Monday, March 9, 2009

ఫల శ్రుతి

చిన్నప్పుడు మా ఇంటి ఎదురు గా రామాలయం ఉండేది. ఆ ఆవరణలో ఓ చెట్టు. ఆ చెట్టు పేరు బంకీరుకాయల చెట్టు. బంకీరుకాయ అంటే - రేగు పండు ఆకారంలో, రేగు పండు లాగే లోపల బీజం ఉన్న ఓ పండు. గుజ్జు కాస్త జిగురుగా ఉన్నా, బాగా తియ్యని రుచి. ఈ పళ్ళు తినడం మొదట అలవాటు పడ్డం కష్టం కానీ, ఒక్కసారి వీటి రుచి మరిగితే విడిచిపెట్టటం కష్టం. రోహిణీ కార్తెలో ఎండలు మండిపోతున్నప్పుడు, ఆ ఉష్ణానికి నోటి పూత వస్తే, దానికి చక్కటి ఔషధం ఈ పండు (లేదా ఈ చెట్టు ఆకులు).

వేసవి సెలవుల్లో పిల్లలకు ఆటవిడుపు అవడంతో, ఆ చెట్టు కాయలు పక్వానికి వచ్చే సమయానికి, కోతులు, కోతులకు ధీటుగా మా కుర్రమూక ఆ చెట్టు దగ్గర సిద్ధం. మమ్మల్ని, కోతులను తరమడానికి, దేవాలయానికి కాపలా పనికీ నరసమ్మ అనే ఒకావిడ. ఆవిడ మమ్మల్నందరినీ తరిమేసి, ఆ కాయలు పోగు చేసుకుని, బయట అమ్ముకునేది. (బీదరాలు ఆవిడ.) అప్పట్లో మా పాలిట విలను ఆమె. దాదాపు 15, 20 యేళ్ళు ఆ చెట్టుతో నా అనుబంధం కొనసాగింది.

ఆ బంకీరు కాయల్లాగే నాకు కొన్ని unconventional fruits బాగా జ్ఞాపకం. వాటిలో కొన్ని.

కలే పండ్లు అని. నల్లగా మిరియపు గింజల లాగా ఉండేవి. స్కూళ్ళ దగ్గర గంపల్లో తెచ్చి అమ్ముకునే వాళ్ళు. కొన్ని కొన్ని సార్లు పురుగులు పడ్డా, చాలా రుచిగా ఉండేవి. గుజ్జు కాస్త ముదురు ఎరుపు రంగులో ఉండేది.

ఈత పళ్ళు : ఇవి మా ఇళ్ళలో నిషేధం. ఎందుకంటే, ఈత చెట్టు నుండీ కల్లు వస్తుంది కదా. ఈత కాయలూ వాటి తాలూకు ఫ్యామిలీయే కదా, అందుకని. అయితే, ఇంట్లో తెలీకుండా మా స్నేహితుడి తోటనుండీ తెప్పించుకుని ఎగబడే వాళ్ళం.

ఇంకా రేగు, గంగ రేగు, నేరేడు, మేడి, సీమ చింతకాయలు.....

ఇవన్నీ ఇప్పుడు దాదాపు కనబడ్డం మానేశాయి.

అయితే కొత్త కొత్త ఫలాలు చాలా చూశాను, ఈ మధ్య 4,5 యేళ్ళలో. ఆన్ సైటుకు ఇండోనేషియా వెళ్ళినప్పుడు, కివి అని, డ్రాగన్ ఫ్రూట్ అని, పసుపు వర్ణం గుజ్జు ఉన్న పుచ్చకాయ, బీహార్ నుండి అప్పుడప్పుడు మా స్నేహితుడు తెచ్చి పంచే లిచి, ఇంకా పేరు తెలీని అనేక రకాల పళ్ళు...

సరే, మర్చిపోయిన ఫలాల విషయానికి మళ్ళీ వస్తాను. ఈ మధ్య ధూర్జటి కవి గారి కాళహస్తీశ్వర శతకం తాలూకు ఓ పద్యంలో ఆ మర్చిపోయిన పళ్ళలో కొన్నిటిని చూశాను. ఆ పద్యం........

నేరేడు పండులు నెలయుట్టి పండులుఁ
గొండ మామిడి పండ్లు దొండపండ్లుఁ
బాల పండులు నెమ్మి పండులు బరివంక
పండులుఁ జిటిముటి పండ్లుఁ గలివి
పండులుఁ దొడివెంద పండ్లుఁ దుమ్మికి పండ్లు
జానపండులు గంగ రేఁగుఁబండ్లు
వెలగ పండులు పుల్ల వెలగ పండులు మోవి
పండ్లు నంకెన పండ్లు బలుసు పండ్లు

బీరపండ్లును బిచ్చుక బీర పండ్లుఁ
గొమ్మిపండ్లీతపండ్లును గొంజి పండ్లు
మేడి పండ్లును మోదలుగాఁ గుడిమాడి
చెంచెతలు దెత్తురిత్తు విచ్చేయుమయ్య (3-69)

ఇవన్నీ అడవిఫలాలు.

