Tuesday, August 11, 2009

సత్య క్రియ

సీత అగ్ని ప్రవేశ ఘట్టం మీద ఈ బ్లాగులో చర్చ జరిగి అప్పుడే సంవత్సరం కావస్తూంది. నిన్న బౌద్ధ జాతక మాల చదువుతుంటే కథ చివర్లో ఒక చోట రామాయణాన్ని, అందునా సీత అగ్ని ప్రవేశ ఘట్టాన్ని ఉటంకిస్తూ రాసిన ఒక ఫుట్ నోట్ చూశాను. అప్పుడు సాగిన ఆలోచనలతో ఈ టపా రాయాలనిపించింది.

రాముడి మీద ప్రశ్నలు, రామాయణం లో విలువలు, గతి తార్కిక భౌతిక వాదాలు ఇవన్నీ తిరగదోడి ఆరోగ్యాలు చెడగొట్టుకొనే తీరిక, ఓపిక, ఆసక్తి ఇప్పుడు నాకు లేవు. కాబట్టి వాటి జోలికి వెళ్ళదల్చుకోలేదు.

ముందుగా కథ, సాధ్యమైనంత విశదంగా.

జాతక మాల లో ఈ కథ పేరు శిబి జాతకం. శిబి అనగానే గుర్తొచ్చే డేగ - పావురం కథ చాలా మందికి తెలిసిందే. జాతకమాలలో ఈ కథ కాస్త భిన్నంగా ఉంటుంది.

ఈ కథలో శిబి (బోధిసత్వుడు) ఓ గణతంత్ర రాజ్యానికి రాజు. ఆయన దాన ప్రవృత్తికి సరిపడా గొప్ప యాచకుడు దొరకలేదని ఒక రోజు మథన పడతాడు. అప్పుడు ఆయన అత్యుదార సంకల్పానికి పృథివి, భర్త యెడల అనురక్తమైన స్త్రీ వలె చలించిపోతుంది. పృథివి చలనానికి మేరు పర్వతం కూడా చలిస్తుంది. ఆ కంపనాన్ని స్వర్గలోకంలో ఇంద్రుడు గమనించి, ఆశ్చర్య పడి, శిబిని పరీక్షించడానికి భూమిపై అడుగెడతాడు.

ఓ వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించి శిబి వద్దకు వచ్చి, ఇంద్రుడు, శిబిని ఒక కన్ను దానమడుగుతాడు. అప్పుడు శిబి, ఇన్ని నాళ్ళకు నా దాన ప్రవృత్తికి సార్థకత లభిస్తున్నదని ఆనందపడి తన రెండు కళ్ళను దానమిస్తానంటాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుని, తన గురించి ఇంత గొప్పగా చెప్పి ప్రేరణ కలిగించినదెవరని అడుగుతాడు. అప్పుడా బ్రాహ్మణుడు అది ఇంద్ర ప్రేరణ అని చెబుతాడు.

శిబి మహోన్నత నిర్ణయాన్ని విన్న మంత్రులు, ఆ వచ్చిన వాడు దేవుడని, ఒకరి నేత్రం ఇంకొకరికి అమరదని, ఇలా అతణ్ణి రకరకాలుగా వారిస్తారు. శిబి వారికి నచ్చజెబుతూ, కార్పణ్యదోషం (avarice) పాపహేతువు అని చెబుతాడు.

ఇంకా

నైకకారణ సాధ్యత్వం కార్యాణాం ననుదృశ్యతే
కారణాంతరసాపేక్షః స్యాద్దేవో 2పి విధిర్యతః

ఏకకారణం (single cause) వల్ల కార్యములు (effects) ఏర్పడడం మనకు ఎక్కడా కనిపించదు. కనుక దేవుడికైనా తన కార్యసిద్ధికి కారణ సామగ్రిని ఆపేక్షించక తప్పదని చెబుతాడు. ఇలా చెప్పి అందరిని ఒప్పించి, శిబి తన నయన పద్మాలను సహస్ర నయనునికి అర్పించి, పద్మములు లేని, పద్మాకరముఖుడవుతాడు.

అప్పుడు శక్రుడు మిక్కిలి సంతోషించి, ఈ మహా పురుషుడికి పునః చక్షు ప్రాప్తికి సమర్థమైన ఉపాయం కలిగేలా ప్రేరణ ఇస్తానని తీర్మానించుకుంటాడు.

కొన్ని రోజుల తర్వాత శిబి గాయాలు మానిన తర్వాత, తిరిగి ఇంద్రుడు నిజరూపంతో వస్తాడు. ఏమి కావాలో ఆజ్ఞాపించమంటాడు శిబి. ఇంద్రుడేదయినా వరం కోరుకొమ్మంటాడు. శిబి ఆ మాటలకు ఆశ్చర్యపడి, "శక్రా, నాకు ఏ దానము వద్దు. అయితే నాకు అన్ని సంపదలున్నా, యాచకులు దానం గ్రహించినప్పుడు వారి ముఖంలో సంతోషాన్ని చూడలేకపోతున్నాను. అందుకే మృత్వువును కోరుతున్నా"నంటాడు. చలించిపోతాడు ఇంద్రుడు. అయితే పరీక్షించడానికి, రెచ్చగొడుతూ, "యాచకుల వలనే కదా నీకీ దురవస్థ. యాచకులపై నీ భావాలేమిటి" చెప్పమంటాడు.

తదివ చైతర్హి చ యాచకానాం వచాంసి యాంచానియతాక్షరాని
ౠశీర్మయాణీవ మమ ప్రియాణి యథా తథోదేతు మమైకమక్షి

"యాచకుల యాచనా వాక్యాలు ఆశీర్వాదాల లాగా శ్రవణపేయంగా ఇదివరకు ఎలా అనిపించాయో, ఇప్పుడు అలానే అనిపించే పక్షంలో నాకు ఒక కన్ను ఉదయించుగాక!"

శిబి ఇలా చెప్పగానే సత్యాధిష్టాన బలం వల్ల శిబి కన్ను తిరిగి ఉదయించింది.ఆశ్చర్య చకితుడైన శిబి, ఇంకో శ్లోకం చెబుతాడు.

