Saturday, August 15, 2009

ఎడమకాలి రెండో వేలు గోరు

గంగమ్మ.

పేరు విననీకి అంత బాగలే. అయితేనేమంట? గంగమ్మ అచ్చంగా మా పాలిటికి గంగమ్మ తల్లే. గంగమ్మ మా ఇంట్లో బట్టలుతుకుతా ఉన్నిండే సాకలాయమ్మ.

నాకప్పుడు ఒగ ఏడేండ్లున్నిన్నా? అప్పటి రోజులు నాకు బాగా గ్యాపకం.

మామూలుగా ఒక రోజు మా ఇంటికి ఉతికే బట్టలు తీసకపోనీకి గంగమ్మ ఒచ్చింది. మా అమ్మ గంగమ్మతో మాట్లాడతా, మాట్లాడతానే, మురికి బట్టలు ఒక్కొక్కటి ఎంచి, ఇవతల కుప్ప బేర్సింది. అన్నీ అయిన తర్వాత ఒక చీర పరిచి, దాన్లేకి ఈ కుప్ప బట్టలూ ఏసి, ఇట్లొక గంటు, అట్లొక గంటు ఏసి మూటకట్టె. గూట్లో ఒక చిన్న డిక్టేషన్ బుక్కు. ఆ డిక్టేషను బుక్కు నా రెండో కళాసు లోది. నేను మూడుకొచ్చినా కాబట్టి, అది ఇంక సాకలి పద్దు కు పెట్టుకున్నింది మాయమ్మ. ఆ బుక్కు తీసి పెన్సిలుతో రాసి, మొత్తం పద్నాలుగు బట్టలు గంగమ్మా అనె.

"మొత్తం పద్నాలుగు బట్టలు గంగమ్మా" అంటి నేను గుడక, నవ్వుతా.

కిసుక్కున నవ్వె గంగమ్మ, వక్కాకు ఏసుకున్న నోట్లోంచి, ఎర్ర పండ్లు బయటపెడతా.

"గంగమ్మా అనాకు. గంగమ్మవ్వ అను" కసిరె మాయమ్మ.

"పోన్లేమ్మయ్యా, ఉన్నీలె" అనె గంగమ్మ. గంగమ్మకు నన్ను చూస్సే శానా ముద్దు.

ఒకపాలి నాకు ఎడమకాలు బొటనేలు పక్కనేలు యాడనో తగిలిచ్చుకుని, చీము పట్టి గోరంతా పసుప్పచ్చగాయె. నెప్పి తట్టుకోలేక ఏడస్తా ఉన్నా. మాయమ్మ సత్యనారాయణ డాక్టరు కాడికి పిల్చక పాయె, సూది యేపిచ్చె, వేడన్నము, పసుపు కలిపి ముద్ద కట్టి కాలికి చుట్టె, ఇట్ల ఏమేమో చేసె. అయినా తగ్గలే.

గంగమ్మొచ్చి చూసి, "పిలకాయ నీర్సంగున్నాడు కదమ్మయ్యా. ఏదీ చూడనీ" అనె. అని నాకాలు గోరు కాడ కొంచెమట్ల పిసికె. మొదటే ఉన్న గోరు నొప్పితో నేనెడుస్తా ఉంటే, మాయమ్మ దానికి తోడుగా సూది గుచ్చిపిచ్చిందని కోపంలో ఉన్నా. గంగమ్మ గోరు పిసికే సరికి నాకు తిక్కరేగిపాయె.

"డాక్టరు సూది ఏసినాడు కదా, తగ్గి ఛస్తాదిలే" అన్నా ముకం ముడుచుకుని.

గంగమ్మ మామూలుగానే కిసుక్కన నవ్వి, నా కాలు అట్లిట్ల తిప్పి చూసి, "అమ్మయ్యా, ఎర్రగడ్డ, బాగ కాల్చి, రోంత రోంత కాపడం పెట్టు. తగ్గిపోతాదిలే. రోజులు బాగలేవమ్మయ్య, దిష్టి తీ" అనె. నా గోరు సంగతేమో గానీ, అందరికీ ఇదొక ఆటైపాయె అనుకుంటి నేను. బయటికి చెప్పలే.

