిస్తూ ఉండవచ్చు.

  ఇక "పరిమితమైన స్వేచ్ఛ" అనడంలో నా ఉద్దేశ్యం ఎవరినీ కించపర్చడం కాదు, స్త్రీలను తొక్కివేయాలన్న తపనా కాదు. స్త్రీకి పూజనీయార్హత ఓ హక్కు కావాలి తప్ప నూటికి నూరుశాతం ఆర్థికపరమైన వెసులుబాటు కాదు. ఇలాంటివి చర్చిస్తే, అదీ జాలంలో తలబొప్పి కట్టడం తప్ప ఉపయోగం ఉండదు కాబట్టి, నన్ను ఒగ్గేయండి. అయితే స్త్రీలను ఎద్దేవా చేయడం నా ఉద్దేశ్యం కాదని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 12. "అవార్డు సినిమా" --:-)))

  నాకు కూడా అస్సలు వుద్దేశం లేదండి స్త్రీ స్వేచ్హ గురించి జాలం లో మాట్లాడే ఓపిక, ఎప్పుడో అమావాస్య కు పౌర్ణమి కు తప్ప (అంటే అప్పుడూకొంచం పిచ్చి లేస్తుంది కదా). మీరు రాయరు అలా అనే నమ్మకంతోనే ఆడిగేను.కొంచం బాధేసింది మీరు అలా అంటే అంతే. ఠ్యాంక్స్.

  ReplyDelete
 13. నేను విభేదించే విషయాలు కొన్ని ఉన్నా చాలా ఆలోచింప చేసింది మీ టపా. ముఖ్యంగా నన్ను ఆకట్టు కున్న విషయం సహాయం లో అంతర్లీనమయిన స్వార్థం. ఈ విషయం నాకు కూడా చాలా సార్లు అనిపించింది.

  ReplyDelete
 14. పరస్పరం ఆధారపడిేనే మానవసంబంధాలూ, అభిమానమూ మొదలైనవి ఏర్పడతాయి. నిలబడతాయి. ఆధారపడే అవసరం లేని సందర్భాల్లో అవి సమూలంగా అంతరించిపోతాయి. ఆధారపడే అవసరం లేదని మనసులో అనుకున్నా అవి అంతరించిపోతాయి. ఇది భార్యాభర్తలే కాదు, దేశాలూ, ప్రాంతాల మధ్య సంబంధాలక్కూడా వర్తిస్తుందేమోనని నాకు అనిపిస్తున్నది.

  --తాడేపల్లి

  ReplyDelete
 15. "వలసినప్పుడు సహాయం అడిగి, ఆ తర్వాత కుదిరినప్పుడు తిరుగు సహాయం చేస్తూ, సాధ్యమైనంతవరకూ సంబంధాలను నిలుపుకునేవాడే ఇప్పటికి ధన్యుడు!"

  ఇది నిజం. మంచి టాపిక్ మీద ఆలోచనలు రేకెత్తించే టపా రాశారు, గుడ్.

  ReplyDelete
 16. chalaa bagundi,aalochinchevidhanga undi sanath sripathi vrasindi kooda bagundi

  ReplyDelete
 17. Good topic. I appreciate the style of expression (Manchi Saili ani naa uddesyam). Can we get the writings of Rahul Sankrutyan in any web site? If anybody have an idea reg. the same, please tell me.

  ReplyDelete
 18. మీ టపా ప్రకారం చూస్తే, నేను కూడా ధన్యజీవినే అన్నమాట. :))). ఎంతోమందికి నాకు సేవ చేసుకునే అవకాశం కల్పించాను అందుకన్నమాట :))

  >>"ప్రజలు దీనులూ, దరిద్రులూ అయితేనే కదా, వాళ్ళకు సేవ చేసే అవకాశం లభించేది నాకు? అంటే పరోక్షంగా వాళ్ళు దీనులు కావాలని కోరుకుంటున్నానన్నమాటే కదా?"

  ఈ వ్యాఖ్యాలు చదువుతుంటే, ఎప్పుడో నేను చదివిన ఒక కథ గుర్తుకువస్తోంది. మీకులాగే, నాక్కూడా ఆ కథ కలకాలం గర్తుండిపోయింది.