౧.నేరెడు
౨. కొండమామిడి
౩. దొండ
౪. పాల (సపోటాతో అంటు కడతారుట)
౫. బరివంక : బంకీరు కాయలివే
౬. కలివి : కలే పండ్లు ఇవే.
౭. తుమ్మికి / తుమికి /తునికి : కిందుకం అంటారుట సంస్కృతంలో
౮. వెలగ :
౯. పుల్ల వెలగ:
౧౦. గంగరేగు : ఇది తెలిసే ఉండాలి. రేగు పండు పెద్దన్న.
౧౧ మోవి
౧౨. బలుసు
౧౩. బీర : (కూరకు వాడే బీర కాదు)
౧౪. పిచ్చుక బీర : బాపన బూరెలంటారుట
౧౫. ఈత :
౧౬. గొంజి : గొల్వి, గొలుగు, గొనుగు, గుడఫలము
౧౭. మేడి (ఉదుంబర అని సంస్కృతంలో)
౧౮. కొమ్మి
౧౯, నెమ్మి : (సంస్కృతంలో చిత్రకుశ)
౨౦. నెలయుట్టి / నెల్లుట్టి
౨౧. చిటిముటి ; మంచి బిక్కి అంటారుట దీన్ని
౨౨. జాన/పూతిక : పుల్ల జామపండ్లట
౨౩. సంకెన :
౨౪. తొడివెంద

ఇలా ౨౪ జాతుల ఫలాలను పేర్కొన్నాడా కవివరేణ్యుడు. ఈ కాఱడవిలో ఉన్న శివయ్యకు, మా వూరు (ఉడుమూరు) కు వస్తే, చెంచెతల చేత తెప్పించి పెడతానని తిన్నడు ఆశ చూపెట్టాడుట.

చిన్నప్పుడు చూసిన రుచులు (మళ్ళీ ఆ రుచులు కనిపిస్తాయన్న ఆశలేదు) ఇలా ఈ పద్యంలో కాస్త కనిపించాయి.

అన్నట్టు తెనాలి రామకృష్ణ సినిమాలో ఈ పద్యం కూడా ఆ ఆశ్వాసంలోదే. (3-71)

చుఱుఁకుఁ జూపునఁ గాలిన కొఱతనుఱుకు
నుఱుకుఁ జూపులఁ బుట్టించు నెఱుకువారి
ఇఱుకు వలిగుబ్బ పాలిండ్ల ఇగురుఁ బోండ్ల
సేవకిచ్చెద నీకు విచ్చేయవయ్యా......!

11 comments:

 1. bankeeru...ante albukaar aa ?

  ReplyDelete
 2. mEmu chinnappuDu balusu paLlu, pisinika paLlu, ilaaMTi rakaalu chaalaa tinEvaaLlaM :)

  ReplyDelete
 3. Hmm malli avanni kanipistaayanna aaSa naaku kUdaa ledu.vaaTitO paatu mogali puvvulu ,Taati munjalu kudaa.chivaravi reandu dorukutunnaayanta kaanI naaku maatram vaatini aaswaadinche bhaagyam kalugaledu gata 10 ellalO.

  ReplyDelete
 4. Ravi nice one,
  Seema Chinta kaaya.. was my favorite.. in Maski we had few trees in backyards of my home, I guess u remember them, ..

  ReplyDelete
 5. కలే పళ్ళు, చిటిముటిపళ్ళు,జాన పళ్ళు... ఇవి నాకు తెలుసు. పలనాడు లోని చిట్టడవుల్లో కాసే ఈ పళ్లను తెచ్చి చిన్నప్పుడు స్కూలు ముందు గంపలోనో, బండి మీదో అమ్ముతుండే వారు. కలే పళ్ళు, జానపళ్ళు మరీ చిన్నవిగా ఉంటాయి. అందులోనూ జానపళ్ళు నోట్లో వేసుకోగానే తోలు కూడా పుల్లగా ఉంటుంది. దాన్ని ఆస్వాదించాక, అప్పుడూ పండుని తినడం!

  ఈతపళ్ళు కూడా బాగుంటాయి. మా ఇంటివెనకే చెట్టుండేది. ఎండాకాలంలో దానికి గెలలు వేయగానే పండేదాకా ఎదురు చూడ్డం నరకంగా ఉండేది.

