Friday, October 17, 2008

తెలుగులో "ఇవ" అర్థములు!

ఓ అందమైన సీస పద్యం చదవడం తటస్థించింది నిన్న.

మామూలుగా కనిపిస్తూనే ఎన్నో విషయాలు తెలిపిందా పద్యం, దానిలో ఉటంకించిన వివరాలూను. ఇంకెందుకు ఆలస్యం., చిత్తగించండి.

సింధు బల్లహు రీతి, శ్రీపతి పండితు
మరియాద, ధూపద మాచిదేవు
నట్లు,మహాకాళుననువున, నల్ల క
ల్కద బ్రహ్మ ఠేవ, గక్కయ విధమున,
శూలద బ్రహ్మయ్య చొప్పున, బిబ్బ బా
చన లీల, వీర నాచాంకు పోల్కి,
కదిరె రెమ్మయగారి కైవడి, దెలుగేశు
మసణయ్య చందాన,మాదిరాజు

కరణి, మోళిగ మారయ్య గతి, దెలుంగు
జొమ్మనార్యుని వడువున, సురియ చౌడు
పగిది, బసవేశ్వరుని మాడ్కి భక్తి యుక్తి
శంభు బూజించి బ్రదుకు రాజన్య చంద్ర!


పై పద్యంలో 16 మంది ప్రముఖ శివ భక్తులు. వారందరి లాగ, రాజా, నీవూ శంభుని పూజించి తరించు అని భావం.

ఆ 16 మంది కథా కమామీషు ఇలా...

1. సింధు బల్లహుడు : ఇతణ్ణే బల్లాణ రాజు, బల్లవ రాయడు అంటారుట.శివుడు జంగముడై, ఈయన వద్దకు వచ్చి, ఓ వేశ్యను యాచించాడుట. ఈయన భార్యను అతని వద్దకు పంపాడుట. శివుడు ఆమెను సమీపించగానే శిశువు గామారాడుట.
2. శ్రీపతి పండితుడు : ఇంద్రకీలాద్రి శాసనంలో ఈయన ప్రస్తావన ఉందిట. ఈయన తన ఉత్తరీయంలో నిప్పులు మూటగట్టేడుట. ఆంధ్ర దేశంలో శైవం వ్యాప్తి చేసిన ముగ్గురిలో ఒకడు. (ఈన పేరు వినగానే మనకు బాగా పరిచయం ఉన్న ఒకాయన పేరు గుర్తుకు వచ్చి వుండాలి. శివునికి తేనె తో ఎన్నో యేళ్ళు అభిషేకం చేస్తే, తీయని స్వరం వస్తుందిట. శ్రీపతి పండితారాధ్యుల బాలు కూడా అదే పని చేసి ఉంటాడు ముందు జన్మల్లో)
3. ధూపద మాచిదేవుడు : ధూపం ఇచ్చేవాడు ధూపదుడు. బసవేశ్వరుని సమకాలికుడు.
4. మహాకాళయ్య : శివుడికి తల అర్పించి తిరిగి తలను పొందిన భక్తుడు.
5. కల్కద బ్రహ్మయ్య : మరో బసవేశ్వరుని సమకాలికుడైన భక్తుడు.
6. ఇంద్రజాలం చేసే కక్కయ్య
7. శూలద బ్రహ్మయ్య : శూలమును ధరించిన ఓ భక్తుడు
8. బిబ్బ బాచన : శివ భక్తుల ఇళ్ళలో బిచ్చమెత్తి, అన్నార్తులకు ప్రసాదించే వాడట ఈ శివ భక్తుడు. అప్పటి బ్రాహ్మణులు ఆయన బండిని నిరోధించాలని విఫలమయ్యేరుట.
9. వీర నాచయ : వీర నాచాంకుడనే మరో భక్తుడు
10. కదిరె రెమ్మయ : కోమాలో వెళ్ళిన ఓ వ్యక్తికి వైద్యం చేసి బతికించినట్లు చెప్పుకునే ఓ పల్లీయుడైన శివ భక్తుడు.
11.తెలుగేశు మసణయ్య: మసణము (శ్మశానము)లో నివశించిన ఓ భక్తుడు
12. మాదిరాజు : మరో భక్తుడు
13 మోళిగ మారయ్య : కట్టెలమ్ముకునే ఓ నిరుపేద భక్తుడు. ఈయనకు శివుడు సువఋనాలను ప్రసాదిస్తే, వాటిని పంచి తిరిగి నిరుపేదగా మిగిలి పొయేడుట.
14. తెలుగు జొమ్మయ్య :వేటగాడైన ఓ శివ భక్తుడు (తిన్నడంటే ఈయన కాదు)
15. సురియ చౌడయ్య :మరో ప్రసిద్ధ శివభక్తుడు.
16. బసవేశ్వరుడు : నంది అవతారుడని చెప్పుకునే, వీర శైవానికి ఆద్యుడైన మహా భక్తుడు. లింగాయతులనబడే వారు, ఈయనను పూజిస్తారు. పాల్కురికి సోమనాథుడి బసవేశ్వర చరిత్ర ఓ గొప్ప గ్రంథం.


