Wednesday, July 8, 2009

పోలిక

నా క్రితం టపాలో కామేశ్వర్రావు గారు కామెంటుతూ, సమాయుక్తం, సమన్వితం అన్న పదాలు చూడగానే చప్పున ఓ విషయం, చూచాయగా ఓ విషయం గుర్తొచ్చాయన్నారు. ఇలా ఓ విషయం చూసినప్పుడు మరో విషయం స్ఫురించటం మామూలుగా అప్పుడప్పుడు జరిగేదే అయినా, ఒకే కాలానికి, ప్రాంతానికి చెందని ఏ రెండు రచనలలోనో, రచనా ప్రక్రియల్లోనో ఇలా పోలికలు కనబడితే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కో సారి ఈ పోలిక అనుసరణ, ప్రేరణ లేదా ప్రభావం కావచ్చు.

కామేశ్వర్రావు గారు వివరించిన "ఎవ్వాని వాకిట . . ." చదివిన తర్వాత, అలాంటిదే ముక్కు తిమ్మనాచార్యుని పారిజాతాపహరణం చూసినప్పుడు, అందులో అవతారికలో ఈ (12 వ)పద్యం కనిపించింది. ఇలాంటివి ఎన్నెన్నో సారస్వతంలో ఉండవచ్చు.

అయితే - ఒకే వర్ణన ఇద్దరు కవులు చేస్తే ఎలా ఉంటుంది?

రఘువంశం 6 వ సర్గ లో ఒక చిన్న వర్ణన

ఇందీవరశ్యామతనుర్నృపోసౌ
త్వం రోచనాగౌరశరీరయష్టిః
అన్యోన్యశోభాపరివృద్ధయే వాం
యోగ స్తటిత్తోయదయో రివాస్తు

ఈ నృపుడు నీలోత్పలము వలె భాసించే శ్యామతనూ విలాసుడు. నీవు గోరోచనమువలె పచ్చనైన దండసదృశదేహవిలసితవు. మెఱపుకు, మేఘమునకు వలె, మీరిరువురకు యోగము పరస్పర కాంతి ప్రవృద్ధమానమగును.

స్వయంవరంలో పాండురాజును చూపెడుతూ, దౌవారికి సునంద రాకుమారి ఇందుమతికి చెప్పే మాట ఇది. అయితే సూర్యుని కోసం ఎదురు చూసే తామర మొగ్గకు చంద్రుడి కాంతి పట్టనట్టు ఈ రాజు ఇందుమతికి నచ్చలేదట. (సూర్యుడు అంటే సూర్యవంశపు రాజయిన అజుడు అని అన్వయించుకోవాలి)

పై శ్లోకంలో తటిత్తోయదయోరివ - (తోయం దదాతి ఇది తోయదః - తోయములను ఇచ్చునది తోయదము) - మెఱపునకు, మేఘమునకు వలె.

ఈ ఆఖరు వాక్యం చదవగానే -

మెఱయు శ్రీ వెంకటేశు మేన సింగారము గాను
తఱచయిన సొమ్ములు ధరియించఁగా
మెఱుఁగుబోణీ అలమేలు మంగయుఁ దాను
మెఱుపు మేఘము గూడి మెరసినట్లుండె

ఒకపరికొకపరి ఒయ్యారమై
మొకమునఁ గళలెల్ల మొలచినట్లుండె

చప్పున గుర్తుకు వచ్చింది. అయితే ఈ సారి పద్మావతి, శ్రీనివాసుడు నాయికా నాయికలు. నాయకుడు నీలతనుడు. పైగా మంచి సొమ్ములు వేరే వేసికొన్నవాడు. నాయిక పద్మావతి కుంకుమ వర్ణిని. ఇద్దరి యోగము ఇందాక చెప్పిన తటిత్తోయదయోరివ అంటే - మెఱుపు మేఘము గూడి మెరసినట్లుండె.

ఈ కీర్తన విన్నప్పుడో, చిన్నగా పాడుకునేప్పుడో, మేఘాల మధ్య తటిల్లత లాంటి మెఱుపు, ఆ వెంటనే ఆ తటిల్లత ను నాయిక (అమ్మవారి)గా పోల్చిన పోలిక, ఆ తర్వాత నల్లటి మేఘం లాంటి నాయకుడు అసంకల్పితంగానే గుర్తుకు రావడం జరిగిపోతోంది.

