Wednesday, November 12, 2008

సైటోపాఖ్యానం

"ఉష్ ష్..మాట్లాడకు"

"మెల్లగా వెనక్కి తిరిగి చూడు"

"ఇప్పుడు కూరగాయలు కొంటున్నట్టు నటిస్తూ, నాకు సైటు కొడతాడు చూడు"

ఏ సినిమా నో తెలిసుండాలి?

గీతాంజలి.

అప్పట్లో "యూత్" కేకలు పెట్టారు, సైట్ కొట్టటం, లేచిపోదాం ...ఇలాంటి డవిలాగులను విని. ఇంకా బాగా వెనక్కి వెళితే, మన నలుపు తెలుపు కళాఖండాల్లో, "ఇల్లరికం" లో నాగేశ్వర్రావు "నిలువవే వాలు కనుల దానా" అంటూ జమున వెనుక పడటం, అప్పట్లో యూత్ ను ఉర్రూతలూగించి ఉంటుంది. ఇంకా "అయ్యయ్యో బ్రహ్మయ్య",అంటూ ఏయెన్నారు, "గుంతలకిడి గుమ్మ" అంటూ స్టిఫ్ గా చేతులు పెట్టుకుని డాన్స్ చేస్తూ కృష్ణ గారు, 80 వ దశకంలో బెల్ బాటం తో శ్రీదేవి ని ఆటపట్టిస్తూ (పీడిస్తూ) ఎన్టీ వోడు, "బెక బెక బావురు కప్పా....కోకోనట్" అంటూ బాపు బొమ్మ వెంటపడ్డ, మెగా స్టారుడు (మంత్రి గారి వియ్యంకుడు), "కోక దాగుడు కోటమ్మో" అంటూ సినిమాల్లో ఆరంగేట్రం చేసిన మొదట్లోనే విజయ శాంతి వెనుకపడ్డ బాలయ్య, "చికుబుకు చికుబుకు రైలే" అంటూ వూగిపోయిన ప్రభుదేవా,మొన్నామధ్య దేశముదురు లో "నిన్నే నిన్నే" అంటూ గ్లామరు సన్యాసి పిల్ల వెంట పడ్డ ఓ దేహముదురు....లిస్టు పెద్దదే!

అమ్మాయిలకు సైట్ కొట్టటం, లైనెయ్యడం అన్నది చాలా చాలా పాత ఫార్ములా అయినా హిట్ ఫార్ములా. నిజానికి ఇది ఫార్ములా కాదు, అన్నం లో ఆవకాయలా సినిమాల్లోనూ, ఇంకా మన జీవితాల్లోనూ ఉన్న ఓ స్పయిసే. మనలో చాలా మంది కూడా కాలేజీ జీవితంలోనో, ఆ తర్వాతో ఎవరికో ఒకరికి, ఏదో రకంగా లైను వేసి ఉంటాం..అమ్మాయిలు వెంటపడే అబ్బాయిలను చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకొని ఉండటం కూడా మామూలే.

నా వరకూ వస్తే తెగ లైన్లు వేసి, వేసి బాగా స్కిల్స్ సాధించి, లైన్మెన్ స్టేటస్ నుండీ బయటపడే లోపు పెళ్ళయిపోయింది!

సరే, ఇంతకూ సంగతేంటో చెబుతాను. నేను సంస్కృతం చదువుకునే రోజుల్లో, రఘువంశం 6 వ సర్గ ఉండేది మాకు. సర్గ మొత్తం పూర్తిగా. ఆ సర్గ లో సన్నివేశం ఇది.

హీరో స్వయవరానికి వచ్చి ఉంటాడు. స్వయంవరం చేసుకోబోతున్నది, ఇందుమతి అన్న హీరోవిను. పైగా సంచారిణీ దీపశిఖ.ఇంత అందంగా ఉన్న అమ్మాయిని వరించడానికి ఆశపడని రాజు ఉంటాడా? అయితే అది స్వయంవరమాయె. ప్రతి రాజు దగ్గరా ఆమె కాసేపు ఆగి, ఆ రాజు గుణగణాలు తన చెలికత్తె సునంద విశదీకరించిన తర్వాత, నిర్ణయం తీసుకుంటుంది. ఆ సమయం చాలా తక్కువ.ఆ కొద్ది సమయంలో ఆమెను ఎలాగైనా మెప్పించాలి. అందుకని కొంతమంది రాజులు, ఆమె తమవద్దకు రాగానే ఆమెకు సైటు కొట్టటం ప్రారంభించారు.

అందులో మొదటాయన.

కశ్చిత్కరాభ్యాముపగూఢనాళం
ఆలోల పత్రాభిహతద్విరేఫం
రజోభిరంతః పరివేశబంధి
లీలారవిందం భ్రమయాంచకార

తామర పూవు కాడ (నాళం)ను రెండు అరచేతుల మధ్య ఉంచుకుని (ఇరికించుకుని), రేకులు ఎగిరిపడుతుంటే, ఆ పువ్వు పై వాలిన తుమ్మెదలు చెదరి పడేట్టు, తామర తూడు చుట్టుకుని పోయేట్టుగా, రెండు చేతుల మధ్య విలాసంగా తిప్పుతున్నాట్ట.

ఇక రెండవ కాండిడేటు.

విస్రస్తమంసాదపరో విలాసీ
రత్నానువిద్ధాంగదకోటిలగ్నం
ప్రాలంబముత్కృశ్య యథాప్రదేశం
నినాయ సాచీకృతచారువక్త్రః

కాస్త ఫేసు టర్నింగ్ ఇచ్చుకుని, వదులుగా ఉన్న తన రత్నఖచితమైన భుజకీర్తులను భుజానికి అదుముకుంటూ, వక్షస్తలాన్ని సవరించుకుంటూ ఉన్నాడు (ట).

