Monday, August 31, 2009

జానెడు సైజు జానపద నవలలు


"అబ్బా, సెగట్రీ, ఎప్పుడూ పనులూ బిగినెస్సేనా, మడిసనింతర్వాత కూసింత కలాపోసనుండాలి. పరగడుపునే కూసింత పచ్చిగాలి పీల్చి ఆ పత్యచ్చ నారాయుడి సేవజేసుకోవద్దూ".............

ఇంచుమించుగా అదే పద్ధతిలోనే -

"అబ్బా, ఎప్పుడూ చందమామ, బాలమిత్రలేనా. చదివి చదివి బోరు కొడతా ఉంది. కొత్తగా ఏమైనా కొనక్క రావా అమ్మా?".................

నా భ్రాతాశ్రీ అమ్మ దగ్గర అర్జీ పెట్టుకున్నాడు చిన్నప్పుడు.

ఇప్పుడంటే చందమామ చుట్టూ బెల్లం చుట్టూ మూగిన ఈగల్లా ముసురుకుంటున్నాం కానీ, అప్పట్లో చందమామ రాగానే, దానికోసం - అక్కకూ చెల్లికీ, అన్నకూ తమ్ముడికీ, అక్కకూ తమ్ముడికీ...ఇలా ఏ ఇంట్లో ఏ కాంబినేషన్స్ ఉన్నాయో వారందరికీ మధ్య ఓ సంకుల సమరం జరిగి, ఎట్టాగోలా చందమామ దక్కిన తర్వాత - తీరా చూస్తే, ఓ గంట కంతా పుస్తకం చదవడం అయిపోతుండేది. తిరిగి ఇంకో నెల వరకు వెయిటింగు.

అదుగో..ఆ పరిస్థితి చూసి చూసి, విసిగి వేసారి ఒక రోజు మా అన్న అమ్మ దగ్గర పైన చెప్పిన రకంగా అర్జీ పెట్టుకున్నాడు. ఆ అర్జీ అమాయకమైన అర్జీ కాదు. అఖండుడతను. అంతకు ముందే బాలభారతి పుస్తకం చివరి అట్టమీద రెండు పొట్టి జానపద నవలల ఆడ్స్ చూసి పెట్టుకున్నాడు.

"ఏమి చెయ్యమంటావురా? " అమ్మ విసుక్కుంది.

"వేరే రకం పుస్తకాలు కొనుక్కుంటా". అమ్మ ఏ కళనుందో ఏమో, "సరే. ఏ పుస్తకం" అడిగింది.చెప్పాడు భ్రాతాశ్రీ.

"ఇవా?" కొంచెం సందేహించింది మాతాశ్రీ. (ఇవి దయ్యాలు, భూతల కథలు కదా. ఇవి పిల్లలు చదవచ్చా?)

"సరే. ఒక్క పుస్తకం మాత్రమే". బడ్జెట్ సాంక్షన్ చేసింది మా అమ్మ. అప్పుడా పుస్తకం ఖరీదు 1-75 పైసలు.

చందమామల నుండి మొట్టమొదటి సారి అప్ గ్రేడ్ అయిన వైనం అదీ. నేను చదివిన మొట్టమొదటి పొట్టినవల పేరు గుర్తు లేదు, కానీ ముఖపత్రం, చూచాయగా కథ గుర్తుకు ఉన్నాయి.

ఈ నవలల్లో కథ 80 వ దశకం తెలుగు సినిమాల్లోలాగ కొన్ని ఫిక్సెడ్ ఫార్ములాలు.

