Saturday, June 13, 2009

ప్రయాణం లో పదనిసలు

"ఓ పెద్ద బాంబు పేలుతుంది. స్క్రీనంతా మంటలు. ఆ మంటల వెనుకగా ఓ నెమలి నడిచొస్తుంది. ఆ వెనుక ఓ చిన్న పిల్లాడు..... విలన్ హీరో మీద బాంబు వేస్తాడు. అయితే హీరో మధ్యలోనే ఆ బాంబును చేతితో పట్టుకుంటాడు. పట్టుకుని దాన్ని నలిపేస్తాడు..... హీరో ఊర్లోకి అడుగు పెడుతూనే మబ్బులు అలా విడిపోతాయి. వాటి మధ్యలోంచి సూర్యుడు వెలుగుతాడు. ....ఉగ్రనరం - ద మాన్ విత్ మసిల్స్ ..."

"మామూలుగా ఓ అమ్మాయిని లవ్ లో పడేయాలంటే ఓ రెండేళ్ళు ఆమె వెనక తిరగాలి. అందులో మొదటి మూడు నెలలు, ఆమె కళ్ళల్లో పడటం, రెండో ఫేస్ లో ఆమెతో మాటలు కలపటం, ఆమె అభిరుచులు కనుక్కోవటం....ఇలా ఎనిమిది. ఇదంతా రెండు గంటల్లో జరగాలంటే, నువ్వు మొదటి పదిహేను నిమిషాల్లో ఆమె కళ్ళలో పడాలి, రెండో పదిహేనులో ఆమెతో మాట్లాడాలి...."

మొదట పేరాలో లా కథలు రాసే యువకుడు, రెండో పేరాలో లా అంచనాలేసే సైకాలజీ స్టూడెంటు, ఇంకో ఎం బీ యే చదువుకుని, ప్రయాణాలు హాబీగా పెట్టుకుని తిరిగే ఓ కుర్రాడు మలేషియా విమానాశ్రయంలో కలుసుకుని, సింగపూరుకు వెళ్ళాలనుకుంటారు. ఇంతలో ఓ మెరుపు తీగ లాంటమ్మాయి, ఆ అమ్మాయికి తోడుగా ఓ బొండాం లాంటమ్మాయి ఇండియాకెళ్ళటానికి అదే విమానాశ్రయానికి వస్తారు. మెరుపు తీగకు పెళ్ళిచూపులు. అందుకే ఆ ప్రయాణం. ముగ్గురు కుర్రాళ్ళలో ఇద్దరికి మెరుపు తీగ నచ్చేసింది. ఎం బీ యే కుర్రాడయితేనేమో మరీనూ. ప్రయాణం మొదలయింది. గమ్యం చేరుకోటానికి, ఆ తర్వాత జీవితాంతం తనతో ప్రయాణానికి ఒప్పించటానికి, ఆ అబ్బాయికున్న సమయం కేవలం రెండు గంటలు. రెండు గంటల్లో అమ్మాయిని మెప్పించి, ఒప్పించి, కరిగించటానికి సాధ్యమవుతుందా?

"మేఘమా, ఆగాలమ్మా,
వానగా కరుగుటకు

రాగమా, ఆగాలమ్మా,
పాటగా ఎదుగుటకు"

ఈ ప్రయాణంలో మరికొన్ని పదనిసలు.

"నేనో దొంగను పట్టుకోవాలనుకుంటున్నాను. అతడు మా పాప ఐస్ క్రీం దొంగతనం చేశాడు." - డబ్ చేసిన ఆంగ్ల చిత్రాల్లో డవిలాగుల్లాగా ఓ నల్లనయ్య ఇంగ్లీష్ లో చెప్పే మాటలను తెలుగులో పలికింపజేస్తూ ఉంటాడు దర్శకుడు.

అ ప్రయాణంలో మరో తోడు ఓ రైతు. ఆ రైతుకు మన స్టోరీ టెల్లర్ మొదటి పేరాలోలా బాంబుల కథ వినిపిస్తుంటాడు. అది విని మలేషియా పోలీసులు అనుమానించటం, వారితో ఆ రైతు గొడవ, అదో హడావుడి.

