Sunday, December 20, 2009

ఆశయం


మరిడేశ్వర్రావు.


కర్రిగా, మామూలుకన్నా రోంత ఎత్తుగా ఉండేటోడు. నల్లగున్నా, మొకంలో మంచి కళ. నవ్వితే మట్టుకు, కండ్లు మూసకపోయి స్కెచ్చి పెన్నుతో రెండు గీతలు ఒకదానిమీద ఇంగోటి గీసినట్టు కనిపిస్తాండె. వీడు నాకు పదోతరగతిలో ట్యూషన్ మేటు. వానిది పొట్రాం (పొట్టి శ్రీరాములు) స్కూలు. నాది వేరే బడి. కుళ్ళాయప్ప ట్యూషనులో సాయంకాలం కలిసేటోడు. పేరు మరిడేశ్వర్రావు గదా, పొల్లాపగలు మరిడేశ్వర్రావు అని పూర్తీ పేరుతో పిలసాల్లంటే ఎట్లబ్బా అనుకుంటి. ఆ తర్వాత వాణ్ణి ఈశ్వర్ అని పిలుస్తా ఉంటే, నేను అట్లే అనబడ్తి.

ఆ రోజు ..

తెలుగు ఐవారు, తిరుపతి వెంకటకవుల పాఠం చెప్తా ఉన్న్యాడు. "ఏనుగునెక్కినాము, ధరణీంద్రులు మొక్కగనిక్కినాము.." ఈ పద్యం రాగం తీయబట్టినాడు. ఇట్లా పద్యాలు, రాగాలు తీసేటోళ్ళు తీస్తేనే కమ్మగుంటుంది. తెలుగైవారు బండ గొంతుతో రాగాలు తీస్తా, మధ్యలో నిలబెడతా, పాఠం చెప్తా ఉంటే, పిలకాయలు ఎవడి పాటుకు వాడు నకరాలు చేస్తా ఉన్న్యారు. నేను ఈశ్వర్ పక్కన లాస్ట్ లో కూచునుంటిని.

నా కాడ తెలుగువాచకం లేకపోతే, వాడే నాకు పాఠం చూపిస్తాండె. కొదమ సింహం సినిమాలో చిరంజీవి మొకం కనబడేటట్ల తెలుగు వాచకానికి ఆంధ్రజ్యోతి పేపరుది అట్ట యేసినాడు. పుస్తకంలోపల తిరపతి వెంకటకవుల్లో ఒకాయనకి మీసాలు, నల్లకంటద్దాలు బాల్ పెన్నుతో దిద్దినాడు. ఇంకొకాయనకి తలపైన గుండ్రం టోపీ పెట్టి, నోట్లో సిగరెట్టు పెట్టినాడు. సారు పాఠం కన్నా, ఈ బొమ్మలే బాగుండె. ఆ బొమ్మలు చూస్తా, నేను నవ్వితే, వాడు నన్ను చూస్తా నవ్వుతా ఉండే.

వాని బుక్కు నిండా ఇట్లా యవ్వారాలే. ఒకచోట ఇట్ల రాసినాడు - "నా పేరు 13వ పేజిలో ఉంది." ఆ పేజికి పోతే, "నా పేరు 64 పేజిలో ఉంది." ఇట్లా రాసుకుంటా పోయి, కడాకు, లాస్టు అట్ట మింద, "ఇంగ ఎతికింది సాలు. నా పేరు N. మరిడేశ్వర్రావు" అని రాసుంది. పరవస్తు చిన్నయ సూరి పాఠంలో ఒగచాట, ’వార్ధక్యమున ప్రశాంతముగ కాలంబు పుచ్చక ’అని రాసుంటే, ఆ చివరి పదం కింద అండర్ లైను చేసినాడు.

ట్యూషన్ లో నాకు మొదట్లో పరిచయమైనా గుడకా, నాకు ఈశ్వర్ కి పెద్దగా మాటలుండేటివి గాదు. నేను బక్కోణ్ణి, మామూలుగా కొంచెం మాట్లాడేది తక్కువ. నాకు ఎన్టీయారు, బాలక్రిష్ణ ఇష్టమయితే వాడు చిరంజీవి అంటే పడి సచ్చేటోడు. దానికి తోడు పొట్రాం స్కూలోళ్ళది వేరే గుంపు. వాళ్ళతో నేను ఎక్కువగా కలుస్తా ఉండ్లే.

ఎప్పుడైనా నన్ను చూసి నవ్వేటోడు, మాటలు పడినప్పుడు మట్టుకు, స్వచ్ఛంగ మనసులోంచి మాట్లాడేటోడు.

