Tuesday, October 28, 2008

మలయాళంకారం

"మీ ఇండియన్స్ ఇంగ్లీషు ఇంత చక్కగా మాట్లాడతారు కదా, కానీ ఇక్కడ యూనివర్సిటీ లో ఇంగ్లీష్ చెప్పే టీచర్లు ఓ రకమైన యాసతో మాట్లాడతారు. ఎందుకలాగ?" అడిగాడు క్లయింట్ దేవో భవ గాడు, నిరుడు యెమెన్ కి వెళ్ళినప్పుడు.

"అంటే?" అడిగాను అర్థం కాక.

"అంటే, "కాలేజ్" ను "గోళేజ్" అని, అరబ్ ను "యెర్ఱబ్" ఇలా ఖూనీ చేస్తుంటారు దారుణంగా" చెప్పాడు వాడు. వాడి కళ్ళల్లో అరుణిమ.

అర్థమయి నవ్వేశాను. (నవ్వక పోతే, అ కోపం మా మీద చూపించి మమ్మల్ని పీక్కు తింటాడు)

మలయాళంకారం గురించి ఇప్పటికే నెటిజనులకు తెలిసి ఉంటుంది. ఎన్ని మెయిల్స్ వచ్చినా తిరిగి మలయాళీల మీద వచ్చిన జోక్ కొత్తగానే అనిపిస్తుంది.

ఇంతకీ "మలయాళీ" కరెక్టా? "మళయాళీ" కరెక్టా?

***************************

కాలేజ్ అయిపోయిన తర్వాత మా వాడికొకడికి బిర్లా పోలీ ఫాబ్రిక్స్ అన్న కంపనీ లో ఉద్యోగం వచ్చింది. ఆ కంపనీ ఉత్పత్తి గంధకిక ఆంలము (సల్ఫ్యూరిక్ ఏసిడ్). సల్ఫ్యూరిక్ ఏసిడ్ ఉత్పత్తి లో ఓ (అనుబంధ ఉత్పత్తి) బై ప్రాడక్ట్ జనిస్తుంది. దాని పేరు ఓలియం (H2S2O7).

మావాడు డ్యూటీ ఇంజినీరు(ట). తన షిఫ్ట్ లో ఎంత ఉత్పత్తి సాధించేడు, తదితర వివరాలు పద్దు రాసి వెళ్ళాలి షిఫ్ట్ ముగిసి వెళ్ళేప్పుడు.

వాడి బాసురుడు తనిఖీకి వచ్చేట్ట.

"ఒళియూం" ఎంత? అడిగేడట.

ఓహో, "ఓలియం" గురించేమో అని మా వాడు ః౨౨ఓ౭ గురించి చెప్పేడుట.

బాసురుడు ఆగ్రహంతో, "అసలు నీవు ఇంజినీరింగ్ చదివావా? నీకు చెప్పేది అర్థం అవుతుందా ... " ఇలా మొదలెట్టేట్ట.
ఆఖరుకు తేలిందేమంటే, "ఓలియం" (H2S2O7) కు "వాల్యూం" (ఘనపరిమాణం) కు ఆ కేరళ బాసు ఒకే రకంగా సౌండిస్తాడు!


************************

ఇంకో సారి కేరళ కు మా ఇంట్లో వాళ్ళందరం పిక్నిక్ కి వెళ్ళాం. అక్కడ ఓ హోటల్ లో పొద్దునే, కాఫీ టీ లు వదిలేసి ఓ పెద్ద గ్లాసులో తెల్లటి ద్రవ పదార్థం తాగుతున్నారు జనాలు.

వెయిటర్ ను పిలిచి, సైగలతో అడిగేం, యేమిటదని.

వెయిటర్ నిండుగా ఊపిరి పీల్చాడు, సముద్రం లంఘించబోయేముందు ఆంజనేయుడు బిగపట్టినట్టుగా.

"హో-ర్ళి-క్స్" అన్నాడు, వూపిరి వదిలేస్తూ.

మా కజిన్ ఆ దెబ్బకు తుఫానులో చిక్కిన ఎండుటాకులా అల్లాడాడు.

******************************

మా ఇంట్లో మా మేనత్త కేరళ లోని కేలికట్ లో ఉంటుండటంతోనూ, మేము అప్పుడప్పుడు అక్కడికి వెళుతుండటంతోనూ, వాళ్ళ వాళ్ళు మలయాళం లో సంభాషిస్తుండంతోనూ, ఎంగళుక్కు మలయాళం స్వల్పమాయి అరయుం. (మాకు మలయాళం తెలుసు).