ఫార్ములా 1 : ఒక రాజుకు ఎన్ని నోములు నోచినా పిల్లలు కలుగరు. చివరికి ఎలాగోలా ఒక పాప పుడుతుంది. యువరాణీ వారు యుక్తవయస్కులవగానే, ఎవడో పొద్దుపోని మాంత్రికుడొకడు ఆమెను ఎత్తుకుపోతాడు. ఇక ఒక క్షత్రియ యువకుడు ఆమెను వెతుకుతూ వెళతాడు. చివరికి ఎక్కడో సప్త సముద్రాలకవతల ఏ చిలుకలోనో సేఫ్ గా ఉన్న ప్రాణాలను తీస్తాడు. యువరాణి + యువరాజు ఆల్ హాపీస్. యువరాణి కాకపోతే, రాజుకున్న జబ్బు మాన్పించటం - ఇక్కడ వెళ్ళటం ముఖ్యం, ఎందుకు అన్నది కాదు. అలాగే చివరకు మాంత్రికుణ్ణి చంపుతాడు అన్నది ముఖ్యం కాదు, మధ్య దారిలో ఏం జరిగింది అన్నది మాత్రమే ముఖ్యం.

ఫార్ములా 2 : ఒక రాజు ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తుంటాడు. (అంటే మరీ జోకొట్టటాలు, గోరు ముద్దలు తినిపించడాలు ఇలా కాకుండా). అతని సేనాపతి దుర్జయుడికి ఈ కాన్సెప్టు నచ్చదు. రాజ్యాన్ని దొంగగా తన ఏలుబడిలోకి తెచ్చుకోవాలని చూస్తాడు. ఇంతలో ఊళ్ళో ఒక ముసుగు వీరుడు బయలుదేరి అక్కడక్కడా కొన్ని వీరోచిత కృత్యాలు చేస్తుంటాడు. ఈ ముసుగు వీరుణ్ణి యువరాణి ప్రేమిస్తుంది. ఈ ముసుగు వీరుడు చివరికి ఆ దుర్జయుడి ఆటకట్టిస్తాడు. ఇక్కడా కొన్ని పాయింట్లు. ఆట కట్టిస్తాడన్నది ముఖ్యాం కాదు. ఎలాగ అన్నదే మనకు ముఖ్యం.

ఇవి రెండూ కాక మూడో రకం నవలలు. ఇవి పురాణాలో, భారతంలో ముఖ్య పాత్రలో, అరేబియన్ నైట్స్ కథలో,... ఇలాగ వేటి మీదో ఆధారపడి ఉంటాయి. ఇవండీ రసగుళికలు.

బహుళ జాతి సంస్థల్లో హెచ్ ఆర్ వాళ్ళు హోరెత్తించే, ప్రోయాక్టివ్ థింకింగులు, పాజిటివ్ అవుట్ లుక్కులు, హై ఎనెర్జీ లెవెల్లు, యాంటిసిపేషన్లు, రిస్క్ మిటిగేషన్ ప్లాన్లు....ఇలాంటివన్నీ ఈ జానపద నవలల్లో హీరోలకు అలవోకగా స్వతః సిద్ధంగా ఉంటాయి. హెచ్ ఆర్ వారు ఇచ్చే టుమ్రీ ట్రయినింగులకన్నా, ఈ పుస్తకాలు చదవడం చాలా లాభదాయకం.

పఠనాసక్తి ని అమాంతం ఆకాశానికెత్తే ఇలాంటి పుస్తకాలు ఈ కాలం పిల్లలకు అందకపోవడం చాల పెద్ద దురదృష్టం. ఇన్ఫర్మేషన్ యుగం కదా. ఇన్ఫర్మేషన్ ముఖ్యం, ఇమాజినేషను కాదు! పైగా వెధవ డబ్బా ఉండనే ఉంది. ఇక ఇవన్నీ ఎందుకూ?

ఈ జానపద నవలలు, బుజ్జాయి, బాలభారతి, బొమ్మరిల్లు - ఈ సంస్థలు ముద్రించేవి అప్పట్లో. బుజ్జాయి లో "కేశి" అనే ఆయన బొమ్మలేసే వారు. ఎంతచక్కగా ఉండేవో అవి. ఆ "కేశి" గారు చందమామ పత్రికలోనూ బొమ్మలేశారు.

తలవని తలంపుగా నాకు ఈ జానపద నవల నిధి సంవత్సరం క్రితం దొరికింది. ఇప్పటి వరకు ఆ నవలలు పూర్తీ చేయలేదు. చిన్న పిల్లాడికి లాలీపాప్ దొరికితే ఎక్కడ అయిపోతుందో అన్నట్టు నిదానంగా లాగిస్తాడు కదా - అదే కాన్సెప్టు నాదీను.