యశ్చాపి మాం చక్షురయాచితైకం తస్మై ముదా ద్వే నయనే ప్రదాయ
ప్రీత్యుత్సవైకాగ్రమతిర్యథాసం ద్వితీయమప్యక్షి తథా మమాస్తు ||

"ఒక నేత్రాన్ని యాచించిన యాచకుడికి నా రెండు నేత్రాలు మోదంతో ఇచ్చి ఆనందోల్లాసంతో నా చిత్తం లగ్నమై ఉండిన పక్షంలో రెండవ నేత్రం నాకు కలుగుగాక!"

రెండవనేత్రమూ ఆయనకు కలుగుతుంది. ఆ సత్యక్రియకు హర్షం పట్టలేక భూమి కంపిస్తుంది. సాగరుడు చెలియలికట్ట దాటుతాడు. సూర్యదేవుడు శరత్కాలంలో వలె శుద్ధంగా ప్రకాశిస్తాడు. పుష్పవృష్టి కురుస్తుంది. సకల దేవతా గణమూ బోధి సత్వుణ్ణి ప్రశంసిస్తుంది.

ఇది కథ. ఇక విషయానికి వద్దాం.

ఎటువంటి లోపానికి తావివ్వకుండా ధర్మానుచరణ కలిగిన వారి వాక్కులకు ఒక దివ్యప్రభావం సంక్రమిస్తుంది. జీవితంలో ఏదేని అతిక్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు వారు దాన్ని సత్య అధిష్టాన బలం (Power of truth blessing)ద్వారా అధిగమిస్తారు. ఈ సత్యక్రియ ఆచరించేప్పుడు వారి సంకల్పం వాగ్రూపంలో వ్యక్తం కావడం అవసరమై ఉంటుంది. శిబి అంతకు ముందే ఆ క్రియను ఆచరించి, నేత్ర సిద్ధి పొంది ఉండవచ్చు. అయితే ఆ మహనీయుడు అందుకూ ఆశపడక మౌనం వహిస్తే, చివరికి ఇంద్రుడు ప్రేరణ కలిగించవలసి వస్తుంది.ధర్మ మహాత్మ్యానికి భారతీయహృదయం ఇచ్చిన మహోన్నత స్థానానికి సత్యక్రియ ఒక ప్రతీక (symbol).ప్రాచీన భారతీయ సాహిత్యంలో ఈ సత్యక్రియా ప్రక్రియ ప్రముఖంగా కనబడుతుంది. ఉదా: సీతాదేవి అగ్ని ప్రవేశ ఘట్టం.

పైన శిబి కథలోనూ, సీతాదేవి విషయంలోనూ నాకు కనిపించిన ఒప్పుకోదగిన విషయాలు ఏమంటే - ఈ సందర్భాలలో సత్య క్రియ అన్నది తమకు వచ్చిన ఆపదను తొలగించుకోటానికి, లేదా సత్యంపట్ల తమ అనుయాయులకు, ప్రజలకు నమ్మకం సడలపోరాదని చెప్పటానికి ఉపయోగించబడింది. తమను ధిక్కరించిన వారిపై శాపాలు పెట్టటానికి సత్యక్రియ ఉపయోగించబడలేదు. (మహర్షులు పెట్టే శాపాల మీద వ్యక్తిగతంగా నాకు విశ్వాసం లేదు. కామక్రోధాదులను జయించగోరే వారు, జయించినట్లు చెప్పబడే వాళ్ళు, శాపాలెందుకిస్తారో ఊహకు అందదు. అందులో మానవీయత, మహనీయత కూడా నాకు గోచరించదు.)

పైన శిబి ఉదంతం, సీతా దేవి ఉదంతంలోని సత్యక్రియ నిదర్శన కరుణరసప్లావితమై ఉంటుంది. చూచాయగా ఇలాంటి సంఘటనలు, ఇలాంటి సత్యక్రియ కలిగిన వ్యక్తులు మనజీవితంలోనూ ఎదురవడం కద్దు - మన నమ్మకం, అపనమ్మకం, విశ్వాసాలతో సంబంధం లేకుండా. తిరుమల రామచంద్ర గారి జీవిత చరిత్రలో ఓ చోట రాతి బసవడు, చెక్క బసవడు అని ఇద్దరు మిత్రుల కథ చెబుతారు. వారిద్దరికి సంస్కృతం వంటబట్టదు. ఇంటినుండీ పారిపోతారు. వారికి రామచంద్రగారు మంచి మాట చెబుతారు. ఓ మంచి మాట, మంచి జరగాలనే సంకల్పం అంతే. ఆ తర్వాత ఆ ఇద్దరు మంచి జీవితాలలో స్థిరపడతారు.

నా చిన్నప్పుడు మా ఊళ్ళో వర్షం పడకపోతే, వారం రోజులు మా ఇంటి పక్క గుడిలో ఏవో పూజలు, భజనలు జరిపారు. బాగా జ్ఞాపకం నాకు. సరిగ్గా ఆ వారం చివరిరోజు - మంచి వర్షం కురిసింది. ఇక్కడ నేనా పూజలను, విధానాలను సమర్థించడానికి ప్రయత్నం చేయట్లేదు. వర్షం కురవక, గొంతులెండిన అనేకమంది ఆర్తి - ఆ రోజు అక్కడ సత్యక్రియగా మారింది అని నా అనుకోలు.

అలాంటి పూజలు ఇప్పుడు జరిపినా వర్షం కురుస్తుందన్న ఆశ లేదు. దురదృష్టవశాత్తూ వ్యాపార సంస్కృతి అడుగంటా పాతుకుపోయిన సమాజంలో ఉన్నాం మనం. మనకు ఇలాంటి సంకల్ప బలాలు, సత్యాధిష్టానం తాలూకు ప్రతిఫలాలు బహుశా అర్థమవమేమో. పైగా మనమున్నది సమాచార విప్లవపు సమాజంలో. మనకు సమాచారం, హేతువు, విశ్లేషణ(analysis), విషయాన్ని ముక్కలుగా నరకటం - వీటి మీద ఉన్న శ్రద్ధ, motives ను కనుక్కునే విషయం మీద, విషయాలను సమన్వయం/సంశ్లేషణం (synthesis) చేయడం మీద లేదు. మనిషికి అజ్ఞానం ఇచ్చిన తృప్తి, విజ్ఞానం ఇవ్వలేకపోతోంది.

