Tuesday, December 2, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౩

హబూబ్ లో తడిసి మట్టి అయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి వచ్చేము. అక్కడ మా సంస్థలో భోజన శాలలో విచిత్రం. చాలా మంది భారతీయులు మమ్మల్ని చూసి, మేము వాళ్ళను చూసి ఆశ్చర్యపొయాం. సంగతేమిటంటే, అక్కడ ఆ సంస్థలో దాదాపు 30 శాతం భారతీయులే. డిప్యూటీ మేనేజరు తెలుగాయన కృష్ణమోహన్. ఇంకా బిహారీలు, మలయాళీలు (డీఫాల్ట్), ముంబైకర్లు, వగైరా, వగైరా. వంటతను వంగ దేశస్తుడు (బంగ్లా దేశ్)., చక్కటి భోజనం పెట్టేడు మాకు. భోజనం చివర్లో లస్సీ కొసమెరుపు.

అక్కడ ఉన్న భారత దేశ పౌరులు, మమ్మల్ని శుక్రవారం ఆహ్వానించేరు,తమతో గడపడానికి. వాళ్ళకోసం ఓ హాస్టలు ఏర్పాటు చేసారక్కడ.

సరే, మధ్యాహ్నం తిరిగి రోమింగ్ టెస్ట్ కోసం బయలుదేరాం. అంటే, కారులో ఊరంతా తిరుగుతూనే ఉండాలి. (రోమింగ్ టెస్ట్ కోసం)మా ఆఫీసు సందు గొందుల నుండీ కాస్త బయటకు వచ్చి, మెయిన్ రోడ్డు కి రాగానే ఊపిరి ఆగి పోయేంత చక్కటి దృశ్యం. అక్కడ - నైలు నది, దిగువన వరద కారణంగా, దాదాపు రోడ్డు కు ఒరుసుకుని, మట్టి రంగు (వరద) నీళ్ళతో, దాదాపు రెండు కిలో మీటర్ల వెడల్పుతో ఉధృతంగా ప్రవహిస్తోంది!చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నది, నైలు నది ప్రపంచంలో అన్ని నదులకన్నా పొడవైనది, మన గంగా నదికి ౩ రెట్లు పొడవైనది అని. అప్పుడు స్వయంగా చూడ్డం. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.

మేము చూసినది, బ్లూ నైలు నిజానికి. బ్లూ నైలు , వైట్ నైలు అన్న రెండు నదులు కలిసి, ఓ నదిగా ఏర్పడి, నైలు నదిగా ఉత్తరాన ఈజిప్టు వైపు సాగిపోతుంది. ఆ రెండు నదులు కలిసే చోటు సూడాన్ రాజధాని ఖార్తూమ్ లోనే. మన భారద్దేశం లో అయితే, అలాంటి సంగమం పవిత్రంగా భావిస్తాం. అక్కడ అలాంటిదేమీ లేదు. ఓ చిన్న పార్క్ ఏర్పాటు చేసారా సంగమ ప్రదేశంలో. మేము వెళ్ళినప్పుడు ౨ నదులు వరదలో ఉన్నాయ్ కాబట్టి, మట్టి రంగులోనే కనిపించాయి రెండూనూ.

నైలు నది పక్కన సాయంత్రం ఓ అనిర్వచనీయమైన అనుభూతి.
సరే, మొదటి రోజు ఆఫీసులో అలా గడిచింది. ఆ సాయంత్రం మా బసకు తిరిగి వచ్చేము. మేము సాయంత్రం వచ్చే సరికి, అక్కడ మా ఇంట్లో కరెంట్ పోయింది. మా డ్రయివర్ కు చెప్పాము వెంటనే, కరెంట్ లేదని. సరే, ఇప్పుడే వస్తా అంటూ, ఓ పది నిముషాల తర్వాత వచ్చేడు. వచ్చి కరెంట్ మీటరు దగ్గర ఉన్న కీ పాడ్ లో కొన్ని నంబర్లు నొక్కేడు. కరెంట్ తిరిగి వచ్చింది! అక్కడ కరెంట్ ప్రీ పెయిడ్. ఉన్న డబ్బులకు కరెంట్ అయిపోగానే, విద్యుత్ శాఖ ఆఫీసుకెళ్ళి, డబ్బులు కడితే, వాళ్ళో నంబరు చెబుతారు. ఆ నంబరు ఇంట్లో ఉన్న కరెంట్ మీటరు లో ఎంటర్ చేస్తే చాలు!

అన్నట్టు సాయంత్రం వచ్చేప్పుడు అక్కడ ఓ మిలిటరీ వారి ఆఫీసు చూసేము. అక్కడ UN వారి అనేక బళ్ళు అనేకం ఉన్నాయి. ఓ పెద్ద కాంపస్. ఆ కాంపస్ ద్వారం వద్ద కొంత మంది సాయుధులు కాపు కాస్తున్నారు. ఆ ద్వారం పై భాగాన, కొన్ని ఇసుక మూటలు (?) వెనుక నక్కి, కొంత మంది తమ గన్ లను గురి పెట్టి అలర్ట్ గా ఉన్నారు. అక్కడ ఫోటోలు తీయడం నిషిద్ధం.

సూడాను వివాదం గురించి వచ్చే టపాలో.
(సశేషం)

5 comments:

 1. నైలు నది చూసారా :)
  బాగున్నాయి విశేషాలు....

  ReplyDelete
 2. నైలు నదిని చూశారా! చాలా ఎగ్జైటింగ్ గా ఉంది చదువుతుంటేనే! నైలు నది అనగానే నాకు క్లియోపాత్రా నే గుర్తొస్తుంది.

  ReplyDelete
 3. నైలు నదిని చూసారా? Great....

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. బాగున్నాయి మీ విశేషాలు!

  కొన్ని సంవత్సరాల క్రితం నేను నాష్ విల్ (టెన్నెసీ) లో ఉన్నపుడు మా పక్కింట్లో సూడాన్ కుటుంబం ఉండేది.నేనూ,నా రూం మేట్ వాళ్ళింటికి గృహప్రవేశానికి వెళ్ళాం. అపుడు భోజనాలు చూసి చాలా ఆశ్చర్యపడ్డాం, భోజనాల్లో ఇడ్లీ, సమోసా, దోస (కాకపోతే బీఫ్ దోస) ఉన్నాయి.

  తీరా అసలు విషయం ఆరా తీస్తే తెలిసింది,సూడాన్ లో భారతీయులు బాగా ఉన్నారని. వాళ్ళ ద్వారా ఈ కొత్త వంటకాలు నేర్చుకున్నామని ఆ కుటుంబం చాలా సంతోషంగా చెప్పారు.

  గమనిక: నా మొదటి కామెంటులో అచ్చుతప్పులు ఉంటే సరి చేసాను.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.