అన్నట్టు నాకు దొరికిన నవలలకుప్పలో, సంస్కృత నాటకాలయిన రత్నావళి (శ్రీ హర్ష విరచితం) , మృఛ్ఛ కటికం (శూద్రకుడు), కథా సరిత్సాగరం (సోమదత్తుడు), ఇంకా సింద్ బాద్, అల్లా ఉద్దీన్ వంటి అరేబియన్ నైట్స్ కథలు ఉన్నాయి.

సుదూర భవిష్యత్తులో ఓ అందమైన రోజు - నా మనవరాలికి/మనవడికి ఈ కథలు చదివి వినిపిస్తాను, ఆ పాప రాజకుమారుడు మాంత్రికుడిని చంపక ముందే నిద్రపోతుంది. - ఇదీ నా అరుదయిన పగటి కల.

22 comments:

 1. జానపద నవలలన్నింటినీ ముచ్చటగా మూడు ఫార్ములాల్లో ఇరికించడానికి ప్రయత్నం చేశారు గానీ, అంతకంటే మించిన వైవిధ్య భరితమైన కథలెన్నో వచ్చాయి. జాబిల్లి పబ్లికేషన్స్, వెన్నెల బాల పబ్లికేషన్స్ నెలకు రెండు నవలలు ప్రచురించేవారు. మా స్కూల్లో వీటిని బ్యాగుల్లో దాచుకొని రానివారుండేవారు కాదు.

  మీ ఖజానాలాంటిది నాదగ్గరా ఉండేది. కొన్ని వందల పుస్తకాలు, "చదివిస్తా" అన్న ఒక్క ముక్కతో పట్టుకుపోయిన వారి పుణ్యాన మొత్తం హాంఫట్! జానపద కథల్లోలాగా! మీ పుస్తకాలొకసారిస్తారా, చదివిస్తా! :-)

  ReplyDelete
 2. ఈ యుగానికి, ఈ తరానికీ హారీ పాటర్ పుస్తకాలే దిక్కు. తెలుగులో ఇలాటి కథలు ఏనాడో వచ్చాయంటే ఇప్పటి పిల్లలు ఎవరూ నమ్మడంలెదు.

  ReplyDelete
 3. నాదగ్గర నా చిన్నప్పుడు ఒక ట్రంకుపెట్టె నిండా ఉండేవి..

  సైన్యాధిపతే ప్రధాన విలను. చాలా సార్లు తను రాణీగారి తమ్ముడు కూడా. అలానే రాజుగారికి ఇద్దరు భార్యలు, అన్నికధల్లోలాగే ఒకామెకు పిల్లలుండరు. ఇంకొన్ని కథల్లో భైరవ ద్వీపాలూ, క్షుద్ర కాపాలికులూ, నరమాంస భక్షకులూ.. అప్పుడప్పుడూ మునులూ శాపాలూ.. పేరుని బట్టి నాయకుడో, ప్రతినాయకుడో ఇట్టే చెప్పొచ్చు.అదేంటొ ఎన్ని చదివినా బోరు కొట్టేది కాదు..

  ఇప్పటి వాళ్ళు క్లాసుల్లో ఏంచేస్తున్నారో గానీ, అప్పట్లో మాక్లాసులో ఉండే "రౌడీ" పిల్లలు ఒకపక్క క్లాసు జరుగుతుంటే వీటిని టెక్స్ట్ బుక్ మధ్యలో పెట్టుకొని చదివేవాళ్ళు..

  ఇప్పుడు అంత చిన్న పుస్తకం చేతుల్లో ఇముడుతుందా అనిపిస్తొంది ? :)

  ReplyDelete
 4. "సుదూర భవిష్యత్తులో ఓ అందమైన రోజు - నా మనవరాలికి/మనవడికి ఈ కథలు చదివి వినిపిస్తాను, ఆ పాప రాజకుమారుడు మాంత్రికుడిని చంపక ముందే నిద్రపోతుంది. - ఇదీ నా అరుదయిన పగటి కల."

