Saturday, October 24, 2009

ఆంగ్ల చిత్రం - యండమూరి స్టైలు కథనం

బ్రూస్ విల్లిస్ మామూలుగా ప్రతీ రోజు లాగే తన FBI ఆఫీసుకు బయల్దేరేడు. ఏదో జరుగబోతోందని మనసు చెబుతోంది. ఆ ఫీలింగ్ కు అర్థం లేదు. అప్రమేయము, అనిరతము కాని ఓ అనిమిష భావన అతణ్ణి ఊపేస్తోంది.

సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి బయల్దేరబోయే ముందు అతడికి ఫోన్ వచ్చింది, ఓ వ్యక్తి కాల్పులలో మరణించినట్టుగా. బయల్దేరేడు. ఆ సంఘటన తన జీవితాన్నే మార్చేస్తుందని అతడికప్పుడు తెలీదు. హత్యాస్థలాన్ని చేరుకునేప్పటికి అరగంట పట్టింది. దాదాపు పది అడుగుల దూరం నుంచీ 0.5 mm కాలిబర్ పిస్టల్ తో కాల్చారెవరో. హంతకుని వెన్నెముక గుండా, గుండెలనుంచి తూటాలు దూసుకుపోయినట్టు కనబడుతూంది. కాస్తంత దూరంగా హతుడి వాలెట్. అది కాదు అతడు చూస్తున్నది. హంతకుని కడుపునుంచీ బయటకు వచ్చిన తీగలు, చిప్ లు. అవీ, అక్కడ నిలిచిపోయిందతని చూపు. చనిపోయిన వ్యక్తి ఓ సరోగేట్.

సరోగేట్.

ఈ పదానికి అర్థం తెలియాలంటే సరీగ్గా నలభై సంవత్సరాల క్రితానికి వెళ్ళాలి.

*************************************************

21వ శతాబ్దం ప్రథమార్థంలో ఇంటర్నెట్ కనిపెట్టబడింది. దాంతో కంప్యూటర్ ల వాడకం ఊపందుకుంది. ఈ పరిస్థితిని మార్కెట్ లో ఉన్న అనేక కంప్యూటర్ తయారుదారీ సంస్థలు సొమ్ము చేసుకున్నాయి. అప్పట్లో అమెరికాలో దాదాపు ప్రతి వ్యక్తికీ ఓ ల్యాప్ టాప్ ఉన్నట్లు ఓ అంచనా. ఇటుపక్క జపాన్ లో రోబోల వాడకం ల్యాప్ టాప్ లంత కాకపోయినా నెమ్మదిగా, స్ఫుటంగా ఎక్కువవుతూ వస్తూంది. ఇక్కడో విషయం చెప్పాలి.

మనిషి (యజమాని) చెప్పే సూచనలను అర్థం చేసుకుని, తనలో నిక్షిప్తం అయి ఉన్న ప్రోగ్రామ్ ద్వారా ఆ సూచనలకు అనుగుణంగా స్పందించటమే రోబోల పని. ఆ ప్రోగ్రామ్ కు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పేరు.

కంప్యూటర్ ల సాంకేతిక పరిజ్ఞానాన్ని రోబోలకు అనుసంధానించి, మనిషికి ప్రత్యామ్నాయంగా రోబోలను వాడవచ్చుననే ఆలోచన చేసిన వాడు మిస్టర్ వి. అతడి పూర్తీ పేరు ఎవరికీ తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాడో ఆనవాళ్ళు లేవు. ఓ ప్రభంజనంలా దూసుకొచ్చేడు. ఓ కొత్త ఆలోచనా విధానాన్ని రూపొందించేడు.

అతడి ఆలోచన ప్రకారం, మనిషి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అతడి తలకు బిగించిన వైర్ల ద్వారా మెదడులోని ఆలోచనలు ఓ కంప్యూటరుకు చేరతాయి. ఆ ఆలోచనలు సూచనలుగా మార్చబడి, రోబోలో అమర్చబడిన చిప్ కు చేరతాయి.

అంతే.

మనిషికి మారుగా మరో మరమనిషి తయారు. ఈ ఆలోచనను మార్కెట్ చేయడానికి వికలాంగులను, వృద్ధులను ఎంచుకోవడంలోనే అతడి తెలివితేటలు కనబడతాయి. "మీరు వికలాంగులా? మీరూ మామూలు మనుషుల్లా సాధారణ జీవితం గడపాలనుకుంటున్నారా? అయితే వాడండి, మీ కోసం, మా ద్వారా తయారు చేయబడిన సరోగేట్. మీరు కోరుకున్న కొత్త జీవితం కోసం" - ఇదీ అతడి స్లోగన్.

