Thursday, July 16, 2009

జలోపాఖ్యానం

"మీ ఆంధ్ర మీల్స్ తెగ స్పైసీనోయ్. అయినా సరే చాలా అద్భుతంగా ఉంది" అన్నాడా బాబు మోషాయ్ కన్నీళ్ళతో. అతనివి దుఃఖాశ్రువులు కావు. ఆనంద భాష్పాలూ కావు. మజ్జిగ మిరపకాయ ముక్క కాస్త కొరికి, ఆ ఘాటు నషాలాకెక్కడంతో, కంట్లో, ముక్కులో నీళ్ళు కారాయ్ తనకు. నాగార్జున హోటల్లో మధ్యాహ్నం లంచడానికి వెళ్ళేం మేము. బాబు మోషాయ్, బీహారీ, కన్నడ కస్తూరి, ఇలా మినీ ఇండియా లాగ ఉందక్కడ.

"సార్, సాయంత్రమయే సరికి కడుపు మంట స్టార్ట్ అవుతుంది చూడండి. దీనికి అలవాటు పడితే ఎప్పుడో ఒకప్పుడు అల్సర్ రావడం ఖాయం" వంతపాడాడు కన్నడ కస్తూరి.

నేనన్నాను. "అవును, ఈ అన్నం ఇక్కడ తిని అరిగించుకోవటం కాస్త కష్టమే" అని.

"అంటే?" క్వశ్చన్ మార్క్ ఫేసు పెట్టాడు కాట్రవెల్లి కండో (మలయాళీ).

"ఏముందీ, ఇదే భోజనం ఆంధ్రాలో అంతమంది తింటున్నారు, అక్కడ అల్సరూ, హలసూరు ఏదీ లేదు. మా వూళ్ళో ఇంతకంటే స్పైసీగా భోంచేస్తాం. మాకు కడుపులో ఏ మంటా కలగదు" చెప్పాను.

"ఎందుకంటావ్?" బీహారీ డవుటేడు.

"మా వూరి నీళ్ళు అలాంటివి." చెప్పేను నేను. నా మాటకు బాబూ మోషాయ్ ఏకీభవించలేదు. నీళ్ళు ఎక్కడికెళినా ఒకేలా ఉంటాయ్. అసలు నీళ్ళకు టేస్టేంటి? వితండవాదం సాగించేడు. బాబూ మోషాయ్ నా బాసురుడు కావడంతో నేను మాట్లాడలేదు.

అవును. మా వూళ్ళో నీళ్ళకు ఆ గుణముంది అని నా నమ్మకం. కాలేజీ రోజుల్లో దాదాపు ప్రతిరోజు సాయంత్రం నారాయణ బొరుగులో, ఉగ్గాని, మిరపకాయ బజ్జీలో, కట్లెట్ పానీపూరీయో మాకు కడుపున పడాల్సిందే. ఆ నారాయణ బొరుగులు తినేప్పుడు కళ్ళల్లో నీళ్ళలా కారిపోయేవి, అయినా సరే అలాగే లాగించేవాళ్ళం.

ఓ సారి నేను, నా ఫ్రెండ్ ఓ పందెం వేసుకున్నాం తను పాతిక మిరపకాయ బజ్జీలు తింటానని, దానికి ప్రతిగా నేను పాతిక రూపాయల బొరుగులు తినగల్ననీనూ. అన్నంతపనీ చేశాం. గెలుపు ఎవరిది అని తేలలేదు. అయితే మా వాడు మరుసటి రోజు హాస్పిటల్లో సెలైన్ బాటిళ్ళ వాతన బడ్డాడు. నేను తప్పించుకున్నా. కారణం బాగా నీళ్ళు తాగడమే. అవును మా వూరి నీళ్ళల్లో అలా కారాన్ని హరాయించే శక్తి ఉంది. అలానే మా వూరి నీళ్ళ రుచి కూడా. (అందరూ వాళ్ళ వూరి నీళ్ళ గురించి అలానే అనుకోవచ్చు). నా చిన్నప్పుడు మా నాన్న మా సొంత ఇంట్లో బావి తవ్వించారు. 200 అడుగులకు పైగా. నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఆ నీళ్ళు కొబ్బరి పాలలా ఎంత తియ్యగా ఉండేవో. పొద్దులో అరిపిరాల సత్య గారి మంచినీళ్ళ బావి కథ చదివినప్పుడు అదే గుర్తొచ్చింది నాకు.