  మీ కల చాలా అందంగా ఉంది :)

  ReplyDelete
 5. మీకల నాకు చాలా బాగా నచ్చింది.

  ReplyDelete
 6. బాగా రాశారండీ. అభినందనలు!

  > హెచ్ ఆర్ వారు ఇచ్చే టుమ్రీ ట్రయినింగులకన్నా, ఈ పుస్తకాలు చదవడం చాలా లాభదాయకం.

  జానెడు సైజు జానపద నవలలు నేను హైస్కూలు రోజుల్లో చదివాను. బొమ్మరిల్లులో వచ్చిన ధారావాహిక ‘మృత్యులోయ’ నాకు ఇష్టమైన నవల. దీన్ని రెండు భాగాల పుస్తకాలుగా ‘జానెడు సైజు’లో ప్రచురించారు.

  ReplyDelete
 7. శీర్షిక చూసి, ఎవరైనా ప్రచురణ కర్తలు, ఆ పాత నవల్స్ అన్నింటినీ, కలిపి ముద్రిస్తున్నారేమో అనుకుని ఆశగా వచ్చా :(


  మా ఇంట్లో, చందమామ తో పాటు బొమ్మరిల్లు కూడా వచ్చేది.. దాంట్లో మధ్యలో ఈ జానపద కధ(నవల) ఉందేది..
  నిజమే, అన్నీ ఫార్ములా బేస్డ్.. ముగింపు ముందే తెలిసినా, ఎలా అనేదే అసలు పాయింట్..
  ఇప్పుడు ఇమాజినేషన్ ఎవరికి కావాలండీ, ఏదోలా, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయితే సరిపోదూ!!

  >>సుదూర భవిష్యత్తులో ఓ అందమైన రోజు - నా మనవరాలికి/మనవడికి ఈ కథలు చదివి వినిపిస్తాను, ఆ పాప రాజకుమారుడు మాంత్రికుడిని చంపక ముందే నిద్రపోతుంది. - ఇదీ నా అరుదయిన పగటి కల..
  ఏమో, నా కైతే కనీసం నా పిల్లలకి చదివి వినిపించగలనో లేదో కూడా డౌట్ గా ఉంది!!!

  ReplyDelete
 8. తాత గారి ఊరికి వెళ్తే మాకు ప్రైవేటు లైబ్రరీలో పావల అద్దెకు ఇచ్చే ఈ చిట్టి నవలలు తప్ప వేరే టైంపాస్ ఉండేది కాదు. బాగా రశారు. మన నవలలకి హారీ పాటర్ కి పోటీయా? హ్మ్మ్మ్ ఆలోచించాలి.
  యాదృచ్చికంగా నేను ఇలాంటి టాపిక్ మీదే టపా వేశాను చూడండి.

  ReplyDelete
 9. రవి గారూ,
  నా ఆర్త నాదాలు వినిపిస్తున్నాయా మీకు? అన్ని పుస్తకాలే! ఏం చేసుకుంటారూ?

  మా కజిన్ ఒకామె వద్ద కూదా పదహారు నవలలు ఉన్నాయి ఈ పాకెట్ సైజు జానపద నవలలు. ఫొటోస్టాట్ తీయించుకోడానికైతే ఇస్తానంది విశాల హృదయంతో! కానీ వాటిని అలా ఒరిజినల్ గా own చేసుకుని చదవడంలో ఉన్న ఆనందం ఫొటోస్టాట్ లతో వస్తుందా? కథ ఒక్కటే కాదు ముఖ్యం, అప్పియరెన్స్ కూడా కదా! వద్దన్నాను.

  సరే ఏం చేస్తాం! మీ మనవలన్నా మీ వద్ద కథ మొత్త చెప్పించుకోవాలని ఆశిస్తున్నాను!

