Wednesday, October 22, 2008

మిత్ర ఖేదం

సూర్యుడికి మేఘంలాగా, అగ్నికి నీరులాగా, పువ్వుకు తుమ్మెదలాగా,గౌతం పాలిటి దినకర్ లాగా మనకు మన జీవితాల్లో కొంతమంది స్నేహితులు తగులుతూనే ఉంటారు. అప్పుడప్పుడూ మనమూ వాళ్ళ పాలిట దినకర్ గా మారుతుంటాము.

గుండ్రాలు....గుండ్రాలు...గుండ్రాలు...

ఇంజినీరింగుకు ముందు, ఎమ్ సెట్ రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న రోజులు. ఫలితాలు రానే వచ్చాయ్. నాకూ, నా పాలిట దినకర్ అయిన అనంత్ కూ, మరో ఇద్దరు మిత్రులకూ రాంకు వచ్చింది! సృష్టిలో అప్పుడప్పుడూ అద్భుతాలు జరుగుతాయ్ అన్నది అర్థం అయింది. (ఎమ్సెట్ రాని మిత్రుల లిస్టు పెద్దది కాబట్టి ఇక్కడ చెప్పడం కుదరదు)ఎమ్సెట్ కొట్టామన్న ఆనందాన్ని మా నలుగురు, ఎమ్సెట్ తమను కొట్టిందన్న ఆక్రోశాన్ని మిగిలిన మిత్రులు సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాం. అందులో భాగంగా జీవితంలో మొట్ట మొదటి సారి ఓ "మంచి" మళయాళ చిత్ర రాజాన్ని చూడాలని నా మిత్ర బృందం నిర్ణయించింది. ఆ చిత్రం పేరు "అడవిలో అందగత్తెలు".

అందరూ మా ఇంటికి వచ్చేరు. మాది చాలా ఆర్తోడాక్స్ ఫ్యామిలీ!

"ఇలాంటి సినిమాలు చూస్తే చెడిపోతాం. అంత కక్కుర్తి తో ఈ సినిమా చూడ్డం నాకు ఇష్టం లేదు. నేను రాను"
ఉద్రేకంగా చెప్పాన్నేను.


ఓ ముప్పావు గంట తర్వాత సినిమా హాలు దగ్గరున్నాము.

అది మా వూళ్ళోని ఓ poorman's multiplex. అందులో 3 సినిమా హాళ్ళు. అందులో ఒక సినిమా హాల్లో శరత్ బాబు ప్రధాన పాత్రధారుడిగా "అయ్యప్ప స్వామి లీలలు" సినిమా ఆడుతోంది. ఆ పక్క సినిమా హాల్లో మేము వెళ్ళదలుచుకున్న సినిమా. రెండు సినిమా ల టికెట్ కవుంటర్లు, థియేటర్ తలుపుకి చెరో వైపున ఉన్నాయ్. అయ్యప్ప సినిమా కు విపరీతమయిన రద్దీ. టికెట్లు ఇవ్వడం ఇంకా ఆరంభించలేదు.

సరే అని బఠాణీలు, శనక్కాయలు షాపింగ్ చేయడానికని హాలు బయటికెళ్ళాం మేము. అక్కడ కాస్త నింపాదిగా కూర్చుని ఉన్నాం. ఇంతలో టికెట్ కవుంటరు ముందు లైటు వెలిగింది.

అంతే!

అయ్యప్ప స్వామి లీలలు సినిమా కోసం కాచుకున్న జనాభా అంతా మూకుమ్మడిగా రెండవ సినిమా హాలు టికెట్ కవుంటర్ వైపు పరిగెత్తుకు రాసాగారు. మేము త్వరగా స్పందించి, కవుంటర్ వైపు పరిగెట్టాము. ఎలాగోలా మా బృందం అందరం క్యూలో నిలబడి టికెట్లు తీసుకున్నాం. మా మిత్ర బృందంలో అనంత్ (దినకర్) మాత్రం లేడు!

బాక్ గ్రవుండ్ లో జరిగిందిదీ! మేము శనక్కాయలు తింటుండగా, మా వాడు అయ్యప్ప స్వామి సినిమా క్యూలో వాళ్ళ అక్కయ్య ఫ్రెండ్ నిలబడి ఉండటం చూసాడు. మాతో "ఇప్పుడే వస్తా" అని చెప్పి పక్కకెళ్ళాడు. నేనూ నా మిత్ర బృందంతో కలిసి పరుగులు తీస్తున్నప్పుడు వాడి అక్కయ్య ఫ్రెండ్ నన్ను చూసింది! (ఆమె ఇల్లు మా వాడి ఇంటి పక్కనే. నేను వాడి ఇంటికి అప్పుడప్పుడూ వెళుతుంటా కాబట్టి, నన్ను ఆమె గుర్తు పట్టింది). వాడు మాత్రం ఆమె కనుమరుగయే వరకు ఎదురు చూసి, తర్వాత మా దగ్గరకు వచ్చాడు.