చిరంజీవి సినిమా వస్తే, స్టారు చేసేది, కటవుట్ కి పూల దండ, దండ మధ్యలో గుమ్మడికాయ, గుమ్మడికాయ చుట్టూతా కలర్ పేపరూ, ఇట్లా పనుల్లో మనోడు తగ్గేటోడు కాదు. ఆ రోజు స్కూలు, ట్యూషనూ అన్నీ ఎగ్గొట్టేటోడు.

ట్యూషనులో కుళ్ళాయప్ప సారికి కోపమొస్తే భలే తిట్టేటోడు. శాపాలు పెట్టేటోడు. భలే భయపడేటోళ్ళు పిలకాయలు. ఒకరోజు కుళ్ళాయప్ప సారు శ్రేఢుల్లో ఒక అభ్యాసంలో లెక్క జేస్తా గుణశ్రేఢి లో సంఖ్యల మొత్తానికి సూత్రం అడిగితే వాడు అంకశ్రేఢి సూత్రం చెప్పినాడు. ఐవారికి కోపమొచ్చి తిట్టబట్టె. "లే, బేకుఫ్! నువ్వు మీ నాయన మాదిరిగా సైకిలు షాపు, టైర్లు పంచర్లేసుకుంటా బతుకుతావు. నీ బతుకింతే ఫో!" అనె. వాడు సారు తిట్టింతర్వాత కూసుని, పుస్తకం అడ్డం పెట్టుకుని కిస కిస నవ్వె. నాకు భలే నవ్వొచ్చె. కానీ నవ్వితే ఐవారు నన్ను సంపుతాడు. ఉగ్గబట్టుకొని, ఆ తర్వాత గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నా.

ఒకరోజు ఉన్నిందున్నట్టు ఈశ్వర్ ట్యూషన్ కి ఒక నాలగు రోజులు రాలే. స్కూల్లో గుడకా కనబడతా ఉన్నిండ్లేదంట. ఇట్లా వారమాయె. ఆ తర్వాత సోమవారం వాళ్ళమ్మ ట్యూషన్ కాడికొచ్చి, కుళ్ళాయప్ప సారుతో, ఏడుస్తా ఏందో చెప్పబట్టె. వాడు ఇంట్లో కూడా లేడంట! యాడకి పోయినాడో ఏందో!

ఇట్ల దగ్గర దగ్గర ఒక నెలన్నరైపాయె. ఒక రోజు ట్యూషన్ మొత్తం, ఒగటే గలాట గలాట. ఈశ్వర్ తిరిగొచ్చినాడంట. వాని చుట్టూతా అందరు మూగి ఏందో మాట్లాడతా ఉన్న్యారు. కొంతమంది ఆ గుంపు లో దూరదామని, దూరలేక దూరం నుండీ వాని వంక హీరోని చూసినట్టు చూస్తా ఉన్న్యారు. నాకు ఆ మరుసట్రోజు విషయం తెలిసె.

ఇంతకీ సంగతేందంటే, మనోడు మడ్రాసు బండెక్కి, మడ్రాసుకు పోయినాడు. ఆడ ఒకచోట కాఫీ షాపులో పని చేసుకుంటా, చిరంజీవిని చూడాలని తిరిగినాడంట. ఇట్ల కన్నగచాట్లు పడి, కడాకు ఒకరోజు చిరంజీవిని ఎట్లో కలుసుకున్న్యాడు. చిరంజీవి వానికి ఒక మూడు వేల రూపాయలు, ఒక సూట్ కేసు, ఒకట్రేండు బట్టలూ ఇచ్చి, మాట్లాడి ఊరికి పొమ్మని సాగనంపినాడంట.

కొన్ని రోజుల తర్వాత ఐవారు ఏదో చెబుతా, "ప్రతి ఒకనికీ జీవితంలో ఆశయం ఉండాల. అది సాధించుకునేకి ప్రయత్నిస్తా ఉండాల. మీరు గొప్పోళ్ళు కావాల. గొప్ప గొప్ప ఉద్యోగాలు చెయ్యాల. ఇంజినీర్లు కావాల." ఇట్లా చెప్తా వచ్చె. ఆ రోజు వాడు నా పక్కన మామూలుగానే నవ్వుతా, "నా ఆశయం ఒగటే ఉండే. అది తీరిపాయె." అని గొణిగి, మామూలుగా కిసకిస నవ్వె.