బాగానే ఉంది, ఇంతకూ సంగతేంటి అంటారా?

తెలుగు లో "వలె" అనే అర్థం వచ్చే పదాలు మొత్తం 30 ఉన్నయి(ట).అవి- రీతి, మరియాద, అట్లు, అనువున, ఠేవ, విధమున, చొప్పున, లీల, పోల్కి (పోలె), కైవడి, చందాన, కరణి, గతి, వడువున, పగిది, మాడ్కి, లాగు, భాతి, భంగి, గరిమ, రేఖ, భావము, సోయగము, చెలువు, గారవము, వెరవు, సరణి, రమణ, క్రియ, తెఱగు

అందులో ఏకంగా 16 పదాలను ఇందులో ప్రయోగించడం ఓ యెత్తయితే, పేర్లను సీసంలో చక్కగా ఇముడ్చి చేసిన చమత్కారం ఇంకొకటి. (పేర్లను పద్యంలో ఇముడ్చటం కష్టం అని విన్నాను, అయితే నాకు ఉపజాతి పద్యాల గురించి అంతగా తెలియదు. పొద్దు లో రాఘవ గారి వ్యాసాలు ఇంకా పూర్తిగా చదవలేదు.)

ఇంతకూ ఈ పద్యం రాసినాయన ఎవరు అంటారా?

ఊహించండి.

2 క్లూలు.
1. ఈ పద్యం ఓ గ్రంథంలోనిది. ఆ గ్రంథం పేరు ఓ అచ్చుతో మొదలవుతుంది.
2. ఈయన ఓ ప్రబంధ కర్త (పంచ ప్రబంధాల్లో ఓ ప్రబంధం ఈయన కృతి)

(అందంగా కందాలు చెబుతున్న మన బ్లాగు సోదరులకు ఈఇవార్థములు ఉపయోగపడుందేమో అని ఓ ఆశ., అలాగే ఓ అనుమానం. "మాదిరిగా" అని మనం వ్యవహార భాషలో వాడతాం. ఆ పదం ఈ లిస్టులో లేదెందుకో?ఎవరికైనా తెలుస్తే చెప్పగలరు.)

**************

6 comments:

 1. వలె వలె వలె!! :)
  ముప్పై సమానార్థకాలున్నాయంటే ఆశ్చర్యంగా వుంది. ఎక్కడ చదివారీ పద్యవిశేషాలు? అచ్చుతో మొదలయ్యే ప్రబంధగ్రంథం ఆముక్తమాల్యద - ఔనా? దాని కర్త శ్రీకృష్ణదేవరాయలవారేనా ఈ పద్యకర్త?

  ReplyDelete
 2. రానారె గారు, పప్పులో కాలేశారు.ప్రశ్నను ఇంకోసారి జాగ్రత్తగా గమనించండి.

  సమాధానం.

  గ్రంథం పేరు : ఉద్భటారాధ్య చరిత్రము

  గ్రంథ కర్త : తెనాలి రామలింగడు (రామలింగడు- రామ కృష్ణుడు కాదు. ఎందుకంటే, ఈ కావ్యం రాసేప్పుడు ఆయన శైవుడు. ఇంకా రాయల వారి ప్రాపకం సంపాదించలేదు. చూడుడు. తెనాలి రామకృష్ణ సినిమా)

  తెనాలి రామ కవి మీద ఓ అద్భుతమైన పుస్తకం వెలువడింది మొన్నా మధ్య. మా వూళ్ళో విశాలాంధ్ర లో దొరికింది. రాసినాయన ముత్తేవి రవీంద్రనాథ్. ఈ విశేషాలన్నీ ఆ పుస్తకం లోవి.

  ReplyDelete
 3. ఇంకో ముక్క. ఆముక్త మాల్యద (విష్ణు చిత్తీయం) వైష్ణవ భక్తుడు, పన్నిద్దరు ఆళ్వార్లలో ఒకడైన తొండరడిప్పొడి ఆళ్వారు (?) మీద వ్రాసిన గ్రంథం. అందులో శైవ భక్తుల గురించి విపులంగా వ్రాయడానికి అవకాశం లేదు :-).

  ReplyDelete
 4. ఓహో!
  ఈ విశేషాలు విన్నాక తెనాలిరాము డెలావుండేవాడో చూడాలనే కోరిక కలుగుతోంది. :-)

  ReplyDelete
 5. భలే ఉందండీ. ఇలాంటి పద్యాన్ని చూడడం ఇదే ప్రథమం :)

  ReplyDelete
 6. క్రితం సారి హైదరాబాదు వెళ్ళినప్పుడు నేను విశాలాంధ్రలో ఈ పుస్తుకం కొన్నాను..చదవడం మొదలుపెట్టిన తరువాత వేరే పుస్తకాల వైపు మళ్ళి మళ్ళీ తిరిగిరావడం తటస్థించలేదు.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.