Friday, June 5, 2009

పిజ్జాతురాణాం....

పిజ్జా అన్న పదం వింటే నాకు తమిళంలో "పిచ్చె" అన్న పదం గుర్తుకొస్తుంది. "పిచ్చె" అంటే, భిక్ష, తిరిపెం అని మీనింగు. అసలు బ్రెడ్డంటేనే చిన్నప్పటి నుంచీ అదో రకమైన విరక్తి. ఎందుకంటే, చిన్నప్పుడు యే జ్వరమో వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళడం, ఆ డాక్టరు కాసేపు నాలుకా అదీ చూసేసి, తడి గుడ్డతో గొంతులు కోసే వాడిలాగా మౌనంగా సూదిలోకి మందు ఎక్కించటం, కస్సున దాన్ని పొడవటం, ఆ తర్వాత బాధకు ఉప్పు రాస్తున్నట్టుగా "బ్రెడ్డు", "హార్లిక్సూ" తిని చావమని సలహాయించటం...ఈ ఎపిసోడ్లు, దూరదర్శన్ లో సుత్తి వేలు కథల్లాగా అనేక సార్లు రిపీట్ అవడం వల్ల, బ్రెడ్డు మీద తీవ్రమైన విరక్తి పేరుకుపోయింది. ఈ పిజ్జా కూడా పులివేషం వేసుకున్న బ్రెడ్డు లాంటిదే కాబట్టి, బ్రెడ్డు మీద విరక్తి పిజ్జా అన్న డొమైను కు కూడా విస్తరించింది.

అయితే, బ్రెడ్డు చెల్లెలొకటుంది. దాని పేరు "బన్ను". ఈ బన్ను నాకో క్రష్షు. ఇది కూడా చిన్నప్పుడే మొదలయ్యింది. మా ఇంటికి ఓ ఫర్లాంగు దూరంలో ఓ కాకా హోటలొకటుండేది. ఆ "కాక చేట" టీ కలపడంలో నిష్ణాతుడు. టీ తో పాటు బన్నులూ, బిస్కట్లూ సీసాల్లో ఉంచేవాడు. ఆ టీ, బన్ను కాంబినేషను, అప్పట్లో చిరంజీవి, రాధ కాంబినేషన్ లా వెలిగిపోయేది. ఇళ్ళల్లో శుద్ధంగా పెట్టిన కాఫీ తాక్కుండా, బయట కాకా హోటల్లో టీలు, బన్నులు తాగటం పట్ల నిరసన తీవ్రంగా ఉన్నా, "కుచ్ పీనా హైతో కుచ్ ఖోనా హై" అనుకొని ఆ నిరసన లెక్క చేసే వాళ్ళం కాదు నేను మా మిత్రబృందమూ.

ఉద్యోగరీత్యా పూనాకి వెళ్ళిన మొదట్లో, బన్ను యొక్క పోలీమార్ఫిక్ ఫాం వడాపావ్ (వడాపాం అని ధ్వనించింది మొదటి సారి విన్నప్పుడు) పరిచయమయింది. వడాపావ్ అన్న టైటిల్ "పొడలపాము" లాగా వినిపించినా, త్వరగానే నాకు వడాపావ్ తో లవ్ అఫయిర్ మొదలయ్యింది. (అసలు మరాఠీ స్నేక్స్ పేర్లన్నీ అలానే ఉంటాయి. మిసళ్ పావ్ అనే స్నేక్ పేరు విన్నప్పుడు నాకు మిస్సయిలు గుర్తొచ్చింది) బాచిలర్ అన్న పదానికి ఓ అర్థం - స్నానానికి "లైఫ్ బాయ్" సబ్బు, గెడ్డం గోకడానికి "భారత్ బ్లేడు", అన్నానికి బదులు "వడాపావ్" వాడేవాడని ఓ అర్థం. బస్టాండుకు దగ్గర్లో "జోషీ వడే వాలే" అని ఒక వడల దుకాణం ఉండేది. వడాపావ్ లు హాట్ కేకుల్లా అమ్ముడయేవక్కడ. వాడి దగ్గర అలవాటయిన వడాపావ్ డ్రగ్ పూనా వదిలేంతవరకు నన్ను వదల్లేదు.