హేతువుకు దొరకని సంఘటనలు ప్రతి ఒక్కరికి ఎదురవుతుంటాయి. జీవితం మీద అనురక్తిని కలిగించేవి అలాంటి సంఘటనలే. వాటికి హేతువులు వెతకటం కన్నా, motives గురించి ఆలోచించటమో (contemplation), వాటి ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమో మాత్రం మనం చేయగలిగినది.

"The unknowable can never be known." - J Krishnamurthy

24 comments:

 1. నిజమే. కొన్ని కొన్ని హృద్యమయిన భావనలకు హేతువుండదు. అందులో హేతువుకోసం వెతికితే హృద్యం మృగ్యం అవుతుంది.

  ReplyDelete
 2. చాలామంచి విషయాలు చెప్పేరండీ. నిజమే! హేతువుకి అందని విషయాలు ఎన్నో మనకి జీవితంలో ఎదురవుతాయి. ప్రతిదానికీ కారణం ఉండి తీరాలా అంటే ఎందుకుండాలి? కానీ మనిషికున్న ఒక మౌలికమైన గుణం కారణాన్ని వెతకడం. అది భౌతికం కావచ్చు, అభౌతికం కావచ్చు, నిరూపితం కావచ్చు, కల్పన కావచ్చు. ఎవరు ఎలాంటి కారణాల కోసం వెతుకుతారన్నదాన్లో తేడాలున్నాయి కాని, కారణమంటూ ఏదో ఉండాలనే ప్రతి మనిషీ అనుకుంటాడు.

  "మహర్షులు పెట్టే శాపాల మీద వ్యక్తిగతంగా నాకు విశ్వాసం లేదు. కామక్రోధాదులను జయించగోరే వారు, జయించినట్లు చెప్పబడే వాళ్ళు, శాపాలెందుకిస్తారో ఊహకు అందదు."

  ఇక్కడ మీరు కూడా హేతువు కోసం వెతుకుతున్నారు కదా? లేకపోతే సత్యక్రియా శక్తి మీదున్న నమ్మకం మీకు మహర్షుల శాపశక్తిపై ఎందుకు లేదంటారూ?

  అన్నట్టు శాపాన్ని గురించి ఒక అద్భుతమైన వ్యాఖ్యానం విశ్వనాథ కల్పవృక్షంలోని అరణ్యకాండ, మునిశాప ఖండంలో చేసారు.

  "The unknowable can never be known."

  How can one know this? Or is it the definition of word "unknowable"?

  ReplyDelete
 3. @శరత్ గారు : సరిగ్గా చెప్పారు.

  @కామేశ్వర రావు గారు:

  "ఇక్కడ మీరు కూడా హేతువు కోసం వెతుకుతున్నారు కదా? లేకపోతే సత్యక్రియా శక్తి మీదున్న నమ్మకం మీకు మహర్షుల శాపశక్తిపై ఎందుకు లేదంటారూ?"

  మహర్షుల శాపశక్తిని విశ్వసిస్తున్నాను. అయితే ఆ శాపశక్తిని, కోపాన్ని వెలిగక్కటానికి ఉపయోగించటం అన్నది సాత్వికుల లక్షణమా? అన్నదే నా అనుమానం. ఇలాంటివి చదివినప్పుడు బుద్ధుడు గుర్తొస్తాడు. తనను చంపడానికి వచ్చినతనికి ఆహ్వానం పలుకుతాడాయన. అలాగే తనను మట్టగించటానికి వచ్చిన ఏనుగును తన కరుణాశక్తితో మార్చగలుగుతాడు. బుద్ధుడు కూడా సుక్షత్రియుడే. కావాలనుకుంటే ఆయనా అంగుళీమాలుడితో పోరాడగలడు. నళగిరి అనే ఏనుగును ఎదుర్కోగలడు. ఇంకా కాస్తో కూస్తో శాపాలూ పెట్టగలడు. అయితే అవేవి లేవు. అందుకే వ్యక్తిగతంగా నాకు ఆయన మీద అభిమానం.

  "How can one know this? Or is it the definition of word "unknowable"?"

  చూశారా, మీరు హేతువు అడిగేస్తున్నారు. :-)

  మొత్తం కృష్ణమూర్తి తత్వాన్ని అంతా ఒక్క ప్రశ్నలో అడిగారు మీరు. ఇలాంటిదొకటి ఉపనిషత్తులలో కూడా ఉన్నది. యాజ్ఞవల్క్యుడు అనుకుంటాను, తన గురువునడుగుతాడు.

  నాకు అర్థమయినది చెబుతాను. అయితే ఇది interpretation మాత్రమే.

  "One" - can never know this. which implies, as long as the "I" (thinker) exists, "that" cannot be known. Thinker has to cease for the unknown to be.

  "How the thinker ceases?" ఇక్కడ మళ్ళీ తెలుగులోకొస్తాను.

  ఈ "how" అన్న ప్రశ్న "methodology" కి సంబంధించినది. అంటే ఆ ప్రశ్న ఉదయించినదే thinker అన్న point నుంచి. కాబట్టి ఈ ప్రశ్న అసంబద్ధం. అదే ప్రశ్నను re-phrase చేద్దాం.

  "When that situation happen? The situation in which thinker disappear?"

  When the thoughts are silently observed, with right-mindfulness (సమ్మా బుద్ధి)- i.e.,with ever being watchful without any effort, without any judgment (passive awareness) then thinker ceases.

  Or in hinduic interpretation, The thinker, thought, and thinking unites and sublimates, thus YOGA (Unision).

  అయితే ఇవన్నీ ఆ స్థితి యొక్క గుణగణాలు మాత్రమే. అవి మనం చర్చిస్తే కేవలం interpretations of words అవుతాయి.

  ReplyDelete
 4. టపా, కామెంట్లు అద్భుతంగా ఉన్నాయి.
  "సత్యక్రియ" అన్న పదం నేనెప్పుడూ వినలేదు. సత్యాధిష్ఠానబలం గురించి చాలా వ్రాయాలనే ఉంది గానీ ప్రస్తుతానికి కుదరడం లేదు.

  శాపానుగ్రహాల గురించి చక్కని వివరణలు నేను చదివాను.మన సంస్కృతిలో వీటికి అతివ్యాప్తి దోషం ఉంది (జానపద కథలూ, విఠలాచార్య సినిమాలూ వీటిని తేలికపరుస్తాయి).

