Thursday, October 22, 2009

ఆంగ్ల చిత్రమునకు తెలుగు సమీక్ష!

ఒకానొక బలీయమైన విధి దుర్విపాకమున క్రితము వారము నేనొక ఆంగ్ల సాంఘిక చిత్రమునుఁ జూచుట తటస్థించినది. ఆ విధివశమును ఏమని వర్ణింతును? ఆ చలన చిత్రమును గురించి హెచ్చరించి చదువరులను ఆప్రమత్తులఁ గావించుట యొక్కటే నా ప్రస్తుత లక్ష్యమని దోచుచున్నది. అందులకే ఈ సమీక్ష.

చిత్రము పేఱు "సరోగేట్స్". "సరోగేట్స్" అననేమి? "స్పయిడరు మేను", "సూపరు మేను", లేదా "బాట్ మేను", అనగా నర్థము ఛప్పున స్ఫురించును. కానీ "సరోగేట్స్" ఏమిటి నా శ్రాధ్ధము? ఇంచుక ఆంగ్ల నిఘంటువును పరిశీలింతము. అందు "డిప్యూటీ" అని వ్రాయబడి ఉన్నది. తెలుగున జెప్పవలెనన్న "ఒకని కార్యకలాపములు జూచుటకై నియమితుడయిన మరొకడు" అని జెప్పుకొన వచ్చును. ఈ చలన చిత్రమున కథ కూడా అదేను.

కథ అంతయును, భవిష్యత్కాలమున సాగును. సుదూర భవిష్యత్తులో ఒకానొక దినమున మనుజుని బుద్ధి వికటించి, తన బదులుగా కార్యకలాపములు సాగించుటకు, తనకు మారుగా ఒక యంత్రమును నియమించి, ఆ యంత్రము ద్వారా దైనందిన వ్యవహారములు సాగించును. ఆ యంత్రము మాటలాడును, ఆటలాడును, ఇంకనూ అనేక కార్యములు జేయును. అదియొక చమత్కారము.

ఇక ఆ యంత్రమును ఉపయోగించెడి మనుజుడు, సుదీర్ఘ నిద్రావస్థుడై ఉండును. తన మెదడులోని సంకేతములను గైకొని, తనద్వారా, తనకొరకు నియమింపబడిన యంత్రము, బాహ్య ప్రాపంచిక కార్యములను అత్యంత జాగరూకతతో నిర్వహించును. ఈ విధముగ, సమాజమంతయును, అనగా వ్యాపారులు, రక్షకభటులు, వివిధ ఉద్యోగులు, పిన్న వారు, పెద్ద వారు, ఒకరని యేల? అందరును యంత్రములే.

కథానాయకుడు ఒక రక్షకభటుడు. తను కూడా ఒక యంత్రమును నియమించును. ఆ యంత్రము, ఒకానొక పోరాటమందు మరణించును. మరణించినది యంత్రమే కదా. మన కథానాయకుడు మాత్రము జీవించియే ఉండును. వాడికొక భార్యా రత్నము. ఆమెయునూ తన బదులుగా యంత్రమును నియమించును. ఈ యంత్రములు రెండునూ కలిసిఁ గాపురము జేయుచుండును. కథానాయకుడి యొక్క యంత్రము మరణించిన పిమ్మట, ఆతనికి స్వచ్ఛమైన ప్రేమయొక్క ఆవశ్యకత తెలియవచ్చును. ఆతడు, తన భార్యారత్నము (యంత్రము) తో ఏమేమో మాటలాడును. ప్రార్థించును, కన్నీళ్ళు పెట్టుకొనును. ఆ యంత్రము మనసు కరుగదు. (అదంతయును నటన యని మనము భావించవలె)

వారి గోల అట్లుండనిమ్ము.

