Friday, October 31, 2008

భాషా సేవకుడు, ఆయన రచనల పరిచయం

తిరుమల రామచంద్ర గారి గురించి, ఆయన రచన (ఆత్మకథ) "హంపీ నుంచీ హరప్పా దాకా" గురించి దాదాపు తెలుగు సాహితీ అభిమానులందరికీ పరిచయమే. ఆయన రాసిన మరి కొన్ని పుస్తకాల మీద ఓ చిన్ని పరిచయం.

౧. సాహితీ సుగతుని స్వగతం : రామచంద్ర గారు, చాలా చిన్న వయసులోనే భారతి పత్రిక కు వ్యాసాలు రాసే వారట. అప్పట్లో భారతి పత్రికలో వ్యాసం పడ్డం అంటే, అదో గొప్ప గౌరవమట. ఆ వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. ఇందులో కొన్ని అద్భుతమైన వ్యాసాలు.

ఆంధ్రచ్చందో విశేషములు : "ఎసగు , ఒసగు" అన్న పదాల చర్చకు సంబంధించి శ్రీ వజ్ఘల చిన సీతారామశాస్త్రి గారి వాదనను ఆక్షేపిస్తూ వ్రాసినది. ఈ వ్యాసం చదివిన పండితుడొకాయన ప్రభాకర శాస్త్రి గారి వద్ద ప్రస్తావిస్తూ, భారతి లో ఎవరో గొప్ప వ్యాసం రాసేరని అన్నాట్ట. శాస్త్రి గారు పక్కనున్న రామచంద్ర గారిని చూపించేరట. ఆ పండితుడు విస్తుపోయి, "ఎవరో శాలువా పండితుడనుకున్నాను. ఈ కుర్ర వాడా?" అని మెచ్చుకున్నారుట. ఈ ప్రస్తావన "హంపీ నుండీ..." లో ఉన్నది.

నువ్వులు కొట్టిన ఇడి నూటిడి : నన్నెచోడుడి కుమారసంభవం పరిష్కరిస్తూ, వేదం వెంకటరాయ శాస్త్రి గారు ఓ చోట, "నూటిడి" అన్న భక్ష్య విశేషాన్ని, "నూబిడి (నువ్వు + పిడి -> పిడికిలి మేర నువ్వులు)" గా పేర్కొంటే, రామచంద్ర గారు, "నూటిడి" పదాన్ని అన్నమయ్య కీర్తనలోనూ, శ్రీనాథుని హరవిలాసం లోనూ వాడినట్టు ఋజువు చేశారు. ఇదో అత్యద్భుతమైన వ్యాసం.

బుద్ధుడికి ముందే ఉన్న ధూమపానం : ధూమపానం పైని వివరణ. ఇంకా ఇందులో ఆఫ్రికా కాల్పనిక సాహిత్యం, అనువాద సమస్యలు వంటి అద్భుతమైన వ్యాసాలున్నాయి. సాహితీ ప్రేమికులు మరువకూడని అద్భుతమైన పుస్తకం ఇది. విశాలాంధ్ర ప్రచురణ. ఇప్పుడు దొరకం లేదు!

౨.మనలిపి - పుట్టుపూర్వోత్తరాలు : లిపి పైన తెలుగులో కానీ, మరే భాషలో కానీ ఇంత సాధికారికమైన, సమగ్రమైన గ్రంథం వెలువడలేదు అంటే అతిశయోక్తి కాదు. రామచంద్ర గారు ప్రాకృతం పరిష్కరింపబడి, సంస్కృతం గా మారిందని, సంస్కృత, ప్రాకృతాల మధ్య జన్య జనక సంబంధం లేదని ఎన్నో ఋజువులు (ఆచార్య హేమచంద్రుడు, గాథా సప్తశతి వగైరా) చూపించారు. ఈ రచనలో పాళీ నుండీ సాగిన లిపి ప్రస్థానం ప్రస్తుత తెలుగు లిపి పరిణామం వరకు ఎంతో అద్భుతంగా వివరించబడింది. లిపి గురించి తెలుసుకోవాలన్న వారు ఈ గ్రంథం చదవకపోతే, వారి ఆసక్తి, అనురక్తి, అసమగ్రం అని చెప్పడానికి సందేహించనక్కరలేదు. ఇంకో గొప్ప విషయం. ఈ రచన వ్యవహార భాషలో సాగటం. ఇలాంటి గ్రంథం వ్యవహార భాషలో అదీ అప్పటి కాలంలో రాయడం ఓ నేర్పు.ఇదీ విశాలాంధ్ర ప్రచురణే.

