Wednesday, August 5, 2009

ఓ వర్షం కురవని రాత్రి

"తారా సువర్ణం" హిందీ చానెల్ లో "డర్నా మనా హై" సినిమా వస్తోంది. ఈ సినిమా ఓ మంచి ప్రయోగం. నాకు చాలా నచ్చిన సినిమా. మంచి కథ, కథనం, చక్కటి నటులు, మంచి ఫోటోగ్రఫీ, అద్భుతమైన స్క్రీన్ ప్లే ..ఇలా అనేక హంగులున్నప్పటికీ "అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని" అన్నట్టు ఎందుకు ఫ్లాపు అయిందో తెలియదు.

డర్నా మనా హై లో కొంతమంది ఏదో పిక్నిక్ కు వెళ్ళి, చీకటి పడ్డాక తిరిగి వస్తూ మధ్యలో ఓ అడవిలో ఆగుతారు. అక్కడ వాళ్ళు ఓ పాడుబడ్డ కొంపలో చేరి, కూర్చుని కథలు చెప్పుకుంటుంటారు. మొత్తం 6 కథలు. కథల మధ్యలో పక్కకెళ్ళిన వారు అందరూ హత్యకు గురవుతుంటారు. ఇలా భయానకంగా ఉంటుంది.

పాతికేళ్ళ క్రితం యండమూరి "దుప్పట్లో మిన్నాగు" అని సరిగ్గా ఈ సినిమా కథలాంటి ప్రయోగమే చేశాడు. 6 కథలను గుది గుచ్చి, ఒక కథ లో భాగంగా రాయటం. ఆ తర్వాత అప్పుడెప్పుడో స్రవంతి పత్రికలో ఈ నవల ఏదో ఇంగ్లీషు నవలను చూసి రాసింది అని చిన్న సైజు దుమారం రేగింది.

రాత్రి పూట ఎటూ కాని చోట ఇరుక్కుపోతే ఎలా ఉంటుందో నాకూ ఓ సారి అనుభవమైంది.

పన్నెండేళ్ళ ముందు మాట. అప్పటికి పూనా కొచ్చి ఎక్కువ రోజులు కాలేదు. పూనా అంటే పూనా నగరం కాదు. నా నివాసం, పూనాకు దాదాపు పాతిక మైళ్ళ దూరంలో ఉన్న ఓ గ్రామం. ఆ గ్రామం పేరు ఆళంది. మహారాష్ట్రీయులందరికీ ఈ ఊరి పేరు తప్పక తెలిసి ఉంటుంది. ఈ వూళ్ళో 11 వ శతాబ్దంలో జ్ఞానేశ్వరుడనే ఓ గొప్ప మహానుభావుడు పుట్టి చిన్న వయసులోనే "జ్ఞానేశ్వరీ" అని భగవద్గీత కు భాష్యం వ్రాసి, 14 యేళ్ళకు సమాధి చెందాడు. ఆయన సమాధి, ఈ ఊళ్ళో ఇంద్రాణి నది ఒడ్డున ఉన్నది. అలాగే ఈ వూరి నిండా అనేక సత్రాలు, మధుకరం చేబట్టిన విద్యార్థులు..ఇలా చాలా సాంప్రదాయికంగా ఉండేది.

అప్పట్లో నాకు మరాఠీ, హిందీ రెండూ రావు. ఎలానో నెట్టుకొచ్చే వాణ్ణి. మరాఠీ కాస్త అర్థమయేది, ఎందుకంటే కొన్ని సంస్కృత శబ్దాలు కలిసేవి కాబట్టి. (ఉదా : తాందుళ్ - తండులం - బియ్యం)

సెలవు రోజు వస్తే పొద్దునే ఆ ఊరు వదిలి పూనా వెళ్ళే వాణ్ణి నేను. పూనాలో నా ఫ్రెండు, తన మామయ్య వాళ్ళతో గడిపే వాణ్ణి. అలా ఓ సెలవు రోజు ఉదయమే పూనా వెళ్ళాను. వెస్ట్ ఎండ్ లో సినిమా చూసి, సాయంత్రం అలా తిరిగి, అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నుండి బయటపడే సరికి బాగా చీకటి పడింది.

సమయం రాత్రి 12:30 . ఆళంది బస్ ఎక్కాను. ఆళంది వెళ్ళటానికి నాకు తెలిసి 2 మార్గాలు ఉండేవి. అయితే నేను ఎక్కిన బస్సు, ఆ రెండు మార్గాల నుండీ కాక, వూరి బయట ఓ రింగు రోడ్డు దారి పట్టింది. బస్ లో పది మంది కంటే ఎక్కువ లేరు. బస్సు హై వే వదిలి లోపల దాదాపు అడవి లాంటి నిర్మానుష్యమైన ప్రదేశంలో వెళుతూంది.

ఇంతలో బస్సు చక్రం రోడ్డు పక్కగా ఓ బురద గుంతలో కూరుకుపోయింది. డ్రయివర్ చాలా సేపు ప్రయత్నించాడు. ఇక కుదరక ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. బస్ లో వాళ్ళందరూ దిగి ఏదో మాట్లాడేసుకుంటున్నారు.

"కాయ్ ఝాలా"
"లవ్ కర్ కరూన్ టాక్" ...ఇలా...

