Monday, June 29, 2009

సంస్కృత బ్లాగులు

ఎక్కడో, ఏదో వెతుకబోతే, మరేదో తగిలింది. అంతా గూగులమ్మ దయ, నా ప్రాప్తం!

కోలాచలం మల్లినాథ సూరి అని 15వ శతాబ్దపు గొప్ప పండితుడు. ఆయననే "వ్యాఖ్యాన బ్రహ్మ" అంటారట. కాళిదాసు కావ్యాలన్నిటికి (శిశుపాలవధం కి కూడా?) ఈయన వ్యాఖ్యానం వ్రాశారు. ఈయన తెలుగాయన. (మెదక్ జిల్లా కోల్చారం ఈయన ఊరని ఊహిస్తున్నారు) ఈయన కథ పూర్తిగా తెలియదు గానీండి, లీలగా విన్నది. కొంచెం కాళిదాసు కథలానే ఉంటుంది(ట). ముందుగా కాళిదాసు కథ(న కుతూహలం).

మూఢుడైన ఓ గ్రామస్తుడు, భార్య కారణంగా కాళిదాసు గా మారిన వైనం మనం విన్నాం. అలా పండితుడైన కాళిదాసు ఇంటికి తిరిగి రాగానే భార్య "అస్తి కశ్చిత్ వాగ్విషయః?" (మాటలాడడానికి ఏమైనా విషయం ఉందా?) అని దెప్పిందట. దానికి కాళిదాసు,"అస్తి" అన్న పదం తో మొదలుకుని కుమారసంభవం (అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మా..), "కశ్చిత్" అన్న పదంతో మొదలుకుని మేఘదూతం (కశ్చిత్ కాంతా విరహ గురుణా...), వాక్ అన్న పదంతో మొదలెట్టి రఘువంశము (వాగర్థావివ సంపృక్తౌ...)చెప్పాడని ఓ వైనం.

మల్లినాథ సూరికి సంబంధించిన కథ (నాకు లీలగా గుర్తున్నది) ఏమంటే, వాళ్ళావిడ ఓ రోజు వంటింట్లో చారు చేస్తున్నదట. అందులో, జిలకర, మిరియాలు, ఇంగువ అన్ని వేసి, ఉప్పు వేయటం మర్చిందట. అపండితుడైన తన భర్తకు అన్యాపదేశంగా పాఠం చెబుతూ "కారం, ఇంగువ, జిలకర, బాగా కలిపి, చక్కగా పోపు ఘుమఘుమలు జోడించినప్పటికి, లవణం లేకపోతే ఎలా ఉంటుందో, ఏమి ఉన్నప్పటికి, పాండిత్యం లేని భర్త ఎందుకూ కొరగాడు" అందిట. ఈ కథ దూర దర్శనం లో కథగా కూడా వచ్చింది యేళ్ళ క్రితం. దీనికి సంబంధించిన పద్యం ఒకటున్నది.

"చారు చారు సమాభాతం ఇంగు జీర సమ్మిశ్రితం...." ఇలా... అదుగో ఈ శ్లోకం కోసం గూగులమ్మను వెతికాను. ఎంత వెతికినా కనిపించక, మూసేద్దామనుకుంటే, ఏదో యూనివర్సిటీ వారి లంకె. అందులోకెళితే, పేరు, పాస్ వర్డ్ చెప్పమని. సరే, దానికి రిజిస్టర్ చేసుకుని, అక్కడ వెళ్ళి వెతికితే కనిపించిన లంకెలు ఇవీ.

http://vishvavani.blogspot.com/
http://samskritapatrika.blogspot.com/
http://kalidasa.blogspot.com/
http://koham.wordpress.com/
http://vykharee.blogspot.com/
http://satyayugam.blogspot.com/
http://nimittam.blogspot.com/
http://vaak.wordpress.com/

కోలాచలం వారిని గూర్చి వెతకటానికి 2 కారణాలు. సంస్కృతంలో శ్లోకానికి అన్వయాలు రెండు విధాలుగా చెప్పవచ్చునట. 1. దండాన్వయము. 2. ఖండాన్వయం. ఖండాన్వయానికి "ఆకాంక్ష" అని మరొక పేరు. తెలుగులో చెప్పాలంటే "తీగ పట్టుకు లాగే పద్ధతి". ఈ రెండు పద్ధతులలో వ్యాఖ్యానం ఉన్న రఘువంశ కావ్యం ఈ మధ్య విశాలాంధ్ర లో దొరుకుతున్నది. ఆ పుస్తకం నుంచీ వె(మ)ళ్ళిన ఆలోచనలు అవి.