అయితే మా మేనమామ ఒప్పుకోడు. "గంగా స్నాన, తుంగా పాన". మా ఊరి నీళ్ళే మంచివి అనే వారాయన. ఆయన బళ్ళారి లో నివాసముండేవారు.

నీళ్ళ విషయంలో బెంగళూరు వాళ్ళది తెగ బడాయి. మేము కావేరీ నీరు తాగుతాం. కావేరి వాటర్లో ఫాస్పరస్ కంటెంట్ ఉందట. అది బుద్ధిని తెగ షార్ప్ చేస్తుందట, అని వీళ్ళ మాటలు. అక్కడికి బుద్ధి పెన్సిలయినట్లు, కావేరీ నీళ్ళు బ్లేడులా దాన్ని చెక్కుతున్నట్లు.


నీళ్ళకో గుణం. ఏం తిన్నా హరాయిస్తాయా నీళ్ళు. అలాగే ఎంత తాగినా ఏవీ తాగినట్టుండదు, ఎందుకో ఏమో?

పారే నదిలో మధ్యలో వెళ్ళి ఆ నీళ్ళు తాగటం ఓ గొప్ప సంతోషాన్నిస్తుంది నాకు. బాసర వద్ద గోదావరి నది మధ్యకు తెప్పలో వెళ్ళి నది మధ్యలో తెప్పనాపించి, నీళ్ళు ముంచుకు స్నానం చేసి, ఆ నీళ్ళు తాగడం నాకున్న గొప్ప జ్ఞాపకాల్లో ఒకటి. తెప్ప అంటే హరిగోలు కాదు. థర్మోకోల్ షీట్లను తాళ్ళతో కట్టి చేసిన ఓ నలుచదరపు పడవ. అలానే శృంగేరి దగ్గర తుంగా నది నీళ్ళు కూడా. ఇంకా గొప్ప జ్ఞాపకం నైలు నది మధ్యలో పడవలో వెళ్ళి నీళ్ళు ముంచుకు తాగటం.

ఇంతకూ నేనిలా మంచినీళ్ళ మీద పడ్డానికి కారణం, గత ఐదేళ్ళుగా ఈ దరిద్రపు ఊళ్ళో మినరల్ వాటర్ కొనుక్కుని తాగి బతుకీడ్చాల్సిన ఖర్మ పట్టటం. మన చదువులు, మన బతుకులన్నీ "ఉద్యోగం" చుట్టూ తిరుగుతూ తగలడ్డాయ్. ఇంతమందికి ఉద్యోగాలు రావాలంటే పనికొచ్చేవి, పనికి రానివీ రకరకాల వస్తువుల ఉత్పత్తి జరగాలి. పనికి రాని వస్తువులు మార్కెటింగ్ ప్రతిభ కారణంగా, పనికొచ్చే వస్తువులుగా తయారు చేయాలి. అదుగో అందుకనేనేమో చివరకు నీళ్ళను కూడా కొనుక్కుని తాగే దిశకు చేరుకున్నాం. ఎవణ్ణి తిట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఈ నీళ్ళల్లోనూ కాంపిటీషను. టాటా వాడి నీళ్ళు లీటరు పాతిక రూపాయలు. ఇంకొకడెవడో క్యువా అట. బాటిలు నలభై రూపాయలు పెట్టి అమ్ముతున్నాడు.

అలానే మన తిండి పదార్థాలు, పాలు పెరుగు వీటి రుచి కూడా నీటి మీదనే ఆధారపడి ఉంటుందని నాకొహ నమ్మకం. నైలు నది వద్ద ఒక ఆన్ సైటుకెళ్ళినప్పుడు నెల్లాళ్ళు దాదాపు నేనే వండాను, మా కొలీగుల కోసం. అయితే అదే వంట ఇక్కడ బెంగళూరులో చాలా సార్లు ప్రయత్నిస్తున్నా, కుదిరి చావడం లేదు. నైలు నీళ్ళలోనే మర్మం ఉంది.

ఇంతకూ, మనకు ఎప్పుడు వానలు కురిసి నీటి కరువు తీరుతుందో ఏమిటో?