  ReplyDelete
 10. ఇంకా ప్రత్యేకంగా కామెంటేందుకు ఏమీలేదు.నేను చెప్పదలుచుకున్నది అందరూ చెప్పేసారు. మీ కల నిజమవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకూ నా పెద్ద కూతురికి నేను రామాయణం, భారతం వినిపించలేకపొయ్యాను, పాఠాలుగా ఉన్నవి ముక్కున పెట్టుకు చీదేసేది. అంతే! ఎంత బోరో దానికి. అలాంటిది, హరీ పాటరు సిరీసు అన్నీ చదవడమే కాదు, చూసింది కూడా, విసిగి ఓదిలేసాను. మన పాత నలుపూ, తెలుపొ, సినిమాలు కనీసం పౌరాణికాలు కూడా చూడరు. ఒక్క "మాయా బజారు,"" పరమానందయ్య శిష్యుల కధ" అదీ మా అమ్మ కూర్చుని ప్రతి పదం వారికి వివరించి చెప్తే ఏదో అమ్మమ్మ మీద ప్రేమ కొద్దీ. అందుకే మీ కల నిజమవ్వాలి.

  ReplyDelete
 11. ఒక్కసారి ఇస్తారా, చదివిచ్చేస్తా. :P (మీరివ్వరని ఎందుకో మనసు చెబుతోంది)

  ReplyDelete
 12. ఇలాంటి పుస్తకాలు కొనుక్కోడానికెక్కడైనా దొరుకుతాయా?
  అలాగే, మధుబాబు గారి షాడో సీరీస్ మొత్తం కొనుక్కోవాలంటే ఏదైనా మార్గముందా?

  ReplyDelete
 13. @సూర్యుడు గారు : షాడో సిరీస్ మళ్ళీ పునర్ముద్రిస్తున్నారు. 2008 లో దాదాపు 20 నవలలు ముద్రించారు. ఇవి ఏవైనా బస్ స్టాండ్ లలో చిన్న చిన్న కొట్లలో దొరుకుతున్నాయి. మీది హైదరాబాద్ అయితే హైదరాబాద్ బస్ స్టాండ్ లోపలకు వెళ్ళగానే ఒక పుస్తకాల దుకాణం ఉంది. అక్కడ విచారించండి.

  ఇంకో విషయం. కొన్ని మధుబాబు షాడో నవలలు డూప్లికేట్ వి కూడా వస్తున్నాయి. అన్ని పాత్రలు అలాగే ఉంటాయి, అయితే అస్సలు బాగోవు. ఎవరైనా ఘోస్ట్ చేత రాయిస్తున్నారేమో తెలీదు.

  అలాగే మల్లెపూలు.కామ్ లంకెలో కొన్ని షాడో పుస్తకాలున్నాయ్. పరిగెట్టండి అక్కడికి :-)

  ReplyDelete
 14. సునిత గారు, హాచ్చెర్యంగా ఉంది. రామాయణం వద్దనే పిల్లలుంటారా? మా ఇంట్లో బుడతడికి రామాయణం వినందే నిద్రపట్టదు. ఆల్రెడీ ఒక గద, రెండు ధనుస్సులు, శరాలు(వాటిని బాణాలు అనరా అంటే వినడు), ఒక ఖడ్గం (ఒరతో సహా) కొని పెట్టుకున్నాడు. బహుశా మరీ చిన్నవాడు కాబట్టి ఇపుడిపుడే స్కూల్ కి వెళ్తున్నాడు కాబట్టి మా సోది వింటున్నాడేమో.

  వీలైతె ఇంగ్లీషులో అమర్-చిత్ర-కథ సిరీస్ లొ బొమ్మల రామాయణం కొనివ్వండి. అదైతె కామిక్స్ స్టైల్లో ప్రి-టీన్స్ చదువుకునేందుకు వీలుగా ఉంటుంది.

  ReplyDelete
 15. @చంద్రమోహన్ : స్కూలు బ్యాగుల్లో అవునండి. మా అయ్యవారొకరు, మమ్మల్ని అరెస్ట్ చేసి, ఆ పుస్తకాలు గుంజుకుని, చదువుకుని, సాయంత్రం తిరిగి ఇచ్చేవారు.

  @harephala : pity.

  @ఉమాశంకర్ : ట్రంకుపెట్టెలున్నవే అందుకే. నా దగ్గరా చాలా ఉండేవి. అన్నీ మాయం.