సంస్కృత వర్ణన లో క్లుప్తత, కేవలమొక సాదృశ రూపము కనిపిస్తే తెలుగు వర్ణనలో ఓ లయ, దాని ఉధృతి, మనసులో చెప్పలేని ఓ తాదాత్మ్య భావన కలుగుతోంది. (బహుశా నాకే అలా అనిపిస్తుందో ఏమో?)

ఇందులో భక్తి, భగవంతుడిపై నమ్మకం, అపనమ్మకం ఇవేవి లేవు. ఇవన్నీ రసాస్వాదనకు అడ్డు రావు, రావలసిన అవసరం లేదు. అనుభూతులకు తర్కం సమాధానం చెప్పలేదు.

అన్నట్టు ఇది రాస్తున్నప్పుడు, పక్కన కిటికీ నుండీ బయట చీకట్లో ఉండుండీ మెఱుపులు కనిపిస్తున్నాయి.

19 comments:

 1. ‘పోలిక’ బాగా చెప్పారు.‘తటిత్తోయదయోరివ’- కాళిదాసు ఉపమాలంకార చాతుర్యం! మీరన్నట్టు... భగవంతుడిపై నమ్మకం, అపనమ్మకం ఇవేమీ రసాస్వాదనకు అడ్డు రావు. అభినందనలు!

  ReplyDelete
 2. రవిగారూ, ఈ మెరుపు-మేఘం పోలిక చాలా ప్రసిద్ధి చెందినదేనండీ. శ్రీమచ్ఛంకరభగవత్పాదులు అర్ధనారీశ్వరులని, సీతారాములని పోల్చడానికి వాడిన ఉపమానాలలో మెరుపు-మేఘం (తడిత్-అంభోధర), బంగారం-గీటురాయి (కనక-నికష) వంటివి ఉన్నాయి. ఆంజనేయుడు చేసిన సీతారామస్తోత్రంలో కూడా ఇలాంటి పోలికే కనబడుతుంది కూడాను: మెరుపు-మేఘం (కార్తస్వర-కాలమేఘ). అంతెందుకూ, నేను కూడా రాత్రీశాన్వయజాతడిజ్జలధరః అని వాడేసాను ఒకసారి. :P

  ఇక, పూర్వకవులని చూచి ప్రేరణ పొందడం అంటారా, అది సాధారణంగా జరిగేదేనేమో. మళ్లీ సొంత డబ్బా అనుకోకపోతే ఈ టపాలోని సీసపద్యంలో కొంచెం తిరుపతివేంకటకవుల "బావా ఎప్పుడు వచ్చితీవు" పద్యం యొక్క ప్రభావం కనబడుతుంది. :D

  ReplyDelete
 3. >>ఇందులో భక్తి, భగవంతుడిపై నమ్మకం, అపనమ్మకం ఇవేవి లేవు. ఇవన్నీ రసాస్వాదనకు అడ్డు రావు, రావలసిన అవసరం లేదు. అనుభూతులకు తర్కం సమాధానం చెప్పలేదు.
  So true...

  >>అన్నట్టు ఇది రాస్తున్నప్పుడు, పక్కన కిటికీ నుండీ బయట చీకట్లో ఉండుండీ మెఱుపులు కనిపిస్తున్నాయి.
  మీరు చెప్పిన పోలిక, ఈ పోలిక రెండూ బావున్నాయి... :)

  ReplyDelete
 4. బావుంది.
  తిమ్మన పద్యం తిక్కన పద్యానికి కచ్చితంగా అను(స)కరణే. సాధారణంగా వ్యాఖ్యానం ఉన్న ఏ కావ్యాన్ని తీసుకున్నా, దాని పీఠికలో ఆ కావ్యంలో పూర్వ కవుల పద్యాల అనుసరణ/ప్రేరణతో ఉన్న పద్యాల లిస్టు ఉంటుంది. దాని బట్టి ఆ కవిమీద ఏ పూర్వ కవి ప్రభావం ఎక్కువగా ఉందో తెలుస్తుంది.
  చాటువుల్లో ఇది సాధ్యపడదు. చాటువుల కర్తృత్వమూ, కాలమూ రూఢిగా తెలియకపోవడం వల్ల ఏది మూలం ఏది అనుకరణ అన్నది చెప్పడం సాధ్యం కాదు.