ఆ ఎపిసోడు తర్వాత బన్ను మరో రూపమూ పరిచయమయింది. ఓ సారి నేను, మా కజిన్స్ ఇద్దరం కలిసి కర్ణాటక టూరుకెళ్ళాము. జోగ్ ఫాల్స్,ఉడుపి, శృంగేరి, ఆగుంబె, కొల్లూరు వగైరా, జోగ్ ఫాల్స్ కెళ్ళాలంటే సాగర్ అనే చోటికి వెళ్ళాలి. ఆ సాగర్ అనేచోట టిఫిన్ చేద్దామని ఆగాము. బేరర్ ని పిలిచి ఏమున్నాయని అడిగితే, కన్వెన్షనల్ ఇడ్లీ వగైరాలతో, ఆ సర్వరు చెప్పిన మరో పేరు "బన్స్" - మంగళూరు బన్స్. బాండ్ - జేమ్స్ బాండ్ అన్నట్టుగా చెప్పాడా సర్వరు. అచ్చ తెనుగులో ఆ బన్స్ ను "అరటి పండు లంబా లంబా" అని పిలవచ్చు. ఎందుకంటే మంగళూరు బన్స్ ను అరటి పండు,మైదా పిండి కలిపి చేస్తారుట. చాలా బావుందది. బెంగళూరులో ఈ మధ్య బస్టాండ్ దగ్గర "ప్రియదర్శని" (రామకృష్ణ) అన్న హోటల్లో ఈ మధ్య ఇంట్రొడ్యూస్ చేశారు దీన్ని.

బన్ను, దాని రూపాంతరాల మీద లైకింగు ఉంది కాబట్టి పిజ్జానూ అప్పుడప్పుడూ క్షమించేయాలనిపిస్తుంటుంది. మా కఛేరీ (ఆఫీసు) కు ఏ గెస్టు వెధవ దాపురించినా బలయ్యేది పిజ్జాకే. అలానే ఏవైనా మీటింగులవీ ఉన్నప్పుడూ, చీకటి పడేంతవరకు ఆఫీసులో దొబ్బించుకున్నప్పుడు, "పిజ్జాలో రామచంద్రా" అని అంగలార్చాల్సిందే మేము. కాబట్టి పిజ్జా పీడ మాకు అప్పుడప్పుడూ తప్పదు. నేను "వెగ"టేరియ్యన్ని కాబట్టి, పిజ్జాలంటే, దానిపైన చీజు, టమోటాలు, కాప్సికమ్మూ ఇలాంటివే తెలుసు నాకు. ఈ కాప్సికం అంటే నాకు మొదట్లో తెలిసేది కాదు. మా కన్నడ కజిన్ ను అడిగితే, తను స్పష్టమైన కన్నడలో "దొణ్మిణసిణ కాయి" అని చెప్పేడు దాని టైటిల్ ను. అప్పుడర్థమయ్యింది. ఓ సారి ఇంటికి తీసుకొస్తే మా నాన్న దాని ఖరీదెంతని అడిగేడు. చెప్పాన్నేను. "పగలు దోపిడీ" అన్నాడాయన. బ్రెడ్డు ముక్క కాస్త రోస్ట్ చేసి, పైన కాస్త వెన్న, టమేటా ముక్కలు వేసినందుకు ఇంత రేటా? ఏమోరా, ఏం పీడనో ఏమో ఇది అన్నాడు. నాకూ అలానే అనిపిస్తుంది, పిజ్జా కోసం ఎగబడే మా ఫ్రెండ్స్ ని చూసి.

"పిజ్జాతురాణాం న ధనం న జిహ్వా".

ఓ రెండు పిజ్జాలు తినడం కన్నా, కాస్త పెరుగన్నం తింటే మనసుకు నెమ్మది. అలా ట్యూన్ అయిపోయింది నా మనసు.

