Thursday, January 29, 2009

అనగనగా ఒక వారాంతం

"అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు?
పండితులు కూర్చుండు మా అరుగు మేలు.
గడపలన్నిటిలోన ఏ గడప మేలు?
సిరుల సంపదల తావు మా గడప మేలు.
-
-
ఊరులన్నిటిలోన ఏ ఊరు మేలు?
పాడిపంటలు గల్గు మా ఊరు మేలు"

పెద్ద బాలశిక్ష లో భట్టీయం పట్టిన చిన్నప్పటి ఓ తీపి గుర్తు.

**********************************************************

ప్రతీ రోజు ఒకేలా ఉండదు. అలా అనిపిస్తే, జీవితం లో ఏదో పోగొట్టుకున్నట్టే లెక్క. ఉద్యోగ రీత్యా మెట్రో సిటీల్లో, కార్పోరేట్ సంస్థల తాలూకు "హై, వాట్స్ అప్", "లాంగ్ టైం నో సీ" వంటి ప్లాస్టిక్ పలకరింపుల్లో అప్యాయతను వెతుక్కుంటూ, వీలు చిక్కినప్పుడల్లా నగరానికి దూరంగా (ఆఫీసు వారు అప్పుడప్పుడూ పనికి రాని ట్రయినింగులకోసం తీసుకెళ్ళే) ఫాం హవుసుల్లో ప్రశాంతతను కొనుక్కుంటూ, జీవితం పరమార్థాన్ని, జీవితం నుండీ పారిపోయి కనుక్కునే ప్రయత్నం చేస్తూ, నిత్య సంఘర్షణ లో మునిగి తేలే ఓ సగటు హై టెక్ వ్యవస్థ తాలూకు పౌరుడైన నాకు ఓ పల్లె పలుకరించింది మొన్న శనివారం.

మా ఆవిడ వృత్తి రీత్యా ఓ టీచరు. ఓ గ్రామంలో. ఆ గ్రామం పేరు తిమ్మాపురం. అనంతపురం జిల్లా, కంబదూరు మండలంలో, ప్రధాన రహదారికి ౩ కి.మీ. దూరంలో ఉంటుంది. వారాంతం సెలవులకు ఆ వూరు వెళ్ళాను. పొద్దున 6: 30 కావస్తూంది. ఆర్టీసీ బస్సు కల్యాణ దుర్గం నుంచీ వెళుతూంది.

వెళుతున్న దారిలో -

తూరుపు వైపు ఓ ఎఱ్ఱటి గోళం నారింజ రంగులోకి మారుతూ, పుడమితల్లి కప్పుకున్న చలి ముసుగును తొలగించే ప్రయత్నంలో ఉన్నది.
ఎడ్ల బండి ఒకటి ఎదురుగా వస్తూ, బస్సు రావడం గమనించి కాసింత పక్కకు తప్పుకుంది.
మేకల గుంపు ఒకటి సందడిగా , బాటను దాటుతూంది. వెనుక వాటి కాపరి.
బట్టలమూటను మోస్తూ, ఓ గాడిద, ఆ గాడిదపై ఓ చిన్న పిల్లాడు, వెనుకల ఆ గాడిదను అదిలిస్తో, పక్కూరు చెఱువు దిశగా వెళుతున్న ఓ యువ జంట.
గ్రామం సమీపిస్తూంటే, పారిపోతున్న పుంజును పట్టుకునే ప్రయత్నంలో ఓ కుర్రాడు.

నేను సమీపించేసరికి
- ఊరు మేల్కొంది.

అచ్చంగా పసిపాప బోసినవ్వల్లే ఉందా పల్లె.

**********************************************************

మా ఆవిడ పనిచేసే సాంఘిక సంక్షేమ పాఠశాల తాలూకు క్వార్టర్సుకు వెళ్ళేప్పటికి బాగా తెల్లవారింది. ఆరు నెలల మా పాపాయి కేరింతలు కొట్టింది నాన్నను చూసి. నిజానికి ఆ ఊరు వెళ్ళటం మొదటిసారి కాదు నాకు. అయితే పల్లెకు వెళ్ళిన ప్రతిసారీ మొదటిసారిలానే ఉంటుంది. పెరట్లో దానిమ్మ చెట్టూ, రావి చెట్టూ, ఇంటి ముందున్న జామ చెట్టు అప్యాయంగా పలుకరించాయ్. జామిచెట్టుకో మహత్యం ఉందండి. ఆ చెట్టు దగ్గరకెళితే నా సెల్ ఫోను నెట్వర్క్ సిగ్నల్ ను పట్టుకుంటుంది. ఆ చెట్టుకు కాస్త దూరంగా ఏ దిశలో వెళ్ళినా ఫోను పనిచేయదెందుకో! కాబట్టి అదేదో పాతకాలం సినిమాలో హీరోవినుకు ఉన్నట్టు, ఆ చెట్టు నా ఫ్రెండు.

అక్కడ పాఠశాల ఆవరణంలో కొంగలకు, రామచిలుకలకు, ముదురు ఎఱుపు రంగు మెడ ఉన్న ఒక రకం కాకులకు - పొద్దు పొడిచింది. ఇంటి గదిలో కువకువలాడుతూ చేరిన గువ్వ పిట్టలు మా పాపను పలుకరించాయ్. మా పాపాయి వాటిని చూసి యథాశక్తి మాటాడించింది.