  మహర్షులు కావాలని కామ,క్రోధవశం చేత శాపాలిస్తారని భావించడం సరి కాదు. వాళ్ళు సత్యాన్ని అధిష్ఠించిన కారణం చేతనే మహర్షులయ్యారు. మరి శాపానుగ్రహాలు వాళ్ళ ద్వారా ఏ విధంగా వ్యక్తమయ్యాయి అంటే- వాళ్ళ వద్దకు వచ్చిన వ్యక్తుల సంస్కారాల్ని బట్టి వాళ్ళు అనుభవించవలసిన స్థితి అప్రయత్నంగా ఆ మహర్షుల వాక్కులో ప్రతిబింబిస్తుందట. కాబట్టి ’వాళ్ళు అన్నది నిజమైంది’ అని భావించడం కన్నా, ’సత్యమే వాళ్ళ వాక్కులో అప్రయత్నంగా ప్రతిబింబించింది’ అనడం ఎక్కువ సమంజసం.

  కామ,క్రోధవశులైన వ్యక్తులు శాపాలివ్వడానికి ప్రయత్నిస్తే అవి ఫలించకపోవడం కూడా పురాణ గాధల్లో కనిపిస్తూనే ఉంటుంది. (ధర్మవ్యాధుడి కథలో బ్రాహ్మణుడి కోపం పతివ్రతని ఏమీ చెయ్యలేకపోతుంది కదా. అలాగే దుర్వాసుడి కోపం అంబరీషుణ్ణి.)

  ReplyDelete
 5. >>"ఇలాంటివి చదివినప్పుడు బుద్ధుడు గుర్తొస్తాడు"
  నాకు రామాయణ మహాభారతాలు గుర్తుకొస్తాయి:-) ఆ రెండిటికీ ఋషుల శాపాలే కదా మూలం!

  >>"చూశారా, మీరు హేతువు అడిగేస్తున్నారు. :-)"

  అవును, అందులో ఆశ్చర్యమేముంది, నేను పక్కా హేతువాదినే! :-) మానవులందరూ హేతువాదులే అన్నాను కదా. మీరు అభిమానించే బుద్ధుడు కూడా దుఃఖానికి హేతువుని (కారణం) కనుక్కోడానికే కదా తన శోధన మొదలుపెట్టింది.
  హేతువు గురించిన ఆలోచనని పూర్తిగా విసర్జించడం మానవులకి సాధ్యమవుతుందా అని నా అనుమానం.

  ""One" - can never know this. which implies, as long as the "I" (thinker) exists, "that" cannot be known. Thinker has to cease for the unknown to be."

  మీరిచ్చిన సమాధానం బాగుంది, కాని నా ప్రశ్నే తప్పు :-). నా ఇంగ్లీషు వల్ల వచ్చిన తిప్పలివి. "How can one know this?" అనడంలో నా ఉద్దేశం,
  "The unknowable can never be known" అని JKగారు ఎలా తెలుసుకున్నారు/నిర్ధారించారు అని.

  ReplyDelete
 6. "కాబట్టి ’వాళ్ళు అన్నది నిజమైంది’ అని భావించడం కన్నా, ’సత్యమే వాళ్ళ వాక్కులో అప్రయత్నంగా ప్రతిబింబించింది’ అనడం ఎక్కువ సమంజసం."

  మీరు చెబుతున్నది సమంజసంగానే "క(అ)నిపిస్తున్నది". అయితే పరమ సత్యమనేది - ఒక శూన్యం (సమాధి - ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే సమ్మా సమాధి) అని బుద్ధుల భావన. ఆ శూన్యం - సగుణ భావనగా మహర్షుల వాక్కు ద్వారా "శాపం" గా ఎలా పరిణమిస్తుంది? అలా కావాలంటే బుద్ధి (The "I") ద్వారా జరగాలి. బుద్ధి అంటే మానసిక వ్యాపారం.i.e., the physiological entity. ఎప్పుడయితే "I" అన్నది ఉన్నదో, అక్కడ "Unknown" (Truth for our understanding) ఉండదు. అప్పుడు ఆ వాక్కు (శాపం) సత్యమెలా అవుతుంది?

  మొత్తానికి ఇక్కడ నాకు మౌలికంగా 2 భావనలు (లీలగా) కనిపిస్తున్నాయి. రెంటి సమన్వయం కుదరట్లేదు.మీరే చెప్పాలి.

  ReplyDelete
 7. @కామేశ్వర రావు గారు :

  ""The unknowable can never be known" అని JKగారు ఎలా తెలుసుకున్నారు/నిర్ధారించారు అని."

  నిర్ధారించారు అన్నది తప్పు. ఈ విషయం JK ఒప్పుకోరు. వీలయినంత ఆయన పదాల్లోనే చెప్పడానికి ప్రయత్నిస్తాను.

  The speaker is not telling a statement. We are inquiring together. So, what is important is - not the speaker, but what is being said.

  If a person says that he is enlightened, he is not enlightened. (enlightenment అన్నది శూన్యం కాబట్టి. శూన్యాన్ని ఎవరైనా ఎలా తెలుసుకుంటారు?). So, the truth happens.

  ఇక ఆ ఫిలాసఫీ పక్కన పెట్టి, సూటిగా సమాధానం వెతకాలంటే - JK పుస్తకాలు, జీవిత చరిత్ర, వీలయినంత బుద్ధ బోధలు (బుద్ధుడి జెవితానికి, ఆయన బోధలకు, కృష్ణమూర్తి జీవితానికి చాలా striking similarities ఉన్నవని బౌద్ధులు చెప్పుకునే మాట)ఇవి చదివి (నాలాగ) బుర్ర చెడగొట్టుకుంటే ఇలాంటివి నమ్మాలనిపిస్తాయి.:-)

  ReplyDelete
 8. నాగమురళి గారు, ఇందాక నా సమాధానంలో మరింత క్లారిటీ కావాలనిపించి మళ్ళీ రాస్తున్నాను.

  "ఆ శూన్యం - సగుణ భావనగా మహర్షుల వాక్కు ద్వారా "శాపం" గా ఎలా పరిణమిస్తుంది? "

  ఇప్పుడు ఒక డవుట్ రావాలి. శూన్యాన్ని సాధించినవాడు మాటలాడ్డమనేదే ఉండదా?