  @యోగి, @Indian minerva : ఠాగోర్ కవితలు మీరు చదవలేదా? ఆయన కవితలు చదువుతుంటే చాలు, ఇలాంటివి అనేకం తడతాయి ఎవరికైనా.

  @వేణు : మృత్యులోయ నాతో ఉండాలనుకుంటున్నాను.

  @మేధ : షాడో పుస్తకాలు ముద్రించారండి. మీరు చదువుతున్నానని చెప్పారు కదా అప్పుడెప్పుడో.

  @బుడుగు : అర్రె, మీ టపాలో నేనూ ఇలానే కామెంటానే. మీ వ్యాఖ్య చూడకముందే అక్కడికెళ్ళాను.

  @సుజాత గారు : చందమామలన్నీ e-format లో చూసుకోవట్లేదూ ఎంతోమంది. వాటితోనే తృప్తిపడాలి. తప్పదు.

  @sunita గారు : ఆ కల చాలా దూరం. మొదట మా పాయికి నేర్పాలి, సాధ్యమైనన్ని.

  @అరుణ పప్పు గారు : ఇవి మా పాపాయి ఆస్తిపాస్తులు. నేను సంరక్షకుణ్ణి అంతే.:-)చంద్రమోహన్ గారు, మీకూ ఇదే సమాధానం.

  ReplyDelete
 16. @రవి గారు: షాడో నవల్స్ కాదు.. అప్పట్లో చందమామ/బొమ్మరిల్లు/బాలమిత్ర వచ్చిన జానపద నవల్స్ గురించి..

  ReplyDelete
 17. రవి గారు, ధన్యవాదాలండి. ఏదైనా వి.పి.పి లో కొనుక్కునే అవకాశముందా?

  ReplyDelete
 18. @మేధ : ఊహూ. అవి ఇప్పుడు బయట ముద్రించట్లేదు!

  @సూర్యుడు : వీ.పీ.పీ సౌకర్యం లేదనుకుంటాను.

  @కొత్తపాళీ : Many of us used to have. Sad.. Somehow, I got these in a village..

  ReplyDelete
 19. బొమ్మరిల్లు వాళ్ళు వాళ్ళ బుక్ తో పాటు ఇంకో చిన్న బుక్ ఇచ్చేవారు .. అది కాకా ప్రతి నెల ఇంకో బుక్ రిలీజ్ చేసే వారు చిన్నది.. మీ బ్లాగ్ బాగుంది ...

  ReplyDelete
 20. రవిగారూ, నిజాయితీగా చెప్తున్నా... ఈ జానపద నవలలే అన్నపానీయాలుగా, ఊపిరిగా బ్రతికిన బాల్యం నాది. ఐనా కూడా Harry Potter వీటికంటే ఎంతో నచ్చింది నాకు. ఫార్ములా ఒకటే ఐనప్పటికీ ఈ జానపద కథల్లో లోపించిన సృజనాత్మకత కల్పనా పటిమ Harry Potter లో పుష్కలంగా కనపడ్డాయి నాకు.

  ReplyDelete
 21. ఇది నాకు ఎంత బుర్ర బాదుకున్నా అర్ధం కాని విషయం అండి మా ఆఫీసు వాళ్ళు మూడు నెలలకోసారి సమయ పాలన అని వ్యక్తిత్వ వికాసం అని భావోద్వేగాల అదుపు అని ఎవడెవడో చెప్పిన రాసిన పుస్తకాలు తీసిన సినిమాలు చూపిస్తుంటారు ఒక్క సారైనా మన రామాయణం లో హనంతుడి వాక్పటిమ నుగురించో, కార్యశీలత గురించో రాముడి సమయ పాలన గురించో, ధర్మరాజు వాక్చాతుర్యం గురించీ ద్రౌపది ధీరాత్వము గురించో చెప్తారా అని చూస్తానండి అదేమి విచిత్రమో ఒక్కడు కూడా మాట్లాడాడు అసలు వీళ్ళకి తెలియవో లేక సేక్యులరిసం అని మాట్లాడారో అర్ధం కాదు

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.