Friday, November 14, 2008

సిద్ధాంతం - నమ్మకం

బ్లాగ్లోకంలో సున్నితమైన విషయాల గురించి చర్చలు రకరకాల రీతుల్లో కొనసాగుతున్నాయి. ఇంతకు మునుపు చివుకుల కృష్ణమోహన్ గారి బ్లాగులో మొదలయిన రామాయణ చర్చ అనేక రీతుల్లో సాగి, అంతకు మునుపు ఇదే విషయంపై సాగిన చర్చను వెలికి తీసింది, ఇంకా విభిన్న కోణాలను ఆవిష్కరించింది. అయితే, లోగడ ఓ సారి భైరవభట్ల గారు సూచించినట్లు, ఇలాంటి చర్చల వల్ల అపోహలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.ఆ అపోహలకు కారణం ఆయా వ్యక్తులకు ఆయ విషయాలపై మీద ఉన్న తీవ్రమైన నమ్మకం ఓ కారణం కాగా, రచయిత చెప్పిన విషయాలను, ఉద్దేశ్యాలను ఆకళింపు చేసుకునే ప్రయత్నం కన్నా ముందుగానే అభిప్రాయాలకు వచ్చేయడం ఇంకో కారణం అవుతోంది.

ఓ నమ్మకాన్ని తీవ్రంగా విశ్వసించడం వల్ల మన దృక్కోణం పాక్షికమవుతుంది. సరిగ్గా అక్కడే నమ్మకం సిద్ధాంతంగా మారడం జరుగుతుంది.

తిరిగి అడుసు తొక్కుతున్నానని అనుమానం ఉన్నా, ఇప్పుడు రాముడిపైనో, మత విశ్వాసాల మీదో బురద చల్లడం నా ఉద్దేశ్యం కాదు కాబట్టి, రాముడి సంగతి ప్రస్తావిస్తున్నాను ధైర్యం చేసి.

"రాముడు ఏకపత్నీ వ్రతుడు. శూర్పణఖ వలచినా లొంగలేదు...తన కు భార్య లేకుంటే యాగానికి అనర్హుడనైనప్పుడు బంగారు బొమ్మను పెట్టుకున్న ఆతండ్రి ఏకపత్నీ వ్రతమెక్కడ? ..."

ఓ వ్యక్తి ఔన్నత్యమో, గొప్పతనమో మనం ఊహించేప్పుడు, తన చర్యలను, వాటి వెనుక ఉద్దేశ్యాలను, ఆ తర్వాత ఉద్దేశ్యాల వెనుక సిద్ధాంతాలను మనం పరిగణిస్తాం అసంకల్పితంగానైనా.

"కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ద్వారా కర్తవ్య బోధ చేశాడు"

కృష్ణుడి చర్య - గీత బోధ (ఇక్కడితో ఆగితే మనకు కృష్ణుడి గొప్పతనం తెలియదు)
ఉద్దేశ్యం - కర్తవ్య విమూఢుడిగా ఉన్న అర్జునుడికి దిశానిర్దేశం చేయడం. (ఇక్కడ మనకు ఆయన గొప్పతనం తెలుస్తుంది).

ఇప్పుడు మొదటి వాక్యం చూద్దాం.

"రాముడు ఏకపత్నీ వ్రతుడు. శూర్పణఖ వలచినా...."

చర్య - ఏకపత్నీవ్రతం
ఉద్దేశ్యం - జాగ్రత్తగా ఆలోచిస్తే,

ఏకపత్నీవ్రతం - ఓ గొప్ప వ్రతం.
ఏకపత్నీ వ్రతం - తనకు జీవితానికి అనుకూలం

మొదటి విషయానికి వస్తే, ఏకపత్నీ వ్రతం గొప్ప వ్రతమా? అలా అయితే, స్వయంగా రాముడి తండ్రి దశరథుడు ఏకపత్నీ వ్రతుడెందుకు కాలేదు? ఇంకా కాస్త ముందుకెళితే, సుగ్రీవుడు ఏకపత్నీ వ్రతుడు కాడు. సీతను చెరపట్టక ముందు వరకు రావణుడు - గొప్ప శివభక్తుడు, ఆత్మ లింగాన్ని సాధించిన వాడు, గొప్ప వ్యాకరణవేత్త, జ్యోతిశ్శాస్త్ర పండితుడు, రాజనీతిఙ్ఞుడు. లంకా రాజ్యం సకల సౌభాగ్యాలతో తులతూగేది, కాస్తో కూస్తో అయోధ్యకంటే కూడా. ఆ రావణుడు బహుపత్నీకుడే. అంటే, అప్పటి సమాజ పరిస్థితుల దృష్ట్యా చూచినా బహుపత్నీ వ్రతం పెద్ద దోషం కాదు.ఏకపత్నీ వ్రతం గొప్ప వ్రతమూ కాదు. (ఇక్కడ ఓ చిన్న విషయం. ఏకపత్నీ వ్రతం గొప్ప వ్రతం కాదు అని నేను ఊహించినది దశరథుడు మొదలైన వారు పాటించలేదు కాబట్టి అన్న అంచనాతో వచ్చింది తప్ప, రామాయణ గ్రంథం ఆసాంతం చదివి కాదు. ఒకవేళ వాల్మీకి తగిన కారణాలు చెప్పి ఉంటే తప్పు నాదే.). ద్వాపర యుగానికి వస్తే, కృష్ణ పరమాత్ముడు బహుపత్నీకుడు.

పై కారణాల దృష్ట్యా చూస్తే, ఏకపత్నీ వ్రతం అన్నది, తనకోసం తన అనుకూలత కోసం తను విధించుకున్న నియమం అన్నది మాత్రమే కనిపిస్తుంది.అంటే, ఇంకో రకంగా చెప్పాలంటే, ఏకపత్నీ వ్రతం అన్నది ఓ సిద్ధాంతం (ideal) తప్ప అంతర్గతంగా విలువను ఆపాదించుకున్న ఓ సత్యం అన్న చెప్పలేము. ఏకపత్నీ వ్రతం గొప్ప వ్రతం అయితే కృష్ణుడి గొప్పతనాన్ని శంకించాలి. రాముడి ఏకపత్నీవ్ర్తతం ఎంత గొప్ప నియమమో, కృష్ణ పరమాత్ముని ప్రేమతత్వం కూడా అంటే గొప్పది. అంటే - (ఓ మనిషి చర్యలో) గొప్ప తనం సిద్ధాంతంలో లేదు!

ఇక్కడ నా ఉద్దేశ్యం, రాముడనే పౌరాణిక పురుషుడిపై బురద చల్లటమో, లేదూ, తప్పుల తడక అభిప్రాయాలను అందరిపై రుద్ధటమో కాదు. కేవలం, ఓ సిద్ధాంతం ఎంత గొప్పగా కనపడినా అందులోని పాక్షికత ను ఉదహరించటమే. అలాగని ఏకపత్నీ వ్రతులందరూ చెడ్డ వారని చెప్పటం లేదు.

రాముడు, లేదా ఓ మహనీయుడి గురించి తెలుసుకోవాలంటే, వారి చర్యలు, వాటి వెనుక అంతర్యం లోని మౌలిక విలువల గురించి సూక్ష్మ పరిశీలన గావించి తెలుసుకోవాలి. లేదంటే, వారి వ్యక్తిత్వాలు మన దైనందిన జీవితాలకు ఉపయోగపడతాయో వాటిని గ్రహించాలి.

సందర్భం వచ్చింది కాబట్టి, నేను చేసిన వ్యాఖ్యలు, గురించి ప్రస్తావిస్తాను.

