Wednesday, May 27, 2009

చెట్టు - మనిషి - దేవుడు


ఓ రావి చెట్టు (అశ్వత్థ వృక్షం). కాస్త ఎడంగా ఓ వేపచెట్టు. అదే సరళ రేఖలో మరింత ఎడంగా ఓ బిల్వ (మారేడు)చెట్టు. మా ఇంటి ముందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లా. ఓ గుడి ఆవరణలో ఉండే వాళ్ళం చిన్నప్పుడు.

ఇంకో పక్క బాదామి చెట్టు. కాస్త దూరంలో బంకీరు కాయల చెట్టు. భక్తులు ప్రదక్షిణం చేసే దారిలో కాస్త మూల ఒద్దికగా ఓ ఉసిరి చెట్టు మొలిచింది కొన్నళ్ళకు. ఈ ఉసిరి చెట్టు కాయలు చిన్నవి, కాస్త వగరు తక్కువగా ఉన్నవీను. గింజ కూడా పెద్ద ఉసిరి కాయల్లా కాక చిన్నగా ఉండేవి. ఉసిరి చెట్టు ఐదు దేవతా వృక్షాల్లో ఒకటి అని మా తాతయ్య చెప్పేవారు. మిగిలిన నాలుగు కూడా చెప్పారు కానీ గుర్తులేవు.

ఆ ఆవరణలోనే వెనుక వైపు బ్రహ్మాండమైన వేపచెట్టు, దానికి పక్కనే ఓ కాగితంపూలచెట్టు. భాగవతంలో కృష్ణుని కథలో, చిన్ని కృష్ణుని యశోదమ్మ ఓ మద్దెలకు కట్టేసి వదిలేస్తే, ఆయన రెండు మద్ది చెట్ల గుండా వెళ్ళి, రెంటినీ పడగొట్టి గంధర్వులకు శాపవిమోచనం కలిగించాడని చదువుకున్నాం కదా. అదుగో, అప్పుడు ఆ మద్దిచెట్ల మధ్య ఎంత ఎడం ఉండి ఉండేదో, సరిగ్గా అంతే ఎడం వేప చెట్టు, కాగితం పూల చెట్టు మధ్యానూ.శాపగ్రస్తులైన గంధర్వుల్లా ఆకుల మధ్యలోనుంచీ సంగీతం వినిపిస్తూ, ఓ తేలికపాటి సువాసన వెదజల్లుతూ, అద్భుతంగా, ఆకాశాన్ని తాకుతూ ఉండేవి అవి. వాటి నీడన ఆవులు, పొద్దస్తమానం ఏదో నముల్తూ.

(ఆ ఆవులు ఎందుకమ్మా, పొద్దస్తమానం ఏదో నముల్తుంటాయి? - నేను.
ఏమో తెలీదమ్మా - అమ్మ)

వాటి నీడన గుడి పూజారి, సత్యనారాయణ శాస్త్రి అలియాస్ సత్యమయ్య. ఆయనలో ఓ గొప్పకళాకారుడుండేవాడు. మధ్యాహ్నం పూట భోజనం ముగించి, నులక మంచం మీద పడుకున్న తర్వాత ఆయన లోని కళాకారుడు గొంతు విప్పేవాడు, "భక్త యోగ పదన్యాసి, వారణాసి..పావన క్షేత్రముల రా...శి" "రా" కు "శి" కు మధ్య ఓ అల లాంటి గమకం పెట్టి పాడుకుంటుండే వాడు, అర్ధనిమీలిత నేత్రాలతో.

ఇంకాస్త వెనుక సీమ చింతకాయల చెట్టొకటి.

ఇంకా జమ్మిచెట్టు, మరో బిల్వపత్రి, వరుసగా పూల చెట్లు, నాగుల కట్ట ఓ వేపచెట్టుకింద నీడలో...