సమాజమున ఈ యంత్రముల వల్ల మానవ సహజ జీవితము నశించుచున్నదని ఒకడు గోలపెట్టుచుండును. వీడొక నల్లవాడు. వీడు నగరమునకవతల ఒకానొక ఆశ్రమమును స్థాపించి, జనావళికి సత్కర్మలు బోధించుచుండును. కథానాయకుడు ఈ నల్లవాని మాటలలోని డొల్లతనమును బయటపెట్టుటకు ప్రయత్నించుచుండును. ఒకానొక సందర్భమున రక్షకభటుల దాడియందు, ఈ నల్లనయ్య మరణించును. అంతయును జేసి, చివరికి ఏమయ్యా అన్నచో, ఆ నల్లనయ్యనూ యంత్రమే.

ప్రియమైన పాఠకులారా? మీకు ఇప్పటికే శిరః కంపము మొదలయినదని అనుకొనుచున్నాను. అందువలన ఈ చిత్రము చివర ఏమగునో చెప్పి ముగింతును. చిత్రము చివర ఈ యంత్ర వ్యవస్థను కథానాయకుడు సమూలముగ నాశనము జేయును. అన్ని యంత్రములు నశించి, తిరిగి ప్రజలు జనజీవన స్రవంతిలో గలియుదురు. ఇంతియే కథ.

బ్రూస్ విల్లిస్ అనునాతడు ఈ చిత్రమున కథానాయకుని పాత్రను పోషించెను.

ఈ చిత్రమున కథ లేదు (జదివితిరి కదా), ప్రతి నాయకుడు లేడు, హాస్య, శృంగారాది రసపోషణములు లేవు. ఇక యేమున్నది, సున్నకు సున్న, హళ్ళికి హళ్ళి.

ఈ సమీక్షా శకలమును జదివి ఒక్కరైనను, ఇటువంటి చిత్రరాజమును వెళ్ళుటకు ముందు నిమేష మాత్రము ఆలోచించినచో, ఈ వ్యాసోద్దేశ్యము నెఱవేఱునని తలపోయుచు, విరమించుచున్నాను.

మ్లేఛ్ఛ సృజనాత్మకతకు ఉదాహరణగా జెప్పుకోదగిన ఈ చిత్రమును బహుశా లక్ష్మీగణపతీ పిక్చర్స్ వారు, తెనుగున అనువదించుదురని నా ఊహ. వారి పటాటోప ప్రకటనా పాఠములకు ఎవ్వరునూ ప్రలోభపడకుందురు గాక!

(శ్రీరమణ పేరడీల లో ఒకానొక పేరడీ - సుప్రసిద్ధ ఆంధ్ర రచయితల తెలుగు సినిమా సమీక్ష. అందులో ఆయన విశ్వనాథ వారి శైలిని అనుకరిస్తూ ఓ పేరడీ వ్రాశారు. అదే ఈ టపాకు ప్రేరణ.

ఈ టపాలో హేళన ధ్వనిస్తే క్షంతవ్యుణ్ణి. మనస్స్ఫూర్తిగా - అది నా ఉద్దేశ్యం కాదని మనవి.)

15 comments:

 1. తెనుగు దేశములవారి యదృష్టమువల్ల మీరీ లోకమున ఇవ్విధముగా నవతరించినారనియు, చిత్రకళాపోషణకు, సమీక్షలకు నడుము గట్టినారనియు మాయభిప్రాయము. ఈలాటి విశ్లేషణవల్లనూ, సమీక్ష వల్లనూ లోకములో అమృతాంజనము రాసుకొను బాధలు తప్పును. అమందానంద కందళిత హృదయార "విందు"ను పంచు మీరు అశ్వినీ దేవతల నిజ అవతారముగాని మనుషులుగారు. చిల్లుపడిపోయిన హృదయకవాట ద్వారాలు ఈ విశ్లేషణాత్మకమైన సమీక్షవలన నీరుకారుట కట్టి ఆ తరువాత వట్టిపోయినవి. నెమలిఈకల భస్మములో మార్జాల దంతచూర్ణము కలిపి, గజరాజులవారి జున్నుపాలలో వేసి వీశెల లెక్కన మందు తిన్నవిధముగానున్నది. శరీరమో, మనసో మణుగులలెక్కన అలౌక్యానందానికి గురి అయినవిధంగా అగుపడుచున్నది. గోమాత గడ్డిని మేసినట్టుగా ఈ సమీక్షను చదివిన పిదప, నాలుగు తులముల అరఖు తాగినవానివలె ఇమ్మనుజుని పైత్యము వదిలినది. ధన్యవాదములు. కల్పవృక్షాలవంటి ఈ విశ్లేషణలు, సమీక్షలు మీరు శతసహస్రాధికముగా వ్రాసి లోకోపకారము చేయుదురుగాక.