కాసేపయింతర్వాత ఊరికి వెళ్ళాను. 1000 గడపలుంటాయేమో ఆ వూళ్ళో. వేరు శనక్కాయలు, అనప కాయలు కోతకొచ్చిన సమయం కాబోలు. వేరుశనగ మొక్కల నుండీ కాయలను వేరు చేయడానికి ఓ మిషనులో ఆడిస్తున్నారు. తర్మోకోల్ డబ్బాలో పుల్లలకు గుచ్చిన ఐస్ క్రీములమ్ముతున్న ఓ ముసలాయన. ఆ ఐస్ క్రీము చప్పరిస్తూ, అలాంటిది తిని ఎన్ని సంవత్సరాలయిందో ఊహించాను. ఉహూ......తెలియదు.

**********************************************************

అక్కడ ఉన్న రెండు రోజులు కొన్ని అద్భుతమైన అనుభూతులు.

సాయంత్రం పూట ఇంటి దారి పట్టిన ఆవులు రేపిన గోధూళి,
దూరంగా గుడిలో వినబడే గంటలు,
బ్రాహ్మీ ముహూర్తంలో వినబడే విష్ణు సహస్రనామ స్తోత్రం,
సంగటి, గోంగూర పచ్చడి, మునగ సాంబారు,చింతాకు పప్పు, ఆవు నెయ్యి, గడ్డపెరుగులతో మృష్టాన్న భోజనం,
మాటలు రాని మా పాపాయి చెప్పిన ముచ్చటైన కబుర్లు,
-
-
జనవరి 26 వ తేదీ గణతంత్ర దినోత్సవం రోజు తిరిగి వచ్చేస్తుంటే నా నుండీ ఏదో దూరమైనట్టు ఓ భావన. ఈ గణతంత్ర దినోత్సవం రోజు - నేను ఓ రకంగా సంతోషం పోగొట్టుకున్న రోజు!

**********************************************************

11 comments:

 1. నాకు దూరమైన భావన మరియు దూరం చేసుకున్న భావన.

  ReplyDelete
 2. ప్లాస్టిక్ పలకరింపు ప్రయోగం చాలా బాగుంది. పల్లెటూరు ప్రయాణం చాలా హాయిగా ఉంది చదువుతుంటే....

  ReplyDelete
 3. రవి గారూ, చాలా బాగా వర్ణించారు మీ అనుభూతిని. మాకు కూడా మీ ఊరికి వచ్చి చూడాలనిపిస్తూంది ఇది చదివాకా.
  ఈ మధ్య మా ఊరు వెళ్తూ దార్లో కనబడ్డ ప్రతిచోటా కారు ఆపి వేడి వేడి మొక్కజొన్న పొత్తులూ, నవనవలాడే జామకాయలూ, తేగలూ కొనుక్కుని తింటూ వెళ్ళాము. మీలాగే ఎక్కడికో వెళ్ళిపోయాను నేను కూడా...

  ReplyDelete
 4. మా తాతయ్య గారి ఊరు వెళ్ళినప్పుడల్లా, ఇలాంటి భావనే కలుగుతుంది...

  ReplyDelete
 5. రవిగారు మీ ఊరి వర్ణన బాగుంది

  ReplyDelete
 6. రాధిక గారు, శ్రీ గారు, నాగమురళి గారు,మేధ, చైతన్య, కొత్తపాళీ గార్లు, నెనర్లు.

  మన తరం నెమ్మదిగా ఏదో కోల్ఫొతున్నాం. అందుకే ఇలాంటివి రాసుకుని తృప్తి పడ్డం తప్ప మార్గం లేదు. :-)

  ReplyDelete
 7. ముదురు ఎఱుపు రంగు మెడ ఉన్న ఒక రకం కాకులకు - పొద్దు పొడిచింది.

  చమరకాకులు అంటారు వీటిని. ఏ మాత్రం అలికిడయినా మనుషులనుంచి ఇవి పారిపోతాయి. వీటిని కొట్టి తినేవాళ్లు కూడా వుండేవారు. నేను చిన్నప్పుడు వీళ్లకు పిట్టలను కొట్టే షాట్ గన్ ఉపయోగించడానికి ప్రభుత్వం ఒక దశలో లైసెన్సులు జారీచేసింది. ఎగిరే బెళ్లాయిలను కూడా వీళ్లు కొట్టగలిగేవాళ్లు. ఎక్కడ చూసినా కనిపించే బెళ్లాయిలు ఈ తుపాకులవల్ల కనబడటమే అరుదైపోయింది. బెళ్లాయిలు, చమరకాకుల సంఖ్య దారుణంగా పడిపోయింది. వీరబల్లెలో కన్నా హ్యూస్టన్లోనే చాలా బెళ్లాయిలు కనబడుతున్నాయి. ఇప్పుడు తుపాకులతో గువ్వలను కొట్టేవాళ్లు తగ్గిపోయినా, చెట్లూ అడవులూ తగ్గి ఎండలు పెరగడంతో మునుపు కనిపించేటన్ని గువ్వలిప్పుడు మన ఊళ్లలో కనబడవేమో. మీరు చెప్పిన ఒక్కమాట పట్టుకొని ఎక్కడికో వెళ్లిపోయినట్టున్నాను. :)

  ReplyDelete
 8. రానారె : బాగుంది. ఆ కాకులు కాస్త అలికిడి కే ఎగిరిపొయేవి. సాంబార్ కాకులు అన్న ఒక పదం విన్నాను, అనంతపురంలో. వీటిని తింటారని కూడా అనుకుంటుంటారిక్కడ. ఈ ఎఱుపు మెడ కాకులు అవేనేమో తెలీదు.

  బెళ్ళాయిలు అంటే ఏమిటి? గువ్వపిట్టలా?

  ReplyDelete
 9. చాలా బావుంది, కళ్ళకు కట్టినట్టు వర్ణించారు!

  ReplyDelete
 10. Ravi nice article... reminded me abt my 16 yrs life in maski.. nice that u got to taste it :)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.