మొదటి సారి బెంగళూరు ఇస్కాన్ కు వెళ్ళినప్పుడు ఓ ఘాతుకం చూశాను. అసలా ఇస్కాను నాకు గుడిలా అనిపించదు. ఫైవ్ స్టార్ వర్షిప్ సెంటర్ లా ఉంటుందది. అక్కడ స్వామి వారి ప్రసాదాల లిస్టులో పిజ్జాను పెట్టారు. అలా దాన్ని "సర్వాంతర్యామి" ని కూడా చేశేసారు అప్రాచ్యులు. (అప్రాచ్యులు - నిందాపూర్వకం కాదు)

భవిష్యత్తులో మా పాప ఇడ్లీ బదులు కార్న్ ఫ్లేక్స్, భోజనం బదులు పిజ్జా అడుగుతున్నట్టు భయంకరమైన కల వచ్చింది నిన్న నాకు.ఏదైనా శాంతి చేయించాలి. తప్పదు.

26 comments:

 1. :))
  బాగుంది మీ పిజ్జా పురాణం.

  ReplyDelete
 2. పిజ్జాలపై నాకు కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. మా ఇంట్లో అందరూ తింటున్నా నేను తినకుండా నిరసన (నిరశన అని కూడా అనుకోవచ్చు) పాటించేవాడిని. పిజ్జా హట్ లో తిన్న తరువాత ఆ అభిప్రాయం కొంత మారింది. అక్కడ తప్ప మరెక్కడా పిజ్జా బాగుండదు నాకు.

  ఇటాలియన్ భాషలో ద్విరుక్తమైన z, 'dz' (డ్జ) గా పలుకుతుంది. Pizza ను పీడ్జా అనాలన్న మాట. ఐతే నేనిలా పలికితే షాపు వాళ్ళు నన్నో వింత జీవిలా చూడసాగారు. దాంతో నేనే తగ్గి ఇప్పుడు 'పిజ్జా/ పీజా' అనడం మొదలు పెట్టాను.

  ReplyDelete
 3. > అసలా ఇస్కాను నాకు గుడిలా అనిపించదు. ఫైవ్ స్టార్ వర్షిప్ సెంటర్ లా ఉంటుందది
  so true...

  ReplyDelete
 4. చంద్ర మోహన్ గారూ - పిడ్జా, పిడ్రాళ్ల కాదు మాష్టారూ. pizza, z in italian is pronounced as ts, so its pitsa a kinda.
  ఈ కింద నొక్కండి పీజ్జా పురాణం కోసం.
  http://nalabhima.blogspot.com/2008/12/blog-post_03.html

  ReplyDelete
 5. I love Pizza!

  గుండ్రంగా పెరుగుతున్న పొట్టని తగ్గించడం కోసం ఈ మధ్య పిజ్జాలకు దూరంగా ఉంటున్నా.

  ReplyDelete
 6. బాగుంది బాసు.

  ReplyDelete
 7. మా ఇంట్లో అంతా పిజ్జా ప్రియులమే. అవును. అన్నింటికంటే పిజ్జా హట్ వే రుచిగా వుంటాయి. శ్రీ లాగా పిజ్జాలు నేనూ తగ్గిస్తున్నా.

  ReplyDelete
 8. బాగుంది మీ పిజ్జా పురాణం.
  "బెంగళూరు ఇస్కాన్ కు వెళ్ళినప్పుడు ఓ ఘాతుకం చూశాను. అసలా ఇస్కాను నాకు గుడిలా అనిపించదు. ఫైవ్ స్టార్ వర్షిప్ సెంటర్ లా ఉంటుందది. అక్కడ స్వామి వారి ప్రసాదాల లిస్టులో పిజ్జాను పెట్టారు."
  ఏం చేస్తాం మనం కూడా అలానే తయారయ్యాం కదా! పలానా ఆహారాన్నే తినమంటే తినం కదా మనకసలే జిహ్వా చాపల్యమెక్కువ నానాకవీ తింటున్నాం, రోగాలు తెచ్చుకుంటున్నాం. సరే మీరెలా చెప్పినమాటవినరు.మీ బాటలోనే పోతూ మీకు(భక్తునికి) ఇబ్బంది కలిగించకుండా అన్ని రకాల పదార్థాలను కృష్ణునికి నైవేద్యంగా సమర్పించి వాటినే మనకందిస్తున్నారు.కృష్ణునికి నైవేద్యంగా సమర్పించినది ఏదైనా అది పవిత్రమే కదా ! అందుకే ఏ ఆహారాన్నైనా తినేముందు "బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః" మరియు "అహం వైశ్వానరో" అనే శ్లోకాలను అనుసంధానించుకుంటే ఆ తినే ఆహారం కృష్ణుని ప్రసాదంగా మారుతుందని చెబుతారు.కృష్ణుని ప్రసాదం భక్తునికి మేలే చేస్తుంది.