ఇప్పుడు కొంచెం జ్ఞానదాయకమైన విషయాలు చెప్పుకుందాం

నీరు అన్నది సంస్కృత "నీయతే ఇతి" అన్న ధాతువు నుండి వచ్చిన "నీర" శబ్దానికి తద్భవం కాదని నుడి నానుడి రామచంద్ర గారు. నిగనిగలాడేది కాబట్టి నిగళ్ష్, నిగర్, నీరు, నివురు అయిందట. అలాగే వెణ్ణ, పెన్నా వీటి నుంచి వెల్ల, వెల్లువ, మలయాళలో వెళ్ళం (వెళ్ళం అంటే నీరు ఆ భాషలో), వానావానా వల్లప్ప లోని వల్లప్ప ఇవన్నీ వచ్చాయట. ఇలాంటివి మరెన్నో. కాబట్టి మనపదాలన్నీ సంస్కృతానికి కాపీ అని బాధపడాల్సిన అవసరం లేదు.

23 comments:

 1. ఈ టపా చదివి తీర్థం పుచ్చుకుని నెత్తి మీద నీళ్ళు జల్లుకున్నా! :-)

  ReplyDelete
 2. మీ ఆఫీసు కొంపదీసి M.G. Road ప్రక్కలే కాదుకదా!! మా ఆఫీసు గరుడా మాల్ ప్రక్కనే Thomson Reuters.

  ReplyDelete
 3. This comment has been removed by the author.

  ReplyDelete
 4. "అలానే మన తిండి పదార్థాలు, పాలు పెరుగు వీటి రుచి కూడా నీటి మీదనే ఆధారపడి ఉంటుందని నాకొహ నమ్మకం."

  absolutely! నమ్మకం కాదు, నిజవే.
  BTW, enjoyed the post

  ReplyDelete
 5. కారం మాటెత్తి నోట్లో నీరూరించారండీ.. ఇక్కడ చవిచచ్చిన తిండి తిని తిని నీరసమొచ్చేసింది. ఇక లాభంలేదో ఏదో ఓ ఇండియన్ షాపుకి వెళ్ళి.. ఊరుమిరపకాయలు తిని కారందభాష్పాలు కార్చాల్సీందే..
  మీ పోస్టు కారంకారంగా బాగుందండి. ఖళ్ళ్ ఖళ్ళ్ స్స్స్ స్స్స్ ఏమేవ్ ఓ పోలండ్ స్ప్రింగ్ వాటర్ బాటిలందుకో..

  ReplyDelete
 6. అవునండోయ్.. టపా చదివాక నాకు జ్ఞానోదయమయింది. ఇప్పుడు తెలిసింది మావూరి కందిపప్పులో మా వూరి చెలమ నీళ్ళు పోసి వుడికిస్తే వచ్చిన పప్పురుచు ఇక్కడ స్ప్రింగ్ వాటర్ పోసి వుడకబెట్టినా రావటంలేదు..
  అన్నంలోకి టమోటా,పచ్చిమిరపకాయ కారమో/ ఆవకాయో లేకుండా అసలు అన్నం సున్నంలాగా ఎలా తింటారో ఏక్థూ..

  ReplyDelete
 7. రవి గారు:

  > "మాకు కడుపులో ఏ మంటా కలగదు"

  చాలామంది తెలుగువాళ్ళు కాసింత గొప్పగా చెప్పుకునే మాట :-( (నేను గుంటూరు జిల్లా వాణ్ణి కనుక మరింత తరచుగా వింటుంటాను.) ఒకసారి అడయారు వెళ్ళి అక్కడి పెద్ద కాన్సరు ఆసుపత్రిలో ఇదే మాట అని చూడండి. వైద్యులు ఏం చెప్తారో! Seriously!

  > Etymology of "నీరు"

  I don't think that శ్రీ రామచంద్ర's explanation is sound.

