Tuesday, May 19, 2009

ఇదే నా మొదటి ప్రేమలేఖ......

ఓ చింకి చేప, తల మాసిన దిండొకటి, దుప్పటి. ఆ పక్కనే చిందరవందరగా పుస్తకాలు. ఆ పుస్తకాల మధ్య నిరాశగా చూస్తున్న కృష్ణమూర్తి, కౄరంగా చూస్తున్న ఓషో, నవ్వుతున్న చలం, పేపర్లు చినిగిపోతున్న చందమామలు, అల్మారా వెతికి తీసిన కొన్ని పాత పుస్తకాలు... మరో పక్క, అలాంటి బలిచక్రవర్తులు నాకో లెక్కా అంటూ వామనావతారం లాంటి చిన్న ఝండూ బాం సీసా.

ఝండూ బాం కాస్త తలకు పట్టించాను. కాసేపటికి బాగా నిద్ర పట్టింది.

"ప్రియతమా! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. "దర్శనే స్పర్శనే వాపి స్మరణే భాషణేపి వా యత్ర ద్రవత్యంతరంగం స స్నేహ ఇతి కథ్యతే" అని మన సంస్కృతం అయ్యవారు చెప్పినది మన గురించేనేమో. నిన్న తెలుగు టీచరు, "భర్తృహరి సుభాషితాలు తెలుగులో అనువాదం చేసినది ఎవరు?" అని అడిగినప్పుడు, ఏనుగు లక్ష్మణ కవి అని చెప్పడానికి బదులు ఏడిద నాగేశ్వర్రావు అని చెప్పినది ఎందుకోసమో తెలుసా? నేను తప్పు చెప్పిన తర్వాత టీచరు నిన్ను అడుగుతుంది. అప్పుడు నువ్వు సరిగ్గా సమాధానం చెబితే, నీతో నాకు ముక్కు చెంపలు వేయిస్తుంది. అలాగైనా నువ్వు నన్ను తాకే చాన్సు దొరుకుతుంది కదా. అదుగో, అందుకే. అయితే, టీచర్ నన్ను అడిగిన వెంటనే బెల్లు కొట్టటంతో నా ఆశ ఫలించలేదు. స్కూలు కొన్ని నెలల్లో ముగిసిపోతుందంటేనే ఏదోలా ఉంది.

రాసేప్పుడు గుండె లబ్ డబ్ అని కాక ధన్ ధన్ మని కొట్టుకుంది.

రాయడం ముగించి, నా 10 వ తరగతి తెలుగు వాచకం మధ్యలో పెట్టబోయి ఆగాను. అమ్మో, క్లాసు మధ్యలో జారిపడితే? వద్దు. జేబులో పెట్టుకున్నాను. (చదువరీ, పైన ప్రేమ పత్రంలో భాషను కొంచెం పల్చగా, భావాన్ని మరింత చిక్కగా మార్చి, యథాశక్తి కలుపుకోవలసింది. చదువరి != శిరీష్ కుమార్)


మధ్యాహ్నం పూట ఓ గంట భోజన విరామం. హిందీలో "భిక్షుక్" అనే పాఠంలో దోహే ఒకటి కంఠాపాఠం చేస్తున్నాను. 12 వ సారి. మ్యాత్స్ లో 80 మార్కులు తెచ్చుకోవటం ఈజీయేమో గాని ఈ హిందీ లో 20 మార్కులు తెచ్చుకోవటం సాధ్యం కాకుండా ఉంది.


పోస్ట్ మాన్ వచ్చాడింతలో. నేను కూర్చున్నది తరగతి గుమ్మం దగ్గర వరండాలో. అతను నా దగ్గర వచ్చి అడిగాడు. "బాబూ, టెంత్ క్లాసు ఎక్కడ?"


"ఇదే. నేనూ టెంత్ క్లాసే." చెప్పాను. ఇంతలో కొంతమంది మా క్లాసు విద్యార్థులు వచ్చి మూగారు.

ఓ రెండు కార్డు ముక్కలు తీశాడు. "ఫలానా-1, ఫలానా-2" మీ క్లాసేనా?అడిగాడు.

"ఆ మా క్లాసేనండి." చెప్పాను.

ఈ కార్డ్లు వాళ్ళిద్దరికీ ఇచ్చేస్తావా? అంటూ చేతిలో పెట్టాడు.

తీసుకున్నాను.

ఆ కార్డులో మొదటి లైను ఇలా ఉంది. "ఫలానా-1, నువ్వు చాలా అందంగా ఉంటావు. అచ్చు శ్రీదేవిలా..." బాపు మొట్ట మొదటి సారి అక్షరాలు దిద్దుకున్నప్పుడెలా రాసి ఉంటాడో అలా ఉన్నాయి, ఆ అక్షరాలు. అవి చేతిలో తీసుకోబోతుండగా "ఏంట్రా అది" అంటూ సంస్కృతం అయ్యవారు వచ్చారు, భోజనం ముగించి, వక్కాకు నములుతూ.