సినిమా అంతా భయంకరమైన సస్పెన్స్త్ తో , ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలమధ్య, అడవిలో ఉత్కంఠ భరితంగా గడిచింది.ఆ సినిమా కు సెన్సార్ సర్టిఫికట్ ఇచ్చిన వాడికి ఇంగ్లీష్ అక్షరాలు సరిగా రానట్లుంది. "U" అని రాయాల్సిన చోట "A" అని రాసాడు.

మరుసటి రోజు వాడి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అక్క నా వైపు కొంచెం నిరసనగా, అనుమానంగా చూసింది. ఆ పయోముఖ సారా కుంభం గాడు అప్పటికే తప్పును నా మీదకు మళ్ళించి ఉన్నాడు. నాకు కొంచెంగా అర్థమయింది విషయం. ఎందుకంటే, మొట్ట మొదటి సారి జీవితం లో (so called) తప్పు చేసేం. ఎవరు అనుమానించినా అందుకేనేమో అని మనసులో ఓ అభద్రతా భావం.

ఆవిడ అడగనే అడిగింది నన్ను,వాణ్ణి కలిపి, "ఏరా, ఇంజినీరింగు సీటు వస్తూనే కొమ్ములొచ్చాయా? వెధవ పనులు, మీరూను" అంటూ. (నిజానికి వాళ్ళింట్లో అందరికీ, నామీద మంచి నమ్మకం, రవి మంచి బాలుడు అని.)

వాడు చెప్పక ముందే నేను చెప్పేను, "లేదక్కా, అయ్యప్ప సినిమాకని వెళ్ళాము. అక్కడ క్యూలో అందరు ఇంకో సినిమా వైపు పరిగెత్తుతుంటే, మేము పరుగెత్తి టికెట్లు కొన్నాం అంతే, హాలు లోపల చూస్తే, ఈ దరిద్రం సినిమా ఉండె. మాకసలు తెలీనే తెలీదు."

ఆమె నా మాట నమ్మినట్టే కనబడింది. (నా లాంటి అమాయకుడు అలాంటి తప్పులు చేయడని ఆమె గట్టి నమ్మకం కాబట్టి.)అంతా అయ్యప్ప లీల!!!

*********************************

వాణ్ణి దెబ్బ కొట్టే అవకాశం మరో సంవత్సరం తర్వాత నాకు వచ్చింది. ఇంజినీరింగు మొదటి యేడు అచ్చు "హాపీ డేస్" సినిమాలోలా గడిపేం. ఆ యేడు గడవగానే, నాకు రొస్టు సివిల్ ఇంజినీరింగు నుండీ తొట్టి మెకానికల్ కు, వాడికి రొస్టు సివిల్ నుండీ తోలు కెమికల్ కు ప్రమోషన్లు లభించాయ్. రెండవ ఏడు మా ఇద్దరికీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్ కామను. మా ఇద్దరికీ నచ్చని ఒకే ఒక సబ్జెక్ట్ అది.

ఆఖరు ఇంటర్నల్ పరీక్షలు వచ్చాయ్. మామూలుగానే పరీక్షలను ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. సరిగ్గా ఆ సమయంలో, నాకు (అవుట్ అయిన) ప్రశ్నాపత్రం ఓ మిత్రుడి ద్వారా దొరికింది. అప్పుడు...నాకో అద్భుతమైన అవుడియా వచ్చింది. ఎలాగు ప్రశ్నాపత్రం అందరికీ దొరుకుతుంది. అంతలోనే మా వాణ్ణి ఓ చిన్న ఆటాడించాలి! వెంటనే ఆ ప్రశ్నా పత్రానికి ఇంకో ఇంకో 5,6 ప్రశ్నలు (కొన్నిటికి తప్పుడు సమాధానాలు) కలిపి, తన వద్దకు వెళ్ళాను.

"రేయ్, రేపు జరుగబోయే పరీక్ష ప్రశ్నాపత్రం ఇది. ఏం చేస్తావో తెలీదు. మనం సాధ్యమైనంత త్వరగా అన్నిటికీ ఆన్సర్లు పట్టాలి. రాత్రిలోగా ప్రిపేర్ అవాలి" చెప్పాను.

ఆ రోజు రాత్రికి వాడో పేపర్ తీసుకొచ్చాడు. (బాక్ గ్రవుండ్ లో...వాడూ నన్ను దెబ్బ కొట్టాలని, కొన్ని తప్పుడు సమాధానాలు రాసుకుని తీసుకొచ్చేడు) సరే ఎలాగో మొత్తం ప్రిపేర్ అయాం. తర్వాతి పరీక్షలో ఇద్దరం ఫెయిలు!ఆ ర్వాత ఫైనల్ పరీక్షలోనూ విజయ వంతంగా ఫెయిలయాం ఇద్దరూనూ.