"కృష్ణుడు ఆత్మ నిర్దేశం ప్రకారం నడుచుకున్న వాడు కాబట్టి అవతార పురుషుడు" - ఈ నమ్మకం నాలో బలంగా నాటుకుపోవటం వల్ల, ఓ సారి నా వ్యాఖను నేను పునశ్చరించుకున్నప్పుడు ఇదో ideal - ప్రతిపాదన లాగానే కనిపించింది తప్ప, ఇందులో నేను కనుక్కున్నది, నిజం అన్నది ఏమీ లేదు. అలానే కృష్ణుడి ఇంకొకరు చెప్పిన statement లో కూడా ప్రతిపాదన కనిపించవచ్చు తప్ప, ఓ మౌలికత, అంతర్గత విలువ అన్నవి లేవు.

ఈ విషయం మనం సంయమనంతో, ఆత్మ పరిశీలనలో మనం తెలుసుకోగలిగితే, వివాదాలు వచ్చే అవకాశం తక్కువ. అప్పుడు ఓ గొప్ప విలువ, లేదా ఓ మహనీయుడి వ్యక్తిత్వం అన్నది మౌలికంగా మన నిత్యజీవితాలకు ఉపయోగపడుతుంది అన్న దృక్పథంలో ఆలోచిస్తామేమో!

33 comments:

 1. బాగుంది రవిగారూ, చివరి పేరా చాలా బాగా రాసారు.
  నేను చెప్పదలుచుకున్నది - రాముడు కేవలం ఏకపత్నీవ్రతం వల్లే పూజనీయుడు కాలేదు. కృష్ణుడు ఆత్మనిర్దేశం ప్రకారం నడుచుకోవడం ద్వారానే అవతారపురుషుడు కాలేదు. వాళ్ళ వ్యక్తిత్వానికి ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి. అందుకే ఇన్నవేల ఏళ్ళనుండీ సమాజం వాళ్ళని తలుచుకుంటున్నది. ఎవరి నమ్మకాలు,ప్రాధాన్యతలూ బట్టి వారికి ఆ పార్శ్వం కొంచెం ప్రధానంగా గొప్పగా కనిపిస్తుంది. సచిన్‌ టెండూల్కర్ స్ట్రైట్ డ్రవ్ అనీ, గంగూలీ ఆఫ్ సైడ్ అనీ పేరు పడిపోయినట్టన్నమాట. (ఇక్కడ ఒక చదరంగం ఉదాహరణ ఇద్దామనుకున్నా - సులభంగా ఉంటుందని ఇలా క్రికెట్ తో సెటిల్ అయిపోయా). నిజానికి వాళ్ళు అదొక్కటే కాదు. నిజంగా సచిన్‌ అదొక్క షాటే కొట్టుంటే ఇన్ని పరుగులు చేసేవాడా? అలాగే ఈ మహాపురుషులు ( ఆ మాటకొస్తే ఏ మహాపురుషులైనా), వాళ్ళ వ్యక్తిత్వంలో ఎన్నో పార్శ్వాలుంటాయి. అప్పటి కాలమాన పరిస్థితులు, అప్పటి సమాజం అవసరాలు, భవిష్యత్తులో సమాజానికి అందించాల్సిన విలువలు (ఇంకా చాలా) - అవన్నీ కలిస్తేనే వాళ్ళు మహాపురుషులవుతారు.
  వాళ్ళు మహాపురుషులు అనడంలో ఉన్న ఒకటే అంతరార్థం ఏమిటంటే వాళ్ళని మనం దిక్సూచిలా ఉపయోగించుకోవచ్చు అని. దీనివెనక సమాజం తాలూకు పెద్ద కుట్ర ఏమీ ఉండే అవకాశం నాకేమీ కనిపించటంలేదు. ఎందుకంటే సమాజంలో కొంతమంది వ్యక్తులు ఒక అబద్ధాన్ని కొంతసేపు నమ్మించగలరు. వందల తరాలబట్టి, కోట్లజనాల్ని తిమ్మిని బమ్మిని చేసి నమ్మించడం సాధ్యం కాదు. ఈ కోట్ల జనాలలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మరిందరు మహాపురుషులు కూడా ఉన్నారని మర్చిపోకండి. ఉదాహరణకి గాంధీ, త్యాగరాజు .. కేవలం రామభక్తులనే పేర్కొనడంలో కుట్రేమీ లేదు - కృష్ణుడి గురించి మీకూ నాకూ వివాదం లేదుకదా :)
  అందుకే నేను అనేది ఏమిటంటే - మనం కనుక్కొన్న వెంటనే జనాలకి చెప్పేయడంలో తప్పేమీ లేదు. కానీ, ఒక మహాపురుషుని వ్యక్తిత్వంలో చెడు అని మనకి కనిపిస్తే -కొంచెం సంయమనం పాటించి - నేను అర్థం చేసుకోవడంలో పొరపడుతున్నానా అని మరింత ఆలోచించడంలో నష్టం ఏముంది?
  ఇంగ్లాండు రాజు, లైట్ హౌస్ కథ తెలిసిందే కదా! రాజుగారి నౌక వస్తూ లైటు కనిపిస్తే మీరు తప్పుకోండని ఆజ్ఞ పంపిస్తారు. మీరే తప్పుకోవాలి అని అటునుంచి సందేశం వస్తుంది. నేను బ్రిటిషు రాజుని తెలుసా అని ఇట్నుంచి సందేశం పంపితే - మేము లైట్ హౌస్ ని అటునుంచి రిప్లై వస్తుంది. మనమందరమూ రాజులమే - మహా ముఖ్యులమే - డౌటే లేదు. కాకపోతే మహాపురుషులు అని చరిత్రలో నిల్చున్నవాళ్ళు లైట్ హౌసులు. అర్థం కాకపోతే తప్పుకుని వెళ్ళిపోడం మంచిది అంతేకానీ, మీరు లైట్ హౌసే కాదు అనడం అంత భావ్యం కాదేమో!

  బహుశా మీరనుకున్నదే నేనూ రాసినట్టు ఉన్నాను. మరో భాషలో అనుకుంటా...

  చివరిగా... ఏకపత్నీవ్రతాన్ని వివరించింది వాల్మీకి అని మీ ఉద్దేశ్యం అనుకుంటా - వ్యాసుడు అని రాసేరు..

  మంచి టపాకి అభినందనలు.

  ReplyDelete
 2. రవి గారు,
  మనకు తెలిసిన విషయాల ఆధారంగా సిద్ధాంతాలు చేయకూడదని అంటూనే మీరు సిద్ధాంతాలు ప్రతిపాదించేస్తున్నారు:-)

  రాముడు ఏకపత్నీ "వ్రతం" ఏదీ కోరి ఆచరించలేదు. నేను ఫలానా వ్రతం చేస్తున్నానని రాముడెక్కడా అనలేదు. వాల్మీకి కూడా నాకు తెలిసినంతవరకు రామాయణంలో ఎక్కడా ఆ పదాన్ని వాడలేదు. అది తరువాత వచ్చిన వారు చేసిన 'సిద్ధాంతం' మాత్రమే.

  రామునికి ముందు, తరువాత కూడా ఒకే భార్య కలవారు, బహు భార్యలు కలవారు అనేక మంది ఉన్నారు. రాముడి, కృష్ణుడి దైవత్వం, మహనీయత, మాననీయత వారి భార్యల సంఖ్యను బట్టి రాలేదు. వారు మహనీయులు కనుక వారనుసరించిన దారి ఇతరులు మార్గ దర్శకంగా భావించారు. ఆనాటి ధర్మాలు వేరు, ఈ నాటి కొలమానాలు వేరు. ఇంచిటేపు తీసుకొని నక్షత్రదూరాలను కొలవబోవడం వృధా ప్రయాస. అరుంధతి "నిత్య బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళాలి, దారి విడువు" మంటే గంగ వశిష్ఠాశ్రమానికి దారినిచ్చిందని ఐతిహ్యం.తన భర్త నిత్య బ్రహ్మచారి ఎలా అయ్యాడో ఆ మహాసాధ్వికే అర్థం కాలేదట.