మొట్టమొదట కనుమరుగయినది, వెనకున్న సీమ చింతకాయల చెట్టు. నరికేశారు దాన్ని. రోజు ఆ సీమ చింతకాయలకోసం ఆ చెట్టును రాళ్ళతో కొట్టేవాళ్ళు పిల్లలు. బహుశా నవ్వుకొనేదేమో ఆ చెట్టు. ఆ చెట్టు పడిపోయిన రోజు, దాని కాయలు కింద చిందరవందరగా పడ్డాయి. అన్ని కాయలు కళ్ళ ముందు కనబడ్డా, చిత్రంగా ఆ కాయలు ఏరుకోడానికి పిల్లలకు సంకోచం, రేపట్నించీ ఈ చెట్టు లేదుగా అనేమో. చెట్టు ఏమనుకుందో ఏమో? రాళ్ళదెబ్బలకంటే పెద్ద దెబ్బ తగిలినందుకు నవ్వుకుందో, పిల్లలు కాయలు తీసుకోనందుకు నొచ్చుకుందో?

కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు కాగితం పూలచెట్టుకు ఎసరు పెట్టారు. దానికి ఓ కథ అల్లారు. కాగితం పూల చెట్టు, వేప చెట్టు, ఒకదాని పక్కన మరొకటి ఉంటే అరిష్టం అట. అలా అని రాసుందట. ఆ చెప్పినాయన పెద్దాయన. పూజ్యుడు, ఎన్నో శాస్త్రాలు చదువుకున్నవాడూనట. ఇక చేసేదేముంది. శాపగ్రస్తుడైన గంధర్వుడికి శాపవిమోచనం జరుగలేదు. జనాలు దాన్ని శాపంతోనూ ఉండనివ్వలేదు. చచ్చిపోయిందది. ఈ చెట్టూ నవ్వుకుని ఉంటుంది, మనుషుల మూర్ఖత్వం చూసి. దీని చెలికత్తె, వేప చెట్టు మాత్రం మనసులో కుమిలిపోయి ఉంటుంది.

మరి కొన్నాళ్ళు గడిచింది. ఎవరో పుణ్యాత్ములు నాటిన విత్తుతో ఓ పక్కగా చెట్టు మొలిచింది. అసలది యే చెట్టో మాకు తెలియదు. మా ఇంటికి దగ్గరలో ఉండటంతో, మా అమ్మ నీళ్ళు పోసేది దానికి. అలా మా కళ్ళ ముందు పెరిగింది. ఆ చెట్టుతో రాధామాధవం పూలతీగ నేస్తం కట్టింది. ఎంచక్కా, ఆ చెట్టుకు కమ్ముకుని, నమ్ముకుని, అల్లుకుపోయింది. పెద్దగయిన తర్వాత ఆ చెట్టుకు కాయలు కాసాయి. అప్పుడు తెలిసింది అది ఉసిరి చెట్టని. మా అమ్మ కళ్ళలో తెలియని సంతోషం. పసిబిడ్డ మొట్టమొదటి సారి "అమ్మా" అని అని పలిచినప్పుడు ఎలాంటి సంతోషమో అలాంటిది. ఆ చెట్టు వద్దకు అప్పుడప్పుడూ, వనభోజనాలని జనం వచ్చేవారు. ఉసిరి చెట్టు కింద మొదల కుంకుమ పెట్టి పూజించి, మొక్కుకుని, ఆ తర్వాత కుటుంబంతో సహా భోంచేసి ఇళ్ళకెళ్ళేవారు. మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఆ ఉసిరి కాయలు, పక్కన బాదం కాయలు గర్వంగా కోసుకొని తెచ్చిచ్చేవాళ్ళం.

దేవాలయం ఆవరణ సుమారుగా పెద్దదే. నిజానికి అందులో మూడు చిన్న చిన్న మందిరాలు, లింగాష్టకం, నవగ్రహ స్తోత్రం వగైరా రాతి ఫలకలపై రాతలు, నవగ్రహాలు. ఓ రోజు భక్తులకో ఆలోచన వచ్చింది. ఇందరు దేవుళ్ళున్నారు, కానీ "మన" దేవుడు లేడు. ఆ దేవుడి కోసమూ గుడి కట్టాలి. అందుకు చందాలు పోగయ్యాయ్. కొత్త గుడి వస్తే, ఆదాయం బావుంటుంది, కాబట్టి అందరూ సంతోషించారు. గుడికి కావలసిన స్థలం సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి, ఓ గొప్ప ఎమ్మెల్ల్యే ( అప్పటి మంత్రి, ఇప్పుడూ ఉన్నాడు. రాజశేఖరుడి ద్వారా మంత్రి పదవి దక్కించుకోలేకపోయిన ఇద్దరు ప్రముఖులలో ఒకడు) .

