Saturday, October 11, 2008

ఓ సిగరెట్టు కథ

వచ్చే జన్మలో నేను మనిషిగా పుట్టకపోవచ్చునేమో కానీ, దున్నపోతుగా మాత్రం పుట్టను. ఎందుకంటే, నేనూ సిగరెట్టు తాగాను! గిరీశం శాపనార్థం నాకు తగలదు!

ఖగపతి అమృతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
పొగచెట్టై జన్మించెను
పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్

సరే, నా మొదటి సిగరెట్టు కాలేజీ చదువు ముగించి, పూనా లో ఉద్యోగం చూస్తున్న రోజుల్లో మొదలయింది. అప్పట్లో పూనా లో "అల్కా" అని ఓ సినిమా థియేటరు. సెలవు రోజుల్లో అక్కడ చెప్పనవసరమే లేదు. రంగు రంగుల సీతాకోక చిలుకల మయం. అయితే అపశృతి ఏమంటే, అమ్మాయిలందరు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తోనూ, వాళ్ళ కాలేజీ మేట్స్ తోనూ సినిమాలకు రావడం. నాలాంటి జిడ్డు ముఖాలను అస్సలు పట్టించుకోకపోవటం.

ఎలా...? వాళ్ళ దృష్టిలో పట్టం ఎలా?

ఆ దురాశే నా మొదటి సిగరెట్టు కు హేతువయింది. నేనూ నా మిత్ర బృందం ఓ మూల నిలబడి స్టవిలుగా ఒకే సిగరెట్టు పంచుకుని తాగేము. అమ్మాయిలు రాలే కానీ దగ్గొచ్చింది. ఆ తర్వాత నోరంతా చేదు వాసన..అప్పుడప్పుడూ మా ఆశ చావక మా మిత్ర బృందం సభ్యులు, అలా ఒకే సిగరెట్ పంచుకుని మా వంతు ప్రయత్నాలు చేశాము. అయితే,ఒకే సిగరెట్ అలా పంచుకుని తాగడం వల్ల డబ్బు ఆదా చేయగలిగామని కాస్త ఆత్మ తృప్తి మాత్రం మిగిలింది.మా లో బడ్జెట్ ప్రేమ వ్యవహారాలు మాత్రం ఫలించలేదు.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. నా వ్యర్థ ప్రయత్నాలను చూసి, ఎగతాళి చేయడం, నలుగురు చూసి నవ్వుకోవడం వంటివి అక్కడి అమ్మాయిలు చేసినట్టు కనబడలేదు. ఆ తర్వాత ఎంతో కాలానికి, నాకు ఆఫీసులో ఇద్దరు ముంబయి అమ్మాయిలు పరిచయమయ్యారు. ఆ అమ్మాయిలు నా టీమ్ లో పనిచేయడానికి ముంబయి IIT నుండీ వచ్చిన వాళ్ళు. (అన్నట్టు నేనో భయంకరమైన మొహమాటం గాణ్ణి లెండి) వాళ్ళతో కాస్త పరిచయం అయిన తర్వాత అర్థమయింది, వాళ్ళ కు అబ్బాయిలు చేసే కోతి చేస్టల గురించి చాలా వీజీగా తెలిసిపోతుంది అని. (అప్పటికి నేనింకా "యూత్" గానే ఉన్నాను). వాళ్ళకో సారి నేను చేసిన వ్యర్థ ప్రయత్నాల గురించి చెప్పేను. పడీ పడీ నవ్వారు. ఆ అమ్మాయిల్లో ఓ అమ్మాయి నన్ను చాలా లైక్ చేసేది(ట). ఇప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ భర్తలతో, పిల్లలతో కాపురాలు చేసుకుంటున్నారు. నాకు మంచి ఫ్రెండ్స్ ఇప్పటికీ....ఓర్కుట్లో!

సరే..

సిగరెట్టు వెనుక నా ఉద్దేశ్యం సిగరెట్టు కాదు కనుక, నాకు అది అలవాటవలేదు. పూనాలోనే కొన్ని రోజులలా గడిచిన తర్వాత, ఉద్యోగం మారాను. ఆ కొత్త ఉద్యోగం లో, ఆఫీసులో ఓ అందమైన మరాఠీ రెసెప్షనిస్టు. తొలి చూపులోనే ప్రేమ మొదలయింది. ఏవేవో ఊహలు, ఎక్కడికో వెళ్ళిపొయే వాణ్ణి. ఆ ఊహల్లో ఓ ఊహ, ఎప్పుడో ఓ సిగరెట్టు తాగినా అది తనకు ద్రోహమే కదా అనేది ఒకటి. ఆ విధంగా సిగరెట్టు ఆలోచనలే దూరమయాయ్. కొసమెరుపు ఏమంటే, ఆ అమ్మాయి స్టయిల్ గా సిగరెట్ తాగే అప్పటి నా కొలీగ్ ని ఒకణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంది!

అప్పుడలా వదిలేసిన సిగరెట్టు పొగ, మళ్ళీ 8 ఏళ్ళ తర్వాత రాజుకుంది. ఈ సారీ అమ్మాయే, అందులోనూ పూనా అమ్మాయే కారణం. ఇక్కడ సాఫ్ట్ వేర్ సంస్థలో నేను పని చేసిన మొదటి ప్రాజెక్ట్ విజయ వంతంగా నాశనం అవడంతో, నన్ను వేరే టీమ్ లోకి మార్చారు. ఆ టీములో చేరిన తర్వాత మొదటి మీటింగు. నా ఎదురుగా ఓ అమ్మాయి వచ్చి కూర్చుంది. నా జీవితంలో ఓ క్షణం నాకు కాకుండా పోయింది. అంత అందమైన కళ్ళు నేనంతవరకు హీరోవిను భానుప్రియ లో మాత్రమే చూసాను.ఆ అమ్మాయి నా పక్క సీట్ అవడంతో మాటలు కలిపేను. ఆ అమ్మాయి తెలివయిందేమో, మొదటి రోజే చెప్పేసింది, తనకు పెళ్ళయినట్టుగా. సిగరెట్ మళ్ళీ రాజుకుందిక్కడ!