  కేవలం నాన్ కన్ఫార్మిస్టుగా ఉన్నందువలన కృష్ణుడు అవతార పురుషుడైతే, 'అందరిలా రోడ్డుకు ఎడమవైపునే ఎందుకు వెళ్ళాలి? నేను కుడివైపున వెళతాను' అనుకొనేవాడు కూడా అవతార పురుషుడిగా భావించుకోవచ్చు. పాయింట్ ఏమిటంటే, కృష్ణుడు అవతార పురుషుడు కనుక ఆయన నాన్ కన్ఫార్మిజం పూజనీయమైంది.

  వివాదాల జోలికి వెళ్ళద్దనుకుంటూనే మీ పోస్టు చూసి ఆగలేక నా అభిప్రాయాలను చెప్పేశాను.

  ReplyDelete
 3. "స్వయంగా రాముడి తండ్రి దశరథుడు ఏకపత్నీ వ్రతుడెందుకు కాలేదు? ఇంకా కాస్త ముందుకెళితే, సుగ్రీవుడు ఏకపత్నీ వ్రతుడు కాడు. సీతను చెరపట్టక ముందు వరకు రావణుడు - గొప్ప శివభక్తుడు, ఆత్మ లింగాన్ని సాధించిన వాడు, గొప్ప వ్యాకరణవేత్త, జ్యోతిశ్శాస్త్ర పండితుడు, రాజనీతిఙ్ఞుడు. లంకా రాజ్యం సకల సౌభాగ్యాలతో తులతూగేది, కాస్తో కూస్తో అయోధ్యకంటే కూడా. ఆ రావణుడు బహుపత్నీకుడే."
  - అప్పటి సమాజం బహుపత్నీవ్రతాన్ని పాటిస్తూంటే తన అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి రాముడు non - confirmist and rebellion గా ప్రవర్తించాడని అలా అనేసారేంటండి బాబూ!

  ReplyDelete
 4. టపా బాగుంది, చర్చ కూడా బాగుంది. ఈ వారం ఊపిరి సలపనంత పని. ఎక్కడా కామెంటేయడం కుదర్లేదు.

  అవతారాల గురించి నేనింక చర్చించదలచుకోలేదు. రవిగారూ, మీ టపా మాత్రం బాగుంది.

  ReplyDelete
 5. ఆ అపోహలకు............ నుంచి .............ఇంకో కారణమవుతుంది .........దాక అర్ధం కాలేదు.
  రవి గారు,
  రాముడు అవలంబించిన ఎకపత్ని వ్రతం ప్రాధాన్యత సంతరించు కోవడానికి కారణం క్షత్రియునిగా బహు భార్యలని కలిగి వుండే అధికారం అర్హత కలిగికూడా ఏక పత్నివ్రతునిగా ఉండదలచటం,ఉండటం.
  కృష్ణు ని విషయంలో,
  నాకు తెలిసి,సత్యభామ,రుక్మిణి,జాంబవతి,మిత్రవింద,కాళింది,నాగ్నజితి మొదలైన వారందరూ వారంతట వారుగా వలచారు,లేదా పెద్దలద్వార ఇవ్వబడ్డారు.
  చివుకల కృష్ణ మోహన్ గారి మొదటి ఆరు వాక్యాలకు సంపూర్ణ మద్దతు.
  చంద్ర మోహన్ గారు,'భార్యల సంఖ్యా బట్టి కాదు 'చాల కరెక్ట్.
  అయిన ,ఈ అంశంలో కూడా ఎక్కువ తక్కువలని నిర్ణయించే పరిస్తితి లేదు అని చెప్పడానికే పైది రాసాను.
  రాముడు,కృష్ణుడు గొప్ప వాళ్ళో ,కాదో ,అయితే ఎందువల్ల అవునో,కాకపోతే ఎందువల్ల కాదో ,ఎవరికీ అవునో,ఎవరికీ కాదో పక్కన పెడితే,
  వారి ప్రభోదాన్ని,మార్గాన్ని,వ్యక్తిత్వాన్ని ఆరాధించి,గౌరవించే వాళ్ళున్న చోట దిగువస్తాయి వ్యాఖ్యానం సరి కాదు.అని చెప్పడం నా ఉద్దేశం.
  ekapatnivratam,siddhantam kadu.viluvani aapadinchukunna satyam annade nijam.
  vaalmiki ramayanam chadavandi.

  moulikatani,antargata viluvalani nirnayinchadaniki ,calculate cheyyadaniki,derive cheyyadaniki,equation teliste,cheppagaligite,adi siddantamo,pratipadano tappaka cheppagalanu.
  verevaro annatlu,'neenu undabattaleka rasa'.
  subhabhinandanalatho,


  ppramilap@yahoo.com
  deenimida inka charchalangikarinchabadavu,endukante......endukante.....nakinka type chese opika ledu...(J>K'ing)(yavath blogger landariki pratyeka abhinandanalu,inta oopigga type chestonnanduku......okka rojuke naa pani ..hare rama..hare krishna)

  ReplyDelete
 6. absolute విలువలు అమితంగా కాంక్షించే వ్యక్తులకు మీ theory of relativity అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఆర్థం చేసుకునే ప్రయత్నంకన్నా,అపార్థం చేసుకునే అవకాశాలే మెండు.

  Interpretation కి అవకాశమే లేదు అని భీష్మించుకుంటే,ఆధునిక ధ్రుక్పధం ఎలా అలవడుతుంది?

  ReplyDelete
 7. ఇలాంటి విషయాలపై చర్చించేంత విషయం నాదగ్గర లేదు. అంచేత మీకు నేనేమీ చెప్పలేను.
  ---------------
  మహేష్,
  ఏమిటి ఆధునిక దృక్పథం? మన సంస్కృతిని కించపరుస్తూ మాట్టాడ్డమా? మన చారిత్రక, పౌరాణిక వ్యక్తులను చులకన చేసి, ఎగతాళిగా మాట్టాడ్డమా? నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, పశుప్రాయంగా బతకడం తప్పేం కాదని బోధించడమా? నైతికతకు తిలోదకాలిచ్చే మార్గాలివీ అని విడమర్చి చెప్పడమా?

  ఇది ఆధునిక దృక్పథం కాదు.. ఒక జాతి సంస్కృతిని, దాని వారసత్వాన్నీ, ఆ జాతి నమ్మే ఆధ్యాత్మిక, తాత్విక విలువలనూ తెగనరకాలనే విధ్వంసక వాదం అంతర్లీనంగా ఉందిందులో. ఈ రకపు ఆధునిక దృక్పథం లేనందువలన బాధేం పడక్కర్లేదు,

  ReplyDelete
 8. చివుకుల కృష్ణ మోహన్ గారు, చంద్రమోహన్ గారు : నిజానికి నా టపా కన్నా, మీ సమాధానాలే బావున్నాయి.

  @చంద్ర మోహన్ గారు : మన లాంటి వారు ఏది మాట్లదినా సిద్ధాంతం లానే ముగుస్తుంది చివరికి. because, ours is quest or seeking, and we are not realized ones :-).

  మహేష్ గారు : ఆధునిక దృక్పథం అన్నది భౌతిక జగత్తులో అలవర్చుకోవలసిందే. పార భౌతిక జగత్తులో (metaphysical world) interpretations కానీ అవి కేవలం interpretations అన్న ఎఱుక ఇంకా ముఖ్యం.

  ReplyDelete
 9. chaduvari garu, very very well said !

  Athi telivi vaadanalu chesi, daniki 'absolute values' follow avutunnaavu kabatti artham kaadu neeku anatam...yuddhaaniki munde satruvu balaanni neerasa parche goppa prakriya !

  As if following absolute values is a foolish thing !

  ReplyDelete
 10. Dear Mahesh,

  you are regularly using "theory of
  realtivity "in your posts .I am not able to understand your wording


  Do you explain me regarding this

  Already I put a comment in your site regarding this.

