Tuesday, November 25, 2008

సీమ నుండీ సూడాను వరకు - ౧

శ్రీయుతులు గొల్లపూడి మారుతీ రావు గారు కౌముది జాల పత్రికలో జనవరి నుండీ జూలై వరకు ఓ ట్రావెలాగు (టాంజానియా) రాసారు. అత్యద్భుతమైన ట్రావెలాగు అది. అందులో ఆయన టాంజానియా కు ట్రావెలాగు ఏమిటి ఏ అమెరికాకో వెళ్ళక? అన్న అనుమానానికి, ఓ చక్కటి సమాధానం చెబుతారు.

"సంపద ఎక్కడ చూసినా ఒక్కలాగే ఉంటుంది. ఎక్కువ సార్లు చూస్తే బోరుకొడుతుంది....నేలబారు జీవితం ఆకర్షిస్తుంది. ఆలోచింపచేసేట్లు చేస్తుంది.A master piece is monotonus,while life is not...."

బహుశా అందుకేనేమో అభివృద్ధి చెందిన దేశాలకు వెళితే (కొంతకాలం పాటు), మొదట కొన్ని రోజులు ఆ ఆకర్షణ లో మునిగినా, మనకు మన ఇల్లు, మన వూరు, మన జీవితాలు తిరిగి గుర్తుకొస్తాయి. మేధ గారు కొన్ని నెలల క్రితం కొరియా మీద వరుస టపాలు రాశారు. ప్రతి టపా చివర "జై భారత్" తప్పనిసరి.ఆమెది ఆ రకమైన నొస్టాల్జియానే నేమో?

అయితే, ఉన్నన్ని రోజులు (రెండు నెలలు దాదాపు) కాస్తో కూస్తో మన లాంటి మనుషులు, మన జీవిత విధానానికి దగ్గరగా ఉన్న జీవితంతో, Feel at home అన్నట్టు నాకు అనిపించిన (నేను చూసిన) దేశంసూడాను.

************************************

వెంకటేష్ సినిమా "నువ్వు నాకు నచ్చావు" లో చంద్రమోహన్, "మా వాడికి, అదేదో సాఫ్ట్ వేర్ నేర్పించి, అమెరికాకు కాకపోయినా, కనీసం పాకిస్తాన్ అయినా పంపించరా" అంటాడు, ప్రకాష్ రాజ్ తో.

ఒకప్పుడు నాకున్న ఏకైక లక్ష్యం కూడా అదే. అయితే బుద్ధి propose చేస్తే, లెగ్గు Dispose చేసిందన్నట్టు, నా భీకరమైన లెగ్గు వల్ల వచ్చిన అవకాశాలు అన్ని ఏవో కారణాల వల్ల తప్పిపొయాయి. రోజులలా గడుస్తుండగా ఓ రోజు నేను పనిచేస్తున్న కంపనీకి ఓ సూడాను ప్రాజెక్ట్ వచ్చింది. ఆన్ సయిట్ కి 5 మంది వెళ్ళాలి. సూడాను కాబట్టి ఎవరు ఆసక్తి చూపకపోవడంతో, 12th మాన్ లా పడి ఉన్న నాకు అవకాశం వచ్చింది. సూడాను అయితేనేం, నా జీవితంలో మొట్టమొదటి విదేశయాత్ర!

అయితే, అనుకున్నంత వీజీగా గడవలేదు. ప్రయాణానికి అడుగడుక్కూ ఆటంకాలే. నన్ను తప్పించి, ఇంకో అమ్మాయికి ఆన్ సయిట్ చాన్స్ కట్టబెట్టాలని బాసురుడి ఊహ (ఎందుకో ఊహించుకోండి). అయితే, ఆ అమ్మాయి అదివరకే ఒకట్రెండు అభివృద్ధి చెందిన దేశాలు తిరిగి ఉండటం వల్లా, పైగా నాకా అమ్మాయి మంచి మిత్రురాలవటం వల్ల, అవకాశం తిరస్కరించింది ఆవిడ.

