Sunday, October 12, 2008

కాళిదాసు శబ్దాలంకార చమత్కృతి!

ఉపమా కాళిదాసు, ఉత్ప్రేఖ్య కాళిదాసుల గురించి ఇదివరకు (కొన్ని నెలల క్రితం) రెండు మూడు టపాలు వచ్చాయి. ఇప్పుడు కాళిదాసు శబ్దాలంకార చమత్కృతి చూద్దాం.

యావత్తోయధరా ధరాధర ధరా ధారాధర శ్రీధరా
యావచ్చారు చచారు చారు చమరం చామీకరం చామరమ్
యావద్రావణ రామ రామ రమణం రామాయణం శ్రూయతే
తావత్తే భువి భోగ భోగ భువనం భోగాయ భూయాద్విభో

ఈ పద్యం లోని శబ్ద చమత్కారం ఎంత అందంగా ఉందో గమనించండి. ఇలా ఒకే రకంగా ధ్వనించే శబ్దాల ను ఆవృత్తిలో ప్రయోగించడమే యమకాలంకారం లేదా వృత్త్యనుప్రాస అంటారు(ట).

ఈ పద్యానికి అర్థం ఇది.(తప్పులుంటే నిర్మొహమాటంగా సరిదిద్దగలరు)

విభో : ఓ రాజా,తోయధరాః : మేఘాలు,ధరా : భూమి,ధరాధరః : పర్వతాలు,ధారాధరః : భూమిని మోస్తున్న ,శ్రీధరా: ఆది శేషుడు,యావత్ : ఎంతవరకు ఉంటాయో,చారు : అందమైన,చచారు : సంచరించడం అనే స్వభావం ఉన్న,చమరం : చామరీ మృగాలు,చామీకరం చ: సువర్ణ గిరి (మేరు పర్వతము),అమరం : జీవించి, యావత్ : ఎంతవరకు ఉంటాయో,రావణ రామ రామ రమణం : రావణుడు, రాముడు (వంటి పాత్రలతో) వీనులకింపైన,రామాయణం శ్రూయతే : రామాయణం వినబడుతుందో,తావత్ : అంతవరకు,భోగ భోగ భువనం : సకల భొగాలకు నిలయమైన,భువి : పృథ్వి,తే భోగాయ : నీ భోగాల కోసంభూయాత్ : ఉండు గాక!

పై శ్లోకం కాళిదాసు చెప్పిన చాటువు (ట).

ఈ అలంకారం హిందూ స్తోత్రాల్లో కూడా చాలా చోట్ల కనబడుతుంది. నాకు చప్పున స్ఫురించిన ఓ (శివతాండవ) స్తోత్రం లోని శ్లోకం ఇది.

జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమశ్వసత్
ద్వినిర్గమ క్రమ స్ఫురత్కరాళ ఫాల హవ్యవాట్
ధిమిద్ధిమిద్ధిమి ధ్వనన్ మృదంగ తుంగ మంగళ
ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శ్శివః

పై స్తోత్రం లో ఇంకో విశేషం (నాకు కనిపించినది) ఏమంటే, సంస్కృతంలో ధాతువు (క్రియా వాచకం) తో ఆరంభించడం గొప్ప వ్యాకరణ పాండిత్యానికి ఋజువు(ట). పై పద్యం "జయతు" తో ఆరంభించడం లో అది కనిపిస్తుంది.

- ఈ టపా రాసేప్పుడు దీనితో పాటుగా ఇంకో టపా రాద్దామని బయలు దేరి, తొందరలో ఈ శబ్దాలంకారాన్ని రూపకం (యమకం అని ఉండాలి) అని చెప్పడం జరిగింది. ఇది చాలా అల్పమైన తప్పిదం. తర్వాత చాలా సిగ్గేసింది. సవరించిన కొత్తపాళీ, చంద్రమోహన్ గార్లకు కృతఙ్ఞతలు.

8 comments:

 1. ఉదాహరణలూ వివరణా చాలా బాగున్నై కానీ రూపకాలంకారం అంటే ఇది కాదు. అమ్మాయి ముఖం చంద్ర బింబంలా కాంతివంతంగా ఉంది అంటే అది ఉపమ.
  ఇది ముఖం కాదు చంద్రబింబం అంటే ఉత్ప్రేక్ష.
  ముఖ చంద్రబింబం (ముఖమూ చంద్రబింబమూ కలిసిపోయినై) అంటే రూపకం.
  ఇలాంటివే మరికొన్ని .. అజ్ఞానాంధకారం, జ్ఞాన దీపం, చరణ కిసలయములు, ఇత్యాది. ఆంగ్లంలో మెటఫర్ అంటారు. నాకు తెలిసి మీరు మొదట ఉదహరించిన శ్లోకంలో ఉన్న శబ్దాలంకారాన్ని యమకము అంటారు.

  ReplyDelete
 2. రవి గారూ, మంచి పద్యాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అవునండీ, ఈ పద్యం శబ్దాలంకారానికే ఉదాహరణ అవుతుంది అనుకుంటా.