  రాఘవ చెప్పినట్టు మెరుపూ మేఘం పోలిక ప్రసిద్ధమైనదే.
  రాముణ్ణి మెరుపుతో ఎవరు ఎక్కడ పోల్చేరో చెప్పుకోండి చూద్దాం? ;-)

  ReplyDelete
 5. కామేశ్వరరావు గారూ!

  వాగ్డానం సినిమాలో ‘శ్రీ నగజా తనయం సహృదయం ...’ పాటలో...

  ‘ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెరుపువలె నిల్చి’ అని పోల్చారు. రాసింది- పోతన/కరుణశ్రీ లలో ఒకరు. ఎవరైనదీ మీరు సరిగ్గా చెప్పండి మరి.

  ReplyDelete
 6. @రాఘవ గారు : మెఱుపు (లాంటి) పోలిక మీది కూడానన్నమాట. నిజంగా మెఱుపు లానే ఉంది. మీరు చెప్పిన తెలుగుపద్యంలో అంత్య ప్రాస మినహాయిస్తే, తిరుపతి వేంకటకవుల ప్రభావం ఉందని నాకు అనిపించలేదు. అయితే మీరే చెబుతున్నారు కాబట్టి చెప్పగలిగిందేమి లేదు.

  @వేణు, మేధ గారు: ధన్యవాదాలు. మీరు చెప్పిన "శ్రీ నగజా తనయం" అన్నది హరికథా?

  @కామేశ్వర్రావు గారు : మీరు చెప్పిన పీఠికలాంటిది నేను ఇంతవరకు గమనించలేదు. ఇకపై జాగ్రత్తగా గమనించాలి.

  రాముణ్ణి మెఱుపుతో పోల్చినది విశ్వనాథ వారని ఊహిస్తున్నాను. స్వయంవర సందర్భంలో ధనుర్భంగం జరిగేప్పుడు అని అనుకుంటున్నాను.

  ReplyDelete
 7. కామేశ్వరరావు గారూ!

  కాలాంబుదాళి లలితోరసి కైటభారే:
  ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ।
  మాత: సమస్త జగతామ్ మహనీయ మూర్తి:
  భద్రాణి మే దిశతు భార్గవ నందనాయా: ॥

  ఆది శంకరాచార్యులు రచించిన కనకధారా స్తోత్రం !

  ReplyDelete
 8. రవిగారు,
  నేనడిగినంత మాత్రాన విశ్వనాథేనా! :-)
  విశ్వనాథ చెప్పిన పోలికలు ఇన్నీ అన్నీ కావు. కాని అతను రాముణ్ణి మేఘంతో చాలాచోట్ల పోల్చారు. మెఱుపుతో పోల్చిన గుర్తు నాకు లేదు.

  వేణుగారు,
  మీరు చెప్పిన సమాధానం సగం కరెక్టు. పాట అదే. ఆ పాటలో ఉన్న ముగ్గురు కవుల్లో ఇద్దర్ని మీరు చెప్పారు. ఆ మూడో కవి సరైన సమాధానం :-)

  సనత్ గారు,
  మీరలా అర్థం చెప్పకుండా సంస్కృత శ్లోకాలని నా మీదకి సంధిస్తే ఎలాగండీ? నాకర్థమైన కొన్ని పదాలబట్టి ఇక్కడ విష్ణువుని నల్లని మేఘంతో పోల్చినట్టు అనిపిస్తోంది.

  ReplyDelete
 9. అంటే ఇక ఆ కవి- శ్రీ శ్రీ అన్న మాట!

  ReplyDelete
 10. కామేశ్వరరావు గారూ!

  తప్పేనండొయ్.. మీ ప్రశ్న "రాముణ్ణి మెరుపు తీగ తో పోల్చినది ఎక్కడ" అని. హడావుడిలో అసలు ప్రశ్న ని పక్కకి పెట్టెసి నాకు తెలిసిన సమాధానం రాసేసా. కాబట్టి నా సమాధానం అప్రస్తుతం... క్షమించాలి..

  తప్పెలాగూ జరిగి పోయింది కాబట్టి ఇక మీ సమాధనం లో ప్రశ్నకి వచ్చేద్దాం.