  సమాధానం : ఉంటుంది. అయితే "శాపం" అన్నది సాధారణ వచనం కాదు.ఇది కోపానికి, ఆగ్రహానికి ప్రతీక అని నా అభిప్రాయం. ఇది అనుగ్రహానికి, కరుణకు ప్రతీకాత్మకంగా కనిపిస్తుందా అన్న విషయం సందేహాస్పదం. నాకు గల అనుమానానికి కారణం కూడా చెప్పటానికి ప్రయత్నిస్తాను. ధమ్మపదంలో బుద్ధుడు కూడా భిక్కులకు ఉపదేశాలు చేస్తాడు. ఆ ఉపదేశాలలో మందలింపు, కాస్త అదిలింపు, ఇవి కనిపిస్తాయి, కానీ శాపాలలో ఉన్న "పరుషత్వం" కనిపించదు. పరుషత్వం, కఠినత్వం dualistic అని నా భావన.

  ReplyDelete
 9. రవి, మీరన్నారు:
  1. > పరమ సత్యమనేది - ఒక శూన్యం (సమాధి - ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే సమ్మా సమాధి) అని బుద్ధుల భావన. ఆ శూన్యం - సగుణ భావనగా కావాలంటే బుద్ధి (The "I") ద్వారా జరగాలి. ... ఎప్పుడయితే "I" అన్నది ఉన్నదో, అక్కడ "Unknown" (Truth for our understanding) ఉండదు.

  నన్నూ ఈ ప్రశ్న చాలాకాలంపాటు వేధించింది. తర్వాత నేను conceptualగా గ్రహించిందేమిటంటే, పరమసత్యమనేది శూన్యం కాదు. కొన్ని భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం (ప్రధానంగా అద్వైతం ప్రకారం) అత్యున్నతమైన సమాధి స్థితిలో నిలచి కూడా చైతన్యవంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చు. మనుషులతో సంభాషించవచ్చు. ఆటలు ఆడుకోవచ్చు. పాటలు పాడుకోవచ్చు. క్రీడాప్రాయంగా సమస్త ప్రపంచంతోనూ వినోదించవచ్చు. దీనికి సజీవమైన ఉదాహరణగా మన కళ్ళ ముందు కనీసం ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి. ఇక శ్రీకృష్ణుడి బోధలూ, జీవితమూ తెలియజేసే విషయం కూడా ఇదే. నేనీ విషయాన్ని గట్టిగా అర్థం చేసుకోడానికి దోహదపడింది ’త్రిపురా రహస్యం’ అన్న ఒక పుస్తకం.

  2. > శూన్యాన్ని సాధించినవాడు మాటలాడ్డమనేదే ఉండదా? ఉంటుంది. ... మందలింపు, కాస్త అదిలింపు, ఇవి కనిపిస్తాయి, కానీ శాపాలలో ఉన్న "పరుషత్వం" కనిపించదు.
  అత్యున్నత సమాధి స్థితికి చేరినవాడు కూడా క్రీడాప్రాయంగా ప్రపంచంతో వ్యవహరించగలడనడానికి మీరిచ్చిన బుద్ధుడి ఉదాహరణ చాలా సరి అయినది. శ్రీకృష్ణుడి జీవితంలో ఆయన కోపించిన సన్నివేశాలు అనేకం కనిపిస్తాయి. శాపమిచ్చిన సన్నివేశం కూడా ఉన్నది (అశ్వత్థామని శపించాడని గుర్తు). జ్ఞానులైన పెద్దలు చెప్పినదాని ప్రకారం కృష్ణుడి కోపం ’కామ,క్రోధాల’లోని క్రోధం కాదు. అది ధర్మాగ్రహం. ధర్మానికీ, సత్యానికీ తేడా లేదు. అత్యున్నత సమాధి స్థితి చెందినవాళ్ళకి, The "I", లేక ’అహంకారం’ అనేది కరిగిపోయినా ధర్మమయమైన జీవితాన్ని క్రీడాప్రాయంగా నడుపడం, ధర్మానికి అనుగణంగా తన "I" ని అనుమతించడం సాధ్యమే. వాళ్ళు "I"లో చిక్కుకోకుండా దాన్ని అనుమతిస్తారు (లేక "I" లోకి దిగి వస్తారు) కాబట్టి వాళ్ళని ’అవతారాలు’ (It literally means, దిగివచ్చినవాళ్ళు) అంటారు. వాళ్ళ కోపం పరుష ప్రవర్తన అవదు.
  (కానీ మన పురాణాల్లోని ఋషులు కొన్ని చోట్ల కోపానికి లొంగిపోయినట్టే కనిపిస్తుంది. వాళ్ళ కోపం కృష్ణుడి కోపంలాంటిది కాదు. అది ఖచ్చితంగా సమాధి స్థితి నుంచి చెదిరిపోవడమే.)

  ReplyDelete
 10. భలే ఉంది చర్చ

  ReplyDelete
 11. @నాగమురళి గారు :

  "తర్వాత నేను conceptualగా గ్రహించిందేమిటంటే, పరమసత్యమనేది శూన్యం కాదు. కొన్ని భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం (ప్రధానంగా అద్వైతం ప్రకారం) అత్యున్నతమైన సమాధి స్థితిలో నిలచి కూడా చైతన్యవంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చు."

  నేను ప్రస్తావించిన శూన్యం, భౌతికమైన అచైతన్యం కాదు. కాస్త neo - scientific, religeous and philosophical గా చెప్పాలంటే - The mutation of brain cells. This is not a dead status, on the contrary, it is a very alive and active status. The man who happen to got in to that state, "uses" the brain, rather than carried away by it (like normal people does. Normally for all of us, mind dictates our daily routine, emotions etc).

  So, in that sense, I think, your argument co-insides with my understanding. Am I right?