  Do explain

  ReplyDelete
 11. బావుంది రవిగారు. మీరో మెట్టు పైకెక్కారు :-)
  శాశ్వత విలువలంటూ ఏవీ లేవని, దేశకాల పరిస్థితులబట్టి అవి మారుతూ ఉంటాయనే నా నమ్మకం. ఆ విలువలు సాంప్రదాయిక విలువలు కావచ్చు, ఆధునిక దృక్పథాలు కావచ్చు, ఆత్మనిర్దేశం ప్రకారం నడుచుకోవడం కావచ్చు, ఆఖరికి శాంతి, అహింస, మానవత్వం అయినా కావచ్చు. ఏ విలువలూ శాశ్వతమైనవీ, పరమమైనవీ కావు.
  సమాజంలో అధికులు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయిస్తారో అదే మంచి చెడులుగా చెలామణీ అవుతుంది. ఒక మనిషి/పాత్ర "మహనీయుని"గా చెలామణీ అవ్వడంలో కుడా ఇదే కారణం.
  నేనింతకుముందు చెప్పిన "మంచిని" గ్రహించడం అన్నప్పుడు కూడా నా ఉద్దేశం మనమున్న కాలంలో చెలామణీ అవుతున్న "మంచి" అని.
  ఆధునిక దృక్పథంలో కానీ, సంప్రదాయంలో కానీ మనం ఎక్కువ మంచిని చూస్తామా చెడును గ్రహిస్తామా అన్న విషయాల్లోనే విభేదాలు వచ్చేది. మంచిని గ్రహించాలనుకుంటే సంప్రదాయంలోనూ, ఆధునిక దృక్పథంలోనూ కూడా మంచిని గ్రహించ వచ్చు. చెడుని చూడాలనుకున్నప్పుడూ ఆ రెంటిలోనూ అది కనిపిస్తుంది.

  ReplyDelete
 12. "పార భౌతిక జగత్తులో (metaphysical world) interpretations కానీ అవి కేవలం interpretations అన్న ఎఱుక ఇంకా ముఖ్యం" - perfect.

  భౌతిక జగత్తుకు సంబంధించిన విషయాలలోనైనా, ఈ రకమైన ఎఱుక మనల్ని మూసల్లో పడకుండా ఉంచుతుందని నా అభిప్రాయం.

  ReplyDelete
 13. Hello Chaduvari !
  kudos!
  Hello Prameela,
  Bravo !
  I have read your earlier comment too.
  You are awesome.
  Ravi !
  I don't call you a non-realised one,I would rather prefer calling human being under the process of evolution.

  ReplyDelete
 14. @ మహేష్ గారు,
  మీ Absolute Values, Relative Values వాదన నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఐనా నాకు అర్థమైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను.

  విలువలను పూర్తిగా Absolute అని గానీ, పూర్తిగా Relative అనిగానీ బ్రాండింగ్ చేయలేమని నా అభిప్రాయం. కొన్ని విలువలు (ఉదా: మోనోగామీ, పాలీగామీ) సాపేక్షంగా ఆయా దేశ కాల పరిస్థితులను బట్టి గొప్పవిగానో, ప్రాముఖ్యం కోల్పోయినవిగానో, లేక Taboo గానో మారిపోవచ్చు. అలాగే కొన్ని విలువలు (ఉదా: అన్న మాటకు కట్టుబడడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం) ఎప్పటికీ తమ ప్రాముఖ్యాన్ని కోల్పోకుండా Absolute గా నిలిచి పోతాయి.ఇలాంటి అబ్సల్యూట్ విలువల అధారంగానే కొందరిని మహనీయులుగా గుర్తిస్తాము. విలువలన్నీ సాపేక్షమే ఐతే ఎప్పుడో త్రేతా యుగంనాటి విలువలు ఈ కలియుగంలో చెల్లకుండా పోయి ఆనాటి విలువల ఆధారంగా పూజనీయుడైన వ్యక్తి ఈ నాడు పూజనీయుడు కాకుండా పోవాలి. కానీ అలా జరగలేదు.

  ఇవ్వాళ మనం ఉన్నట్టుండి చనిపోతే మరో యాభై ఏళ్ళ తరువాత ఎంతమంది మనలను గుర్తుంచుకొంటారు? అలాంటిది కొన్ని యుగాలముందు అవతరించి, మరణించిన, ఒకానొక కోసల రాజును ఇప్పుడుకూడా ప్రజలు దేవునిగా కొలుస్తున్నారంటే కారణం యేమిటి ? ఆ మహాపురుషుని విలువలు అబ్సల్యూట్ కావడం వలననే కాదా! కొన్ని విలువలు Absolute అనీ, వాటిని ప్రజలు ఎప్పుడూ గౌరవిస్తారనీ చెప్పడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి? అలాంటి అబ్సల్యూట్ విలువలను రిలేటివ్ గా పరిశీలించి 'అబ్బే అవి విలువలే కావు' అని తేల్చేస్తే పొరబాటెవరిది? ఆలోచించండి.

  ReplyDelete
 15. @చదువరి: ప్రశ్నిస్తే "కించపరచారనుకోవడం." చరిత్ర ఒక ఆమోదిత ధృక్కోణం అనిమరిచి ,పౌరాణికం అద్భుతమైన కల్పన అని అంగీకరించని వాళ్ళకు మీరి ఒక దృష్టికోణాన్ని ఆవిష్కరించడాన్ని "చులకన చెయ్యడం" అనుకోవడం. నిర్దేశితనైతికతకన్నా,మానసిక పరిణితి ముఖ్యమనటాన్ని "పశుత్వమని" భావించడమే నేను చెప్పిన absolutism. దాన్నే నేను వ్యతిరేకిస్తాను.

  నా అధునిక ధృక్పధంలో విధ్వంసంకన్నా, భావవైశాల్యం ఉంది.గుడ్డినమ్మకంకన్నా,వ్యక్తిత్వహిత విశ్వాసం ఉంది.ఆధ్యాత్మిక ఆరాటంకన్నా, మనిషిని గౌరవించే పోరాటముంది.వారసత్వపు అర్థరహిత అహంకారంకన్నా,జీవితసత్యాల సగౌరవత్వం ఉంది.
  అందుకే, నా ఆధునికత పట్ల నాకు నిబద్ధతుంది.

  @శ్రీకాంత్: మానవసంబంధాలలో theory of relativity తెచ్చిన విప్లవాన్ని త్వరలో సావకాశంగా ఒక టపా రాయడానికి ప్రయత్నిస్తాను.

  @చంద్రమోహన్: మీరు చెబుతున్నది secular humanist tradition గురించి.ఆ భావజాలం కొన్ని విశ్వజనీయమైన మానవవిలువలున్నాయని నమ్ముతారు. అవికూడా absolute కావు universal.

  ReplyDelete
 16. " నిర్దేశితనైతికతకన్నా,మానసిక పరిణితి ముఖ్యమనటాన్ని "పశుత్వమని" భావించడమే నేను చెప్పిన absolutism.

  నైతికత , మానసిక పరిణితి ... రెండు ఒక చోట ఉండవనా ? అసలు నైతికం గా ఉండటానికి కావాల్సిన మానసిక పరిణితి ఎంతో కూడా మీకు తెలుసా ? ఏమి చేపితివి రా కపితము అన్నట్టు భలే పదాలు అల్లారండి !!!

  commitments wthout sex తో మీరు చెప్పిన జగ్రతల తో పిల్లలు పుడితే, ఒక వేళ ... ( absolute values మడిచి జేబులో పెట్టుకోవాలనే మీ లాంటి 'మేధావులు' ) వాళ్ళు either single parent తో బతకాలి ... లేక చావాలి ! ఏంటి మీ ఆధునికత ఇచ్చిన మానసిక పరిణితి ? ఇది .... విధ్వంసం కి దారి తీసే .. మీ గొప్ప ఆధునికత ! నైతికత ... ఏ విధ్వంసాన్ని ఇచ్చందో మరి ...మీ దృస్తిలో ? మహేష్ గారు , మీ వితండ వాదానికి శత కోటి నమస్కారాలు !