  సంస్కృత శ్లోకాలను అలవోకగా ఆంధ్రీకరించే మీకు (ఈ మధ్యనే నాగమురళి బ్లాగు లో రాశారు సుమీ.. మర్చిపోయినట్టున్నారు) అర్ధం తెలియదంటే బ్లాగ్లోకం లో నమ్మేవాళ్ళు ఎవరూ లేరండీ.. అయినా మీరడగటం లో ఏదో ఆంతర్యం, విశేషం ఉండే ఉంటుంది కనుక.... నాకు తోచినంతలో ఆ శ్లోకానికి భావం...

  'నాది ' అనే మమకారానికి సంకేతమైన కైటభుడనే రాక్షసుని సంహరించిన హరి వర్షాకాలపు నల్లని మేఘముల సమూహములా ఉన్నాడు. ఆయన లలితమైన హృదయ స్థానం లో మెరపు తీగవలే ప్రకాశిస్తూ, కొలతలకు అందని మహనీయమైన ఆకృతితో సమస్త జగములకూ మాతయై వెలుగుకు సంకేతమైన భృగుమహర్షి సంతానమైన అమ్మ నాకు భద్రములను కలిగించుగాక !! ("నీలతోయద మధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా" అనే మంత్ర భావమిది)

  ReplyDelete
 11. @sanath మీరు చెబుతున్న విషయాలు బాగున్నై. ఇలా వ్యాఖ్యల దుమారంలో కొట్టుకు పోకుండా వాటిని మీ బ్లాగు టపాల్లో ప్రతిష్ఠించండి.

  రాముడి మెరుపు పోలిక నేను చూసేటప్పటికే ఎవరో చెప్పేశారు. ఆ పాటలోనే తరవాత వచ్చే .. ఫెళ్ళుమనె విల్లు పద్యం శ్రీశ్రీది కాదనీ, వేరేదో కావ్యంలోదనీ ఎవరో రాయగా చదివిన గుర్తు. ఎవరికన్నా వివరాలు తెలిస్తే చెప్పగలరు.

  తటిల్లత - మేఘం మీద మంచి ప్రయోగం సువర్ణ సుందరి సినిమాలో హాయిహాయిగా ఆమని సాగే పాటలో ఒకటుంది .. ఏమో తటిల్లతిక కేమెరుపో? మైమరపేమో, మొయిలు రాజు గని మురిసినదేమో!" అందులోని చమత్కారం నాకు ఇప్పటికీ గిలిగింతలు పెడుతుంటుంది.

  ReplyDelete
 12. I know I am going off tangent- but
  speaking of imagery-
  అదేపాటలో
  "జగదేక పతి మేన
  చల్లిన కర్పూర ధూళి
  జిగిగొని నలువంక చిందగానూ,
  మొగి చంద్ర ముఖిని
  ఉరమున నిలిపె గాన,
  పొగరు వెన్నెల దిగపోసినట్టుండె"
  అన్న చరణంలోని imagery కూడా అద్భుతంగా అనిపిస్తుంది నాకు.
  అసలు పల్లవిలోని
  "మొగమున కళలెల్ల మొలచినట్టుండే" అనే వాక్యమే నాకు
  imageryకి పల్లవిలా అనిపిస్తుంది.

  ReplyDelete
 13. కొత్తపాళీ గారు,

  ఆ పాట నేను వినలేదు గానీ, "ఫెళ్ళుమనె విల్లు " అనే పద్యం కరుణశ్రీ గారిది. పూర్తి పద్యం ఇదీ:

  ఫెళ్ళుమనె విల్లు, ఘంటలు ఘల్లుమనె, గు
  భిల్లుమనె గుండె నృపులకు, ఝల్లుమనియె
  జానకీ దేహమొక నిమేషమ్మునందె
  నయము, జయమును భయము విస్మయము గదుర!’

  ReplyDelete
 14. @సనత్ శ్రీపతి గారు, అమ్మవారు "భార్గవ నందన" ఎలాగయ్యిందో మీరు చెప్పకూడదుటండీ? కొత్తపాళీ గారి సూచనే నా అభ్యర్థన కూడానూ.

