Thursday, June 18, 2009

నీ యబ్బ గంటు...

"అమ్మలూ, ఆవెక్కడ? ఆవు ఏది?" అమ్మమ్మ పాపను బుజ్జగిస్తూ, అన్నం తినిపించాలని చూస్తుంది.

"యా య్యా" (నాన్న దగ్గరికి వెళతాను)

"ఇదో, కాకి వచ్చె చూడు" నానమ్మ

"యా య్యా" (నాన్నా)

"పోవే పో..నీ యబ్బ గంటు.."

"నీ యబ్బ గంటు" ఈ పదం నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఇలాంటిదే "నీ పాసు గూల". ఈ ప్రయోగాలు మా ఇళ్ళల్లో సర్వసాధారణం. ఇవి తిట్లు గానో, దూషణలు గానో అనిపించలేదు. అయితే అర్థం మాత్రం ఖచ్చితంగా తెలియదు. బాల్యంలో ఓ సారెప్పుడో సంస్కృతం మాస్టారొకాయన వీటికి అర్థం చెప్పినట్టు గుర్తు. ఆ మాస్టారు విశ్వనాథ వారి శిష్యుడు. అగ్నిహోత్రావధాన్లు, పాషాణపాక ప్రభువూను. అయితే మంచి పాండిత్యం గలవాడాయన. మా మిత్రులలో ఒకతన్ని మేము "గురూ" అనే వాళ్ళం. మా మాస్టారు అది చూస్తే తిట్టేవాడు. "గురు" శబ్దాన్ని అలా ఎవరికి పడితే వారికి అన్వయించకూడదని.

"గంటు అంటే ముడి లేదా బంధం. ఇంకో అర్థం గాయం అని. ఇంకాస్త విశదంగా చెప్పాలంటే పేగు బంధం, పేగు ముడి. అబ్బ గంటు అంటే, అబ్బ తాలూకు పేగు ముడి, అంటే అబ్బకు అమ్మ. నానమ్మ.

నీ యబ్బ గంటు పోతుందా? అంటే, మీ నానమ్మ చచ్చిపోతుందా? అన్నట్టు అర్థం" ... ఇదీ ఆయన చెప్పిన అర్థం. ఆ వివరణ కరెక్టో, కాదో నాకు తెలియదు. కనుక్కుందామంటే, ఇది సామెత కూడా కాకపోయె. (సామెతల మీద పుస్తకాలున్నాయి కదా మనకు) ఆ వివరణ నిజమైతే, ఆ ప్రయోగం దూషణే కావాలి, తెలిసి ప్రయోగించినా, తెలియక ప్రయోగించినా.

"సంస్కృతం తెలుగు వాడి అబ్బ గంటు." - ఇది ఒక కవి చెప్పిన మాట. వివరాలు మర్చిపోయాను కానీ, చెప్పినాయన ఓ కవి అన్నది మాత్రం గుర్తుంది. ఇలాంటిదే మరో ప్రయోగం "పాసు గూల". ఇందాకటి మా మాస్టారు, దీన్నీ నిరశించాడు, అయితే ఆయన ఏ అర్థం చెప్పాడో గుర్తు లేదు.

సంస్కృతంలో ఓ శ్లోకం.

"యస్యాపి సర్వత్ర గతిః స కస్మాత్
స్వదేశ రాగేణ హ్రియాతి ఖేదమ్
తాతస్య కూపోయమితి బ్రువాణః
క్షారం జలం కే(కా)పురుషాః పిబన్తి"

ఎక్కడ జరుగుబాటవుతుందో అక్కడకు వెళదాం. మన దేశం, మన ఊరు అని పెట్టుకుంటే పనులు జరుగవు. మా నాన్న కట్టించిన బావి అని చెప్పి, ఉప్పు నీళ్ళు ఎవరు (పనికి రాని వాళ్ళు) తాగుతారు?

సంస్కృత తాత = తెలుగు నాన్న. (ఎంతయినా తెలుగు యూత్)

ఈ తాతస్య కూపానికి "అబ్బ గంటు" కు బాదరాయణ సంబంధం ఏదైనా ఉందేమో? అయితే ఇలాంటి సామెత తెలుగులో ఒకటుంది. చాలా మందికి తెలిసినదే. "మా తాతలు నేతులు తాగారు. మా మూతులు వాసన చూడండి."

5 comments:

 1. బాగున్నయండి ఈ కొత్త పదాలు. ఇలా ఒక్కొక్క ప్రదేశం లో కొన్ని కొన్ని మాటలు వాడుకలో ఉంటాయి. నేనొక సారి మా ఊర్ళొ విన్న మాట, "నీ బొడ్డు కింద ముల్లు ఏమన్నా పోయిందా" అని... నాకు భలే విచిత్రంగా అనిపించింది.

  ReplyDelete
 2. ravi, "gantu" ante "oka moota lo kattina samanu/valuables/vasthuvulu" ani meaning anukonta...(english lo equivalent word=bundle) kaada? - maruthi.

  ReplyDelete
 3. kondaru kannadigulu kooda ee sametha nu as it is ga use chestharu..english lo ayithey "whose father what bundle goes" antaru..kannada lo "yaaru appanu..." ani edo antaru..naku full ga theliyadu. - maruthi.

  ReplyDelete
 4. మారుతి,

  కన్నడంలో ఈ సామెత ఉంది.

  మూట కట్టడం అనేది బాగానే ఉంది. అయితే valuables మూట కట్టటం అనే సంప్రదాయం ఇది వరకు ఉందేమో?

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.