Monday, April 6, 2009

రామనవమి మ్యూజింగ్స్

ఒక పేదవాడికి ఉన్న స్వేచ్చ మధ్య తరగతి వాడికి, ఉన్నత వర్గానికి చెందిన వాడికి ఉండి చావదు. నా ఈ సడన్ జ్ఞానోదయానికి కారణం బోధి చెట్టు కాదు, ఉట్లమాను.

రామనవమి సందర్భంగా అనంతపురంలో ఉట్లమాను నిలబెట్టారు మా ఇంటి దగ్గర. ఉట్లమాను అనగానేమి? అంటారా?ఓ చెక్క స్థంభం, స్థంభం చివర జెండాపై కపి రాజు, ఆయన పాదాల దగ్గర ఓ డబ్బు మూట. ఔత్సాహికులు ఆ స్థంభాన్ని ఎక్కి డబ్బు మూట అందుకోవచ్చు. అందుకుంటే పోలా? అంత వీజీయేం గాదు. దానికింద ఒండ్రుమట్టితో ఓ చిన్న మడుగు, అందులో బురద నీళ్ళు, పైకి ఎగబాకుతున్న వాళ్ళ పై బురద జల్లి, నూనె చల్లి, కిందికి లాగడానికి తయారుగా జనం. (ఇదేదో మనకు సూటయ్యేదే!). ఇంత గోలలోనూ పట్టువదలని విక్రమార్కులు...అబ్బో భలే సందడి లెండి. ఈ ఉట్ల పరుష నా చిన్నప్పుడు ధాం ధూమని జరిగేది. వూరు బాగా సివిలైజ్ అయిపోయి, చాలా యేళ్ళుగా ఇలాంటివి ఆపేశారు. మళ్ళీ ఈ రెండు మూడు యేళ్ళు గా తిరిగి మొదలెట్టారు. (తిరోగమన వాదం. ఏం చేస్తాం?)

సరే, జ్ఞానోదయం విషయానికి వస్తాను. ఇంతకు సంగతేమంటే, నాకు ఈ బురదలో పొర్లాలని, స్థంభం ఎక్కుతూ జారాలని, ఆ ఉట్లమాను ఎక్కి, పైకెళ్ళే వాడి మీద బురద చల్లాలని చిన్నప్పటి నుంచి ఒక చిన్న బేసిక్ ఇన్ స్టింక్టు. మా ఆవిడతో నా బేసిక్ ఇన్ స్టింక్టు చెప్పి ఉట్లమాను దగ్గర బురదలో ఆడాలని ఉందని పర్మిషన్ అడిగా. అంతే! అదేదో బూతు పదం అన్నట్టు విరుచుకు పడింది. కావాలంటే ముల్తాని మిట్టీ కొనుక్కుని, వొళ్ళంతా ఒండ్రు మట్టి (సారీ, ముల్తానీ మిట్టీ) రాసుకుని స్నానం చేయమంది కానీ అక్కడ ఉట్లమాను దగ్గరకు మాత్రం పర్మిషన్ నాట్ ఆలోడ్ అంది. దాంతో తల వెనుక చక్రం తిరగటం, తలలోపలకి ఫిలాసఫీ దూరటం రెండూ ఒకటే సారి జరిగాయ్.

ఒక పేదవాడికి ఉన్న స్వేచ్చ మధ్య తరగతి వాడికి, ఉన్నత వర్గానికి చెందిన వాడికి ఉండి చావదు. నిజ్జం. ఆరోజు సాయంత్రం, ఉట్ల మాను ఆటలో ఆ పేద వాళ్ళు బురదలో బాగా ఆడుకుని, ఆపై కెనాల్లో పడి ఈత కొట్టి, ఆ తర్వాత ఇంటికొచ్చి, చక్కగా భోజనానికి తోడుగా వడపప్పు, పానకం లాగించి, సెకండ్ షో సినిమా కెళ్ళడం చూస్తుంటే, ఇదీరా జీవితం అని అనిపించింది కాసేపు.