వారగా ఉన్న పూల మొక్కలు తెగ్గోట్టేరు. ఆ పూలతో రోజూ పూజ చేయించుకునే దేవుడు ఇప్పుడు పూలు కొనుక్కుని పూజలు చేయించుకుంటాడు. గుడి కట్టటం మొదలయింది. దాదాపు పూర్తి కావచ్చింది. గుడికి మెట్లు పెట్టాలి. ఉసిరి చెట్టు ఆ మెట్లకు అడ్డమయింది కాస్త. దాన్ని కూల్చేయాలని తీర్మానించారు. ఓ భక్తుడు మరుసటి రోజు ఓ మచ్చు కత్తి తీసుకొచ్చాడు. మా అమ్మ అడ్డుపడింది. "అయ్యా, ఉప్పు తిన్న ఇంటికి ద్రోహం చేస్తారా? చెయ్యం కదా. ఈ ఉసిరి చెట్టు ఉప్పు కూడా మనం తిన్నాం కదా. పచ్చని చెట్టుకెందుకయ్యా ఎసరు పెడతారు" అంది. దేవుడికి గుడి కడుతున్నామమ్మా, చెట్టు అడ్డమొస్తుంది అన్నాడతను. నిజానికి చెట్టు వారగనే ఉంది. మెట్లకు పక్కగా. మా అమ్మా అదే అంది. కుదరదన్నాడతను. మేము చందాలేసుకున్నాం, దైవ కార్యం, పైగా దేవాలయం కమిటీ ఒప్పుకుంది, మధ్యలో మీరెవరు అని వాదులాటకు దిగాడు. "ఏం చెబుతుంది? ఆ చెట్టు మేం నాటలేదు. నీళ్ళు పోశామంతే" అని చెప్పాలి. అదీ చెప్పలేదు మా అమ్మ. ఆ చెట్టూ నరికేశారు.

నరికిన తర్వాత మొదలయింది మరో కథ. ఉసిరి దేవతా వృక్షం, కూల్చరాదు. అని ఒకాయన చెప్పాడు (ఇందాక కాగితం పూల విషయంలో శాస్త్రాలు చదువుకునొచ్చి వివరాలు చెప్పినాయన). సరే, పరిహారం కోసం పూజలు చేశారు. విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. కాని దేవుడు ఖచ్చితంగా వెళ్ళిపోయుంటాడు అక్కడ నుంచీ.

ఇప్పుడు మా అమ్మా, అక్కడ చెట్లలో కొన్ని వదిల్సి మిగినవన్నీ, భూమ్మీద లేరు.

చెట్టు కూలిస్తే వాతావరణం సంగతి ఏమవుతుందో కానీ, ఆ చెట్టు పక్కన కాయల కోసం వచ్చే పిల్లలు, ఆ చల్ల గాలి, గాలి వాలున పడుకున్న గోమాత, గాలిలో తేలాడే పరిమళం, వీటన్నిటికి వెనకాల దాగిన ఓ సున్నితత్వం, ఆ సున్నితత్వం తాలుకు మనిషి అస్తిత్వానికి నిర్వచనం, ఇవేవి ఉండవు.

చెట్టు దైవం.
ఆ చెట్టుకు అనవసరంగా హాని తలపెట్టే మనిషి రాక్షసుడు.
దాన్ని మౌనంగా చూసే దేవుడు నిమిత్తమాత్రుడు!

15 comments:

 1. నేనుకూడా ఇప్పుడే బెంగళూరులో చెట్లగురించి ఓ టపా వ్రాశాను కాని మీరు చాలా బాగా వ్రాశారు, మనసుకి హత్తుకునేలా :-)

  ~సూర్యుడు :-)

  ReplyDelete
 2. చాలా బాగా రాశారు.