ఆ రోజు రాత్రికి, మాయమ్మ సన్నెర్రగడ్డ, బాగ కాల్చి తీసుకొచ్చె. రోంత రోంత అట్ల నా గోరుకు సోకిచ్చి, రోంచేపయిన తర్వాత బాగ అదిమి కట్టు కట్టేసె. ఆ తర్వాత దిష్టి తీసె. నిజం చెప్పాల్నంటే, భలే సమ్మగుండెలే. మరుసట్రోజు పొద్దుగాల చూస్సే, నా గోరు పసుప్పచ్చ రంగు పాయి, గోధుమ రంగులో మారె. ఆ మజ్జాన్నానికి మామూలయిపాయె. రెండ్రోజులు స్కూలెగ్గొట్టినా, గోళీలాడలేకపోతి, ఈ గోరు తకరారు తో. ఆ రోజు మాత్రం మజ్జాన్నం.... ఏం చెప్పల్ల. పండగలే!. అయితే గోళీలాడేటప్పుడు తిరగా రాయి కొట్టుకుని, సగం గోరు ఇరిగిపాయె. అయితే గోరు ఆతలికే మెత్తబడింది గామాలు. నెప్పి లేదు.

ఇంకోసారి ఇట్లాగే ఎదురింట్లో సన్నపిల్లోడు ఏమిటికో ఏడుస్సాంటే గంగమ్మ, నిమ్మళంగ వక్కాకేస్కుంటా వచ్చి, అట్ల చూసి, తేనె, తులిశాకు, వేణ్ణీళ్ళల్లో కలిపి పట్టీమని చెప్పెనంట. మరసట్రోజుకి, ఇంకేముంది? పిల్లోని ఏడుపు, జొరమూ రెండూ తగ్గి నవ్వు ముకంతో తిరగబట్టెనే!

మా గేరులో కసుగందులు ఎవరున్నా సరే, వాండ్ల వీపుకు బాగ ఆముదం తిక్కి, స్నానం చేపిచ్చాలన్నా ఆయమ్మనే లాయక్. కాళ్ళు సాపుకుని, కాళ్ళ మధ్య పిల్లగాండ్లను బోర్లబొక్కల తిప్పి పండుకోబెట్టుకుని, వీపు రుద్దుతాంటే, అదేం చిత్రమో యేమో, అంత వేడి నీళ్ళు గుడక, పిల్లనాయాండ్లు నవ్వుతా పోయిచ్చుకుంటాండ్రి.

ఇంకా, రథసప్తమి నాపొద్దు జిల్లేడాకులు తలమింద పెట్టుకొని స్నానం చేయాల్నంట. ఆరోజుకి జిల్లేడాకులు, దసరానాపొద్దు జమ్మి, అప్పుడప్పుడు బిల్వ పత్రి కాయలు, ఎవరికైనా అమ్మోరొస్తే, వేపాకులు, ఇవన్నీ గంగమ్మనే అందరికీ తెచ్చిస్సాండె.

గంగమ్మ ఇంట్లో, మొత్తం ఏడుమంది. ఐదు మంది మనుషులు, రెండు గాడిదులు. గంగమ్మ, కూతురు లచ్చమ్మ, అల్లుడు ఈరయ్య, ఇంకా ఇద్దరు పిల్లోళ్ళు. ఈరయ్య మారాజు లాంటోడు, అత్తమ్మని అమ్మలాగా చూస్కుంటన్న్యాడని అందరూ చెప్పుకుంటా ఉండిరి. ఈరయ్యకి, లచ్చమ్మకి ఇద్దరు పిల్లలు. ఒక బిడ్డ, ఒక కొడుకు. ఈరమ్మ బిడ్డ నాకంటే ఒక సంవత్సరం పెద్దది. సుబ్బయ్య నాకంటే ఒక సంవత్సరం చిన్నోడు. సుబ్బయ్య ఒక్కడే స్కూలుకు పోతా ఉండే.

నేను ఒక్కో కళాసు ప్యాస్ ఐతానే, టెక్స్ట్ పుస్తకాలన్నీ సుబ్బయ్య కిప్పిస్సా ఉండే మాయమ్మ. అట్ల సుబ్బయ్య నా పుస్తకాలతోనే సదువుకుంటా వచ్చినాడు.

అప్పుడప్పుడూ కొళాయిలో నీళ్ళు రాకపోతే, జానకమ్మోళ్ళ బాయిలో నీళ్ళు చేదిచ్చే పని గుడక గంగమ్మదే. మాకే కాదు, అందరికీ. అందుకు రేటు ఇంటికొక రూపాయి. మా ఇంటికి మట్టుక - ఒక ఆకు వక్క, రోంత సున్నం.

రోజులు బాగలేవని యా ముహూర్తాన చెప్పిన్నిందో, గంగమ్మ, అది నిజమయ్యె. గంగమ్మోల్ల కొట్టం బయట అంగట్లో మూలకి నల్లకుక్క ఈనింది. అందరూ బట్టలుతికేకి కెనాలుకు పోయున్నారు, రోజు రాత్రి గంగమ్మ, ఆడ అంగట్లో ఉన్న బండమీదనే పడుకుంటాండె. ఆ రోజు రాత్రి గూడా అట్లాగే పడుకున్నింది. మూలకి నల్ల కుక్క రోంత గురాయిస్తా ఉన్నింది, గంగమ్మను చూసి. నడి రాత్రి ఏమిటికో లేసి, బయటకొచ్చేటప్పుడు తెలీకుండా కుక్కపిల్లను తొక్కేతలికి, ఆ నల్లకుక్క "భౌ" మని అరుచుకుంటా వచ్చి, కాలు కొరికిందంట.