ఈ స్లోగన్ ఎంత పాపులర్ అయిందంటే, ఆ తర్వాత ఐదేళ్ళలో అమెరికాలో ఉన్న వృద్ధులలో దాదాపు 80 శాతం మంది సరోగేట్ లను కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ఈ ఆలోచనను మామూలు వ్యక్తులకూ అన్వయింపజేసేడు. సాధారణ వ్యక్తులు సరోగేట్ లను పెంచుకున్నారు (ఈ పదం కరెక్టేనా?). సమాజంలో ఎవరు సరోగేట్, ఎవరు అసలు మనిషో తెలియని స్థితికి వచ్చింది.

కొందరు కొన్ని రంగాల్లో మాత్రమే అభ్యున్నతి సాధించగలుగుతారు. సాంకేతిక పరంగానూ, మార్కెట్ పరంగానూ అసాధారణ తెలివితేటలున్న వాడు మిస్టర్ వి.సరోగేట్ టెక్నాలజీ మొదట పేటెంట్ చేసి, అభివృద్ధి చేయడం అతడి తెలివితేటలకు పరాకాష్ట.

అతడి పేరు చెబితే సిలికాన్ వాలీ లో కార్పోరేట్ సంస్థల యజమానులకు కాళ్ళు చేతులు ఆడవు. అతడితో పోటీ అంటే వ్యాపారానికి శుభం చెప్పటమేనని భావిస్తారు మరికొందరు.

మిస్టర్ వి. అతడి సంస్థ పేరు వీ ఎల్ సీ.

*************************************************

నగరానికి కొన్ని మైళ్ళ దూరంలో ప్రశాంతమైన ప్రదేశంలో కట్టబడిందా ఆశ్రమం. ఆ ఆశ్రమం ఓ మధ్యవయసు నీగ్రోది. ఆ నీగ్రో వూడూ వంటి విద్యలలో ప్రవీణుడు. సమాజంలో సరోగేట్ ల వల్ల సాధారణ జీవితం దెబ్బతింటుందని అతడి ఉద్బోధ. త్వరలోనే ఆ ఉద్బోధకు అనేకమంది ఆకర్షితులయ్యేరు. మిస్టర్ వి, ధనికులకు గాలం వేస్తే, ఈ స్వామీజీ పేదవాళ్ళను గాలం వేసి పట్టేడు.

*************************************************

ఓ సరోగేట్ హత్య చేయబడితే అందువల్ల ఎవరికి ఉపయోగం? ఇక్కడే బ్రూస్ విల్లిస్ సరిగ్గా అంచనా వేసేడు. అతడి అనుమానం స్వామీజీ మీదకు మళ్ళింది. అయితే బ్రూస్ విల్లిస్ కు తెలియనిది ఆ స్వామీజీ బలగం. అక్కడ అతని అంచనా తప్పయింది. ఆశ్రమం తాలూకు వ్యక్తిని పట్టుకునే ప్రయత్నంలో, ప్రాణాలు కోల్పోతాడు బ్రూస్ విల్లిస్.

ఇక్కడ ఇంటిదగ్గర నిజమైన బ్రూస్ విల్లిస్ లేచి కూర్చుంటాడు.

చనిపోయినది బ్రూస్ విల్లిస్ కాదు, అతడి సరోగేట్ మాత్రమే.

*************************************************

అతడికి బ్రతకాలని లేదు, అలాగని చావాలనీ లేదు. దుఃఖానికి అతీతమయిన స్థితి నిస్పృహ. తను ఇన్నాళ్ళు కాపురం చేస్తున్నది ఓ సరోగేట్ భార్యతో అని ఇప్పుడే తెలిసింది. తెలిసి తెలిసి, తనే కదా అనుమతిచ్చాడు.

పక్క గదిలో తన భార్య తాలూకు సరోగేట్ మరికొంతమంది తో డ్రగ్స్ సేవిస్తూంది. గోల ఎక్కువవడంతో అక్కడికెళ్ళేడు. ఇద్దరు సరోగేట్ల సరాగాన్ని తన భార్య ఎన్జాయ్ చేస్తోంది. అతడి దవడ కండరం బిగుసుకుంది. సాచి లెంపకాయ కొట్టబోయేడు. ఏం ప్రయోజనం? నెప్పెట్టేవి తనచేతులేగా? తన ఆవేశాన్నంతా ఎదురుగా ఓ రోబో మీద చూపించి, దాన్ని బద్దలు కొట్టేడు.

ఇటు బ్రూస్ విల్లిస్ నిజమైన భార్య కుర్చీలో పడుకుని ఉంది. ఆమె చెంపమీద ఓ కన్నీటి చుక్క దిగువకు రావాలా వద్దా అన్నట్టుగా దిగులుగా చూస్తోంది.