  ReplyDelete
 17. రవిగారు,
  ముందుగా మీ టపాకి అంతగా సంబంధం లేని విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నందుగు క్షమించాలి.
  మహేష్ గారు,

  మీరు మరో బ్లాగులోని వ్యాఖ్యలని ఇక్కడ అప్రస్తుతం కావన్న ధైర్యంతో ఇక్కడ ప్రస్తావిస్తున్నాను:
  "నా పరిధిలో తెలుసుకున్నవాటితో నా అభిప్రాయాలు ఏర్పడుతాయి. అవి ఎంతబలమైనవి అనేది నేను తెలుసుకున్న source నుంచో లేక నేను convince అయిన తీరునుంచో జరుగుతాయి.నా అత్మవిశ్వాసానికి కారణం నేను ఏర్పరుచుకున్న నమ్మకం. మళ్ళీ ఎవరైనా నా నమ్మకాన్ని సవాలుచేసి, నా కళ్ళు తెరిపించేంతవరకూ అదే నాకు “సత్యం”. అందుకే ఈ సాధికారత. పైన నేను చెప్పిన విషయాలు దాదాపు అందరు మనుషులలోనూ మోతాదు అటూఇటూ అయినా, చాలా సహజం. నాలో ఆ మోతాదు కొంచెం ఎక్కువనుకుంటాను అంతే!"

  పైన మీరన్న మాటలకీ, మీరిక్కడ వ్యాఖ్యలో పేర్కొన్న "భావవైశాల్యానికి" పొంతన కుదుర్తున్నట్టు నాకనిపించటం లేదు. అందులో మీరన్న గట్టి నమ్మకం మీకు గుడ్డిదని అనిపించకపోవచ్చు గాక. మీరు absolute values లేవంటూనే, "గుడ్డినమ్మకం కన్నా,వ్యక్తిత్వహిత విశ్వాసం", "ఆధ్యాత్మిక ఆరాటంకన్నా, మనిషిని గౌరవించే పోరాటం", "వారసత్వపు అర్థరహిత అహంకారంకన్నా,జీవితసత్యాల సగౌరవత్వం" గొప్పవని నొక్కివక్కాణించడం ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ Absolutes valuesని మీరు ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోకపోతే, మీరు ప్రచారం చేసే ఆధునిక దృక్పథం కచ్చితంగా సాంప్రదాయిక దృక్పథం కన్నా గొప్పది అని విలువకట్టడం సరి కాదని ఒప్పుకుంటారా? లేదా Absolute values ఉన్నాయని ఒప్పుకొని, మీరు చెప్పే ఆధునిక దృక్పథమే కచ్చితంగా గొప్పదని అంటారా?

  ReplyDelete
 18. ఎవరితో అండీ కామేశ్వర రావు గారు ... చర్చిస్తున్నాం మనం ? మేము పాటించేవి absolute values కాదు అంటూ ఒక పక్క ... గుడ్డిగా నైతికత లేని 'values' మాత్రమే నేను ప్రస్నించకుండా పాటిస్తా ( absolute గా ) అనే వాళ్ళతో నా ? మామూలుగా చెప్తే అర్థమయ్యేట్టే ఉంటె, పానశాలలు ఎందుకండీ ?

  ReplyDelete
 19. చర్చ బాగా సాగుతుంది. దయచేసి పక్కదారుల(personal attacks and counter-attacks) కెళ్ళనీకుండా, ఇలాగే కొనసాగించండి. నేనడగాలనుకున్న కొన్ని ప్రశ్నలు ఇక్కడ కనబడ్డాయి..నేను ఆసక్తితో ఫాలో అవుతున్నా!

  ReplyDelete
 20. @భైరవభట్ల కామేశ్వర రావు:నేను absolute విలువల్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పానేకానీ నేను చెప్పినవి absolute అని చెప్పలేదు. Modernity is dynamic.

  మీరు ఉదహరించిన "నా నమ్మకం"లోకూడా, "మళ్ళీ ఎవరైనా నా నమ్మకాన్ని సవాలుచేసి, నా కళ్ళు తెరిపించేంతవరకూ అదే నాకు “సత్యం”." అన్నానేగానీ, దాన్నే పరమసత్యంగా చెప్పుకోలేదు. I always open to change provided,the conditions of self learning prevails. absolutism పేరుతో unconditional పరిస్థితుల్ని కల్పించడానికి నేను సర్వదా వ్యతిరేకిని.

  భావవైశాల్యం అంటే ప్రశ్నించకుండా అంగీకరించడం కాదు.నాపరిధిలో ఉన్న విషయపరిజ్ఞానంతో పరికించి హేతువని నమ్మినదాన్ని అంగీకరించడం. ఈ విధగా నేను నమ్మే ఆధునిక ధృక్పధం "ఖచ్చితంగా" గొప్పదని చెప్పను. కానీ,"అదేనాకు గొప్పదని చెబుతాను." మీ విలువలు మీకు గొప్పగా అనిపిస్తే వాటిని ఆచరించే space కోసంకూడా పోరాడతాను. నా వ్యతిరేకతల్లా మిగతా alternate విలువలకు స్థానం లేదనుకునే "నిర్దేశిత నైతిక కోణంతోనే".

  "మీరు చెప్పిందే సరి" అనే కోణాన్ని వీడి alternate value systems ఉండగలవని అంగీకరించడమే ఆధునికత. With discovery of new knowledge and new reality changing is modernity for me.

  @వీరు: ఒకసారి వితండవాదం అనేసుకున్నాక చర్చ అనవసరం.Once you pass a judgment based on preconceived values, discussion ends.That is absolutism for me. I wish not to accept any imposed truth just because "it is told". I prefer unlocking the truth through self inquiry. That is modernity to me and you don't seem to fit in to my scheme of things.

  ReplyDelete
 21. రవి గారు,
  ఏ నోటా వివాదం లేని విషయాన్ని (ఏకపత్నీవ్రతుడు) మీరు చర్చనీయాంశం చేయటం చాలా ఆశ్చర్యపరచింది. మీరు చెప్పిన కారణాలు బలంగా లేకపోవటం వేరే విషయం అనుకోండి.

  ReplyDelete
 22. మహేష్, మీరు చాలా తెలివైనవారు. ఎటొచ్చీ మొండివాదనను మాటల మాటున మరుగుపరుస్తారు. అవున్లెండి, మాటల మాంత్రికులని గదా మీకు పేరు!

  భావవైశాల్యం గురించి కదా మీరు మాట్టాడింది; మీ భావ వైశాల్యానికి నాకు గుర్తున్నంతలో కొన్ని గుర్తులు చూపిస్తాను..

  *"..పట్టినపట్టువీడని భీష్ముడిది మంకుపట్టు అనిపిస్తుందేతప్ప,మహాప్రతిజ్ఞలాగా అనిపించదు"
  *"..ఇక్కడా భీష్ముడి ప్రతిజ్ఞ నిలబెట్టుకునే కాంక్షకనిపిస్తుందేగానీ, నిజంగా అంబాలిక,అంబికల స్త్రీత్వాన్ని గౌరవించినట్లు కనపడదు. "
  *"..ఇక ఈతరంలోనూ స్త్రీల ఉసురు పోసుకోవల్సిన అగత్యం ఈ మహానుభావుడికి పట్టింది. కుంతీ,మాద్రుల్ని సంసారసుఖం ఇవ్వలేని పాండురాజుకు కట్టబెడతాడు"

  ఇదీ భీష్ముని గురించి, అతడి వ్యక్తిత్వం గురించి మీ విశ్లేషణ. మీ దృష్టిలో భీష్ముడిది "మూర్ఖపు విధేయత". మీకు "భీష్ముడి విధేయత,ధర్మనిబద్ధత ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది"

  ఇక మెకాలే గురించి మీరేమన్నారో చూద్దాం

  "ఇక్కడ మెకాలే భారతదేశానికేదో పెద్ద సేవ చేసాడని చెప్పడం ఉద్దేశం కాదు. కాకపోతే, అప్పట్లో తనకు ఇచ్చిన పనిని సిన్సియర్గా చేసాడు అంతే! అప్పట్లో బ్రిటిష్ వారి ముఖ్య ఉద్దేశం వ్యాపారం, ఆ తరువాత రాజ్యాధికారం. వాటిని సాకారం చెయ్యడానికి కావలసిన విధానాల రుపకల్పన చేసాడు."