మూడవ పార్టీ.

ఆకుంచితాగ్రాంగుళినా తతోన్యః
కించిత్సమావర్జిత నేత్రశోభః
తిర్యగ్విసంసర్పినఖప్రభేణ
పాదేన హైమం విలిలేఖ పీఠం

కాస్త తలవంచుకుని, కాలి బొటన వేలిని కాస్త మడిచి, కాంతులీనుతున్న గోరుతో (నఖంతో)హేమ పీఠాన్ని రాస్తున్నాడట.

......
......
............

ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆమెను ఆకర్షించాలని ప్రయత్నించేరు. ఆమె ఆఖరుకు అజ మహారాజు (దశరథుడి తండ్రి) ను వరించింది.

ఈ శ్లోకాలు 10 వ తరగతి లో (తెలియని వయసులో) చదువుకోవడం వల్ల, పెద్దగా అర్థాలు కనబడలేదు.చాలా రోజుల తర్వాత ఈ పుస్తకం దొరికితే, అందులో చూసి, కాస్త గుర్తుకొచ్చింది బ్లాగడం జరిగింది.

ఇంకో విషయం. కాళిదాస కృతులకు భాష్యం రాసినాయన పేరు కోలాచలం మల్లినాథ సూరి. ఈయన పదహారు అణాల తెలుగు వాడు. ప్రతీ శ్లోకంలోని నిగూఢ భావాలకు ఈయన భాష్యం చెప్పాడు(ట). ఉదాహరణకు, పైన మూడవ పార్టీ విషయం తీసుకుంటే, బొటన వేలితో పీఠాన్ని గీరడం దరిద్రానికి చిహ్నమట. అందుకనే ఇందుమతీదేవి ఆ రాజును వరించలేదట!

ఈ విషయాలు ఎవరైనా సంస్కృతం బాగా తెలిసిన వాళ్ళు విడమర్చి బ్లాగితే చాలా బావుంటుంది.

(ఇది ఈ సర్గ పరిచయం మాత్రమే, పైగా నాకు సంస్కృతంలో మంచి అభినివేశం లేదు.కాబట్టి తప్పులు ఉంటే, సవరించగలరు)

***************************

6 comments:

 1. sorry .idi ee vyasaniki sambandhinchina vyakhya kaadu.
  vere bloglo mee" ani mutyalanti" vyakhyaki javabu.
  neenu blogger nu kanu.ela post cheyalo teliyaka ikkada chestunna.
  krishnudini 'ammayi ni lepukochi' ani bale baga sambodhincharandi.
  meeru maro mathaaniki chendina varayyi,vari viswasala patla ila vyakhyaninchi unte chakkaga javabu dorikedi.
  krishnudanta goppa premikudu,adhyatmikudu,guruvu,hitaishi,mitrudu,yogi verokarunnara ante anumaname.
  rukmini tanuga rasina lekhaki spandinchi mana matam kshatriya dharmamga angeekarinchina baatalo prayaninchi vivaham chesukunnadu.16000 veelamandini vari ishtaniki vyatirekanga ettukuralede?narakudi chera lo unna vallani ,vaari vignapti meraku ,vivaham chesukunnadu.oka rakshasudu parayi raju adhinamlo samvatsaralu gadipina stree landariki gauravinchadagga sthanam lo unchina visala aalochana drukpadham kaligina medhavi.
  eppudu bhagavantunimida bhaaram veyyali,eppudu maanava prayatnanni nammukovali aayana cheppinantha vipulamga evaru chepparo cheppagalaru.
  mana hinduvulaki,mukhyamga telugu vallaki,manalani maname thittukovadam manchi kaalakshepam,goppa abhiruchi.em chestham?
  mee mail id kanipinchaledu.kanipisthe daanike raaddunu.
  ppramilap@yahoo.com

  ReplyDelete
 2. ఇలా అందంగా మాట్లాడే అమ్మాయిలకు సైటు కొట్టుంటారు ;-)

  ReplyDelete
 3. చాలా బాగుంది మీ సైటోపాఖ్యానం!

  ReplyDelete
 4. రవిగారూ, మంచి టపా. మనకి పెళ్ళిచూపులకే మహా ఇబ్బందిగా ఉంటుంది. (నేను formal పెళ్ళిచూపులు avoid చేసేశా లెండి). ఆ రాజుల అవస్థ తల్చుకుంటే చాలా నవ్వొస్తోంది.

  ReplyDelete
 5. @పెళ్ళిచూపులు ఓ పెద్ద ప్రహసనం - అనవసర మొహమాటపు తంతు, మీరన్నట్టు. ఎలానో తప్పించుకున్నారు మీరు. ఆ రాజుల చర్యలకు (మల్లినాథ సూరి) వ్యాఖ్యానం మీకు కానీ, చంద్ర మోహన్ గారికి గానీ తెలిస్తే మంచి టపా రాయవచ్చు కదా!

  ReplyDelete
 6. రవి గారు, ప్రస్తుతానికి ఇది కూడా చంద్రమోహన్ గారికే వదిలిపెట్టేస్తున్నా. సమయాభావం ఒక కారణం, మల్లినాధ సూరి వ్యాఖ్యానం నా దగ్గర ఇప్పుడు/ఇక్కడ లేకపోవడం మరో కారణం. నెట్లో వెతికితే దొరకచ్చు.

  ఒకవేళ చంద్రమోహన్ గారు రాయకపోతే తప్పకుండా కొంచం ఖాళీ దొరగ్గానే రాస్తాను.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.