Friday, November 28, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౨

సూడాను విమానం దాదాపు ఖాళీ గా ఉంది. ఉన్న కొద్ది మంది భారతీయులు ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళవటం వల్ల, కీసర బాసర గా గోల చేస్తున్నారు. వాళ్ళు మలయాళీలని వేరే చెప్పాలా?

సూడాను విమానాశ్రయం కు వచ్చి పడ్డాము. సాయంత్రం 4:30 గంటలు దాదాపు.అక్కడ ఇమ్మిగ్రేషన్ కవుంటరు దగ్గర నిలబడి ఉన్నాము. ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు ఎవరు లేరక్కడ. ఓ అరగంట టెన్షన్ గా గడిచింది. ఆ తర్వాత నల్లగా పొడుగ్గా ఉన్న ఒకతను మా వద్దకు వచ్చి, మా పాస్ పోర్ట్లను దాదాపు గుంజుకున్నంత పని చేశాడు. గంగిరెద్దు మెడ లో గలగంటలా, అతని మెడ నుండీ వేల్లాడుతున్న ఐ డీ కార్డును ఎవరూ చూడలేదు, నేను తప్ప. అతణ్ణి మేము ఎవరని విచారించే లోపల, ఇప్పుడే వస్తానంటూ ఎటో మాయమయాడు!

మా వాళ్ళు టెన్షన్ తో సినిమాల్లో గుండె పోటు వచ్చే ముందు గుమ్మడిలా తయారయ్యారు. షమీరు అయితే, పోలీసు కంప్లయింట్ ఇద్దామని మొదలెట్టాడు. నేను తన మెడలో మా కంపనీ కార్డు చూట్టం వల్ల నాకు కాసేపు అర్థం అవలేదు, జనాలెందుకు టెన్షన్ గా ఉన్నారో.

సరే, ఎలాగయితేనేం, ఆ నల్లనయ్య తిరిగి వచ్చేడు. అక్కడ ఉన్న ఇమ్మిగ్రేషన్ వాళ్ళతో ఏదో చెప్పి, బయటకు తీస్కెళ్ళాడు. అక్కడ స్కానింగ్ మిషను నడపడానికి ఎవరు లేరు. ఆ మిషను తనే ఆన్ చేసుకుని, ఆ పని అయిందనిపించాడు. సూడాన్ లో అడుగుపెట్టాం.

ఆ వచ్చిన వాడు అజ్ గర్. (అజగరం అంటే పాము అని అర్థం ట). తను అక్కడ మాకు సంబంధించిన కంపనీ లో ఫెసిలిటీస్ మేనేజరు. సూడాన్ లో బయట సంస్థలు స్వయంగా వచ్చి వ్యాపారం చేయడానికి వీల్లేదు. అక్కడ కంపనీ తో పొత్తు పెట్టుకోవడం తప్పనిసరి.

ఇంకో విషయం. ప్రపంచం లో అత్యంత లంచగొండి దేశాల చిట్టాలో మొదటి పదిలో సూడాను ఒకటి (ఎప్పుడో చదివినది). అందులో మన దేశం లేకపోవడానికి, మన వాళ్ళు ఆ చిట్టా తయారు చేసిన సంస్థకు ఎంతో కొంత కట్టబెట్టి ఉంటారని నా ఊహ.

విమానాశ్రయం బయట మా కోసం "బోక్సు" ఎదురు చూస్తోంది. బోక్సు అంటే, కారు కు ఎక్కువ, మెటడోర్ కి తక్కువ. ఓ చిన్న కారుకు, లారీకు వెనుక సైడు లగేజ్ వేయడానికి ఉంచినట్టు, ఓపన్ గా తెరిచి ఉంచారు. కారులో ముగ్గురు మాత్రమే కూర్చోగలరు. మిగిలిన ఇద్దరు కారు వెనుక ట్రాలీలో బయట ప్రకృతి సౌందర్యాన్ని అస్వాదిస్తూ ఊరేగాలి. నేనూ, నితినూ ఆ ఇద్దరం. నాకు చాలా సంతోషమనిపించింది.ఎందుకంటే, ఎప్పుడో కాలేజీ రోజుల్లో వూరి బయట ఉన్న మా కాలేజీ నుండీ వూరికి రావడానికి ఒకట్రెండు సార్లు, బస్సు టాపు పైకి ఎక్కి వచ్చిన రోజులున్నాయి.ఇప్పుడు ఎంతో కాలం తర్వాత అలాంటి అవకాశం !

అన్నట్టు సూడాన్ లో బోక్సు అన్నది ఓ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు. మన ఆటో లాగా.