  మెకాలే తన ధర్మాన్ని తాను పాటించాడు, అందులో తప్పేముంది అని మీరు అడుగుతున్నారు. అదే ధర్మాచరణ, మన పురాణ పురుషులు, స్త్రీలూ చేసారని భావించడానికి మీకెందుకు వెనకడుగు? ఎందుకు వాళ్ళ వ్యక్తిత్వాలను తక్కువచేసి మాట్టాడుతారు? ఇది విశాలతా, సంకుచితత్వమా?

  అంతేనా.., మెకాలే గురించి ఇంకా ఇలా చెప్పారు మీరు:
  "..సాంకేతిక విజ్ఞానాన్ని మనస్ఫూర్తిగా జ్ఞానమని నమ్మి, దాన్ని అందరికీ అందేలా చెయ్యాలనుకునే ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఒక సంస్కృతి గొప్పదనంవలన తమ ఉద్దేశాలు సాకారం కావుగాబట్టి, మోసంతో దాన్ని అంతం చెయ్యాలనుకునే మూర్ఖుడు కనిపించడు.అంతేకాక, అప్పటికే ఇతర సంస్కృతులవలన బాగుపడిందనుకున్న బ్రిటిష్ సంస్కృతి నేర్చుకున్న పాఠాలను, భారతదేశానికి అన్వయించాలనుకునే మేధావి కనబడతాడు."

  మెకాలే పట్ల ఎంతటి భక్తీ అనురక్తీ ప్రదర్శించారంటే..
  మెకాలేయే లేకపోతే.. "..మనమూ ఏ ఆప్ఘనిస్తానో లేక ఆఫ్రికా దేశాల్లాగానో అధమం నేపాల్ లాగానో తయారయ్యుండేవాళ్ళం." అనీ అన్నారు.

  మెకాలే తన ధర్మాన్ని పాటించాడు, అని చెబుతూనే, భీష్ముని ధర్మనిబద్ధతను శంకించారు. భీష్ముడు తన ధర్మాన్ని తాను పాటించాడు అని మీరు అనుకోలేదు. మీ దృష్టిలో మెకాలే ఒక లిబరలిస్టు, ఒక మేధావి. భీష్ముడిది మాత్రం మంకుపట్టు. మెకాలే మనకు నాగరికత నేర్పాడు - లేకపోతే బికారి వెధవల్లాగానో, తుపాకులట్టుకుని ఒకణ్ణొకడు కాల్చుకుంటూనే గడిపేవాళ్ళం అని మీ ఉద్దేశ్యం! బ్రిటిషువాళ్ళు రాకముందు, మనది ఆదిమ జాతా?

  మన సంస్కృతి పట్ల మీకున్న గౌరవం ఇదీ! దీన్నేమంటారు? చులకన చెయ్యడమా కాదా?

  భావవైశాల్యం అంటే హిందూ చారిత్రక, పౌరాణిక వ్యక్తులను ద్వేషించడం, హిందూ మతాన్ని, హిందువులను ద్వేషించడం, హిందువులు విమర్శించేవాళ్ళను సమర్ధించడమా? హిందువులు ఎవరిని గౌరవిస్తారో, ఎవరిని ఆరాధిస్తారో వారిని తక్కువగా చూపి, వారి వ్యక్తిత్వంపై దాడి చేసి, నిందమోపి హిందువుల నమ్మకాలపై దెబ్బకొట్టడమే ఇది. (సాధారణంగా కొన్ని మతాల ప్రచారకులు ఈ పని చేస్తూంటారు.) నేను ఊరికే ఊహించుకుని చెబుతున్న మాటలు కావివి, పై రెండు సందర్భాలను చూస్తే మీ ఉద్దేశ్యం ఇదేనని నాకు అనిపిస్తోంది. వేరయితే చెప్పండి.

  మీ హిందూ ద్వేషం ఇక్కడితో ఆగలేదు..
  "సనాతనధర్మం దీపమైతే, ఆ దీపపు వెలుగు క్రిందనే వుండే చీకటి ప్రస్తుతం వున్న హిందూమతం. కేవలం ఆ వెలుగు క్రిందవున్నంతమాత్రానా, చీకటి వెలుగెప్పటికీ కాలేదు."
  హిందూ మతం పట్ల మీకున్న అభిప్రాయం ఇంత వివరంగా చెప్పుకొచ్చాక, మీది హృదయ వైశాల్యంగా అనుకోవాలా లేక మనసులో ఏదో ఒకటి పెట్టుకుని, ఇలాంటి ద్వేషపూరిత వాదన చేస్తున్నట్టు అనుకోవాలా?

  పైగా, "అందుకే, మతమౌడ్యం గురించి జరిగే చర్చల్లో హిందూమతం సనాతనం,నిత్యనూతనం, అనంతం,జీవనవిధానం వంటి శుష్క వ్యాఖ్యలు చెయ్యకపోవడమే మంచిది." అంటూ చర్చల్లో శుష్క వాదనలు చెయ్యొద్దని సలహా ఇచ్చి పారేసారు. దీనర్థం ఏమిటి? చర్చలో అవతలి వారి వాదనను వినేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్టా? దేన్ని సూచిస్తోందిది? మీ హృదయ వైశాల్యాన్నా? సంకుచితత్వాన్నా?

  నేను లిబరలిస్టును,. ఆధునిక దృక్పథం కలిగినవాణ్ణి, అవతలివారి దృక్కోణాన్ని విని అందులోని మంచి గ్రహించేందుకు, నా అభిప్రాయాలను మార్చుకునేందుకు సిద్ధంగా ఉంటాను అని మీరు చెప్పుకునే మాటలు నిజం కాదేమోనని ఇక్కడ నేనుదహరించిన మాటలు చదివితే అనిపిస్తుంది.ఇవేకాదండి, అనేక సందర్భాల్లో వివిధ బ్లాగుల్లో మీరు బయటపెట్టిన భావాలు కూడా (ఇప్పుడు వాటన్నిటినీ వెతికి పట్టుకోలేనులెండి!) మీ సంకుచితత్వాన్ని పట్టిస్తాయే తప్ప హృదయ వైశాల్యాన్ని చూపించవు..

  భావ వైశాల్యం, హృదయవైశాల్యం ఎంత ఎక్కువో అని మనం కొలతలేసుకుంటే చాలదు.. హృదయాలకు తలుపులు కిటికీలు ఉన్నాయా, ఉంటే అవి రానూ పోనూ రెంటికీ వీలుగా ఉన్నాయా అనేది ముఖ్యం. వన్‌వే ట్రాఫిక్కు లాగా ఉండకూడదు.

  హిందువులను, హైదవాన్ని విమర్శించడం ఆధునికతగా కొందరు భావిస్తున్నారు. ఇది ఆధునికత కాదు, హిందూ వ్యతిరేకోన్మాదం! ఆధునిక కాలానికి అనుగుణంగా వేషం మార్చుకున్న మధ్యయుగపు భావజాలం.

  ఇక మానసిక పరిణతి గురించి ఉదహరించాలంటే మీ బ్లాగులే ఏడో ఎనిమిదో జాబులను ఎత్తి రాయాల్సుంటుంది. అది మరెప్పుడైనా, మరెక్కడైనా!