కేలికట్ అన్న వూరిని వాళ్ళు పిలిచేది కో-ఝి-కోడ్ అని. ఇక్కడ "ఝి" అన్నది కేవలం తమిళ్, మలయాళం లో ఉన్న ఓ అక్షరం. ఆ అక్షరమే అపభ్రంశం చెంది, ఱ గా మారిందని ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం లో తేల్చారు.

అన్నట్టు ఇంకో విషయం ఏమిటంటే, ఆ భాషలో "సంభాషించడం" అనడానికి ఏమంటారో తెలుసా? "సంసారిక్క్యాం" .

కేరళ భాషలో 64 శాతం సంస్కృత పదాలున్నాయట. ఇది మా మామయ్య చెప్పేడో సారి. ఆయన సంస్కృత, తెలుగు, హిందీ, భాషా పండితుడు. ఆయనకు మలయాళం కూడా తెలుసు. నాకు మాత్రం తెలుగే సంస్కృతానికి దగ్గర అని ఓ అనుమానం. "సంస్కృతం తెలుగు వాడి అబ్బ గంటు" అని ఓ తెలుగు కవి చెప్పినట్టు కూడా గుర్తు.

*************************

మలయాళం అర్థం చేసుకోడానికి, పనికొచ్చే మలయాళంకారం లో రూల్స్ కొన్ని ఇక్కడ పెడుతున్నాను.

1. ఎక్కడ "ల" ఉన్నా, దాన్ని "ళ" గా పలకండి. (కాలేజ్ - గోళేజ్, వగైరా...)
2. "ర" అన్న అక్షరాన్ని అప్పుడప్పుడు "ఱ" తో ఖూనీ చేస్తుండండి. (జేసుదాసు, అదేదో మోహన్ బాబు సినిమాలో "నగుమోము" త్యాగరాజ కృతి పాడేప్పుడు, "నగరాజ" అనే పదాన్ని ఎలా పలుకుతాడో గమనించండీసారి)
3. అక్కడయితే పదం మధ్యలో "ఒ" వస్తే, దాన్ని సాగబీకి, "ఓ" అని పలకండి.
4. వీలున్నప్పుడు, "క చ ట త ప" లను "గ జ డ ద బ" లు గా మార్చండి.
5. మీకు తమిళం తెలుసా, అలాగయితే, బాగా జలుబు తెచ్చుకుని, తమిళ్ మాట్లాడండి. ఓ 40 శాతం మలయాళం వచ్చేసినట్టే.
6. లేదూ, ముక్కు మూసుకుని తమిళం మాట్లాడండి.
7. "అ" ను "ఎ" గా పలకండి. ఏదీ "రెవి" అనండి చూద్దాం ఓసారి. (నా పేరండీ బాబు)
8. ఎంద - ఏమి, ఎత్తరె - ఎంత, యార్- ఎవరు ...ఈ బేసిక్స్ ను విచ్చలవిడిగా ఉపయోగించుకోండి. అవతల వాడు చెప్పినది అర్థం అయినా కాకపోయినా "ఓ!" అంటుండండి.
9. వత్తు పలికేప్పుడు, వత్తు తర్వాత అక్షరం సాగబీకండి. (ఉదా : మెసేజింగ్ అనడానికి, మా ఆఫీసులో ఓ కైరళి "మస్సాజింగ్" అంటుంది. ఆ అమ్మాయి అందం చూసి ఏమనలేక వొదిలేసాను)
10. వంటలో కొబ్బరి నూనెను అధికంగా ఉపయోగించండి. నాలుక జారి, మలయాళం పలుకుతుంది.

*****************************

పైవేవీ వర్క్ అవుట్ అవకపోతే, "వేండామొరు జీవిదం " అని ఓ నమస్కారం చెప్పండి.

19 comments:

 1. ఇంకో సూత్రం: 'ఆ' ను 'ఓ' గా పలకాలి. "ఓయిల్" (ఆయిల్), "ఓపరేషన్" (ఆపరేషన్) ఇలా.

  సంసారిక్కుం లాగా తెలుగువారికి చోద్యం గా వినిపించే మరో మలయాళ పదం 'చోద్యం', ప్రశ్న అని అర్థం. 'చోదిక్కు' అంటే ప్రశ్నించడం.