తర్వాత ఈశ్వర్ చుట్టూతా వాని ఫ్రెండ్స్ ఎక్కువైరి, ఆ తర్వాత నాకు అట్లా దూరమాయె.

టెన్త్ పరీక్షల తర్వాత వాడు, ఇంటర్మీడియట్ లో తెలుగు మీడియంలో చేరె. నాది ఇంగ్లీషు మీడియము. ఆ తర్వాత ఏదో డిగ్రీ, ప్యాసయినాడో, ఫెయిలో తెలీదు.

***********************************

చానా ఏండ్ల తర్వాత నాకు మొన్న మా వూర్లో నా బండికి టైరు మార్చి, ఏదో రిపేరు చెయ్యాలని ఒక షాపుకు పోతి. ఆడ ఒక రూములో ప్రొప్రైటర్ మరిడేశ్వర్రావు అని పేరు రాసున్నింది. అవును మరిడేశ్వర్రావుకు ఇప్పుడు ఊర్లో రెండు టైర్ల షాపులు ఉన్నయ్యంట, బైపాసు రోడ్డు కు అవపక్క ఒక నాలుగిండ్లు ఉన్నాయంట. ఇవి తెలిసిన సంగతులు.

అన్నట్లు నేను షాపులో పనై పోతానే నేరుగ ఇంటికొచ్చేస్తి. ఈశ్వర్ ని కలవలే, మాట్లాడలే. ఏమిటికి అంటే - నా కాడ సమాధానం లేదు.

(నా ఒకానొక బాల్యస్మృతి. పేర్లు మారాయి.నిజంగా జరిగినది, చిరంజీవి ఘటనతో సహా. ఒకే ఒక్క పిసరు కల్పితం. :-))

7 comments:

 1. మీకు 'అనంత రానారె' అనే బిరుదు ఇచ్చేస్తున్నాం:-) చిరు విషయంలో నేనూ, మరిడేశ్వర్రావూ ఒక్కటే! కానీ మీరు పాత మితృణ్ని కలవకుండా వచ్చేడం ఏమీ నచ్చలేదు. ఇలాగే మన యాసలో మరిన్ని టపాలు రాయాలని కోరుతూ...స్మైల్.

  ReplyDelete
 2. Nice. కొంచం అక్కడక్కడ నామిని గారి చాయలు కనిపించేయి యాస లో. అక్కడీ యాసేనా ఇది? బాగా చెప్పేరు. :-)

  ReplyDelete
 3. డాక్టర్ గారు,

  మహాప్రసాదం! :-)

  ఈ యాస ప్రయత్నిస్తున్నాను. ఇదివరకు ఇక్కడ ఒకటి,మరొకటి ఇక్కడాను రాసుకున్నాను.

  @భావన : నామిని గారిది చిత్తూరు. రాయలసీమ లో నాలుగు జిల్లాల్లోనూ ఒకే రకం మాండలికం కనిపించినా, ప్రతి జిల్లాకు కొన్ని కొన్ని తేడాలు ఉన్నాయి.

  ReplyDelete
 4. chaalaa kalaniki raasaru....
  baagundi..

  Intaki kalpitam emiti sir??

  Venuram

  ReplyDelete
 5. ఏప్పోవ్ భలే జోరుగా చెప్తాండావే! మీది పొట్టిశ్రీరాములు స్కూలా! నాది గవర్మెంటు జూనియర్ కాలేజి.. అంటే మల్టీ పర్పస్ గవర్నమెంట్ స్కూల్
  ఏదిరా ఈడెవరో అనంతపురం భాష మాట్లాతాండారే అని చూస్తి. అట్లే నా చెనిక్కాయబుడ్లు తింటూ జ్ఞాకపాకాల్లోకి పోయిడిస్తి. బాగచెప్పినావప్పా , మనసుకు భలే ఇదై పోయింది.
  వస్తానప్పా, ఫస్ట్ రోడ్లో ఆ పిండిమిరక్కాయల అంగడితాకి పోయొస్తా.. భలే వాసనొస్తున్నాయి కదా?

  శంకర్ :))

  ReplyDelete
 6. @వేణూ రామ్:

  కల్పితం ఏమిటంటే - ఆ షాపతను ఆ అబ్బాయేనా అని నాకు ఇంకా ఖచ్చితంగా తెలీదు. అయితే విన్నది మాత్రం - ఆ అబ్బాయి మంచి ఆర్థిక స్థితిలో ఉన్నాడని.

  @శంకర్: బజ్జీలనిజెప్పి బుర్ర పాడుచేసినావు. ఎట్ల చేసేదబ్బా?

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.