ఇక్కడో విషయం. అప్పట్లో మా యూనివర్సిటీ JNTU లో కొన్ని (3,4) సబ్జెక్ట్లు వదులుకున్నా డిగ్రీ రావడానికి ఢోకా ఉండదు. క్రెడిట్ సిస్టం అంటారు దాన్ని. అందువల్ల మాకు ఇబ్బంది లేదు.

అయితే ఇంటి దగ్గర ఊరుకోరు కదా. మా నాన్నకేమో వాడి మీద, వాడి నాన్న కేమో నా మీద నమ్మకం. ఇద్దరం ఫెయిలయ్యాం అన్న విషయం ఎలాగో ఇంట తెలిసింది. మేమిద్దరం మాట్లాడుకుని ఓ ప్లాను వేసుకున్నాం. వాళ్ళ నాన్నను నేను, మా నాన్న ను వాడు కన్విన్స్ చేసేట్టుగా.

అందులో భాగంగా ,అంకుల్ నా దగ్గరకు రాగానే నేను చెప్పాను. "అంకుల్, మా యూనివర్సిటీ పద్దతి చాలా ఆధునికంగా ఉంటుంది. విద్యార్థికి తనకు నచ్చిన సబ్జెక్ట్ మీద ఆసక్తి కలిగించడం వాళ్ళ ప్రధాన ఉద్దేశ్యం. అందుకనే ఒకట్రెండు పరీక్షలలో ఫెయిలయినా పట్టించుకోదు. నిజానికి ఫెయిలవాలి కూడా. అలా కాకపోతే, వాళ్ళు మా మీద చర్య కూడా తీసుకుంటారు."

"ఇదేం యూనివర్సిటీ రా, పరీక్షల్లో ఫెయిలవమని చెబుతుంది. ఎక్కడా విన్లే" అన్నాడాయన.

"అదే అంకుల్, మా యూనివర్సిటీ గొప్పతనం. అందుకే ఇందులో సీటు రావడం చాలా కష్టం" చెప్పాను నేను.

మా నాన్న వాడి దగ్గరకెళ్ళాడు అనుకున్నట్టుగానే. వాడు అదో గొప్ప విషయంలా మా నాన్నకు సర్ది చెప్పేడు.

శుభం.

ఆ తర్వాత ఎప్పుడైనా వాడు నా మీద, నేను వాడి మీదా కత్తులు నూరాలని ప్రయత్నించినా ఇద్దరికీ చెడుపు చేస్తుండటంతో, అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు తనెక్కడో, ఏ దేశానికి పారిపొయాడో తెలీదు!

********************


11 comments:

 1. బావుంది మీ మిత్ర ఖేదం.

  ReplyDelete
 2. అవును మరి. కలసి అబద్ధం చెబితే కలదు సుఖము :)

  ReplyDelete
 3. aamaatram abaddalu baalyaaniki amdaannistaayilemdi

  ReplyDelete
 4. కేక లాగ ఉంది.." అంతా అయ్యప్ప లీల " is good...

  ReplyDelete
 5. సూర్యుడికి మేఘం
  అగ్నికి నీరు
  పువ్వుకు తుమ్మెద
  గౌతం పాలిటి దినకర్
  :-))
  గోముఖ వ్యాఘ్రం,
  మేకవన్నె పులి
  పయోముఖ సారా కుంభం గాడు
  :-)))

  మీరు చదువుకున్న సంస్కృతం బాగా బ్లాగాడిస్తోంది.

  ReplyDelete
 6. Hey ravi sooper article.. esp ayappa leela :D
  Adi yemi Ganga Gouri complexaa? leka Raja Ramana complexaa?

  ReplyDelete
 7. @మహేష్, @మేధ, @ఉమా శంకర్, @దుర్గేశ్వర, @ప్రఫుల్లచంద్ర, @anonymous గార్లు : నెనర్లు. :-).

  @కొ.పా గారు : నిజ్జం. కనీసం అబద్దాలు చెప్పేప్పుడైనా కలిసి చెప్పాలి. :-)

  @రానారె : ఆర్యా, నమస్తే. :-) (స్కూల్లో ప్రెజెంట్ సార్ లేదా యస్ సార్ అంటారు కదా, అటెండెన్స్ వేసేప్పుడు అలాగ సంస్కృతం క్లాసు లో ఆర్యా నమస్తే అని...)

  @Ganesh : రాజా, రమణ, రమేష్ కాంప్లెక్స్..:-)

  ReplyDelete
 8. బాగుంది మీ మిత్ర ఖేదం! గౌతంకే అనుకున్నా.. చాలానే దినకర్లు ఉన్నారన్న మాట! :-)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.