  జవిక్ శాస్త్రి

  ReplyDelete
 2. తెలుగు చిత్రరాజాలనే చూడము ఇక ఆంగ్ల చిత్రాలా ? మాకంత సీను లేదు కాబట్టి భయపడాల్సిన పనిలేదు.

  ReplyDelete
 3. సినిమా సంగతి తరవాత గాని మీరు వ్రాసిన స్టైల్ మాత్రం సూపర్.
  తెనుగున అనువదించుదురని నా ఊహ. >> ఇక్కడ ఒక్క దగ్గర మాత్రం మీ ఒరిజినల్ స్టైల్ ని పట్టిచేస్తుంది :)

  ReplyDelete
 4. రవి గారూ........మీరు అరిపించితిరి.....జవిక్ శాస్త్రి గారు గర్జించితిరి.... :)sooper...

  venuram

  ReplyDelete
 5. ఈ సిరోభార చిత్రరజమును మేము ౧౨౦౦ రూప్యములు చెల్లించి చూసి ... ఆపై అమ్రుతాన్జనమును రాసి ..ఆపై ఒక మంచి చిత్రమును చూసి పీడ వదిలించుకొంటిమి.

  దయచేసి ఈ యొక్క చిత్రరజము యొక్క సమీక్షను మీరు నవతరంగం యందుయుంచినచో మిక్కిలి సంతసించదము. ఎలనిన ..మేము మిక్కిలి ఇష్టపడు మరియు అనుసరించు చలనచిత్ర ప్రదేశము యదియె ...

  www.navatarangam.com........

  ReplyDelete
 6. అయ్యా జవిక్ శాస్త్రి గారు,
  మీ వ్యాఖ్య మమ్ములను హృష్టాంతరంగులను జేసినది అనునది తథ్యము. మీరునూ ఇట్లు ఉచితములైన వ్యాఖ్యామౌక్తికములతో పఠితలను మంత్రముగ్ధులను జేయుదురని విశ్వసించుచున్నాను.

  ఇతర వ్యాఖ్యాతలయిన విజయమోహన్, శ్రావ్య, వేణు, విజయక్రాంతి లకు ధన్యవాదములు.

  ReplyDelete
 7. వామ్మో ఏమి టాలెంటండీ బాబూ. సినిమా సంగతెలాగున్నా టపా అదిరింది.

  ReplyDelete
 8. మందానంద కందళిత హృదయార "విందు"ను పంచు మీరు అశ్వినీ దేవతల నిజ అవతారముగాని మనుషులుగారు.
  :):)
  Anonymous said...

  రవి గారూ........మీరు అరిపించితిరి.....జవిక్ శాస్త్రి గారు గర్జించితిరి.... :)sooper..

  మాదియునూ ఇదే మాట!!!

  ReplyDelete
 9. బాగుంది మీ పరిచయం.. :-) :-)

  ReplyDelete
 10. This comment has been removed by the author.

  ReplyDelete
 11. keka pettinchaaru...(nenu konchem poori fan lendi) ;)

  ReplyDelete
 12. రవి గారూ, అద్భుతమైన ట్యాలెంట్ అండి మీది!

  ReplyDelete
 13. JUST AMAZING.....I AM VERY VERY HAPPY TO HAVE COME ACROSS THIS BLOG...THANKS TO EENADU NEWS PAPER...

  Just for your information...the details of your blog are covered in Eenadu newspaper...today....6th March 2010...

  ReplyDelete
 14. Hello,
  I have only just discovered your blog, and wanted to take the time to say thank you very much for creating it. The Latest infomation are very useful and the content insightful.
  I look forward to more about Eenadu News paper.....
  Thanks for share..........

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.