  ReplyDelete
 3. ప్రతిపల్లెలో ఇదే సీను దాదాపు. చాలా బాగా రాశారు.
  గుడికి కావాల్సిన స్థలం మాజీ మంత్రిగారిచ్చారా ! హాశ్చర్యమే !

  ReplyDelete
 4. లీలామోహనం గారు : స్థలం మంత్రి ఇస్తాడా..హన్నా. గుళ్ళోనే కాస్త పక్కగా మిగిలిన స్థలానికి శంకుస్థాపన చేశాడు. ఆ మంత్రి గారు మీ వూరాయనేనండి. మీకు ఈ పాటికే అర్థమయి ఉంటుంది.

  ReplyDelete
 5. చాలా సంతోషంగా చదవడం మొదలుపెట్టాను.. చివరికి వచ్చేసారి బాధ పెట్టేశారు.. నిజాలు చేదుగానే ఉంటాయి కదా...

  ReplyDelete
 6. తెలుసుకాబట్టే హాశ్చ్యర్యం ప్రకటించింది

  ReplyDelete
 7. It's true. We have seen so many trees around us. Now, even in villages, trees are giving way to new constructions. So sad. Children of this age are missing all these divine experiences. They do not even know names of these trees.

  ReplyDelete
 8. చాలా బాగా వ్రాశారు...

  ReplyDelete
 9. మా తాతగారి ఊరు గుర్తుకు తెచ్చారు. నేను పుట్టి పెరిగింది నగరంలోనైనా సెలవలకి ఆ పల్లెటూరు వెళ్ళేవాళ్ళం. కాబట్టే చెట్టు విలువ నాకు తెలిసింది. అక్కడ ఇంటి చుట్టూ పెద్ద పెరడు. చిన్న సైజు తోటే! కొబ్బరి, జామ, మావిడి, చింత, ఉసిరి, నారింజ ఇలా రకరకాల చెట్లు. బోలెడన్ని పూల మొక్కలు, ఇంకా ఆయుర్వేద మందులకి కావలసిన మొక్కలు కూడా ఉండేవి. మా తాతగారు చనిపోయే వరకూ కూడా (ఎనభై పైబడి) పూర్తి ఆరోగ్యంతో ఉన్నారంటే అందులో ఆ చెట్ల పాత్ర ఎంతగా ఉండేదో నేను ఊహించగలను.
  ఇప్పటికీ ఆ ఇల్లూ, ఆ చెట్లూ ఉన్నాయి. కాని నేను ఏడాదికొక్కసారైనా వెళ్ళలేకపోతున్నాను :-( వెళ్ళినా ఒక్క రోజైనా ఉండలేకపోతున్నాను :-(

  ప్రస్తుతం డబ్బే దైవం!

  ReplyDelete
 10. చాలా ఆహ్లాదం గా చదవడం మొదలు పెట్టాను.భారమయిన మనసుతో ముగించాను.చెట్లకి నా బాల్యానికి చాలా చాలా అవినాభావ సంబంధం వుంది.అవన్నీ గుర్తొచ్చాయి.

  ReplyDelete
 11. చాల బాగా వ్రాసారు.
  నా "ప్రకృతి ఘోష" టపాలో వ్రాసుకున్న పద్యము..

  కం. కటకటపడ నా హృదయము
  విటపములు నరికిరి మీరు, వేదన భరితై
  బొటబొట యేడ్చిన నన్నున్
  తటపట సేయక చరించు తనయల్ మీరల్!!

  ReplyDelete
 12. వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు. జిగురు సత్యనారాయణ గారు, మీ పద్యం చాలా బావుంది.

  ReplyDelete
 13. చెట్టు నా ఆదర్శం!
  చాలా బాగా రాశారు.

  ReplyDelete
 14. Ravi sooper,
  u took me to the olden days of ur home, where i use to visit on summers and really today i rememebered ur mom a lot

  Thanks for the nice a pleasent blog, it was as pleasent as a breez from a neem tree on a spring morning.
  even in my native around the ganesh temple there were 4 such huge trees and they were also been uprooted in the name of Vastu shastra

  ReplyDelete
 15. చాలా రోజుల తరువాత చదివాను. ఎలా మిస్సయ్యనబ్బా! చాలా బాగుంది.తాకింది.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.