  ReplyDelete
 9. "భవిష్యత్తులో ఇడ్లీ బదులు కార్న్ ఫ్లేక్స్ అని పీడకల వచ్చిందా"..నాకు షాక్..మీరు నేను వేర్వేరే ప్రపంచాల్లో ఉన్నామేమోనని.

  Isn't that the REALITY already for the past 10-15 years even in AP, at least in Hyd?

  ReplyDelete
 10. వడాపావ్ అన్న టైటిల్ "పొడలపాము" లాగా వినిపించినా,...:)!

  అబ్బ, ఆ వడాపావ్ ఎలా తింటారో నాకిప్పటికీ అర్థం కాదండీ! పావ్ బ్రెడ్ లో వడ ఏమిటి నా శ్రాద్ధం!

  మంచి మంచి పీజా షాపులు(రెస్టారెంట్లనాలా కొంపదీసి)వచ్చాక ఇప్పుడు బాగానే ఉంటున్నాయి పిజ్జాలు. డామినోస్,పిజ్జా హట్, పిజ్జా కార్నర్ లు ఓకే! డల్లాస్ స్పెషల్ cici ఇక్కడ కూడా తెరిస్తే బాగుండు.

  అయినా ఇస్కాన్ కెఫెటేరియాలోని పదార్థాలన్నింటినీ మీరు ప్రసాదాల్లో చేరిస్తే ఎల్లా రవి గారూ? (అక్కడ ఏది తిన్నా ప్రసాదమేనని వాళ్ళు చెప్తారనుకోండి)

  ReplyDelete
 11. హ హ్హ.. పురాణం సంపూర్ణంగా వర్ణించారు ..అభినందనలు
  కార్న్ ఫ్లేక్స్ ఇప్పుడు కామన్ అయ్యింది బ్రేక్ ఫాస్ట్ గా. అక్షరధాం లో కూడా ఇదే తంతు..

  ReplyDelete
 12. This comment has been removed by the author.

  ReplyDelete
 13. సుజాత గారు వాడా పావ్ ల గురుంది నేను కుడా ఇదే అనుకున్నా..కాని కొన్ని రోజులకి అలవాట్లు మారిపోయి కామన్ అయ్యింది

  ReplyDelete
 14. మీకింకా పీడకలే వచ్చింది. మా అమ్మాయిని వారానికొకసారైనా పిజ్జా హట్ కి తీసుకెళ్ళాల్సిందే.
  నాకైతే చిన్నప్పుడు తిన్న తపాలా రొట్టె (దీనికి ఇంకేమైనా పేరుందా? బెంగుళూరులో దొరికే అక్కి రోటి?)పిజ్జా కంటే బాగుంటుంది.

  ఇస్కాన్ లో వాళ్ళు ఉచితంగా ఇచ్చేదే ప్రసాదం. మిగతాదంతా వ్యాపారం.

  ReplyDelete
 15. @bonagiri
  iskon లో ప్రసాదం తప్ప మిగిలింది వ్యాపారమంటున్నారు వ్యాపారంద్వారా వచ్చినా,విరాళాల ద్వారా వచ్చినా అక్కడ ప్రతి పైసా సద్వినియోగమవుతోందనే విషయం మీకు తెలుసా.పాఠశాల విధ్యార్థులకు వాళ్ళు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన "అక్షయ" కార్యక్రమం గురించి మీరు విన్నారా?http://www.zeenews.com/news421985.html

  http://www.akshayapatra.org/operations.html

  ReplyDelete
 16. :)

  నన్నడిగితే మన దిబ్బరొట్టె ముందు ఈ పిజ్జా ఎందుకు పనికొస్తుంది?

  ReplyDelete
 17. విజయమోహన్ గారు,
  నా ఉద్దేశం అది కాదు. గుడిలో ప్రసాదం ఇచ్చినా, అమ్మినా బానే ఉంటుంది. కాని ఏకంగా రెస్టారెంటు లాగ అన్నీ అమ్మడం కృతకంగా ఉంది.
  ఇకపోతే అక్షయపాత్ర గురించి విన్నాను. అది చాలా మంచి విషయమే.