  శ్లోకాల్ని క్రియావాచకంతో ఆరంభించడం వ్యాకరణ పాండిత్యానికి ఋజువని నాకు ఇంతవరకు తెలియదు. కుమార సంభవం మొదటి శ్లోకం, ‘అస్తుత్తరస్యాం దిశి దేవతాత్మా’ అని ‘అస్తి’ అన్న క్రియతో మొదలౌతుంది.

  ReplyDelete
 3. This comment has been removed by the author.

  ReplyDelete
 4. Hey Ravi
  Appudappudu telugulo kooda blog rayappa otherwise ivanni naake greek latin laaga unnayi Yedo baaga confusion ga undi..

  Though I have read in kannada medium till 10th I hardly remember all these things :) .. but hats off to ur interest and knowledge in our native languages..
  Others please excuse me for my words; as I am from K'taka (AP border) and I can only speak telugu but donno much abt language grammar and all,

  ReplyDelete
 5. రవి గారూ, పద్యం చాలా బాగుంది. నేను చెప్పాలనుకున్నది కొత్త పాళీ గారు చెప్పేశారు. తెలుగులో చూస్తే, విగ్రహవాక్యంలో "అనెడి" అనే పదం రావాలి రూపక సమాసానికి. కోపాగ్ని= కోపము అనెడి అగ్ని, ముఖాంబోజము=ముఖము అనెడి అంబోజము ఇలాగ 'ఉపమేయము + అనెడి + ఉపమానము'అనే విధంగా ఉన్నది రూపకం.

  ReplyDelete
 6. ఇంకొక విషయం మర్చిపోయాను. చమరం అంటే జింక కాదు, చమరీ మృగం. వీటి (తోక) వెంట్రుకలు పట్టులాగా మెత్తగా ఉంటాయట. విసనకర్రలుగా వాడేవారు. నాయికల శిరోజాలను చమరీమృగపు వెంట్రుకలతో పోల్చేవారు. హర్షనైషధంలో ఒక పద్యం ఉంది:

  "చికుర ప్రకరాజయంతితే
  విదుషీ, మూర్ధనిసాభిభర్తియాన్
  పశునాప్యపురస్కృతే న
  త్తులనా మిచ్ఛతి చామరేణక:"
  'దమయంతి వంటి విదుషి తలదాల్చి గౌరవించినవి ఆమె కురులు. చామరములు పశువు చేతకూడా పురస్కృతి నందలేకపోయినవి (తోకలో ఉన్నవి కదా). అలాంటి చామరాలతో దమయంతి శిరోజాలను ఎలా పోల్చగలం!' - అని వర్ణించాడు హర్షుడు.

  ReplyDelete
 7. @కొ.పా గారు : టపా సవరించాను. టపా రాసిన తర్వాత ౩ రోజులు తిరిగి చూడ్డం కుదర్లేదు. తప్పు సవరించినందుకు ధన్యవాదాలు.

  @చంద్ర మోహన్ గారు : మీక్కూడాను. చమరీ మృగం అని నేను విన్నాను. అయితే, అదో రకం దుప్పి అన్నట్టుగా చిన్నప్పుడు మా అనువాదం మాస్టారు చెప్పినట్టు గుర్తు. మీ ఉదాహరణ చాలా బావుంది. "హర్షో హర్షః" అని అందుకనే అన్నారనుకుంటా ఆయన్ను.

  @మురళి గారు : క్రియావాచకం తో ఆరంభించడం అన్నదీ చిన్నప్పుడు చదువుకున్నదే. అయితే, ఇది సూత్రం కాకపోవచ్చు. ఔచిత్య పరంగా గొప్ప విషయం అని నా ఊహ. రామాయణం లో హనుమంతుడు సీతను చూచి, తిరిగి రాముని వద్దకు రాగానే "దృష్ట్వా సీతాం" అంటాడు(ట). అంటే, "చూచితిని" అంటే రాముడి ఆదుర్దా వెంటనే ఉపశమిస్తుంది అని ఊహించి ఆ ప్రయోగం చేశాడు అని నేను విన్నది. హనుమంతుడు, రావణుడు, ధర్మరాజు గొప్ప వ్యాకరణ పండితులు అన్నది కూడా గొప్పవారు చెప్పిందే.

  ReplyDelete
 8. రవిగారు,

  ఇంతటి చక్కని పద్యాలను తెలియజేసినందుకు మీకు నా ధన్యవాదాలు.

  కాళిదాసు చాటువులో శబ్దాలంకారాలు బాగా వాడారు. "ధ, ర", "చ", "ర, మ", "భ, గ", అనే అక్షరాలతో వృత్త్యనుప్రాస అని చెప్పుకోవచ్చు, "యధారా, ధారా" & "చచారు చారు" & "రామ రామ", మొదలైనవి ఛేకానుప్రాస అనుకోవచ్చును. "ధరా" తో యమకం అని చెప్పుకోవచ్చును - ఇవన్నీ నాకు తెలిసినంతవరకు. తప్పిదాలు ఉంటే సవరించ మనవి.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.