  ReplyDelete
 23. @ మహేష్ గారు,

  "alternate value systems" గురించి మీలోనే కొంత కన్ఫ్యూజన్ ఉన్నట్లు నా కనిపిస్తోంది (లేక కన్ఫ్యూజన్ నాదేనేమో!) . ఒకే కాలంలో ఒకే దేశంలో వేర్వేరు విలువలు ఉంటాయనే విషయంలో మీతో ఏ వివాదమూ లేదు. నిజానికి అదేమంత ఆధునిక దృక్పథం కాదు. ఉపనిషత్తులు మొదలు మన శాస్త్రాలన్నీ అదే చెబుతాయి. వివాదం ఎక్కడంటే ఈ వేర్వేరు విలువలన్నీ ఒక సమాజం తనలో ఇముడ్చుకొని అన్నిటినీ పాటించాలనడంలోనే.

  పాపులను క్షమించి ప్రేమించమని ఓ మతం చెబుతుంది. పాపులను శిక్షించడమే ధర్మమని మరో మతం చెబుతుంది. పాపులను అడ్డంగా నరికేయమని ఇంకో మతం చెబుతుంది. ఈ మూడు value systems ఒకే కాలంలో exist కావడం సాధ్యమే. కానీ మూడు విలువలూ ఒకే వ్యక్తిలో, ఒకే సమాజంలో, ఒకే కాలంలో co-exist కావడం సాధ్యం కాదు. ఒకే వ్యక్తి పై మూడు మతాల బోధనలనూ ఒకే సమయంలో ఎలా పాటించగలడు?

  వ్యక్తి తన మేధో వికాసం మేరకు, తన అభీష్టం మేరకు తనకు నచ్చిన ఒక value system ను అడాప్ట్ చేసుకొంటాడు. అదే వాల్యూ సిస్టం ఉన్న సమాజంలో నివసిస్తాడు. అతడికి సంబంధించినంత వరకు అవే అతని అబ్సల్యూట్ వాల్యూస్. అతను ఆ విలువలను పాటించే సమాజంనుండి బయటకు వచ్చి(Alienated)చూస్తే కానీ తన విలువల రిలేటివిటీ అతనికి కనిపించదు. అలా ఒక విలువను వదిలి బయటకు వచ్చి రిలేటివిటీని దర్శించినందువలన అతనికి ఒనగూడే ప్రయోజనం ఏమిటి? అటు తన విలువలనూ గౌరవించలేక, ఇతర విలువలనూ (అవీ రిలేటివే అవుతాయి కదా!) కౌగలించుకోలేక, ఉభయ భ్రష్టుడైపోతాడు.

  విలువల రాహిత్యం కంటే ఏదో ఒక విలువల సిస్టంను అబ్సల్యూట్ గా పాటించడమే మంచిదని నా అభిప్రాయం.

  ReplyDelete
 24. మహేష్ గారు,
  మీరు absolute valuesని ఒప్పుకోనన్నారు సంతోషం. ఇది ఇద్దరం అంగీకరిస్తున్న విషయం కాబట్టి మన మాటలు కొనసాగించవచ్చు.
  >>"మీరు ఉదహరించిన "నా నమ్మకం"లోకూడా, "మళ్ళీ ఎవరైనా నా నమ్మకాన్ని సవాలుచేసి, నా కళ్ళు తెరిపించేంతవరకూ అదే నాకు “సత్యం”." అన్నానేగానీ, దాన్నే పరమసత్యంగా చెప్పుకోలేదు. I always open to change provided,the conditions of self learning prevails. absolutism పేరుతో unconditional పరిస్థితుల్ని కల్పించడానికి నేను సర్వదా వ్యతిరేకిని."

  ఒక వంక మీరు వేరేవాళ్ళు చెప్పేదానివల్ల మీ నమ్మకాలు, ఆలోచనలూ మార్చుకోనని చెపుతూనే, I am open to change అని అనడమే కాస్త పొసగకుండా ఉన్నది.

  >>"భావవైశాల్యం అంటే ప్రశ్నించకుండా అంగీకరించడం కాదు.నాపరిధిలో ఉన్న విషయపరిజ్ఞానంతో పరికించి హేతువని నమ్మినదాన్ని అంగీకరించడం. ఈ విధగా నేను నమ్మే ఆధునిక ధృక్పధం "ఖచ్చితంగా" గొప్పదని చెప్పను. కానీ,అదేనాకు గొప్పదని చెబుతాను."

  ఇదే విషయం సాంప్రదాయిక విలువలని నమ్మేవాళ్ళకి కూడా ఎందుకు వర్తించదు?

  >>"నా వ్యతిరేకతల్లా మిగతా alternate విలువలకు స్థానం లేదనుకునే నిర్దేశిత నైతిక కోణంతోనే"

  మరి మీరు సాంప్రదాయిక విలువలని వ్యతిరేకించడం కూడా alternate విలువలకి స్థానం లేదనుకోవడం కాదంటారా?

  >>""మీరు చెప్పిందే సరి" అనే కోణాన్ని వీడి alternate value systems ఉండగలవని అంగీకరించడమే ఆధునికత."

  నాకు తెలిసిన ఆధునికత కూడా అదే. ఇదే దృష్టితో సాంప్రదాయిక విలువలని ఒక alternate value systemగా అంగీకరించి దానికన్నా ఆధునిక విలువలు గొప్పవి అవ్వాల్సిన అవసరం లేదన్న స్పృహ ఉంటేనే అది మీరన్న నిజమైన ఆధునికత అవ్వదా?
  Absolute values అనేవి లేవని ఒప్పుకున్నప్పుడు, ఆధునిక విలువలతో సాంప్రదాయిక విలువలని బేరీజు వేసి వాటిని తక్కువచెయ్యాల్సిన అవసరం ఏవుంది? ఆలోచించండి.

  ReplyDelete
 25. @చదువరి: మీరు ఉదహరించిన నా టపాల్లో పరిచయవాఖ్యాల్లూ, ముక్తాయింపులూ వదిలేసి కొన్ని వాక్యాల్నిబట్టి "ఇది ఆధునికత కాదు, హిందూ వ్యతిరేకోన్మాదం!" అని మీ నిర్ణయాన్ని ప్రకటించేసారు.బాగుంది.నేను మాత్రం ఏవిషయంలోనూ ఇంకా నిర్ణయాలకి రాలేదు.

  @భైరవభట్ల కామేశ్వరరావు:నేను నా ఆలోచనలు మార్చుకోనని నేనెక్కడ చెప్పాను. మీరుదహరించిన వాక్యాల్లోకూడా "మళ్ళీ ఎవరైనా నా నమ్మకాన్ని సవాలుచేసి, నా కళ్ళు తెరిపించేంతవరకూ అదే నాకు “సత్యం”."అనే చెప్పానే. Till I am convinced, I don't change my stance అనిమాత్రమే దానర్థం.

  నాకు సాంప్రదాయక విలువలు నమ్మే మనుషులతో సమస్యలేదు. "అవే ఖచ్చితమైన విలువలు, మిగతా విలువలు,మార్పులు, అనైతికం అశాస్త్రీయం,మతవిరుద్ధం" అనే absolutism కు మాత్రమే నేను వ్యతిరేకిని. మతానికికాదు మతమౌఢ్యానికి నేను వ్యతిరేకిని.

  అన్ని విలువలూ coexist కాగలవు,కావాలి అనే అనుకుంటాను. కానీ,imposing one set of values as ultimate and unquestionable is the issue all about.

  @చంద్రమోహన్: విలువలరాహిత్యం అనేస్థితి ఎప్పటికీ రాదు.