౩. మనవి మాటలు : ఇదో చక్కని వ్యాస సంకలనం. ఇందులో కేరళ వారి "ఓణం" గురించీ, మాఘుని జ్యోటిశ్శాస్త్ర పాండిత్యం మీద, వినాయక చవితి మీద చక్కటి వ్యాసాలు.

౪. అహం భో అభివాదయే : రామచంద్ర గారు ఆంధ్ర ప్రభ లో పని చేస్తున్నప్పుడు, ఎందరో ప్రముఖులను ముఖాముఖి జరిపారు, మరెందరి మీదో అద్భుతమైన వ్యాసాలు రాసారు. అప్పటి ప్రముఖుల మీద రాసిన వ్యాస సంకలనం ఇది. విశ్వకవి రవీంద్రుడు, ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి, దాలిపర్తి పిచ్చిహరి, విస్సా అప్పారావు గారు, చిలుకూరి నారయణ రావు గారు..ఇలా ఎందరో గొప్ప వ్యక్తుల గురించి ఈ పుస్తకం మనకు పరిచయం చేస్తుంది.

౫. ప్రాకృత వాఙ్ఞ్మయంలో రామకథ : పైన ఇందాక చెప్పినట్టుగా, ప్రాకృతం అన్నది జనపదాల్లో వాడుకలో ఉన్న భాష కాగా, సంస్కృతం సంస్కరింపబడి, సమాజంలో ఉన్నత వర్గాల ఆదరణకు నోచుకున్న భాష. పల్లె సీమల్లో ఉన్న జీవన రామణీయత, వారి గాథలు మొట్టమొదట సంకలనం చేసిన సహృదయుడు హాలుడు. ఆ గాథలు గాథాసప్తశతి గా పొందుపరుచబడ్డాయి. ఈ పుస్తకంలో కొన్నివ్యాసాలు : వజ్జాలగ్గంలో తెలుగు పదాలు, ప్రాకృత ప్రకృతి (ఇది చాలా అద్భుతమైన వ్యాసం), వివిధ ప్రాకృత కవులు, బౌద్ధ రచనలు మొదలైనవి. ఇది ఓ అందమైన పుస్తకం.

౬. నుడి-నానుడి : మహీధర నళినీ మోహన్ గారి ఓ చిట్టి రచన, పిడుగుదేవర కథ. ఇందులో పిడుగు గురించి చాలా విషయాలు చెప్పారాయన. అందులో ఓ చోట తెలుగు పదాలు ఎలా మొదలయ్యాయి అని ఆసక్తి ఉన్న వారికి నుడి - నానుడి పుస్తకం సూచించారు. ఇదో శీర్షిక, ఆంధ్రజ్యోతి వారపత్రికలో. ఈ పాకెట్ సైజు పుస్తకం లో అనేక తెలుగు పదాలకు మూలాలు వెతికారాయన. ఇది కేవలం వ్యాసం రాస్తున్నట్టుగా, మధ్యమధ్యలో పిట్టకథలు చెబుతూ, కావ్యాల్లో ఉదాహరణలు పేర్కొంటూ, అందంగా సాగుతుంది. తెలుగు భాషా ప్రియులకు ఇదో ఆవకాయ. ఇందులో పేర్కొన్న కొన్ని పదాలు :గోంగూర, మిరపకాయ,నాచకమ్మ, చారు, సేపు వగైరా వగైరా...