  ReplyDelete
 6. చిన్నప్పుడు మా ఇంట్లోనూ ఈత పళ్ళు తిననిచ్చే వాళ్ళు కాదు. ఎందుకో చెప్పే వారూ కాదు. నేనూ ఎప్పుడూ ఆలోచించలేదు.. ఇప్పుడు తెలిసింది.. అప్పుడు వద్దన్నారని తినడం మానలేదు లెండి.. రహస్యంగా పళ్ళు, పబ్లిక్ గా దెబ్బలు.. మంచి టపా రాశారు..

  ReplyDelete
 7. కివి అని, డ్రాగన్ ఫ్రూట్ , లైచి పళ్ళు అన్ని నేనూ తిన్నాను.. చాలా బాగా రాసారు

  ReplyDelete
 8. ఉస్తి కాయలు గురించి విన్నారా ఎవరైనా?
  వాటితో పప్పు చేస్తారు. కమ్మగా వుంటుంది.

  అలాగే ఈలకూర తెలుసా?
  అంతర్వేది వెళ్ళినపుడు చూశాను. చాలా ఉప్పగా ఉంటుంది.
  బహుశా ఇప్పుడు ఉండకపోవచ్చును. ఎందుకంటే ఆ స్థలాలన్నీ రొయ్యల చెరువులుగా మారిపోయాయని విన్నాను.

  ReplyDelete
 9. సీమ చింత కాయలు కూడా నాకు చాలా ఇష్టం! అవి పండాక కొడవళ్ల లాగా వంకీలు తిరిగి ఉండే కాయలు గులాబి రంగులోకి మారతాయి. లోపల ఉండే ఫ్రూట్(పప్పు అనాలా)పింక్ రంగులో ఉంటుంది. పెద్ద తియ్యగా ఉండదు కానీ ఎందుకో ఇష్టం మరి. బహుశా పెద్ద కర్రకి చివర సన్నగా చీల్చి (sliT) దానితో కష్టపడి ఆ కాయల్ని కొట్టి పడేసి మరీ తినడంలో ఉన్న మజా కాబోలు అది.

  ReplyDelete
 10. అబ్బో ఇక్కడ చాలా కాయలు, paMDla గురించి మాట్లాడేసుకుంటున్నారుగా!

  బంకీరు కాయ-అంటే ఏంటో ఇంకేమైనా పేర్లు ఉన్నాయా దీనికి? అడవి పండ్లలో చాలా వరకు తెలియవులేండి.

  కలే పండ్లని మేము పుల్లరేక్కాయలు అనేవాళ్లం అనుకుంటా!

  ఈత పళ్లయితే ఎండాకాలం వస్తే చాలు మా పనబ్బాయిని గెలలు తెమ్మని పోరుపెట్టేదాన్ని. అవి మాగుతూ వుంటే ఎవరికి తెలియకుండా ఒక్కొక్కటి తీసుకు తినటంలో రుచే వేరు.

  సీమచింతకాయలయితే ఎక్కడెక్కడో చిఠారు కొమ్మల్లో ఉన్న కాయలు కూడా వెతికి వెతికి కొంకి కర్రతో లాగి కిందపడ్డ వాటిని పోటీపడి ఏరుకుంటూ-సుజాత గారూ, నిజమే ఆ మజానే వేరు. అన్నట్టు మా పిన్ని ఈ గుబ్బలతో (అదే లోపలి పప్పుతో) కూర కూడా వండుతుంది, నిజంగా చాలా బాగుంటుంది..రొయ్యల వేపుడు తిన్నట్టే వుంటుందనుకోండి.

  ReplyDelete
 11. @అజ్ఞాత గారు : తెలీదండి

  @సూర్యుడు : అలాగా

  @కృష్ణుడు గారు : తాటి ముంజలు మా వూళ్ళో దొరుకుతున్నాయి వేసవిలో.

  @Ganesh : I also remember the bankeerukaayalu, on roadside in maski.

  @సుజాత గారు : ఈత చెట్టు చూస్తూ తినకపోవడమే నరకం. ఇక చెట్టు ఎదురుగా పెట్టుకుని...ఊహించగలను.

  @మురళి గారు : నాకు తెలియలేదు, చాలాకాలం. పరిశోధించి కనుక్కున్నా.

  @నేస్తం : మీరూ నా నేస్తమే.

  @bonagiri గారు పేర్లు వినలేదు. అయితే వేరే పేర్లతో ఉండి ఉండవచ్చు.

  @సుజాత గారు, @సిరిసిరిమువ్వ గారు : సీమ చింతకాయలకు నేనూ వీరాభిమానిని. తెల్లగా ఉన్న గుజ్జుపై, కాస్త పింక్ రంగు లో చారలు ఏర్పడతాయి. అవి తిన్న తర్వాత నీళ్ళు తాగితే తియ్యగా అనిపించేవి.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.