  -- శ్రీనివాస్

  ReplyDelete
 8. ఈ మాట అక్షరాలా నిజమే.మన పెద్దలంటూ ఉంటారిక్కడ ఎవరికైనా కొంచెం ఒళ్ళు చేస్తే ఆ ఊరినీళ్ళు నీకు బాగా పట్టినాయిరా అని.మా బంధువులంతా అంటుంటారు పప్పు మేమూ మీమాదిరే చేస్తాం కానీ మీ ఊరిలో చేస్తే వచ్చినంత రుచి మాఊరిలో రాదని.అలాంటి నీటిని కూడా ఈతరం వారు slab industries లో వాడిన కలుషితపదార్థాలతో పెన్నా నదిని నాశనం చేస్తున్నా పట్టించుకుంటున్న వారు లేరు. ఎందుకంటే ఆ కర్మాగారాలన్నీ రాజకీయనాయకులవీ, వారి అనుచరులవే కాబట్టి. మమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేదు ఎందుకంటే వాళ్ళే అంటుంటారు ఆయన మా పార్టినే అని.

  ReplyDelete
 9. నిజమే!! ఎన్ని మిరపకాయలు తిన్నా, మా గుంటూరు నీళ్ళు తాగితే ఏమీ అవదు!!! :)
  నేను కొరియాకి వెళ్ళినప్పుడు పండు మిరపకాయల కారం తీసుకువెళితే, అక్కడ ఆ కారం తిన్న వాళ్ళందరూ కళ్ళనీళ్ళు కార్చారు ;)

  >>పారే నదిలో మధ్యలో వెళ్ళి ఆ నీళ్ళు తాగటం ఓ గొప్ప సంతోషాన్నిస్తుంది
  అది నాకు ఒక తీరని కోరిక.. ఎప్పటికి తీరుతుందో.. :(

  పాత ఇంట్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మినరల్ వాటర్ కొనుక్కోవాల్సి వచ్చేది.. ఈ మద్యే ఇల్లు మారాము.. ఈ ఇంట్లో మంచినీళ్ళు బాగున్నాయి.. తియ్యగా ఉన్నాయి.. కానీ, మినరల్ వాటర్ కి అలవాటు పడి, ఇక్కడా కొనుక్కోక తప్పడం లేదు... హ్మ్..

  మీ జలోపాఖ్యానం వల్ల, నేను కామెంటోపాఖ్యానం చేయాల్సి వచ్చింది.. :)

  ReplyDelete
 10. >>అక్కడికి బుద్ధి పెన్సిలయినట్లు, కావేరీ నీళ్ళు బ్లేడులా దాన్ని చెక్కుతున్నట్లు.

  చూశారా కాంట్రడిక్షన్!! మీ ఊరినీళ్ళు కారాన్ని హరాయించుకునే శక్తినిస్తుందని మీరనుకున్నప్పుడు, బెంగుళూరు వాళ్ళు కావేరి నీళ్ళగురించి అలా అనుకోవటంలో తప్పులేదు కదండీ :) Just pulling your leg.

  టపా చాలా బాగా వ్రాశారు. కానీ నాకెందుకో నాగార్జున కంటే నందినిలోనే ఆంధ్రా భోజనం నచ్చుతుంది.

  ReplyDelete
 11. "నీ ఫేవరెట్ వెజిటబుల్ ఏది?" ఎవరైనా నన్నడిగితే వితిన్ నో టైమ్ "పచ్చిమిరపకాయ, అదీ గుంటూరుది"అని చెప్పేస్తాను. కారం లేకుండా బతుకేం బాగుంటుంది నిస్సారంగా! మజ్జిగ మిరపకాయలైతే వూరికే ప్లేట్లో పెట్టుకుని జీడిపప్పులాగా లాగించొచ్చు, మంచి పుస్తకం చేతిలో ఉండాలే కానీ!

  ఇక నీళ్ల సంగతంటారా? నీళ్ళు ఏ దరిద్రపు వూర్లో కొనక తప్పుతోంది చెప్పండి? కిన్లే 20 లీటర్ల డబా 75 రూపాయలు. బిబో వాడు 50 రూపాయలు.అయినా నీళ్ళు తాగక తప్పదుగా, కాబట్టి కొనకా తప్పదు.

  "అలానే మన తిండి పదార్థాలు, పాలు పెరుగు వీటి రుచి కూడా నీటి మీదనే ఆధారపడి ఉంటుందని నాకొహ నమ్మకం.". అది నిజమేనండీ!

  "అక్కడికి బుద్ధి పెన్సిలయినట్లు, కావేరీ నీళ్ళు బ్లేడులా దాన్ని చెక్కుతున్నట్లు." భాగా చెప్పారు. బుద్ధి షార్పవుతుందో లేదో గానీ,ఆకలి మాత్రం తెగ వేస్తుందండీ! ఎంత తిన్నా ఇంకా ఆకలేస్తూనే ఉంటుంది, ఫాస్ఫరస్ వల్ల జఠరాగ్ని కూడా షార్ప్ అవుతుందేమో మరి!