  2. Incidentally ఆఫీసు నుండీ ఇంటికి వస్తుంటే, నాకు కృష్ణుడే గుర్తొచ్చాడు. అదీ మీరు చెబుతున్న కోణంలోనే. భీష్మున్ని సంహరించడానికి ఉరికినప్పుడు మాత్రం (కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి..) అది ఆగ్రహమా అనిపిస్తుంది. అయితే అది కూడా శ్రీకృష్ణుని diversity కి రూపమే తప్ప, లోపమూ, limitation కాదు. krishna is an unparallel miracle happened in the world. He is the collection of so many diversities, and yet signifies the essence of very dharma. Buddha may somewhere matchable with krishnamurthy or somebody else. But krishna is a true epitome of polymorphism.

  ReplyDelete
 12. Ravi,
  Agree with you 100% on both the points. Thanks a lot for the wonderful post once again.

  ReplyDelete
 13. >>>"తర్వాత నేను conceptualగా గ్రహించిందేమిటంటే, పరమసత్యమనేది శూన్యం కాదు. కొన్ని భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం (ప్రధానంగా అద్వైతం ప్రకారం) అత్యున్నతమైన సమాధి స్థితిలో నిలచి కూడా చైతన్యవంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చు."

  అవును..ఆఆ..అంతే..అంతే!! అని నా మనసు అరుస్తోంది లోపల..

  సరిగ్గా చెప్పారు.
  --sk

  ReplyDelete
 14. అంటే కారణజన్ములంతా హేతువాదులే అనమాట

  ReplyDelete
 15. రవి గారికి రొంబ నెనర్లు..for such a wonderful post.

  నాగమురళి గారి కామెంట్లు, మొత్తం చర్చ సూపర్!
  --sk

  ReplyDelete
 16. @బాబా గారు : ధన్యవాదాలు.

  @Anonymous(sk) గారు : రొంబ థాంక్స్.

  రెండో @Anonymous గారు: మీకు ఎవరు కారణజన్ములనిపిస్తే వాళ్ళనే అడగితే బెటర్. నేనయితే కారణజన్ముణ్ణి అవునో, కాదో నాకు తెలీదు!

  ReplyDelete
 17. "ఇవి చదివి (నాలాగ) బుర్ర చెడగొట్టుకుంటే ఇలాంటివి నమ్మాలనిపిస్తాయి.:-)"
  It seems you are an admirer/devotee and I am a follower of JK. :-) Because you seem to believe in what he says and I don't!

  "The speaker is not telling a statement. We are inquiring together. So, what is important is - not the speaker, but what is being said."

  But the sentence at the end of your post does sound like a statement, is it not? If it is only inquiring, all his books should contain only questions! But I could see lot of his own interpretations, thoughts and conclusions too. I don't have any problem with them. But I only have a problem when he says that they are all inquiries and not statements. I have not read him extensively so my understanding could be incorrect. One question that has been haunting me about him is, "Does he think what he says to others could influence/help others in understanding/realizing/happening truth?"

  పరమ సత్యం - శూన్యం గురించి.

  ఒకటి - పరమమైన సత్యం సత్యక్రియగా ఎలా మారుతుందో అలాగే శాపంగా కూడా మారుతుందని అనుకోడానికి ఏమిటి అభ్యంతరం? సత్యక్రియ అయినా, శాపమైనా రెండూ సగుణ భావనే కదా?
  రెండు - పరమ సత్యం/బ్రహ్మం/శూన్యం - ఇది ఒకానొక మానసిక స్థితిగా మీరు భావిస్తున్నట్టు అనిపించింది. నేను దానితో అంగీకరించను. ఆ శూన్యాన్ని తెలుసుకోడానికి/అనుభవించడానికి మీరు చెప్పిన మానసిక స్థితి ఒక సాధనం అయితే అయ్యుండవచ్చు.

  ReplyDelete
 18. @కామేశ్వర రావు గరు : మీరు కృష్ణమూర్తి గురించి అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే, నిర్వాణం, బుద్ధుడు నిర్వాణం పొందిన తర్వాత వారం రోజులు ఎందుకు మౌనంగా ఉన్నాడు? నిర్వాణం అన్నది ఖచ్చితంగా స్వీయానుభవం (ఆత్మ సాక్షాత్కారం) అని అంటున్నప్పుడు, దాన్ని గురించి ఇతరులకు ఎందుకు చెప్పాలి? చెబితే అర్థమవుతుందా? చెప్పడం నిజంగా ఇతరులకు ఉపయోగికారి అవుతుందా?

  ఇలాంటి అనేక ప్రశ్నల గురించి కలగలుపు గా ఆలోచించాలి. నిజానికి వీటన్నిటికి కృష్ణమూర్తి సమాధానం చెబుతాడు. అనేకసార్లు, రకరకాలుగా.

  ఈ టపా రాయక ముందు నేను నిజానికి ఇవి రాద్దామనే మొదలుపెట్టాను. అయితే Hinduic interpretations మీద అవగాహన లేదు. పైగా మన Hinduism లో శబ్దానికి ప్రాధాన్యత చాలా ఎక్కువ. రాస్తే తల బొప్పి కడుతుంది. అందుకే ఆగాను. వీలు వెంబడి వివరంగా చర్చిద్దాం.

  "రెండు - పరమ సత్యం/బ్రహ్మం/శూన్యం - ఇది ఒకానొక మానసిక స్థితిగా మీరు భావిస్తున్నట్టు అనిపించింది. నేను దానితో అంగీకరించను. ఆ శూన్యాన్ని తెలుసుకోడానికి/అనుభవించడానికి మీరు చెప్పిన మానసిక స్థితి ఒక సాధనం అయితే అయ్యుండవచ్చు."

  ఒకట్రెండు అనాలజీలు చూద్దాం.

  ఇప్పుడు ఉన్నపళాన కంటి రెప్ప తెరవగానే మీ ఎదురుగా ఓ ఆరడుగుల పాము పడగ విప్పి నిలుచుందనుకోండి. అప్పుడు ఆ మానసిక స్థితి ఏమిటి?

  - మెదడు ఉన్నది. ఆలోచన అన్న వ్యాపారం లేదు.
  - చుట్టు ప్రపంచం ఉన్నది. ప్రపంచం లేదు కూడా.
  - భయం మిమ్మల్ని కమ్మేసింది అనుకుందాం. అయితే నిజంగా అది భయమా? కొంచెం జాగ్రత్తగా గమనిస్తే - అది భయమూ కాదు.

  అంటే - The duality is disappeared - Absolutely.