మల్లా రెండు మూడు రోజుల తర్వాత మాయమ్మ గంగమ్మ బట్టలకోసమొచ్చినప్పుడు అడిగె, "ఏం గంగమ్మా, కాలు కేందా కచ్చు?" అని. "ఏం లేమ్మయ్యా, కుక్క కొరికింది, పోతాదిలే" అనె. "చూపిచ్చుకో గంగమ్మా, ఏమిటికన్నా మంచిది" అన్జెప్పె మాయమ్మ.

రెండు నెలలయ్యె. ఒక రోజు ఈరయ్య మా ఇంటికి ఏడుపు ముకం తో వచ్చె మాయమ్మ కాడికి. ఈరయ్య ఎప్పుడూ పని చూస్కునేదే తప్ప, ఎవురితో మాట్లాడేటోడు కాదు, ఎవరింటికీ పొయేటోడు కాదు. మాయమ్మ ఈరయ్యను చూసి ఏమనడిగె.

"అత్తమ్మకి బాగలేదమ్మయ్యా, పెద్దాస్పిటల్లో చేరిపించినాము" అనె. మా అమ్మ ఈరయ్యకు రోన్ని డబ్బులిచ్చి ఇవి పెట్టుకో మని చెప్పె. తను ఆస్పిటలుకు రిక్షా మాట్లాడుకుని, పోయి చూసేసొచ్చె. "ఏమీ లేదులే. తగ్గిపోతాది" అనుకునె.

ఆ తర్వాత ఒక నెల, నెలన్నర తర్వాత గంగమ్మ పరిస్థితి మాఅమ్మకి అర్థమయిపాయె. గంగమ్మకు పిచ్చెక్కిందంట. పిచ్చెక్కినోళ్ళు ఇంకొకళ్ళను కరిస్తే, వాళ్ళకు పిచ్చి ఎక్కుతాదని చెప్పి, గంగమ్మను ఎవరూ రానీకుండా ఉండిరి. ఈరయ్య, లచ్చుమమ్మ కూడా బయటికి పోనిస్సా ఉన్నిండ్లే. ఒక రోజు రాత్రి. ఆ రోజు వర్షం పడతాన్నింది. లోపల పడుకొనున్న్యాం. రాత్రి పెద్దగా అరుపులు. నేను మా అమ్మని అడిగితి, రాత్రి, ఏమిటికా అరుపులు అని. "ఏం లేదులే పడుకో" అనె మాయమ్మ. ఆ అరుపులు గంగమ్మవి. వర్షాన్ని చూసి, బాగా పిచ్చెక్కి అరిచిన అరుపులంట అవి.

ఆ రోజు తర్వాత గంగమ్మ నాకు కనపరాలే. నల్ల కుక్క మట్టుకు ఒక రోజు కస్ కస్ మని దగ్గుతా మా ఇంటి కాడికొచ్చె. నేను చపాతీ రోంత తుంచి యేసేదానికి పోతే, మాయమ్మ, "ఛీ, పా అవతలికి, పాపిష్టి కుక్క." అని తరిమేసె. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ కుక్కా బాగ చిక్కిపోయి, కడాకు యాడపాయెనో ఏమో, కనపరాలేదు.

-----------------------------------------------------

ప్రస్తుతం.

"ఊర్లోకి ఎక్జిబిషను వచ్చిందంట. పోదామా?" నా భార్య అడిగింది.

మా ఆవిడ అడగటం అంటే "పద. బయలుదేరండి" అని అర్థం.

బట్టలు మార్చుకుని, హడావుడిగా బయటకొస్తాంటే, కాలికి గడప్మాను కొట్టుకునింది.

"అబ్బా. మీ కాలి గోరు ఎప్పుడూ కొట్టుకుంటానే ఉంటుందే, ఎప్పుడూ". నా ఎడమకాలి రెండో వేలు గోరు దగ్గర రెండు గోర్లు- ఒకదానిపైన ఒకటి వచ్చి, కొంచెం చూపుదేలింటుంది. అందుకని, అప్పుడప్పుడూ రాళ్ళకు కొట్టుకొంటా ఉంటది.

మా ఇంటికాడే ఆటో స్టాండు. ఆటోని పిలిచింది మా ఆవిడ. ఆటోను చూడగానే ఆనందంగా కేక పెట్టి, "మామా" అని సన్నగా అరిచింది మాపాప. ఆటో ఎక్కడమంటే విమానం ఎక్కడం లాగ మా పాపకు. అదీ ఆ ఆటోను స్టాండులో చూసి, చూసి అలవాటు దానికి.