  మా గుంటూరు జిల్లా నీళ్ళు చాలా శ్రేష్టం,ఎంత కారం తిన్నా కడుపులో మండదు.

  ReplyDelete
 12. "...తిండి పదార్థాలు, పాలు పెరుగు వీటి రుచి కూడా నీటి మీదనే ఆధారపడి ఉంటుందని నాకొహ నమ్మకం..."

  శాస్త్రీయంగా నిరూపణ కాకపోవచ్చేమో గాని, ఇదినిజమే అనిపిస్తుంది. కావేరి నీటి గురించి తమిళనాట కూడా గొప్పగా చెప్పుకొంటారు. "కావేరి నీళ్లు తాగుతాడు కదా, అందుకే అంత చక్కగా మాట్లాడుతాడు" అంటారు. ఐతే వారు చెప్పే కారణం ఫాస్ఫరస్ కాదు, రాగి.

  నీరు అన్న పదం ద్రావిడం నుండే సంస్కృతంలోకి వచ్చి వుండవచ్చు- నేరం, నిలయం,నారికేళం లాగా!

  ReplyDelete
 13. Good discussion about water at the same time informative too.

  ReplyDelete
 14. చంద్ర మోహన్ గారూ,
  భాషల పుట్టు పూర్వోత్తరాలు చూసినట్టైతే సంస్కృతం ద్రవిడ భాష కన్నా ప్రాచీనమైనది. కాబట్టి ద్రవిడం నించి సంస్కృతం లోకి వచ్చే అవకాశం లేదు. కాక్పోతే అక్కడకడ కొన్ని పదాలు తర్జుమా చేసుకుంటున్నప్పుడో, వ్యావహారికం లోనో వచ్చి ఉందచ్చు గాక.

  ReplyDelete
 15. @Dr.నరహరి గారు : ధన్యవాదాలు.

  @ప్రవీణ్ : మినరల్ నీళ్ళా? అయితే ఇంకా దోషం పోలేదు. మీ ఊరి నీళ్ళు చల్లుకోవాలి. :-)

  @అరుణ్ : కాదు. కోరమంగళ. ఎప్పుడైనా బ్లాగర్లందర్లు కలవాలి. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను.

  @కొత్తపాళీ : ఇంతమందికి అనుభవం అయిన తర్వాత ఇది ఖచ్చితంగా నిజమే.

  @ఆత్రేయ గారు :చూశారా, స్వీటు చూసి నూరు ఊరాల్సింది. కారం చూసి ఊరుతోంది. ఏదో మిస్ అవుతున్నాం మనం.

  @భాస్కర్ గారు: పప్పు గురించి చెప్పారు. కొద్దిగా గుండెలో నొప్పి మొదలయింది.

  @శ్రీనివాస్ గారు : మీరు చెప్పింది నిజమేనండి. ఋజువు సాక్షాత్తు మా నాన్న గారే. ఆయన అల్సర్ పేషంట్ ఒకప్పుడు.

  etimology గురించి మీకో అభ్యర్థన పెడుతున్నాను. వ్యక్తిగతంగా వేగు పంపుతాను.

  @విజయమోహన్ గారు : నాకు అర్థమయింది మీ బాధ. గత వారమే మీ వూరొచ్చాను. చూశాను. (మిమ్మల్ని కలవలేకపోయా, ఎందుకంటే ఫ్యామిలీ తో కలిసి వచ్చా కాబట్టి).

  @మేధ గారు : మేము ఒక కొరియా గాడికి పట్టుపట్టి గోంగూర తినిపించాము. వాడి ముఖం టమోటో లా ఎర్రగా మారడం మాకు ఇప్పటికీ గుర్తే. ఇక మీ గుంటూరు మిరపకాయ తినిపిస్తే వాడి ముఖం చూడాలి.

  @బ్లాగాగ్ని : నిజమే. మీరు కావేరి వాటర్ తాగేటట్టున్నారు. నేను వారానికి కనీసం 3 సార్లు నందిని బాధితుణ్ణవుతాను. అందుకే నాగార్జున అంటే ఇష్టం నాకు.