  ReplyDelete
 26. మహేష్ గారు,
  ఎక్కడో ఇప్పుడు గుర్తు లేదు కాని, మీరే మీ టపాల్లోనో వ్యాఖ్యల్లోనో అన్నారు - మీరిక్కడ చెప్పేవి బాగా బలంగా మీలో నాటుకున్న ఆలోచనలనీ, మీకు మీ స్వంత అనుభవమైతే కాని, ఇతరులు చెప్పే మాటలవల్ల వాటిని మార్చుకోరనీ. నేనిక్కడ అన్నది అది మనసులో ఉండబట్టే. అలా కాదు ఇతరులు చెప్పే విషయాలబట్టి మీ ఆలోచనలు మార్చుకొనే అవకాశం ఉందంటే మంచిదే. అలాటి సందర్భం ఇంతవరకూ నాకు అగుపడలేదు కాబట్టి ఆ అనుమానాన్ని వ్యక్తం చేసాను. నా అనుమానానికి కొన్ని స్పష్టమైన కారణాలున్నా, అవిక్కడ ప్రస్తావించడం మీపై వ్యక్తిగత దాడిగా తీసుకొనే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని వివరించ దలచుకోలేదు.
  ఇక, "మతానికికాదు మతమౌఢ్యానికి నేను వ్యతిరేకిని. నాకు సాంప్రదాయక విలువలు నమ్మే మనుషులతో సమస్యలేదు" అన్నారు. అదీ మంచిదే. కానీ మీ ఈ కింద టపాలు (హిందూ)మతాన్నీ, సాంప్రదాయిక విలువలనీ మీరు నమ్మే ఆధునిక విలువలతో బేరీజు వేసి వాటిని తక్కువచెయ్యడం కాదా? అవునని నా కనిపిస్తోంది. కాదంటారా?

  వెధవతనంలో సిన్సియారిటీ
  బుద్దావతారం
  హిందూమతం Vs సనాతనధర్మం
  లైంగికత Vs నైతికత : ఒక జెండర్ ధృక్కోణం
  కాలం చెల్లిన భీష్ములు

  ReplyDelete
 27. @భైరవభట్ల కామేశ్వర రావు:మీ అనుమానాలు నాకు mail చెయ్యండి. అక్కడే చర్చించుకోవచ్చు.

  చర్చలూ వాదనలవలన ఎవరూ అభిప్రాయాలు మార్చుకోరు.వ్యక్తిగత అనుభవాలు మాత్రమే మార్పుకు కారణమవుతాయని నమ్ముతాను. కాకపోతే, అన్ని అనుభవాలూ స్వయంగా ప్రాప్తం కావుగనక ఇతరుల అనుభవాల సారాలనూ పంచుకోవడం లేక కొత్తగా ప్రాప్తించిన జ్ఞానంద్వారా ఆ అనుభవాన్ని (కనీసం) ఆలోచనల్లో ప్రాప్తించడం జరుగుతుంది.

  నా ప్రతిపాదన ఎప్పుడూ ఈ ఆధారంగానే జరుగుతాయి. భీష్ముడి గురించీ బుద్ధుడి గురించీ నేను రాసినటపాలు ఆ కోవకిచెందినవే.నైతికత గురించి నేను చెప్పింది మతారాధిత సామాజిక కోణం. బ్లాగుల్లో చర్చిస్తున్న హిందూమతవాద ధోరణి చర్చలకు నా సమాధానం సనాతనధర్మం మీద టపా.

  నేను మతానికి వ్యతిరేకం కాదు. మతవాదానికి, మతమౌడ్యానికీ ఖచ్చితంగా వ్యతిరేకం.

  ReplyDelete
 28. చర్చ లో పాలు పంచుకుంటున్న బ్లాగర్లందరికీ ధన్య వాదాలు. మన తరానికి ఉన్న ఓ గొప్ప అవకాశం identity crisis. కాకపోతే, వచ్చిన చిక్కు identity crisis ని "నా identity crisis" అనుకోవడమేనేమో అని నా అనుమానం.

  "అవును.నా ఐడింటిటీ క్రయిసిస్సే. ఇందులో తప్పేంటి?" - ఇది కాస్త లోపకారకమైన వాదన. ఎందుకంటే, అలా కొనసాగితే, తెలుసుకున్న నిజాలు/విలువలు నా ఊహలకు అనువుగా నేను ఏర్పరుచుకున్న దృక్పథాలు, మాత్రమే కానీ నిజంగా మానసిక పరిణతికి దోహదకారులు కావు. (ఇది సిద్ధాంతం కాదు. కాస్త ఆలోచితే నాకు అనిపించిన సూత్రం మాత్రమే)

  సాంప్రదాయ వాదులయిన భైరవభట్ల, చదువరి, చివుకుల వగైరా గారు +ve assertion తో పరిశోధించి తెలుసుకోదలుచుకున్నదయినా, ఆధునిక దృక్పథాన్ని కాంక్షించే (మహేశ్ గారు, నేను వగైరా)ప్రశ్నించి, తరచి చూసి -ve assertion తో తెలుసుకోవాలనుకుంటున్న విలువలయినా, కేవలం గుడ్డి నమ్మకాలో, పిడివాదానికి ప్రతీకలో అని భావించనవసరం లేదు. ఒక వేళ నిజంగా పిడి వాదమే అయితే, ఆ పిడివాదం ఎంతో కాలం మనలేదు. Because, our generation in itself cannot afford such.

  మతమౌఢ్యానికి అందరు వ్యతిరేకులే. అయితే ఫలానా విలువ మతమౌఢ్యానికి కారణం అన్నది "శొధన" అన్న ప్రాతిపదికపై జరగడం ముఖ్యం. "నేను నమ్మిన నిజం" అన్న ప్రాతిపదిక మీద - అన్నది కాస్త ఆలోచించవలసిన విషయం.

  ReplyDelete
 29. సాంప్రదాయవాదుల జాబితాలో నన్ను చేర్చడం నాకు పెద్దగా అభ్యంతరం లేదు కాని, నిజమైన సాంప్రదాయవాదులకి తీవ్రమైన అభ్యంతరం ఉండవచ్చు, ఆ పైన మీ యిష్టం :-)

  ReplyDelete
 30. మహేష్: నా ప్రశ్నలకు మీ సమాధానాలు అసంపూర్తిగా ఉన్నాయి. నేనుదహరించిన వాక్యాలు గల ఆయా జాబుల్లో మీరు వేరే అర్థంలో రాసినవి నాకు కనిపించలేదు. ఉంటే దయచేసి ఆ వాక్యాలను ఉదహరించగలరు.

  రవి: మీరు మాకేసిన ముద్దర్లు మరో చర్చకు దారి తీసేలా ఉన్నాయండి. నాకా విశేషణమెందుకిచ్చారో తెలుసుకోవాలని ఉంది. -దానికి నేను అర్హుణ్ణో కాదో తెలుసుకోవాలని అంతే! :)

  పోతే మహేష్ గారు తానో కుహనా లౌకికవాదినని గతంలో చెప్పేసుకున్నారు. మీరేమో అభ్యుదయవాది అని అంటున్నారు. ఆ రెండూ ఒకటేనని మీ ఉద్దేశ్యమా? :)

  ReplyDelete
 31. @భైరవభట్ల

  "నాకు తెలిసిన ఆధునికత కూడా అదే. ఇదే దృష్టితో సాంప్రదాయిక విలువలని ఒక అల్తెర్నతె వలుఎ స్య్స్తెంగా అంగీకరించి దానికన్నా ఆధునిక విలువలు గొప్పవి అవ్వాల్సిన అవసరం లేదన్న స్పృహ ఉంటేనే అది మీరన్న నిజమైన ఆధునికత అవ్వదా? "

  అది ఉత్తర ఆధునికత అని కదా జనం అంటున్నది?

  ReplyDelete
 32. @చదువరి గారు : ఇక్కడ జరిగిన చర్చల్లో నాకు కనిపించిన, నాకు తోచినది రాసానండీ. పెద్దగా ఉద్దేశ్యాలు, దురుద్దేశ్యాలు లేవు. :-)

  మహేశ్ గారు, ఆధునిక దృక్పథం అన్నారు, ఇక్కడ వ్యాఖ్యలో. అది అభ్యుదయ వాదం అని నాకు అనిపించి, ఆ పదం వాడాను.

  ReplyDelete
 33. me black chusanu meru baga rastaru

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.