"ఎక్జిబిషను దగ్గరికి. ఎంతియ్యాలన్నా?" అడిగింది నా భార్య.

ఆటో అతను తలగీరుకుని, మొహమాటంగా, "పర్వాలేదు. కూర్చోండమ్మా". అని చెప్పినాడు.

పాప, మా ఆవిడ, నేను ఎక్కగానే సుబ్బయ్య ఆటో బయలుదేరింది.

15 comments:

 1. అయ్యో పాపం!
  రాయడం అద్భుతంగా రాశారు. అక్కడక్కడా శిష్టవ్యావహారికం తొంగి చూస్తోంది - దిద్దుకోగలరు. ఒకపాలి అనడం విశ్ఖవేఫు మాట, మీ వేపుది కాదనుకుంటా.

  ReplyDelete
 2. చాలా బాగుంది.. కథ.. వ్రాసిన తీరు..!!

  ReplyDelete
 3. @కొత్తపాళీ గారు : ఏమనుకోకుండా మీరు చెప్పిన శిష్ట-వ్యావహారికం డీటయిల్స్ కాస్త నా మృణ్మయ మస్తకానికి అర్థమయేలా చెప్పగలరా?

  @సత్యప్రసాద్ గారు : ధన్యవాదాలండి. నాకు కథలు రాయడం రాదు. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. అయితే ఇంకా చాలా ఎదగాలి.

  ReplyDelete
 4. బాగా రాసారు రవి గారు.

  ReplyDelete
 5. రవిగారు,

  మీ జ్ఞాపకాలు చాలా బాగా రాసారు!

  ReplyDelete
 6. రవిగారు...చాలాబాగా రాసారండి!

  ReplyDelete
 7. చాలా బాగుంది. మనసుకి హత్తుకునేలా రాశారు.

  ReplyDelete
 8. చాలా బాగుంది రవి గారు.

  ReplyDelete
 9. Baagaa raaSaaru.SaD enDing?

  ReplyDelete
 10. అన్ని వ్యాఖ్యలు ఒకేలా ఉన్నాయి కాబట్టి, అందరికీ ధన్యవాదాలు. అందరి పేర్లు రాయడానికి బద్ధకంఘా ఉంది. క్షమించాలి. :-)

  సునీత గారు : never ending..

  ReplyDelete
 11. Hmm read it again - didn't find any. I was sure I spotted 3-4 instances the first time around. Anyway, good show!

  ReplyDelete
 12. కళ్లు ఇంకా మసకబారుతూనే ఉన్నాయి...దు:ఖం పొరలుకొస్తోంది. చిక్కని మానవ సంబంధాల్ని ఎంతో చక్కగా చూపెట్టారు. గంగమ్మ ఎక్కడికెళ్లిందో నాకు తెలుసు. అంత మందికి వైద్యం చేసినా, చివరికి అదే తన ప్రాణం మీద కొచ్చింది.

  శాస్త్రవిజ్క్షానం ఎంత పెరిగినా కొన్నిటికి ఇంకా పరిష్కారం లేదు. వాటిల్లో రేబిస్ ఒకటి. కరిచిన వెంటనే ఆ టీకా సూది మందు ఒక్కటే ఆమె ప్రాణాలు కాపాడగలిగి ఉండేది. ఇందులో ఇంకో సూక్ష్మ పరిశీలన ఉంది. అది వర్షానికి ఆమె పెట్టిన కేకలు,ఇది వ్యాధి చివరి లక్షణం- హైడ్రోఫోభియా. అలాగే గాలిని కూడా తట్టుకోలేరు. మరణం అనివార్యం. దీనికి ఒక్కటే మందు - నివారణే మార్గం అని తెలుసుకోవడం. కరిచిన వెంటనే పెద్దాసుపత్రికి పోయి కొన్ని సూది మందులు వేసుకొని ఉండింటే ఆమె ప్రాణం నిలబడేది కదా అని తలచుకొంటే బాధ ఇంకా ఎక్కువ అవుతుంది.

  ReplyDelete
 13. డాక్టర్ గారు,

  నాది సూక్ష్మ పరిశీలన కాదండీ. నిజంగా ఆమె అలానే చనిపోయింది. అయితే అప్పుడు నేను బాగా చిన్నపిల్లాణ్ణి. లీలగా మాత్రమే జ్ఞాపకం ఆ సంఘటన.

  పోతే ఈ కథ ఇద్దరు గంగమ్మల జ్ఞాపకమండి. ఆ రెంటినీ గుదిగుచ్చాను.

  ReplyDelete
 14. chaala baaga rasaaru..jarigina katha ni meeru present chesina teeru bagundi..

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.