Sunday, May 10, 2009

తసమదీయులు

మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి దగ్గర రాక్షసులకు చదువు చెప్పటానికో గురువు పని చేస్తుంటాడు. ఆ "గురువు" గారి పేరు "చిన్నమయ్య". ఆ చిన్నమయ్య పాత్ర పోషించినాయన పొడుగ్గా, గెడకర్రలా ఉన్న రమణారెడ్డి! సదరు రాక్షస శిష్యులకు మాత్రం "గురువులు" , సంయుక్తాక్షరాలు పలకవు! "దుష్ట చతుష్టయము" అని పలకడానికి "దుషట చతుషటయము" అని అంటుంటారు. అలాగే అస్మదీయులు అనడానికి అసమదీయులు. అలానే "తసమదీయులు"...

ఇక్కడ "తసమదీయులు" అన్న పదం గురించి చెప్పుకోవాలి. సంస్కృతంలో "అస్మద్" శబ్దం ఉన్నది, అలానే "యుష్మద్" శబ్దమూ. అంటే అస్మదీయులు అన్న పదానికి వ్యతిరేకపదం యుష్మదీయులు అవాలి. కానీ ఆ సినిమాలో "తసమదీయులు" అన్న పదం ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి!

ఆ సంగతి అలా ఉంచితే, ఇప్పుడు మాత్రం ఈ "తసమదీయులు" అన్నపదం మన మన రాజకీయ నాయకులకు బాగా సరిపోతుందనుకుంటాను. మొన్న ఎన్నికల ముందు వరకు గాంక్రెస్ అంటే, అసహ్యమూ, రోత అన్న రిచంజీవి గారు ఇప్పుడు తమకు 100 సీట్లు వస్తే గాంక్రెసు మద్దతు స్వీకరించేట్టు, అంతకన్న తక్కువ సీట్లు వస్తే, మద్దతు ఇచ్చేట్టు రహస్య ఒప్పందాలు చేసుకున్నట్టు వార్త. అంటే, రాజకీయాల్లో అస్మదీయులు, యుష్మదీయులు ఇద్దరూ లేరు, ఉన్నదంతా తసమదీయులే.

ఇదిలా ఉంటే, అలాంటి ఒప్పందం జరగలేదని డ్రామాను మరింత రక్తి కట్టించే ప్రయత్నం ఇంకో పక్క సాగుతోంది.

ఏతావతా, "యాక్టరు ముదిరితే రాజకీయ నాయకుడు" అన్న న్యూనుడి సార్థకమయేట్లు ఉంది.

5 comments:

 1. సదరు కథానాయకుడు రెండు ప్రధాన పార్టీలతోనూ ఈ తరహా ఒప్పందాలు చేసుకున్నాడనీ, ఫలితాలను బట్టి ఒక ఒప్పందం బుట్ట దాఖలవుతుందనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయండి.. అయినా ఇంకెంత, మరో ఐదు రోజులు.. తసమదీయుల సంగతేమో కాని, మీ టపా చదివినందుకు గాను 'మాయా బజార్' మళ్ళీ చూడాలిప్పుడు..

  ReplyDelete
 2. >> "ఆ సినిమాలో 'తసమదీయులు' అన్న పదం ఎందుకు పెట్టారో దర్శకుడికే తెలియాలి!"

  దీని గురించి మాయాబజార్ విడుదలైన కొత్తలోనే నానా రాద్ధాంతం జరిగింది. ఆ వాడకం తప్పు, ఎందుకలా వాడారు అని మాటలు రాసిన పింగళి నాగేంద్రరావుగార్ని ఎవరో నిలదీస్తే ఆయన చిద్విలాసంగా వేసిన ఎదురు ప్రశ్న: 'ఎవరో ఒకరు కనిపెట్టకపోతే కొత్త పదాలెలా పుడతాయండీ?'

  నిజమే కదా.

  ReplyDelete
 3. Matter of fact, పై వివరణ ఆ సినిమాలోనే ఉంది నిజానికి. ఆ పదం పుట్టించిన శిష్యుడికో వీరతాడు (ఇదీ పింగళి సృష్టే) వెయ్యబడుతుంది కూడా.

  ReplyDelete
 4. ఓహో, తెర వెనుక ఇంత కథ ఉందాండీ? బావుంది.

  ReplyDelete
 5. రమణారెడ్డి పేరు "చిన్న మయ" అండి, చిన్నమయ్య కాదు. అంటే, మినీ మయుడన్న మాట. రాజసూయంలో మయసభ ముచ్చట్లు విని సరదా పడుతున్న రేవతికి, "మీకా సరదా ఉందని ఒక్కమాట ధర్మజుడితో చెబితే ఏకంగా ఆ మయసభని తెచ్చి ద్వారక ముందే పెట్టిస్తాడు" అంటాడు కృష్ణుడు. "మన శశి పెళ్ళినాటికి వారికదే విడిది కూడా అవుతుంది" అంటుంది రుక్మిణి. మయసభ లాంటి విడిదిని పెళ్ళి కోసం సృష్టించిన "చిన్న మయుడు" రమణారెడ్డన్న మాట.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.