నేను బస్ దిగలేదు. బస్ ప్రయాణీకులు ఒక్కొక్కరు అలా నడుచుకుంటూ వెళ్ళసాగారు. బస్ దగ్గర కండక్టర్, నేను మిగిలేం. డ్రయివర్ ఏదో అడిగాడు. నాకు ఏమి అర్థమవలే. ఊరుకున్నాను. కాసేపటికి డ్రవర్ ఇప్పుడే వస్తా అని వెళ్ళాడు. చివరికి నేనొక్కణ్ణి మిగిలా. రోడ్డు పక్కనంతా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయ్. చిమ్మ చీకటి. నాకు మెల్లగా వెన్నులోంచి చలి మొదలయింది. బయట కూడా చలి!

కాసేపయింతర్వాత ఏదో గోల వినిపించింది. ఆ గోల మెల్ల మెల్లగా అధికమవసాగింది. అలాగే కొన్ని కాగడాలు, కనిపించాయ్ దూరంగా. ఆ కాగడాలు, ఆ కాగడా తాలూకు వాళ్ళు బస్ కు కాస్తంత దూరం వచ్చారు. నాకు లాంగ్వేజ్ ప్రాబ్లెం కాబట్టి అలాగే ఉన్నాను.

ఆ గోల క్రమంగా భజన గా మారింది. విషయమేమంటే ఆ రోజో,మరుసటి రోజో కృష్ణాష్టమి. అక్కడ గ్రామంలో లైట్లు లేవు. వాళ్ళు ఇలా కాగడాలు అవీ వెలిగించుకుని భజన చేస్తున్నారు. ఇక అనుమానం తీరిన తర్వాత అక్కడికెళ్ళా నేను. వాళ్ళు కాసేపటి భజన తర్వాత ప్రసాదం పంచసాగారు. నన్నూ పిలిచేరు. ఆ ప్రసాదం - కాందా పోహే, పూరీ,శ్రీఖండ్. పోహే అంటే అటుకుల తిరుగువాత, ఉల్లిపాయలూ. శ్రీఖండ్ ఎప్పుడైనా రుచి చూశారా? లేకపోతే మీరు జీవితంలో కాస్త కోల్పోయినట్టే. ఆంధ్రులకు పూతరేకులు, ఆవకాయ, గోంగూర ఎలాంటి ట్రేడ్ మార్కు సింబల్సో, మరాఠీలకు శ్రీఖండ్ అలాగ. (దీన్ని మరీ ఎక్కువ తినలేమనుకోండి). అక్కడ నాతో బాటి బస్ తాలూకు ఇతర ప్రయాణీకులూ ఉన్నారు. అందరూ వరుసగా కూర్చున్నారు. ప్రసాదం అందరికీ పంచేరు. నేను వచ్చీ రాని హిందీలో అడిగాను. "ఏం జరుగుతోందని". ఆ గ్రామస్తుడు నవ్వుతూ విడమర్చి చెప్పేడు.

కాసేపటి తర్వాత ఆ గ్రామస్తుల సహాయంతోనే బస్సు కదిలింది. ఎట్టకేలకు తిరిగి ఇంటికి చేరుకున్నాను.

ఇంటికి చేరుకునేప్పటికి సమయం రాత్రి 2:30.

ఆ తర్వాత ఆ గ్రామానికి మరో సారి వెళ్ళడం తటస్తించింది. ఆ గ్రామం పేరు తులా పూర్. ఇంద్రాణీ, భీమా నదుల సంగమ స్థానం ఆ చోటు. ఔరంగజేబు కిరాతకంగా చంపించిన శంభాజీ (శివాజీ పుత్రుడు) సమాధి ఉందక్కడ.

ఇలా ఓ రోజు రాత్రి అనుభవం అందమైన అనుభూతిగా మిగిలిపోయింది, నాకు.

6 comments:

 1. యండమూరి ప్రయోగానికి ప్రేరణ Roald Dahl రాసిన కథలు. 'దుప్పట్లో మిన్నాగు' కధైతే Poison కి మక్కీకి మక్కీ. ఓడలో ప్రయాణమో మరోటో ఇంకో కధ ఉంది. అది Dip in the Pool కి అనుకరణ. కాకపోతే ఇవన్నీ యండమూరి తనదైన శైలిలో అసలు కథలకన్నా ఆసక్తికరంగా మలిచాడు.

  ReplyDelete
 2. @అబ్రకదబ్ర గారు : మంచి సమాచారం. యండమూరి, ఆ కథలకు ప్రేరణ Ronald Dahl కథలు అని కనీసం చెప్పి ఉంటే హుందాగా ఉండేది.

  ఆయన శైలి అనితర సాధ్యం కాబట్టి, అంత ఆసక్తికరంగా చెప్పగలడు.

  ReplyDelete
 3. రవి గారు మీ అర్థరాత్రి ప్రయాణపు అనుభూతి బాగుంది, 12 సంవత్సరాల కిత్రం వాళ్ళు పెట్టిన ప్రసాదాలు భలే గుర్తు పెట్టుకున్నారు:)
  ఇక దుప్పటిలో మిన్నాగు కథ లో నాకు ఆ ఆరు కధలలో ట్విస్ట్ కన్నా అసలు కధ ముగింపు ట్విస్ట్ చాలా బాగా నచ్చింది:)

  ReplyDelete
 4. @Ravi

  Roald Dahl కరెక్టే. నాది టైపో కాదు ;-)

  ReplyDelete
 5. @అబ్రకదబ్ర : ఓహ్.. ఓకె :-)

  ReplyDelete
 6. బాగుందండీ.. మీ అనుభవం.. శ్రీఖండ్ గురించి మరీ ఎక్కువ చెప్పారేమో మా వాళ్ళు కూడా అంతే చెప్పారు కానీ నేను సరైన ప్లేస్ లో తినలేదేమో, మరీ అంతగా నచ్చలేదు.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.