  కథలోకి వస్తే, ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను అందరికీ బాగా ధాన ధర్మాలు చేస్తూ చుట్టుప్రక్కల ఊర్లలో మంచిపేరు సంపాదించాడు. ఒకనాడు ఆ ధనవంతుడు ఉండే ఊరికి ఒక స్వామీజీ వచ్చాడు. ఆ ధనవంతుడు గురించి తెలుసుకొని, అతనిని కలిసి, నువ్వు మంచిపని చేస్తున్నావు, ఏదైనా వరం కోరుకోమంటాడు. కానీ నువ్వు కోరుకునే వరం నిస్వార్థమైనదై ఉండాలి అని షరతు పెడతాడు. అప్పుడు ఆ ధనవంతుడు, "నా ఆస్తులు తరిగిపోకుండా ఉండేట్టు చేసి, నేను కలకాలం ఇలాగే పేదలకు దానం చేసేటట్లుగా అనుగ్రహించు స్వామీ" అని కోరుకుంటాడు.


  అప్పుడు స్వామిజీ నవ్వుకొని వరం అనుగ్రహిస్తాడు. కొద్దికాలానికి ఆ ధనవంతుడి ఆస్తంతా కరిగిపోయి బికారి అయిపోతాడు.

  ప్రజలను దరిద్రం నుంచి విముక్తి చెయ్యి అని కోరుకోకుండా, తన కీర్తి పెరిగేలా కోరుకున్నందుకు అతనికి ఆ శిక్ష అన్నమాట.

  కథను క్లుప్తంగా రాశాను. కానీ నాకైతే చాలా నచ్చింది. నేనెప్పుడు దానం చెయ్యాలనుకున్నా తప్పకుండా ఈ కథ గుర్తుకువస్తుంది నాకు. :))