*************************************************

స్వామీజీ ఆశ్రమం చుట్టూ జాగ్రత్తగా వలపన్నబడింది. కాల్పులు మొదలయ్యాయి. ఆ కాల్పుల్లో స్వామీజీ మరణించేడు. ఆ స్వామీజీ శవం దగ్గరకు వెళ్ళిన బ్రూస్ విల్లిస్ కు ఊపిరి స్థంభించింది. అక్కడ రక్తపు మడుగులో ఉన్నది స్వామీజీ తాలూకు స-రో-గే-ట్.

సరోగేట్ మరణిస్తే, నిజమైన వ్యక్తి ఎవరు? పెద్దగా కష్టపడకుండానే బ్రూస్ విల్లిస్ కు సమాధానం దొరికింది.

ఆ వ్యక్తి - సరోగసీ ప్రోగ్రామ్ కు రూపకర్త అయిన మిస్టర్ వి.

*************************************************

సినిమా చివర్లో బ్రూస్ విల్లిస్ మిస్టర్ వీ తాలూకు ప్రోగ్రామ్ ను నాశనం చేస్తాడు, మామూలుగా అయితే అలా నాశనం చేస్తే, వాటి తాలూకు వ్యక్తులూ నాశనమయేట్టు ప్రోగ్రామ్ ఉంటుంది. అయితే అలా కాకుండా కేవలం సరోగేట్ లను మాత్రమే ధ్వంసం చేసేట్టు కంట్రోల్, ఆల్ట్, డిలీట్ బటన్ లను నొక్కి సరి చూసుకుంటాడు.

*************************************************

(యండమూరి రచనల గురించి కొత్తగా చెప్పే పని లేదు. మామూలుగా జరిగే వాటిని కూడా కథకుడికి పట్టేలా చెప్పడం ఓ టెక్నిక్. అది తనకు మాత్రమే సొంతం. సరోగేట్స్ సినిమాకు తను టూకీగా కథా పరిచయం రాస్తే ఎలా ఉంటుందో అన్న ఊహ ఇది. )

14 comments:

 1. చూడలనిపించేలా వ్రాసారు. thansk for writing.

  ReplyDelete
 2. రవి గారూ,

  యండమూరి రచనా శైలిని బాగా రాశారు.

  ‘కనపడుతూంది’, ‘అది కాదు అతడు చూస్తున్నది’, ‘స్ఫుటంగా’, ‘ఈ స్లోగన్ ఎంత పాపులర్ అయిందంటే’, ‘(ఈ పదం కరెక్టేనా?)’.... ఇలా వీరేంద్రనాథ్ మార్కు పదాలను భలే పట్టుకున్నారు.

  >‘అప్రమేయము, అనిరతము కాని ఓ అనిమిష భావన అతణ్ణి ఊపేస్తోంది’:)

  మీ టపా చదువుతూ ’దవడ కండరం బిగుసుకుంది’ మాటని వదిలేస్తారేమోనని చూశాను. దాన్నీ మీరు వదల్లేదు. (నిజానికి అంతకుముందే డిటెక్టివ్ నవలల్లో ప్రయోగించిన మాట ఇది. వీరేంద్రనాథ్ ఎక్కువగా వాడారు).

  అభినందనలు!

  ReplyDelete
 3. బలే చెప్పేరు అండి, నిజమేమో ఆయనే రాసిన దాని మీద సమీక్షేమో అన్నట్లు.. :-)

  ReplyDelete
 4. You must be yandamuri's surrogate..!! goodjob!!

  ReplyDelete
 5. హ హ చాలా బాగా రాశారు రవి గారు. మొదటి పేరా లో "అప్రమేయము, అనిరతము కాని ఓ అనిమిష భావన అతణ్ణి ఊపేస్తోంది." వాక్యం దగ్గరే ఓ పెద్ద నవ్వు నవ్వేసాను. అద్యంతం అదరగొట్టేశారు :-)

  ReplyDelete
 6. >>అప్రమేయము, అనిరతము కాని ఓ అనిమిష భావన అతణ్ణి ఊపేస్తోంది
  Hahaha.. too good.. :)

  ReplyDelete
 7. బాగా వ్రాశారు.
  యండమూరి శైలిని బాగా పట్టేశారు. :)

  //అప్రమేయము, అనిరతము కాని ఓ అనిమిష భావన అతణ్ణి ఊపేస్తోంది.

  //ఆ సంఘటన తన జీవితాన్నే మార్చేస్తుందని అతడికప్పుడు తెలీదు.

  //అభివృద్ధి చేయడం అతడి తెలివితేటలకు పరాకాష్ట.

  అతని శైలిలో నేను తరచూ చూసే కొన్ని మాటలు ఇవి.

  ReplyDelete
 8. స్పాయిలర్ అలెర్ట్ పెట్టాల్సిందండి.

  ReplyDelete
 9. బాగా రాసారండీ

  ReplyDelete
 10. Super!

  మీ అనుకరణల్లో నాకు నచ్చింది, "ఓ ప్రభంజనంలా దూసుకొచ్చేడు."

  Great job!

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.