౭. లలిత విస్తరం : ఇది బుద్ధ మహానుభావుని జీవితం. బౌద్ధపురాణం. దీన్ని, ఈయన, బులుసు వెంకటరమణయ్య గారు తెనిగించారు. ఈ పుస్తకం నేను చదవలేదు. ఈ మధ్య ఆనంద బుద్ధ విహార ట్ర్సస్ట్, సికందరాబాద్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించినట్టు చూసానెక్కడో.

౮. ఇంకా తెలుగు పత్రిక సాహిత్య సేవ, మరపురాని మనీషులు ఇలాంటి ప్రచురణలు ఈ మధ్య విశాలాంధ్ర వారు మళ్ళీ పునర్ముద్రించలేదు.

***********************************

10 comments:

 1. నేనూ "హంపీ నుండి హరప్ప దాకా" గురించి తెలుసుకున్నాను కానీ, ఇంకా కొనలేదు. మంచి పుస్తకాలను పరిచయం చేశారు. నేను విశాలాంధ్రకి తీసుకెళ్ళే ప్రతీ పుస్తకాల లిస్ట్లో సగం పైగా దొరకడం లేదు.

  ఇవ్వన్నీ చదవటం ఎప్పటికి కుదిరినా, పరిచయం చేసినందుకు ధన్యవాదాలు! ఇక వీటిని ఎలా పట్టుకొని పట్టుబట్టాలో ప్రయత్నించాలి! :-)

  ReplyDelete
 2. రవి గారూ, తిరుమల రామచంద్ర గారు రాసిన పుస్తకాల్ని మీరు పరిచయం చేసిన తీరు చాలా బాగుంది. నేను చదవాల్సిన పుస్తకాల లిస్టు చాలా పెద్దదైపోతోంది. ఎప్పటికి చదవగలనో తెలియదు.

  ఇంత మంచి బ్లాగు టపా రాసినందుకు కృతజ్ఞతలు. (దీనికి నా మాఘుడి శ్లోకం టపా ప్రేరణ అయితే గర్వంగా కూడా ఫీలవుతున్నా... :-) )

  ReplyDelete
 3. హంపీ నుంచి హరప్ప దాకా చదివే వరకూ తిరుమల రామచంద్ర గారి గురించి ఏదో కొద్దిగా తెలుసుకోవడమే కానీ అంత గొప్ప వారని,అంత సాధన చేసారని, ఆయన జీవితమే ఒక సముద్రమంత గొప్పదని తెలియదు. అది చదివాక ఆయన అంటే చెప్పలేని పూజ్య భావం ఏర్పడి పోయింది.

  వారి ఇతర రచనల గురించి తెలిపినందుకు మీకు ధన్యవాదాలు.

  ReplyDelete
 4. బృహదారణ్యకం (ప్రాకృత అకాడెమీ ప్రచురణ,1993), గాథాసప్తశతిలో తెలుగుపదాలు (1983, APArchMuseum లో తప్పితే బయటమ్మరు, మన ఘనత వహించిన ప్రభుత్వసంస్థలతో ఇదో తలనొప్పి! ఇంకా వాళ్ళదగ్గర బోలెడు కాపీలున్నాయి!!)) మీ లిస్టులో మిస్ అయిన ముఖ్య పుస్తకాలు. ఆయన సంపాదకత్వంలో వచ్చిన పుస్తకాలు కొన్నున్నాయి. ఆయన వ్యాసాలన్నీ ఒక సంకలనంగా తీసుకురావల్సిన అవసరముంది.