  ReplyDelete
 19. రవి గారు మీరన్నట్లు ప్రతీ సారీ మంచి పని వెనుక స్వార్ధం ఉంటుందని అనుకోనక్కర లేదు.
  కొన్ని సంఘటనలు మన జీవితం లో ఎదురైనప్పుదు, ఎక్కువ సార్లు ఆ సమయానికి మన మనసు వెంటనే ఎలా స్పందిస్తే(అంటే స్పంటెనిటీ అని నా భావం) అలా డుగులు వేస్తాము అనేది నిజం.
  దీనికి ఉదాహరణగా నా జీవితం లో జరిగిన ఒక సంఘటన.నేను ఒక బ్యాంక్ ఆఫీసర్ ని. ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం, ఒక రోజు నెను నా కొలీగ్ కలిసి హైదరాబాద్ లొ ఉదయం ఆట సినిమా కి (బ్యాంక్ ఉదయం షిఫ్ట్ అయ్యక)వెళ్ళి బయటీకి వస్తుంటే, ఒక మూడు సంవత్సరాల పిల్ల వాడు జనాలకి అడ్డం పడి ఏడుస్తూ, వెతుక్కుంటూ కంగారుగా తిరుగుతున్నాడు. మేము వెంటనే ఆ అబ్బాయిని పిల్చి, విషయం విచారిస్తే, తనని తన అమ్మ అక్కడ వదిలేసి వెళ్ళిందని నిద్ర కళ్ళతో గజిబిజి గా చెప్పాడు. మాకు అర్ధం కాక, ఏమి చెయ్యాలో తెలియక అతన్ని ఎత్తుకుని ఐస్ క్రీం కొని పెట్టి ఇంక కొంచెం వివరం గా చెప్ప మంటే తను ఆ సినిమా హాల్ కి పక్కన బస్ దిగానని, బస్ లో నిద్ర పోయానని, దిగి చూసే టప్పటికి తన అక్క కనబడలేదని ఏడుస్తు బెదిరి పోయి చెప్పాడు. ఒంటి మీద యూనిఫార్మ్ ఉన్నది.
  దాన్ని బట్టి, అతను చెప్పే మాటలని బట్టి మేము అతన్ని ఆ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లో వదిలేసి రాలేక, వాళ్ళు అతన్ని శ్రద్ధగా అతని చోటికి చేర్చరనే అనుమానం తో మాతొ ఇంటికి తీసుకు వెళ్ళాలని నిర్నయించుకున్నాము. అలా వెళుతూ మధ్య దారిలొ నిద్ర మత్తు వదిలి అతను చెప్పిన వివరాలని క్రోడీకరించి అతను చెప్పిన పేరు కల స్కూల్ కి తీసుకు వెళ్ళి విచారిస్తే అక్కడి వాళ్ళు ఆ అబ్బాయి తమ విద్యార్ధి కాదన్నారు. చేసేది ఏమి లేక ఇంటికి తీసుకు వెళ్ళాము. ఇంతలో మాకు మధ్యాహ్నం షిఫ్ట్ బ్యాంక్ కి వెళ్ళే టైం అయింది.మా దగ్గర తాళాలు ఉంటాయి, ఎక్కువ టైం లేదు, చివరి ఆశగా మా ఇంటి దగ్గర ఉన్న అదే పేరు గల స్కూల్ కి తీసుకెళ్ళి విచారిస్తే ఆ అబ్బాయి తమ విద్యార్ధి అని, అతని అక్క కూడా అక్కడ చదువుతున్నదని, ఆ అక్క కి సెవెంత్ క్లాస్స్ ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి అని, ఆ రోజు పరీక్ష అయ్యాక బస్ లో ఇంటికి తిరిగి వెళుతూ ఆ అమ్మాయి కూడా చిన్న పిల్లే అవటం తో, పరీక్ష గురించి అలోచిస్తూ పక్కన ఉన్న తమ్ముడిని నిద్ర పోయి ఉండటం తొ మర్చి పోయి ఉండవచ్చనీ , తాము ఆ పిల్ల వాడిని ఇంటికి చేరుస్తామని హామీ ఇచ్చాక మేము ఊపిరి తీసుకుని మా దారిన మేము వెళ్ళాము.
  ఆ సమయం లో మాకు అలా చెయ్యటమే కరెక్ట్ అనిపించింది. ఒక తల్లి గా నేను ఆ నిముషం లో ఒక పోలీస్ ని కూడా నమ్మ లేక పోయాను.
  ఇది నేను గొప్ప కోసం చెప్పటం లేదు. ఆ సమయానికి మనసు స్పందన ని బట్టి నడుస్తాము.

  ReplyDelete
 20. swaartham, sahaayam gurinchi pakkana pedithe.. manava sambandhaalu.. mukhyangaa kutumba sambandhaala gurinchina vyaakhyalu nannu katti padesaay.. kutumbam bagunte mana desham lo 80% prajalu prashantanga undagalugutaremo ani na nammakam.. Sarve janaah sukhino bhavanthu... :)

  ReplyDelete
 21. రవి గారు. మీ టపా తో నేను పూర్తిగా ఏకీభవించలేను కాని మీ ఆలోచనలు మాత్రం నాకు నచ్చాయి. కొన్ని మాటలు మనసుకు హత్తుకున్నాయి.
  "ఎక్కడో, ఏ మూలనో "దానం చెయ్యడం" కన్నా, "నేను" దానం చేస్తున్నానన్న భావన మనకు ముఖ్యం"
  "ఇంట్లో డబ్బు సంపాదించేవాడి అవసరమెంతో, డబ్బు సంపాదించలేని వారి (అమ్మమ్మలూ, తాతయ్యలూ వగైరా) అవసరమూ మన ముందుతరంలో బాగా ఉండేది. "
  ఇంట్లో అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పే కథలు ఇప్పటి తరం చిన్న పిల్లలకి తలియదేమో. నాకు చిన్నప్పుడు మా అమ్మ బోలెడన్ని కథలు చెప్పేది. ఇప్పటికి నేను మా అమ్మమ్మకి ఫోన్ చేసి పురాణాలలో ఏదైనా కథలు చెప్పమని అడుగుతుంటాను.

  ReplyDelete
 22. dependability is the spine of human relations. how ever the real pleasure of life is in love, affection and connectivity. money can not substitute the above reality.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.