అదో పెద్ద బాధాకరమైన విషయం గా మారలేదు.

అయితే ఎప్పుడైనా (ఏ రెండు మూడు నెలలకో ఓ సారి) అలా ఓ సిగరెట్ తాగాలనిపిస్తే, తాగడంలో ఇబ్బంది లేదు. ఎలాగూ అది నాకు అలవాటు కాదు కాబట్టి.

ఓ ఏడాది క్రితం మాత్రం, సిగరెట్ నాకో చిన్న అనుభూతిని మిగిల్చింది. ఉద్యోగ రీత్యా, ఇండోనెషియా వెళ్ళాను ఆన్సైట్ కి. అక్కడ మా (కంపనీ) డ్రయివర్ మాకు బాగా నచ్చేడు. తన పేరు "ఉన్ తుంగ్". అంటే, వాళ్ళ భాషలో "అదృష్టం". అతను చాలా పేద వాడు. భారతీయులంటే చాలా అభిమానం తనకు. తను స్వయంగా షారుఖ్ ఖాన్ కి పంఖా. షారుఖ్ ఖాన్ సినిమాలు అక్కడ వాళ్ళ భాషలో అనువదించినవి సినిమా హాళ్ళలో విడువకుండా చూస్తాడట తను. అక్కడ కంపనీ రూల్స్ ప్రకారం మాకు ఆఫీసు టైములో తప్ప మిగతా సమయాల్లో కారు వాడుకునే అవకాశం లేదు. అయితే, ఈ డ్రయివర్ మాత్రం మా కోసం, అప్పుడైనా వచ్చి సహాయం చేసే వాడు. మేమూ తనకు సహాయం చేసే వాళ్ళం. అక్కడ నుండీ తిరిగి వస్తూ, తనకు ఓ బహుమతిగా ఓ మొబయిల్ ఫోన్ ఇచ్చేము. తనూ మాకు ఏదైనా ఇవ్వాలనుకున్నాడు. అయితే పేదవాడు , పైగా చదువుకోని వాడు కదా..చివరకు అక్కడ వాళ్ళ దేశం లో తయారయే "బుదం గరం" అనే ఓ సిగరెట్ పాక్ ఇచ్చేడు మాకందరికీ. ఆ సిగరెట్ లో ఉన్న ప్రత్యేకత , కాస్త చక్కెర లా తియ్యగా ఉన్న టేస్ట్.

ఆ చక్కెర తీపి, సిగరెట్ దా, ఆ పేదవాడి మనసులో మాపట్ల ఉన్న అభిమానానిదా? ఆ చిన్ని అనుభూతి మరువలేనిది.

10 comments:

 1. Hey Ravi!!..
  Hahah interesting .. Btw aa GudanGaram.. ane brand mumbai lo dorukutundi, my colleagues use to have it and I hrd it tastes like mint i guess and best part is it never stinks so no need of a chloromint after few puffs :)

  ReplyDelete
 2. బాగుంది తియ్యటి సిగరెట్టు కథ. "కంపుకొట్టు ఈ సిగరెట్టు ఇది తాగకోయి నాపై వట్టు" అని ఎవరూ అనలేదా??

  ReplyDelete
 3. గరం సిగరెట్టు ట్రై చెసి చూడండి.. :-)

  మీ కధ చదివాక.. అమ్మాయిలకి సిగరెట్లకి ఎదొ లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది. :-)

  ReplyDelete
 4. సిగిరెట్టలవాటు లేదు గాని గరం పేరు విన్నా
  అది స్వీట్ సిగరెట్ అని

  ReplyDelete
 5. మరాఠీ మగువ విషయంలో మీ ఆలోచనలు చదివి చాలా నవ్వొచ్చింది. చిన్న బాధ కూడా కలిగింది. మంచి నిజాయితీ నిండిన టపా. బాగుంది. :-)

  ReplyDelete
 6. చాలా బాగుందండీ. నాకు మాత్రం గిరీశం శాపాలు తగిలే అవకాశాలే ఎక్కువ. మీరు టీ తాగుతారో లేదో తెలియదు కానీ, టీ తాగనివాళ్ళని శ్రీశ్రీ శపించాట్ట -
  టీ తాగనివాడు పోతుటీగై పుట్టున్ - అని. ఈ శాపం మాత్రం నాకు తగల్దు లెండి.
  చాలా బాగున్నాయి మీ అనుభవాలు.

  ReplyDelete
 7. @ganesh, @murali,@కొ.పా, @పార్థ సారథి,@అశ్విన్, @రానారె,@మురళి, @మేధ : థాంకులు.

  @రమణి : కంపు నాకే కొడుతుంది, కాబట్టే, అలవాటు అవలేదు. అయితే మా ఆవిడకు చెప్పేశాను, ఎప్పుడైనా ఓ పఫ్ వల్ల ఇబ్బంది లేదు అని.(కాస్త తల నొప్పి తగ్గినట్లు అనిపిస్తుంది కూడా) :-)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.