అజ్ గర్ మమ్మల్ని ఓ అపార్ట్ మెంట్ వద్దకు తీసుకెళ్ళి దింపి, పొద్దున వస్తానని వెళ్ళేడు.

మా ఫ్లాటు లో 2 పడక గదులు, ఓ హాలు, ఓ టాయిలెట్ కం బాత్ రూమ్. అంటే 5 మందికి కలిపి ఒక్కటి! బాత్ రూం లో కాస్త ఫ్రెష్ అవడానికి వెళుతూ, మా కొలీగు నాబ్ ను క్లాక్ వైస్ గా బలంగా తిప్పేడు. అంతే! అది విరిగి చేతికొచ్చింది. అక్కడ మొత్తం మీటలన్ని వ్యతిరేక దిశలో పని చేస్తాయి!! ఉన్న ఒక్క రెస్ట్ రూము, దాని మీట మొదటి రోజు విరగడం. శుభం!!!

మరుసటి రోజు ఉదయం ఆఫీసుకెళ్ళాం. మా పనిలో భాగంగా మేము మా సంస్థ తాలూకు ప్రాడక్టు ను నగరం లో కొన్ని నిర్ణీత ప్రదేశాల్లోనూ, కారులో తిరుగుతూ ఉన్నప్పుడూనూ (రోమింగ్) రకరకాల టెస్ట్ లు జరపాలి. కాబట్టి పొద్దున 10 గంటలకు కారులో బయటపడ్డాం. బయట ఇలా ఉంది.తుఫాను, గాలి వాన అనుకుంటున్నారా? తుఫానే, కానీ గాలివాన కాదు. అది ఇసుక (దుమ్ము) తుఫాను. ఆ ఫోటో లో కనిపిస్తున్నది దుమ్ము, ధూళి. ఎంత ధూళి అంటే, కూత వేటు దూరంలో ఉన్నవి మనకు కనిపించవు. (ఆ ఫోటోలో ఉన్నది మా కొలీగు). దాన్ని "హబూబ్" అంటారు ఇక్కడ.

(సశేషం)7 comments:

 1. >>అందులో మన దేశం లేకపోవడానికి, మన వాళ్ళు ఆ చిట్టా తయారు చేసిన సంస్థకు ఎంతో కొంత కట్టబెట్టి ఉంటారని నా ఊహ.
  :)) నిజమే అయ్యుండచ్చు...!

  >>మిషను తనే ఆన్ చేసుకుని, ఆ పని అయిందనిపించాడు.
  ఎంత స్వేచ్ఛ ప్రజలకి..!!

  >>బోక్సు అన్నది ఓ పబ్లిక్ ట్రాన్స్ పోర్టు. మన ఆటో లాగా
  బెంగళూరు ఆటోలాగా కాదు కదా!

  >>మీట మొదటి రోజు విరగడం. శుభం!!!
  నిజమే, అశుభానికి, అశుభమే శుభం!

  ReplyDelete
 2. "...వాళ్ళు మలయాళీలని వేరే చెప్పాలా?" ఈ వాక్యానికి మీకు 100 వీరతాళ్ళు వెయ్యాలి. ఒక సారి మన్మాడ్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వరకూ అంటే 24 గంటలు ఇలాంటి కీసర బాసర బాచ్ ని మా కంపార్ట్ మెంట్లో భరించాల్సి వచ్చింది.(మాదే తప్పు లెండి, ఎర్నాకుళం నుంచి వచ్చే రైలెక్కితే అంతేగా మరి! రోగం బాగా కుదిరింది)

  ReplyDelete
 3. Correction:

  keesara beesara anaali
  keesara baasara kaadu :)

  ReplyDelete
 4. msmchi snubhsvsm meemu ilss jeevitsmlo snnirskssls psristhitulsnu anubhavaimchi choodali.komchemjaagrattagaa vumdanmdi praamaadaala kaalm.

  ReplyDelete
 5. అజగర్ అంటే కొండచిలువ అని అర్థం.
  ఈ కీసరబీసర గాళ్ళు ఎక్కడకెళ్ళినా ఉంటారు..
  ఇందుగలరందులేరని సందేహము వలదు,
  "మల్లేశము"లెందెందు వెదకి చూచిన
  అందదే గలరు మానవా తైల ప్రపంచమందు..
  అని ఇప్పటి పద్యం..

  ReplyDelete
 6. భలే ఉంది మీ సూడాన్ ముచ్చట్లు! ఫోటో ఎదో ఉపగ్రహం మీద తీసినట్టు ఉంది! ఆకాశం నారింజ రంగులో...

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.