  @కొత్తపాళీ గారు: "హాయి హాయిగా" పాట విన్నాను. అయితే ఈ సారి మీరు చెప్పిన విషయం గమనించాలి.

  @శారద గారు: ఈ కీర్తనలో మూడు చరణాలు, వేటికవే సాటి. నాకయితే "పొగరు వెన్నెల దిగపోసినట్లుండే" - ఈ పాదం వినేప్పుడు మేఘపు ఉరుము, దానితో పాటు కనిపించే మెరుపు స్ఫురిస్తాయి. ఇలాంటి అనుభూతులను వెల్లడించడానికి భాషకున్న శక్తి చాలదనిపిస్తుంది.

  ReplyDelete
 15. రవిగారూ, కొత్త పాళీ గారూ, నెనర్లు. 'విబుధ జనుల వలన విన్నంత, కన్నంత, తెలియవచ్చినంత (తప్పకుండా నా బ్లాగులో వివరంగా) తేట పరతు

  ప్రస్తుతానికి రవి గారి ప్రశ్నకి క్లుప్తం గా..

  భృగుమహర్షి సప్తర్షులలో ఒకరు. ఆయన భార్య ఖ్యాతి . వారి కుమార్తె 'శ్రీ'. ఆమెను భార్యగా పొందినవాడు విష్ణుమూర్తి. కనుకనే అతడు 'శ్రీ మహావిష్ణువైనాడు '

  ReplyDelete
 16. సనత్ శ్రీపతి గారు,

  భృగు మహర్షి కుమార్తె భార్గవి లేక భ్రుగునందన అవుతుందే కానీ భార్గవ నందన కాదు. భార్గవ నందన అంటే, భ్రుగువు మనుమరాలని అర్థం వస్తుంది.

  ReplyDelete
 17. చంద్రమోహన్ గారూ,

  నాకు తెలిసినంత వరకూ ధాత, విధాత, శ్రీ మహాలక్ష్మి, చ్యవన మహర్షి, శుక్రాచార్యుడూ భార్గవులు (అంటే భృగు మహర్షి సంతానం). కానీ వారిలో ఎవరికీ కూతురిగా అమ్మవారు జన్మించినట్టు ఎక్కడా చదివిన గుర్తు లేదు.

  యదునందన అంటే కృష్ణుడు అనీ, రఘునందన అంటే రాముడు అనీ ఎలా అన్వయమో, అలానే భార్గవ నందన/ భృగు నందన అంటే లక్ష్మీదేవి అని ఆది శంకారాచార్యులవారు ప్రయోగించి ఉంటారు అనుకుంటున్నా. (తప్పైతే సరిజేయగలరు)

  ReplyDelete
 18. సనత్ శ్రీపతి గారూ,

  నాకు పౌరాణిక ఙ్ఞానం అంతగా లేదు. నా సందేహం వ్యాకరణ పరమైనదే. పాణినీయం ప్రకారం భృగు మహర్షి సంతానం మీరే వ్రాసినట్లు భార్గవులవుతారు గానీ భార్గవ నందనులు కారు. భృగు నందనులని వ్రాయవచ్చు కావలిస్తే. అలాగే కృష్ణుడి కొడుకు కార్ష్ణి. మరో రకంగా వ్యుత్పత్తి సాధించే అవకాశం ఉందేమో నాకు తెలియదు. నాగమురళి గారో, రాఘవ గారో తాడేపల్లి వారో పూనుకొని సందేహ నివృత్తి చేయాల్సిందే!

  ReplyDelete
 19. భృగోః గోత్రాపత్యం భార్గవః అని. భృగు మహర్షి గోత్రంలో జన్మించినవారికి భార్గవులు అని పేరు. కాబట్టి భార్గవనన్దనా అన్నదానికి భృగోః అపత్యం పుమాన్ భార్గవః, తస్య నన్దనా అంటే భృగు మహర్షి (గోత్ర)సంతానమైన భార్గవుని కుమార్తె అని చెప్పుకోవటం కంటె, భృగోః అపత్యం చాసౌ నన్దనా చ అంటే భృగు మహర్షి (గోత్ర)సంతానమైన కుమార్తె అని చెప్పుకుంటే భృగునన్దనా భార్గవనన్దనా రెంటికీ సరిపోతుందనుకుంటాను.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.