  ఈ స్థితి నేమనాలి?

  ఇంకొకటి - ఓ అడవిలో వెళుతున్నారు మీరు. చుట్టుపక్కల అంతా చెట్లు. అవన్నీ దాటుకుని మీ మానాన వెళుతున్నారు. ఉన్నట్టుండి, మీ ముందు - ఊహించకుండా - ఓ జలపాతం ప్రత్యక్షమయింది.

  అప్పుడు మీ మానసిక స్థితి ఏమిటి?

  ఇప్పుడు ఇదే స్థితిని large scale లో ఊహించండి. బుద్ధుడు నిర్వాణం పొందినప్పుడు ఏం జరిగి ఉంటుందో contemplate చేయడానికి ప్రయత్నించండి. కృష్ణ మూర్తి కి కూడా అలాంటి స్థితి కలిగింది. ఆ స్థితి గురించి ఆయన చెప్పిన description వీలు చిక్కితే చదవండి. (నేనే రాస్తాను వీలయితే). ఇది నా సమాధానం.

  మీ ఇంకో ప్రశ్నకు సమాధానం కాస్త జటిలం అవుతుంది. ప్రస్తుతానికి వీటి మీద ఓ అభిప్రాయానికి వద్దాం.

  ReplyDelete
 19. [హేతువుకు దొరకని సంఘటనలు ప్రతి ఒక్కరికి ఎదురవుతుంటాయి. జీవితం మీద అనురక్తిని కలిగించేవి అలాంటి సంఘటనలే. వాటికి హేతువులు వెతకటం కన్నా, motives గురించి ఆలోచించటమో (contemplation), వాటి ఉద్దేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమో మాత్రం మనం చేయగలిగినది.]

  చాలా కరెక్టుగా చెప్పారు. చాలా మంచి వ్యాసం.

  ReplyDelete
 20. "ఒకటి - పరమమైన సత్యం సత్యక్రియగా ఎలా మారుతుందో అలాగే శాపంగా కూడా మారుతుందని అనుకోడానికి ఏమిటి అభ్యంతరం? సత్యక్రియ అయినా, శాపమైనా రెండూ సగుణ భావనే కదా?"

  ఈ ప్రశ్నకు కాస్త నిదానంగా ఆలోచిద్దామనుకున్నాను. అయితే క్లుప్తంగా కుదురుతుందేమోనని ప్రయత్నిస్తాను.

  సత్యక్రియ లోనూ, శాపంలోనూ వాక్కు యథార్థమయింది. (ఫలించింది). అయితే కొన్ని సాధనాపద్ధతుల ద్వారా, కొన్ని సిద్ధులు సాధించటం జరగవచ్చు. అలాగే వాక్కునకు ఫలించే శక్తి సాధించటమూ కుదరవచ్చు. నేను విన్న ఒక కథ చెబుతాను.

  రామకృష్ణ పరమహంస ఓ రోజు గంగ ఒడ్డున ఉన్నప్పుడు, ఓ వ్యక్తి వచ్చి, ఆయనను సవాలు చేశాడుట. "నేను ఈ నీటిపై నడుస్తూ ఆ ఒడ్డుకు వెళ్ళగలను. మీరాపని చేయగలరా?" అని. అందుకాయన, "అంతకష్టమెందుకు నాయనా, మూడు వరహాలిస్తే పడవతను దాటిస్తాడు కదా." అని. సిద్ధులు సాధించటం అన్నది గొప్ప విషయమవచ్చు. అయితే అలా సాధించినవాడు ధర్మాత్ముడు, "అహాన్ని" జయించిన వాడు అయి ఉండవలసిన అవసరము లేదు.

  ఇక్కడ నేను చెప్పదల్చుకున్నదేమంటే, శిబి, సీతా దేవి ఉదంతాలలో, వారి వాక్కునకు తెలియకుండానే శక్తి అబ్బింది. అది బహుశా వారికీ తెలిసి ఉండక పోవచ్చునని నా నమ్మకం. సీతమ్మ అగ్నిలో దూకేముందు ప్రతిజ్ఞ చేసినప్పుడు, ఆమె ఇంకో రకమైన option అంటే, ఒకవేళ ఆమె వాక్కు అసత్యమయితే ఆమెకు విధించబడే శిక్ష (మంటల్లో కాలిపోవడం) జరిగితే అందుకు కూడా తలఒగ్గింది. అక్కడ జరిగినది పూర్తిగా సత్వ గుణం యొక్క manifestation. ఇంకో రకంగా గమనిస్తే, In the whole episode, "I" is absent.

  శాపాల విషయం వచ్చినప్పుడు, (అన్ని శాపాలు కావు, కానీ చాలా ఎక్కువ సందర్భాలలో) అక్కడ anger అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఎక్కడ ఆగ్రహం ఉన్నదో, అక్కడ "అహం" లేకపోవటానికి ఆస్కారం లేదు. శాపం ఫలించటానికి కారణం సత్యక్రియ కానవసరం లేదు. అది సాధన వల్ల వారు సమకూర్చుకున్న ఓ సంపత్తి.

  సత్యక్రియ శాపంగా మారడానికి ఉన్న అభ్యంతరం - This is not a case of where "I" (అహం) is absent. ఇది సగుణ భావన కావచ్చు, అయితే సత్వగుణపు అభివ్యక్తీకరణ కాదని నేను భావిస్తున్నాను.