"ఏవో లెటర్ లంట సార్." ఆయనకిచ్చాను.

ఆయన కాసేపు చూసి తల పంకించి అవి తీసుకుని వెళ్ళిపోయారు.

మధ్యాహ్నం మొదటి పీరియడ్. రావలసిన మ్యాత్స్ సారు చాలా సేపయినా రాలేదు. అందరూ కీసర బాసరగా మాట్లాడేసుకుంటున్నారు. మ్యాత్స్ సారు చివరికి రానే వచ్చారు. "ఐ యామ్ అషేమ్డ్ అట్ యు" అన్నారు గంభీరంగా చూస్తూ. ఇందాక గమనించలేదు కానీ, క్లాసులో ఫలానా-1, ఫలానా-2 అమ్మాయిలిద్దరు, కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. (అలా ఏడవడం భారత దేశ సంస్కృతి అన్నట్టు). చివరి బెంచి లో ఇద్దరు ఆకతాయిలు కుమిలి కుమిలి నవ్వుకుంటున్నారు. క్లాసులో పిన్ డ్రాప్ సైలెన్స్. (మరీ పిన్ డ్రాప్ కాదు, పెన్ డ్రాప్ అనుకుందాం). అయ్య వారు ఆ మాట ఎందుకంటున్నారో, సందర్భమును వివరింపుడు అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఫలానా-1, ఫలానా-2 లకు ఎవరో లవ్ లెటర్స్ రాసి పంపారని ఊహించిన వాళ్ళు ఊహించారు, చాలా మంది ఊహించలేదు. నాకు విషయం కాస్త అర్థమయింది కానీ, పూర్తిగా తెలియలేదు.

కాసేపు చెడా మడా తిట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత సంస్కృతం అయ్యవారు. వస్తూనే గర్జించారు. "ఎవడో ఈ స్కూలుకు మచ్చ తీసుకొచ్చే పని చేశాడు. వాడు మీలో ఎవడైనా సరే వదిలేది లేదు. వాడికి నేను శాపం పెడుతున్నాను. నా శాపం ఊరికే పోదు" ఇలా...ఆ తర్వాత ఆంగ్ల బోధకుడు, షెర్లాక్ హోమ్స్ లా తన పని మొదలెట్టారు. డిక్టేషన్ చెబుతాను, మీరు అర్థాలు తెలుగులో వ్రాయండి, అని డిక్టేషన్ మొదలెట్టేరు. ఆ డిక్టేషన్ లో ఓ పదం "beauty".
స్కీము ఏమిటంటే, ఆ డిక్టేషనులో రాసిన అక్షరమ్ముక్కల ద్వారా ఆ లెటర్ ఎవడు రాశాడొ కనిపెట్టటం అన్నట్టు.

అందరూ రాసిన తర్వాత, ఒక్కొక్కరి దగ్గరే వచ్చి ఆ అక్షరాలను పరికించి చూశారు. ఒకతణ్ణి మాత్రం, నువ్వు ఇలా రా, అంటూ క్లాసు మధ్యలో బయటకు తీసుకెళ్ళి పోయారు.

నాకు ఆ రోజు సాయంత్రానికి "విషయం" తెలిసింది. ఎవరో ఆకతాయిలు ఇద్దరు అమ్మాయిలకు లవ్ లెటర్స్ రాసి పంపారు. సాయంత్రం నాకు ఇక్కడ భయంతో వణుకు. నా జేబులో ఒక ప్రేమ పత్రం ఉంది కదా. అందుకు. చివరకు ఇంట్లో ఆ పేపర్ ను ఎవరూ చూడకుండా కాల్చేసేంత వరకు నెమ్మది లేకపోయింది.

చాలా రోజుల తర్వాత, నేను పదవ తరగతి ముగించి, ఇంటర్మీడియట్ చేరిన ఆ వెధవ పని చేసింది ఎవరో తెలిసింది, ఆ అమ్మాయిలిద్దరు ఒకే కాలనీలో ఉండే వాళ్ళు. ఆ కాలనీలో ఉన్న మరో స్కూలు కుర్రాడు, ఆ పని చేసింది.నిద్రలో అటు నించీ ఇటు పొర్లాను. చేతికో చిన్న పుస్తకం తగిలింది. ఇదేం పుస్తకమబ్బా, అని లేచి లైట్ వేశాను.

అదో చిన్న ఆటోగ్రాఫ్ పుస్తకం. జీర్ణావస్థలో ఉంది. స్కూలు వదిలేసేప్పుడు అందరితో సంతకాలు తీసుకున్నది. ఈ మధ్య ఇల్లు మారుతున్నప్పుడు తవ్వకాల్లో బయటపడింది. అందులో "ఫలానా-1" అమ్మాయి ఆటోగ్రాఫ్. " I'll remember you forever - your fiend"అని.