  ReplyDelete
 18. వ్యాఖ్యాతలకు ధనవాదాలు.

  @KumarN గారు :కార్న్ ఫ్లేక్స్ అల్రెడీ ఉన్నాయి. అయితే మా పాపాయికి ఆ అలవాటు అవుతుందేమో అన్న అనుమానం నాది.

  @చిలమకూరు విజయమోహన్ గారు : మీకు నూరేళ్ళాయుష్షండి. "అహం వైశ్వానరో భూత్వా ..", "బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః.." సరిగ్గా ఈ రెండే గుర్తొచ్చాయి ఈ టపా రాస్తున్నప్పుడు, రాయలేదు అంతే.

  @సుజాత గారు : ఇస్కాన్ లో ఆ రెస్టరెంట్ పేరే కృష్ణప్రసాదం.

  ReplyDelete
 19. భాస్కర రామరాజు గారూ,

  Pizza గురించి మీ పోస్టులో చాలా వివరాలున్నాయి. ధన్యవాదాలు. z ను ఇటాలియన్లో 'త్స' గా పలుకుతారన్నది నిజమే. ద్విరుక్తమైన z (zz) ను పలికినప్పుడు, త - డ ధ్వనితోనూ, స ను కొంత జ(౨ వ జ) ధ్వనితోనూ పలుకుతారు. 'డ్స-డ్జ' లకు మధ్యస్తంగా ఉండే ధ్వనితో.

  ReplyDelete
 20. అసలు నేనైతే ఒకప్పుడు ఈ బ్రెడ్ వ్యతిరేక సంఘానికి అధ్యక్షుడిని. కానీ ఇక్కడకి(స్వీడన్) వచ్చాక మొదట్లో హాస్టల్ లో వుండాల్సి వచ్చి బ్రెడ్ తినాల్సి వచ్చింది. అప్పుడు చూడాలి నా బాధలు. ముందు అయితే అసలు 2 రోజులు ఏమి తినలేదు కూడా(అంటే పళ్ళు కామన్ అనుకోండి ). కానీ ఏమి చేస్తాం తరువాత తప్పలేదు.

  కానీ నాకు ఎందుకో తెలియదు పిజ్జా అన్నా, బన్ను జేనేటికల్లీ ట్రీటెడ్ ఫాం అదేనండి బర్గర్ అన్నా మనకి సూపర్ ఇష్టం.

  ReplyDelete
 21. చంద్రమోహన్ గారు, పిజ్జా ని మనము 'పిడ్స’ ; ’పిడస ' అనుకుందాం మన పదంలాగా బాగుంటుంది. :)

  ReplyDelete
 22. చంద్రమోహన్, భాస్కర్ రామరాజు గార్లు : మీరు చెప్పిన "డ్జ", "త్స" లల్లాగా, జపాను భాషలో "త్సు" అన్న అక్షరం ఉంది. అదో అక్షరం జపాను వాళ్ళకు.

  ReplyDelete
 23. అవి మన తెలుగులో ఉన్న అక్షరాలే అయ్యుండొచ్చు. మనకీ త్స లాగా పలికే చకారం ఉంది. అలాగే ద్స ల్లాగా పలికే జకారం ఉంది. చకార, జకారాల మీద రెండంకె (౨) వేయడం ద్వారా వాటిని సూచిస్తారు.

  ReplyDelete
 24. తాడేపల్లి గారు,

  ఆసక్తికరమైన కొత్త విషయం చెప్పారు. నిజమేనేమో. జపాను భాషలో మన భారత పదాలు కొన్ని(అవి కూడా మతసంబంధమైనవి) ఉన్నాయి. "సేవ" లాంటివి. వాళ్ళను ప్రభావితం చేసిన బోధి ధర్ముడు ఎలానూ మన దక్షిణ భారతపు వ్యక్తే.

  ReplyDelete
 25. Ravi
  Soooooparu.. I rememberd our tour to western ghats of karnataka and Buns.. btw do u remember "punarpuli" there :D

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.