ఆఫీసులో ఇలా ఉంటే, ఇంటి దగ్గర మా నాన్న నా జీవితం పైన కుట్ర పన్ని నాకు పెళ్ళి చేయాలని తీవ్ర ప్రయత్నాలు ఆరంభించాడు. (నాకు పెళ్ళి సుతరాము ఇష్టం లేదు. ఫిలాసఫీ తల నిండా దట్టించుకున్న వాణ్ణి కాబట్టి). ఓ బలహీనమైన క్షణంలో మా నాన్న మాటకు సరే అన్నాను. ఇక అమ్మాయిని చూసారు. (మాకు తెలిసిన అమ్మాయే). పెళ్ళి చూపులు (బలవంతపు బ్రాహ్మణార్థం) ఎపిసోడ్ అయిపోయింది. అప్పుడు సరిగ్గా ఈ ట్రావెలు.

ఒడిదుడుకులన్నీ అయిన తర్వాత, ఓ సాదా ముహూర్తంలో (శుభ ముహూర్తం అనడం లేదు. ఆఫ్రికాకు వెళ్ళటానికి ఏ తొక్కలో ముహూర్తమైతేనేం?) బెంగళూరు నుండీ కింగ్ ఫిషర్ విమానంలో ముంబై కి బయలుదేరాం. అక్కడ నుండీ ఖతర్ ఎయిర్ లైన్స్ (ఈ పేరు విన్నప్పుడు ఎందుకో ఎడమ కన్ను అదిరింది నాకు) లో మా ప్రయాణం, సూడాను రాజధాని ఖార్తూమ్ కు. మధ్యలో దోహాలో (ఖతర్ రాజధాని) విమానం మార్పు.

*************************************

కింగ్ ఫిషర్ విమానంలో చాలామంది క్వీన్ లు. మొట్టమొదట ఏరోప్లేన్ ఎక్కగానే, అదీ కింగ్ ఫిషర్ విమానం, ఓ కొత్త బంగారు లోకం లోకి వచ్చి పడ్డట్టు అనిపించింది. మా జట్టులో మొత్తం 5 మంది. ఆ ఐదుగురిలో నేనూ, మా ఆన్ సయిటు టీం లీడరు నితినూ మట్టి ముఖాలం., పల్లెటూరి సరుకు. నితిన్ నాకంటే ఓ ఆకు ఎక్కువ నమిలాడు. బీహారీ. మిగిలిన ముగ్గురు సివిలైజ్డ్.

విమానం ఎక్కగానే మమ్మల్ని ఆహ్వానిస్తూ ఓ అమ్మాయి, చిరునవ్వుతో విష్ చేసింది. "ప్లీజ్ వెల్ కం" అంటూ. మా వాడు బదులుగా, ముఖమంతా నవ్వులు పులుముకుంటూ, "గుడ్ మార్ణింగ్" అన్నాడు. అప్పుడు సమయం సరిగ్గా, రాత్రి 9:30 గంటలు.

అలాంటి మరికొన్ని సంఘటనల మధ్య ప్రయాణం ప్రారంభమై, బొంబాయి విమానాశ్రయం వచ్చి పడ్డాం.

అక్కడ నాకు ఓ హర్డిల్ ఎదురయింది. సూడాన్ వెళ్ళటానికి మాకు సూడానులో మా కంపనీ తరపు ఆఫీసు నుండీ, అక్కడ ఎంబసీ ఆమోద ముద్ర పొందిన ఓ ఆహ్వాన పత్రం మాత్రమే ఉన్నది. వీసా (స్టాంపు) లేదు మా దగ్గర. నేను నిలబడ్డ క్యూలో ఉన్న వీసా ఆఫీసరు నన్ను ఎగాదిగా చూసాడు. నా పాస్ పోర్ట్ పెళ్ళి శుభలేఖలా కొత్తగా నవనవలాడుతూ ఉంది. నేను వెళ్ళబోయేది సూడాను. వాడికి అనుమానం వచ్చి, ఓ పెద్ద ఇంటర్వ్యూ మొదలెట్టాడు. యెల్లో ఫీవర్ షాట్ చూపించమన్నాడు (ఆఫ్రికా దేశాలకు వెళ్ళాలంటే, యెల్లో ఫీవరు ఇంజక్షను తీసుకోవడం తప్పనిసరి, తీసుకున్నట్టు ఋజువు కూడా చూపించాలి.), ఇంకా కంపనీ పేరు, అక్కడ సూడానులో మా ఆఫీసెక్కడ, ఇలా... నాకు టెన్షను పెరిగిపోసాగింది. మా వాళ్ళందరు ఇమ్మిగ్రేషన్ దాటి నా కోసం చూస్తున్నారు. ఆ ఇమ్మిగ్రేషను వాడు పక్కకెళ్ళి ఇంకో ఆవిడను పిలుచుకొచ్చాడు. ఆవిడ, వాడు మరాఠీలో మాట్లాడుకున్నారు కాసేపు. ఎట్టకేలకు నన్ను ఆమోదించి, పంపించారు అవతలకు.