2 వ కారణం. నిన్న నేనూ మా ఆవిడ లేకపోవడంతో సొంతంగా చారు పెట్టాను. చివర్లో తెలుసుకున్నదేమంటే, అందులో ఉప్పు లేదని. (ఉప్పు ఇంట్లోనూ నిండుకున్నది. ఇది ఆ తర్వాత తెలిసిన మరో నిజం). ...

ఎవరైనా ఆ మల్లినాథ సూరి కథ విషయం తెలిస్తే చెప్పగలరా?

14 comments:

 1. మల్లినాథసూరి కథ వివరంగా నా బ్లాగులో ఇవాళ రాస్తాను.

  ReplyDelete
 2. http://nagamurali.wordpress.com/2009/06/29/%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5-%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF/

  ReplyDelete
 3. బాగుంది మీ కోతి కొమ్మచ్చి.. చారు నుంచి సంస్కృత బ్లాగులదాకా..!! మీ చారులో ఓ కర్వేపాకు విషయం - రెండో పేరాలో "భార్య కారణంగా మూఢుడైన ఓ గ్రామస్తుడు.." అని చదివాక మొదట అర్థం కాలేదు.. "మూఢుడైన ఓ గ్రామస్తుడు, భార్య కారణంగా.." అంటె బాగుండేదేమో..!!

  ReplyDelete
 4. సత్యప్రసాద్ గారు, నవ్వొచ్చింది, మీరు చెప్పిన తర్వాత. ఇప్పుడు మార్చాను.

  ReplyDelete
 5. మురళి గారు, ఆ సంస్కృత బ్లాగుల వైపు ఓ కన్నేశారనుకుంటాను.

  ReplyDelete
 6. అప్పుడప్పుడూ మీ శ్రీమతి గార్ని ఇలా ఊరికి పంపిస్తూ ఉండండి రవి గారూ, మీరు మంచి విషయాలు వెదికి పట్టుకుని మరీ మంచి పొస్టులు రాద్దురు మా కోసం!చాలా బాగుంది మీ పోస్టు. ఒకసారి నాగ మురళి గారి బ్లాగుకు కూడా వెళ్ళొస్తే సరి.

  ReplyDelete
 7. helo
  i am blogger indonesia klik here to my blog

  ReplyDelete
 8. రవి గారూ, సంస్కృత బ్లాగులను భలే కనిపెట్టేశారు. అభినందనలు.

  ReplyDelete
 9. సంస్కృత బ్లాగులన్నీ ఒక్కదగ్గర చూడ రావాలని ఒక అగ్రిగేటర్ తయారు చేసా.
  చూడండి ......

  http://sanskrit.teluguthesis.org/

  ReplyDelete
 10. చారు చారు సమాయుక్తం
  హింగు జీర సమన్వితమ్
  లవణ హీన న శోభంతే
  పాలాశ కుసుమం వృధా.
  మీ బ్లాగు విజ్ఞాన, వినోద దాయకంగా ఉంది. అభినందనలు. - చంద్ర

  ReplyDelete
 11. రవి గారూ,
  మొదట్లో మీ బ్లాగు పేరు చూసి అపార్థం చేసుకున్నాను చదవకుండానే. నేముతోనేమున్నది? అనుకొని ఆమూలాగ్రమూ చదువుతున్నా. అందుకోండి అభినందనలు.

  ReplyDelete
 12. @"ఎక్కడో, ఏదో వెతుకబోతే, మరేదో తగిలింది."@

  దీన్నే ఇంగ్లీష్ లో serendipity అంటారు.
  మీ టపా బాగుంది.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.