  @సుజాత గారు : నిజం. కొన్ని రోజుల తర్వాత ఇదీ మార్కెట్ అవుతుంది చూస్తుండండి. గుంటూరు వారి మిరపకాయ కారాన్ని హరాయించగల శ్రేష్టమైన నీళ్ళు అని.

  @చంద్రమోహన్ గారు : "నీరు" కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తుంది, ఎందుకంటే "నీయతే ఇతి" (ప్రవహించునది కాబట్టి) అని సంస్కృత ధాతువు ఋజువు తీసేయదగ్గది కాదు. అయితే వెణ్రు, వెళ్ళం, ఇవి ద్రవిడ భాషా శబ్దాలయి ఉండే అవకాశాలు హెచ్చు అని నేననుకుంటున్నాను.

  @sunita గారు : ధన్యవాదాలు.

  @సనత్ గారు : సంస్కృతం ప్రాచీనమని అనుకున్నా, అందులో ద్రవిడ పదాలు చేరకూడని అవకాశాలు లేవు. ఆదాన ప్రదానాలు ఏ భాషలోనైనా పరిపాటే. అయితే "ఓ పదం ఏ భాష నుండి ఉదయించింది అన్న విషయం తేల్చడానికి సాహితీ వేత్తలు మాత్రమే సరిపోరు, దానికి శాస్త్రీయమైన అధ్యయనం అవసరం. " అన్నది ఓ సూత్రం.సురేష్ కొలిచాల గారి వ్యాసాలు "ఈ మాట" పత్రికలో వచ్చినవి (పాత ఎడిషన్ లలో) వీలయితే చదవండి.

  ReplyDelete
 16. సనత్ శ్రీపతిగారు,

  సంస్కృత భాష ప్రాచీనతపై ఏ వివాదమూ లేదు. కానీ సాధారణ అపోహలకు విరుధ్ధంగా సంస్కృత, ద్రావిడ భాషల మధ్య పదాల ఆదాన ప్రదానాలుండేవని మాత్రమే నా భావన. తొలి తమిళ వ్యాకరణం 'తొల్కాప్పియం' లోని కాప్పియం సంస్కృత 'కావ్యం' నుండి వచ్చిందేనట!

  ReplyDelete
 17. అన్యాయం రవీ ! మా ఊరు వచ్చి కలవకుండా పోయారా ! కుటుంబంతో అయితే తప్పక కలిసివుంటే చాలా బాగుండేది. మిమ్మల్ని క్షమించను గాక క్షమించను...

  ReplyDelete
 18. @విజయమోహన్ గారు : సకుటుంబంతో పాటు పరివారమూ ఉండబట్టి కుదర్లేదండి. ఆలూరు కోనలో మా పాపాయికి పుట్టినెంట్రుకలు తీయించాము. అందుకని వచ్చాము. తప్పకుండా ఈ సారెప్పుడైనా కలుద్దాము.

  ReplyDelete
 19. ఇంకా వానా వానా వల్లప్పా అంటే rain rain go away ఏమో అనుకున్నా :-)

  ReplyDelete
 20. పోస్ట్ సూపరో సూపరు.. నీరు రుచి ని, అరుగుదలని నిర్దేశిస్తుందనే దాంట్లో అనుమానమే లేదు. అంతే కాదు రక రకాల కారణాలతో రోజు మినరల్ వాటర్ తాగే వారిలో వ్యాధి నిరోధక శక్తి తరగడం కూడా గమనించాను నేను.

  యాధృచ్చికంగా ఈ ఉదయం మా నాన్న గారికి నాకు మధ్య కూడా ఇదే డిస్కషన్ పాయింట్ తను కూడా ఈ మధ్య గుంటూరు లో మినరల్ వాటర్ మానేసి పంపు నీరు తాగడం మొదలు పెట్టాక ఆకలి పెరిగింది అని ప్రత్యక్షంగా అనుభవించి మరీ చెప్పారు. కాకపోతే వర్షపు నీరుకు భయపడి మళ్ళీ మినరల్ వాటర్ కి మారాల్సి వస్తుంది.

  ReplyDelete
 21. ఏమిటో ఈ నీళ్ళెన్ని తాగినా నోరు తడారిచావదేం? లాంటి మాటలు ఎప్పుడూ వినలేదా? :-)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.