మీరు సరిగానే కాదివారు. fiend అనే రాసిందామె.

సదరు "ఫలానా-1" పేరు మూడక్షరాల ఓ పతివ్రత పేరు. ఆ అమ్మాయి ఇప్పుడెక్కడ ఉందో తెలియదు.

"ఫలానా-2" మాత్రం నాకో దినకర్ (ఇంజినీరింగ్ చదివేప్పుడు తగిలాడు నా పాలిట) ఉండేవాడు. వాడి భార్య. ఇద్దరు పిల్లలామెకు. ఇద్దరూ అమ్మాయిలే.

ఫలానా-2 పేరు - కాళిదాసు వ్రాసిన ఓ దండకం లో మొదటి మూడక్షరాలు.

అలా నా మొదటి ప్రేమలేఖ మొన్న కలలో నన్ను తిరిగి పలుకరించింది.

12 comments:

 1. హ్మ్మ్ ఎక్కడో ఏదో వెలితి...బాగానే ఉంది.

  ReplyDelete
 2. మీ ప్రేమలేఖ బావుంది .
  నవ్వుకున్నాము..మీ ఫలాన 1,ఫలాన2 క్విజ్
  నచ్హింది ..మీ చక్రం {ఫొటొ} అర్దం కాక మా బాబుని
  తిరుగుతుందా? అని పదిసార్లు అడిగాను.

  ReplyDelete
 3. please visit my new blog http://apaksha.blogspot.com

  Thanks

  ReplyDelete
 4. మీ ఇంగ్లీషు మాస్టారు నాకు చాలా బాగా నచ్చేశారు. :)

  ReplyDelete
 5. బాగున్నాయి మీ మొదటి ప్రేమలేఖ అనుభవాలు. కాల్చిన బూడిదలోంచి ఫీనిక్సులా లేచి వచ్చిందన్న మాట!

  మీ ఫలానా-1 పేరుకు మీరిచ్చిన క్లూ కు 'డాటా సఫిషియెన్సీ' లేదు. ఇంకేమైనా...:-)

  ReplyDelete
 6. బాగుందండి.. ఎక్కడికో వెళ్ళిపోయాను...

  ReplyDelete
 7. బహుశా బ్లాగుల్లో గతాన్ని చెప్పడానికి (కాదు చూపించడానికి) గుండ్రాలు తిప్పిన మొదటి బ్లాగరు మీరేననుకుంటాను! ఇంతకీ "ఫలాన-0" అమ్మాయి పేరు వివరాలు చెప్పనే లేదు? :-)
  జరుక్ శాస్త్రిగారు (అనే గుర్తు) ప్రముఖుల ప్రేమలేఖలన్న పేరుతో పేరడీ లేఖలు రాసేరు. శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, విశ్వనాథ ఇలా ప్రముఖ కవులు ప్రేమలేఖలు రాస్తే ఎలా ఉంటాయి అని. అది గుర్తుకొచ్చింది మీ మొదటి ప్రేమలేఖ చదువుతూ ఉంటే. అలాగే "అపరిచితుడు" ప్రేమలేఖ కూడాను :-)

  ReplyDelete
 8. @మేధ, @vinay,@పరిమళం,@Indian Minerva, @anonymous, @మురళి : థాంకులు.

  @మహేష్ : వెలితి ఎందుకంటే, ఈ "రచన" లో పరిపక్వత లేదు. కానీ, ఇవి నా మీద నాకే నవ్వొచ్చే జ్ఞాపకాలు. అందుకే జ్ఞాపకాలుగా చదువుకోండి.

  @rishi గారు : ఇవి సినిమా గుండ్రాలకు సింబాలిక్.

  @apaksha : మీ బ్లాగు బావుంది. బ్లాగ్లోకానికి స్వాగతం.కూడలికి అనుసంధానించండి.

  @చంద్ర మోహన్ : చెబితే నమ్మరు కానీ, నిజంగానే, నాకు ఆ రాతలు అవీ, కలలో నా ముందు జరుగుతున్నట్టు కనిపించాయి.

  ఇక క్లూ : ఆ మంచి కన్య కు గుడ్డి భర్త దొరికాడు!

  @కామేశ్వర్రావు గారు :ఫలానా-0, అది భాస నాటకం పేరుతో ఉన్న మరో అమ్మాయి.:-) అయితే ముగ్గురికి సమానవకాశాలు కల్పించాలనుకున్నాను. :-)

  చదవలేదు కానీ నేను విన్నాను ఆ పుస్తకం. శ్రీరమణ గారు కూడా అలాంటి పేరడీలు (ప్రేమలేఖలు కాదు, మరో టాపిక్) వ్రాశారు. శ్రీరమణ పేరడీలు అన్న పేరుతో ఓ పుస్తకం ఉంది.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.