  తెలుగు కంటే మలయాళంలోనే సంస్కృతం పాలు ఎక్కువ.

  ReplyDelete
 2. :) బావుంది మలయాళం మేడీజీ!
  ఇంతకీ ఆ "వేండామొరు జీవిదం" అంటే ఏంటి.. "నాకొద్దీ పాడు బతుకు" అనా?

  ReplyDelete
 3. వంటలో కొబ్బరి నూనెను అధికంగా ఉపయోగించండి :-)

  ReplyDelete
 4. పాపం మలయాళీలు ఎంత సహనం ఉన్నవారో. ఎన్ని జోకులేసినా ఏమీ అనరు :)

  భామలు .....

  ReplyDelete
 5. మీ టపా జింబ్‌ళీ సూబఱ్.

  నా మలయాళీ కొలీగుడు చేసిన పనిని undo చెయ్యటానికి గండ్రోళ్-జెడ్ నొక్కుతాడు :-)

  ReplyDelete
 6. ఈ మళయాళంతో మనకూ ఎగ్స్పీరియన్సుంది లెండి.

  మన తెలువాళ్ళుకూడా కొన్ని చిత్రంగానే పలుకుతారు ‘ఎమ్’,‘ఎన్’ లను మనం యమ్,యన్ అనిపలుకుతాము. ఇక మనోళ్ళువాడే ఊతపదాలు బోలెడు.

  ReplyDelete
 7. @చంద్రమోహన్ గారు : విరోధమిల్లె :-). ఇంకొకటి -> విరోధం - అభ్యంతరం. తెలుగులో విరోధం అంటే, శతృత్వం అన్న అర్థం లో వాడతాం కదా.

  @చదువరి గారు : అలాంటిదే :-). ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే, అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు.."@#మ్మ జీవితం" :-)

  @వికటకవి గారు : నిజ్జం .

  @ప్రవీణ్ గారు : భామలు అంటూ ఆగిపొయ్యారు?!?

  @అబ్రకదబ్ర గారు : సూబర్. :-)

  @మహేష్ గారు : సరిగ్గా, ఇదే విషయం ఓ మలయాళీ నాతో చెప్పి, మీ తెలుగాళ్ళకు ఆంగ్ల ఉచ్చారణ రాదంది.

  ReplyDelete
 8. నేను ఇదివరకు పని చేసే ఒక టీములో కొన్ని మలయాళీ జోకులు విన్నాను. బయట బాగా చలిగా ఉంటే, ‘బయంగర గోల్డు’ అనేవారు (మన తెలుగువాళ్ళే). టపా చాలా బాగుంది.

  ReplyDelete
 9. ఱవి ఘాఱు.. ఝాళా బాగుంది..
  వేండామొరు జీవిదం ..

  అయ్య బాబోయ్... నాకు మళయాళం వఛేసింది..

  ReplyDelete
 10. ఱవి ఘాఱు.. ఝాళా బాగుంది..
  వేండామొరు జీవిదం ..

  అయ్య బాబోయ్... నాకు మళయాళం వఛేసింది..

  vEnu Ram.

  ReplyDelete
 11. బావుంది టపా

  Good one.

  ReplyDelete
 12. Haha Ravi
  Mana trip gurinchi baaga gurtu chesavu :)

  Mana intlo andarikanna yekkuva bhaditunni nene.. Trivndrum lo 1 yr adi central Govt office lo..
  Anyway i may have to write one blog to explain the whole thing :)

  Good one

  ReplyDelete
 13. "చేటా" మీ టపా సూపరియో.. :)

  ReplyDelete
 14. Great!
  అసలు కరక్టు మలయాలం, మలయాలీ! :)

  ReplyDelete
 15. పోస్టూ.. వచ్చిన కమ్మెంటులు అదిరాయి! :-)

  ReplyDelete
 16. pado point lo vishyam unnatu undi..:)

  ReplyDelete
 17. Zimbly zooparb :))))))

  ReplyDelete
 18. @కొత్తపాళీ గారు,
  మలయాళం, మలయాళీ నే కరెక్టు. చివరి అక్షరం 'ళ' నే 'ల' కాదు.

  ReplyDelete
 19. వేండామొరు జీవిదం

  - కిరణ్
  ఐతే OK

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.