  ఈ క్రింది వాక్యం మాత్రం కాస్తంతఅ త్యుత్సాహంతో రాసినట్లుగా వుంది :-)

  > లిపి పైన తెలుగులో కానీ, మరే భాషలో కానీ ఇంత
  > సాధికారికమైన, సమగ్రమైన గ్రంథం

  తెలుగు వరకైతే ఒప్పుకుంటాను. "మరే భాషలో" అనకండి. నిజానికి గత 5-6 సంవత్సరాలుగా లిపుల మీద చాలా గొప్ప పరిశోధనలు జరుగుతున్నాయి.

  -- శ్రీనివాస్

  ReplyDelete
 5. శ్రీనివాస్ గారు, ఏదో మిస్ అయింది అని అనుకున్నాను. అది బృహదారణ్యకం. ఇంకో చిత్రమైన సంగతి ఏమంటే, నిన్న సాయంత్రం ఆ పుస్తకm తిరగేస్తున్నప్పుడే ఈ టపా రాయాలనిపించింది. గాథా సప్త శతి లో తెలుగు పదాలు ...ఇది నాకు తెలియనిది. నా దగ్గర మనవి మాటలు తప్ప మిగిలినవి ఉన్నాయి. 7 యేళ్ళ ముందు విశాలాంధ్రలో దొరికాయి. అప్పుడూ అవి కాస్త చిరిగి ఉన్నాయ్. అయినా ఎందుకో తీసుకున్నాను. నా అజాగ్రత్త వల్ల "మనవి మాటలు" పుస్తకం ఎక్కడో పోయింది :-(

  ఇక లిపి గురించి. అవును మీరన్నది నిజం. కాస్త అత్యుత్సాహమే. :-) అయితే ఆ వాక్యం కూడా ఓ చోట రామ చంద్ర గారు స్వయంగా చెప్పుకున్నదే! :-)లిపుల మీద ఓ మంచి వ్యాసం పొద్దులో చూసాను. మీరు కొన్ని పరిచయం చేస్తే బావుంటుంది.

  పూర్ణిమ, మురళి, సుజాత గార్లు : ధన్య వాదాలు. కాకతాళీయంగా ఈ రోజు ఉదయం పేపర్లో మొదటి వార్త, తెలుగు భాష కు ప్రాచీన హోదా లభించడం. చెప్పుకోలేని ఓ ఫీలింగ్. గర్వమో, ఆనందమో, అతిశయమో, ఏదో తెలీదు. మీరు అలాగే ఫీల్ అయి ఉంటారు.గాథా సప్తశతి తెనిగించిన మరో మా సీమ ప్రముఖుడు, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారికి, తిరుమ రామచంద్ర గారికి నివాళి. (ఈనాడు లో ఈ రోజు తనికెళ్ళ భరణి రాసినది కూడా చదవండి)

  ReplyDelete
 6. good show. Please upoad this to teviki page on ramachandra.
  If you have doubts, pl contact chadvari or makineni pradeep.

  ReplyDelete
 7. This comment has been removed by the author.

  ReplyDelete
 8. Ravi,
  What does this "prachina hoda" means for a language? I think even kannada along with telugu got this status recently on Nov 1st. But what does this status mean? any idea

  ReplyDelete
 9. కొత్తపాళీ గారు : I did the same. తిరుమల రామచంద్రాచార్య అని వెతికితే కనిపిస్తుంది. సూచనకు ధన్యవాదాలు.

  ganesh : It is drive towards securing our heritage, in which languages (old languages in the country) are one of the major part. Somewhat similar to securing our temples, monuments etc...

  Sanskrit and tamil were earlier recognised. Telugu people were fighting for some time. Now in the voting, out of 9 people, 8 people voted for recognising telugu & kannada as the languages of our heritage.

  guess from which state the person who voted againest this??? :-)...yes.u r correct...:))

  ReplyDelete
 10. Yes Ravi.. I had hrd that there is some opposition for this ..from on of the CORNER..especially for kannada..
  All in all feels proud that I know 3 out of 4 classical languages :)
  and u know 4/4

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.