ఆన్ సయిట్ కు బలిపశువుల్లా మా ప్రయాణం మొదలయింది. అన్నట్టు ఖతర్ ఎయిర్ లైన్స్ లోగో - మేక.

*************************************

ఎట్టకేలకు విమానం బయలుదేరి, ఖతార్ రాజధాని దోహా లో వచ్చి ఆగింది. దోహా విమానాశ్రయం శుభ్రంగా, విశాలంగా ఉంది. విమానాశ్రయం లో కార్మికులు చాలామంది భారతీయులే. విమానాశ్రయంలో ఓ చోట ప్రపంచ పటం, ఎక్కడెక్కడి నుండీ విమానాలు నడుస్తున్నాయి తదితర వివరాలు సూచించబడ్డాయి.

అందులో భారద్దేశం కూడా ఉంది. అయితే భారద్దేశం లో కాశ్మీరులో కొంత భాగాన్ని మాత్రం (ఆ భాగాన్ని ఆ - ఆక్రమిత పేరుతో పిలవడం అంటే మనస్సు చివుక్కుమంటుంది) పాకిస్తానులో కలిపి చూపించారు!

అక్కడ విమానం మారి సూడాను రాజధానికి వెళ్ళే విమానం ఎక్కాము. మా ఆన్ సయిట్ యాత్ర మొదలయింది.

(యేడాది క్రితం బ్లాగ్లోకంలో నా మొట్టమొదటి టపా కూడా ఇదే మకుటంతో రాసాను. దానికి కొనసాగింపు ఇది.)

(సశేషం)

9 comments:

 1. Beginning అదిరింది రెవి గారు.....
  waiting for the next post..

  --Venuram

  ReplyDelete
 2. అన్నట్టు రవి గారూ.. తోట రాముడికి దినకర్ లాగా మీకు నితినా??? ఏమీ లేదు..ఏమీ లేదు. King fisher ,Queenslu + కొత్తబంగారు లోకం. అంటెనూ తోటరాముడి గారి పొస్ట్ గుర్తుకొచింది

  --Venuram

  ReplyDelete
 3. బాగుంది.

  అలాంటి ప్రదేశాలను చూడాలనుకున్నా చూడలేం..ఆ రకం గా చూస్తే మీరు లక్కీ..

  ReplyDelete
 4. ఓపెనింగ్ చాలా బావుంది. తపా కూడా సూపర్

  ReplyDelete
 5. ప్రారంభం బాగుంది...
  ఈ సారి ముగించేయండి మరి...

  ReplyDelete
 6. ప్రారంభం బాగుందండి మరిన్ని విశేషాల కోసం ఎదురు చూస్తున్నాను, మమ్మల్నీ మీతో పాటు సూడాన్ లో అలా ఓ రౌండ్ వేయించేయండి.

  ReplyDelete
 7. బలిపశువు....మేక...ఇది భలే సింబాలిక్ గా ఉందండి! వెయిట్ చేస్తున్నాం తరవాత పోస్టు కోసం.

  ReplyDelete
 8. >>సంపద ఎక్కడ చూసినా ఒక్కలాగే ఉంటుంది. ఎక్కువ సార్లు చూస్తే బోరుకొడుతుంది....నేలబారు జీవితం ఆకర్షిస్తుంది. ఆలోచింపచేసేట్లు చేస్తుంది.A master piece is monotonus,while life is not....

  ఇది చాలా కరెక్ట్...


  ఏంటండీ, ఖతార్ ఎయిర్ లైన్స్ బావుండదా..?! వాళ్ళు ఇచ్చే యాడ్స్ చూస్తే, చాలా బావుంటుందేమో అనిపిస్తోంది!!!
  అంతకుముందు సూడాన్ ఇమ్మిగ్రేషన్ వాటి గురించి వ్రాసినట్లున్నారనుకుంటా!.. ఈసారి సగం సగం కాకుండా మొత్తం కబుర్లు చెప్పాలండోయి!

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.