వడపప్పు అంటే గుర్తొచ్చింది. వడపప్పు ఒరిజినల్ పేరు కోసుంబరి. ఇది కర్నాటక వాళ్ళది అనిపిస్తుంది నాకు. బెంగళూరు లో ఎంటీయార్ (నందమూరి తారక రామారావు కాదు) అని ఒక ఫేమసు హోటలుంది, లాల్ బాగు పక్కన. అక్కడ మీల్సు అదరహో. అయితే చిరంజీవి సినిమా మొదటి రోజుకున్నంత రష్షు అక్కడ ఎప్పుడూ. బెంగళూరు కొచ్చిన కొత్తల్లో అక్కడికెళ్ళాను నేను, మా కజిను తో పాటి. అక్కడ ఈ కోసుంబరి - మనసును కోసేత్తదంటే నమ్మండి. ఎనిమిది సార్లు మొహమాటం లేకుండా అడిగి వేయించుకుని తిన్నాక, తొమ్మిదవ సారి అడగబోతుంటే, ఆ హోటలాయన ఆ కోసుంబరి బేసిన్ - రిజర్వు చేశేసాడు నాకోసం, ఇక పని కాదని. ఆ హోటల్ చరిత్రలో తొమ్మిది సార్లు కోసుంబరి తిన్న వాణ్ణి నేనే అయి ఉంటాను. అంత పిచ్చి నాకు.

మా ఇంటి పక్క రాముల వారి భజన మందిరం. అక్కడ పానకం సప్లై. ఆ పానకం ఆస్వాదించిన తర్వాత, ఈ పానకాన్ని ఆర్థిక మాంద్యం వల్ల ఆఫీసులో రేపో మాపో అనేటట్టున్న కాఫీ మిషనుకు ప్రత్యామ్నాయం లా వాడితే ఎంత చక్కగా ఉంటుందో అనిపించింది.

అన్నట్టు ఓ రెండు ఫుటోలు.


పై ఫోటోలో వెనుక కనిపిస్తున్నది జీ ఆర్ ఫంక్షను హాలు. ఒకప్పుడు అనంతపురం పట్టణంలో ఓ ప్రముఖ వేరు శనగ నూనె మిల్లు. గొంగటి రామప్ప అనే పెద్దాయనది. ఇప్పుడు వ్యవసాయం, దిగుబడి హరించుకు పోవడంతో ఇలా తయారయ్యింది. ఈ మిల్లు ను ఏ పార్టీ బాగు చేయిస్తానంటుందో, ఆ పార్టీకే నా ఓటు.

4 comments:

 1. ఉట్లమాను పెట్టేది కృష్ణాష్టమికి కాదా?
  పలుమరు ఉట్ల పండగను అనే అన్నమయ్య పదంలో ఈ సందడిని సరదాగా వర్ణిస్తారు.

  ReplyDelete
 2. అవును కదా, వడపప్పుని ఇక్కడ (బెంగళూరు), కోసంబరి అంటారు.. నేను మొదట్లో ఆ పేరు విని ఏంటో అనుకున్నా.. తరువాత తెలిసింది అది మన వడపప్పేనని :)
  రామనవమి కబుర్లు బావున్నాయి..

  ReplyDelete
 3. Ravi
  Nice article, btw 2 days back I had been to MTR with madhu and family and vijay and manju, me and manju remembered ur Kosumbari efforts that day :D
  Btw I felt MTR is not as same it was 5 years back..

  ReplyDelete
 4. @కొత్తపాళీ గారు ; ఉట్లమాను రామనవమిదే. కృష్ణాష్టమి కాన్సెప్ట్ వేరు. ఉట్టి (కుండ) తాడుకు పుల్లీ ద్వారా వేలాడ కట్టి, ఆ తాడును ఇటు వైపు నుండీ లాగుతుంటారు.ఆ కుండను ఎగిరి, కట్టెతో పగులగొట్టాలి.
  మీరు ఆ అన్నమయ్య లంకె ఇచ్చి ఉంటే బావుణ్ణు. నేనూ వెతుకుతాను లెండి.

  @మేధ : కోసంబరి మీరూ తిన్నారన్నమాట.

  @Ganesh : MTR lost it's flavour. I also heard that. But still it was among the top it seems. Recently I saw one episode in T & L channel about MTR dosa.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.