  ReplyDelete
 21. వాక్శక్తి, శాపము గురించి నాకు అర్థమైనంతలో కర్మ సిద్ధాంతం ఇలా అంటుంది:
  ఇక్కడ ఉన్నది "చెప్పింది జరగడం" కాదు, "జరగబోయేది చెప్పడం". జరిగేది కర్మ ప్రకారం జరుగుతుంది. ఆ జరిగేది కొందరి నోటివెంట ముందుగా కొన్ని సందర్భాలలో వస్తుంది. వాక్సిద్ధి కలగడం అంటే జరగబోయేది తన నోటివెంట రావడం, అంతే. దివ్యదృష్టి లాగే ఇదీను. అక్కడ జరగబోయేది చూసి/తెలుసుకొని చెబితే, ఇక్కడ అలా తెలియకుండా నోటివెంట అది రావడం.
  శాపం కూడా అంతే. జరగబోయే దానికి ఒక నిమిత్త కారణంగా ఇది మనకి కనిపిస్తుంది. మహాభారతంలో యుద్ధానంతరం గాంధారి కృష్ణుడికి శాపం ఇస్తుంది. అప్పుడామెలో ఉన్నది తమోగుణం కాని సత్త్వగుణం అనలేం కదా. యాదవ కుల నాశనం జరగవలసి ఉంది. దానికి ఒక నిమిత్త కారణంగా ఆ శాపం గాంధారి నోటివెంట వచ్చింది. తపోధనులైన మహర్షులు కొందరికి జరగబోయేది తెలిసి దానికి అనుగుణంగా కోపాన్ని ప్రకటించి శాపం ఇవ్వవచ్చు. కొందరికి ఆ జ్ఞానం ఉండకపోవచ్చు, కేవలం వాక్శుద్ధి మాత్రం ఉండవచ్చు. అందరికీ అన్నివేళలా ఉంటుందనీ చెప్పలేం.
  కల్పవృక్షం మునిశాప ఖండంలోని కథ ఇలా సాగుతుంది. దశరథుడు పొరపాటున మునికుమారుడిపై బాణం వేస్తాడు. అతడు చనిపోతూ తన తల్లిదండ్రులకి నీరు అందివ్వమని చెప్తాడు. దశరథుడు వెళ్ళి నీళ్ళిచ్చి, జరిగినదంతా ఆ ముని దంపతులకి చెప్తాడు. అప్పుడువాళ్ళు కూడా ప్రాణత్యాగం చేస్తూ దశరథునితో ఇలా అంటారు, "నీ నిజాయితీకి మేము సంతోషించాం. అయినా నువ్వు చేసిన యీ కర్మకి ఫలితం అనుభవించాలి. నువ్వు కూడా పుత్రశోకంతోనే మరణిస్తావు. దాన్ని తప్పించడం అసాధ్యం. కాకపోతే, నీ నిజాయితీకి మెచ్చి, పుత్ర మరణంవల్ల కాక నువ్వు పుత్రవియోగం వల్ల మరణించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే జరుగుతుంది." అని చెప్పి మరణిస్తారు. అప్పుడు దశరథుడు అది తనకి నిజంగా వరమనే అనుకుంటాడు. ఎందుకంటే అతనికి అప్పటికి పుత్రులే లేరు. అంచేత వీళ్ళు అన్న మాటలవల్ల తనకి పుత్ర సంతానం కలగనుంది!
  ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ముని శాపమూ ఇవ్వలేదు వరమూ ఇవ్వలేదు. జరగబోయేది చెప్పాడు అంతే. మరి ముని కుమారుడు చనిపోవడం, దానికి ఫలితంగా దశరథుడు పుత్రశోకం అనుభవించడం ఇదంతా ఏమిటంటే, మనిషికి అవసరమైన "హేతువు" చూపించడానికి. ఈ కార్య కారణ సంబంధం కేవలం మనిషి మనసులో ఉన్నదే. మనిషికి కాలాన్ని ఒకే దిశలో గమనించగలడు కాబట్టి, జరిగేవన్నీ ఒక sequenceలో కనిపిస్తాయి. దాని ఫలితంగానే కార్య కారణ సంబంధం అన్వయించుకొనే ప్రయత్నం చేస్తాడు.

  పర బ్రహ్మం - మానసిక స్థితి గురించి:
  బ్రహ్మం ఆదిమధ్యాంతరహితం. మనిషి పుట్టకముందూ ఉంది, మనిషి అంతరించాక కూడా ఉంటుంది. అంచేత అది మనిషి ఒకానొక మానసిక స్థితికి పేరు కాదు. మీరన్నట్టు మనిషి ఒకానొక మానసిక స్థితిలో ఆ బ్రహ్మాన్ని అనుభవించ గలడేమో, అయ్యుండవచ్చు కాకపోవచ్చు. నాకు తెలీదు. అదీ నేను చెప్పదలుచుకున్నది.

  కృష్ణమూర్తి గురించి నేనడిగిన ప్రశ్నకి జవాబుకోసం మీ తదుపరి టపాలకై ఎదురుచూస్తూ ఉంటాను.

  ReplyDelete
 22. శాపానికి మీరు చెప్పిన వివరణ బావుంది.

  "బ్రహ్మం ఆదిమధ్యాంతరహితం. మనిషి పుట్టకముందూ ఉంది, మనిషి అంతరించాక కూడా ఉంటుంది. అంచేత అది మనిషి ఒకానొక మానసిక స్థితికి పేరు కాదు."

  మీరు చెప్పిన ఈ విషయమూ, ఇంకా పైన జరిగిన చర్చలోనూ అక్కడక్కడా సమన్వయ లోపమూ ఏదైనా ఉంటే, అది మౌలికంగా buddhist interpretations కు, hinduic interpretations కు ఉన్న వ్యత్యాసమే.

  బుద్ధుడు అలాగే బౌద్ధులు (even JK) - దేవుడు, ఆత్మ, బ్రహ్మం, all pervading, all permeable truth, వీటిని ఒప్పుకోరు. అందుకే అది నాస్తికత్వం అని చాలా మంది అనుకోలు. (ఖచ్చితంగా చెప్పాలంటే అది నాస్తిక వాదం కాదు, శూన్యవాదం).

  శంకరాచార్యుల వారు చెప్పిన

  బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః

  ఇందులో మొదటి సగం మీరు పైన ఉటంకించినట్టు hinduic interpretation అయితే "జీవో బ్రహ్మైవ నాపరః" - కాస్త loose గా buddhist interpretation.

  రెంటికి సమన్వయం కుదరడం కష్టం. అలా సమన్వ్యం సాధించిన వాళ్ళు ఉన్నారేమో తెలియదు. ఒక వేళ ఉన్నా, అది చదివితే తల బొప్పి కట్టటం తథ్యం. అంచేత ఏ వాదాన్ని ఆ పరిధిలోనే అర్థం చేసుకోవాలి.

  సరే, ఇక ఈ చర్చకు మంగళం పాడుతున్నాను.

  ReplyDelete
 23. చర్చ బాగుంది.

  ReplyDelete
 24. చాలా బాగా వ్రాసారు, చర్చ కూడా బాగా జరిగింది.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.