ఆ రెండు గంటల్లో ఏమయింది? ఇవి ఏలేటి చంద్రశేఖర్ ప్రయాణం సినిమా విశేషాలు.

ఈ సినిమా చూడాలనుకుంటే ఒకట్రెండు సూచనలు.

1. మీరు మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఒంటరిగా కానీ, మీకు బాగా కావలసిన వారితో గానీ వెళ్ళండి.
2. సినిమాలో లాజిక్ లు వెతకటం అనవసరం. (టికెట్ లేకుండానే ఐర్ పోర్ట్ కు హీరో రావటం వగైరా)
3. ఇదో చాకోలేట్ సినిమా. లవ్ అట్ ఫస్ట్ సైటు వంటి వాటి మీద తీవ్రమైన (విరుద్ధ) అభిప్రాయాలు ఉన్నట్టయితే, ఈ సినిమా చూడ్డం అనవసరం.
4. గమ్యం సినిమాలోలా ఇందులో విలువలు, బోధలు అవీ లేవు.

ఇక ఈ సినిమా నచ్చితే (లేదా నచ్చాలంటే) ఇందువలన అయి ఉంటుందని నా అంచనా.

1. అందమైన హీరోయిన్. ఆమె చిరునవ్వు.
2. యూత్ ఫుల్ హీరో, అలానే హీరో ఫ్రెండ్స్.
3. చక్కటి సెటైర్స్ ("సూపర్ మాన్, స్పైడర్ మాన్ అయితే పర్లేదు కానీ టైగర్ మాన్ అయితే మాత్రం లాజిక్ వెతుకుతారు")
4. సరదాగా సాగే కథనం.

అలానే ఈ సినిమా నచ్చలేదంటే (నచ్చకపోవడానికి) కారణాలు.

1. లవ్ అట్ ఫస్ట్ సైట్, అమ్మాయిని రెండు గంటల్లో "పడగొట్టటం" అనే ఇన్ ఫక్చుయేషన్ లాంటి కాన్సెప్టు.
2. అక్కడక్కడా కాస్త సాగుతున్నట్టు అనిపించే కథనం.
3. పెద్దగా ఆకట్టుకోని పాట.
4. మరీ ట్విస్టులు లేకపోవటం.
5. విదేశీ విమానాశ్రయంలో, కాస్త నేటివిటీకి దూరంగా ఉన్న కథ.

అయితే ఇప్పుడు వస్తున్న దరిద్రాతి దరిద్రమైన సినిమాలను పోల్చుకుంటే, ఈ సినిమాకు కాస్త బెనిఫిట్ ఆఫ్ డవుట్ ఇచ్చి ఓ సారి చూడవచ్చు.

ఇక నటులు - మంచు మనోజ్ కుమార్ - బాగా నటించాడనలేము కానీ బావున్నాడు.
హీరోవిను - బావుంది. బానే నటించింది.
బ్రహ్మానందం - మాటలతో, సైగలతోనూ నవ్వించి ఆకట్టుకుంటాడు.
హీరో ఫ్రెండ్స్ గా చేసిన కుర్రాళ్ళు, హీరోయిను బొండాం ఫ్రెండు - టైమింగ్ తో చాలా బాగా చేశారు.

కెమెరా - బావుంది.
పాటలు - "మేఘమా..." అన్న బిట్ తప్ప మిగతా అంతా మామూలే. అయితే ఒక్కపాటే ఈ సినిమాలో. అదీ ఏనిమేషను. కాబట్టి ఓకే.

2 comments:

  1. టామ్ హ్యాక్స్ నటించిన టెర్మినల్ అన్న ఆంగ్ల సినిమా కథ అనుకున్నా, మీరు చెప్పి చాలా మంచి పని చేశారు, వీలైనంత త్వరగా చూసేస్తా...
    ఎలాంటి మూడ్ లో సినిమాకు వెళ్ళాలన్నది చాలా ముఖ్యం, ఇది చెప్పేవారు కరువయ్యారు.
    మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    ReplyDelete
  2. సినిమా చూశాను ...సినిమా కంటే మీ రివ్యూ బావుంది :) :)

    ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.