Sunday, September 7, 2008

ఓషో ...

"Never born and Never Died. Only visited the planet earth between ...". పుణే లోని ఓషో సమాధి పై వ్రాసి ఉన్న వాక్యం అది. ఈ జగతిని నలుమూలలా ఎంతో మంది తమ భావజాలంతో పరిపుష్టం చేసారు, మానవ జాతికి దిశానిర్దేశం చేసారు. వారిలో శాస్త్రవేత్తలూ, కవులూ, దార్శనికులూ, తత్వవేత్తలు, వగైరా వగైరా..

భారతావని విషయానికి వస్తే, అదీ 20 వ శతాబ్దంలో, భారత ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసిన మొదటి 100 మంది వ్యక్తుల్లో ఓషో (భగవాన్ రజనీష్) ఒకడు. (ఇండియా టుడే వారి ఓ సర్వే ప్రకారం). ఓషో జీవితం భారతీయులను అంతగా ప్రభావితం చేయడానికి కారణం పరిశీలిస్తే -

ఓషో చిన్నప్పటి నుండే rebellious భావాలు కలవాడట. Rebellious కి, reactive కి మౌలికంగా ఓ తేడా. reactive అంటే, (సమాజపు) విలువలను ప్రశ్నించడం. Rebellious అంటే, ఆ విలువల ప్రాతిపదికను ప్రశ్నిచి, తద్వారా, ఆ విలువల సారాన్శాన్ని వ్యక్తిగతంగా ఆవిష్కృతం చేసుకోవడం. Rebelious is neither for or againest the society. He is for himself. చిన్నప్పటి నుంచే, తన ఇంట, తనకు తెలిసిన సమాజంలోనూ పాటించే విలువలను ప్రశ్నించే వాడట. ఇక కాలేజీ చదువులోనూ, మామూలుగా అందరు చదివే సబ్జెక్ట్లు కాక, తత్వా శాస్తాన్ని ముఖ్య అంశంగా ఎంచుకున్నాడుట. (ఓషో, JK, ఇద్దరూ, తము బోధించేది, తత్వం అని, తాము తత్వ వేత్తలని ఒప్పుకోరు).

ఇక ఓషో బోధలన్నీ, దాదాపుగా, సమాజంలో శతాబ్దాల తరబడి పాతుకుని ఉన్న విలువలను ప్రశ్నించేవిగా ఉంటాయి. మతం, పవిత్ర గ్రంథాలు, సమాజంలో గొప్ప గా చూడబడే వ్యక్తులు (గాంధీ, వినోభా భావే, మదర్ తెరిస్సా, శంకరాచార్యులు, ఇతర వర్గానికి చెందిన సన్యాసులు వగైరా), సమాజంలో గౌరవంగా, ఆదర్శంగా చూడబడే విలువలు (పెళ్ళి, ఆచార వ్యవహారాలు వగైర), వీటన్నిటిని ప్రశ్నిచడం, సమాన్యులెవరూ ఊహించని విధంగా విశ్లేషించడం, ఈ శతాబ్దంలో ఒక్క ఓషో కే చెల్లింది.

తన జీవన విధానం కూడా అలాగే ఉంటుంది. 99 రోల్స్ రాయస్ కార్లు, పుణే లో అత్యంత ఆధునికమైన ఓ ఆశ్రమం, ప్రపంచం నలుమూలలా శిష్యులు, కానీ, ఆఖరు రోజుల్లో, ఇమ్మిగ్రేషన్ సూత్రాలను ఉల్లంఘించాడన్న నేరంపై అమెరికా లో నిర్బంధితుడు అయి, అక్కడే తనపై విషప్రయోగం జరిగి, ఆ తరువాత ప్రపంచంలో 25 దేశాలు తనకు వీసాలు నిరాకరించి, చివరి రోజుల్లో పుణే లోని తన ఆశ్రమంలోనే మరణం...

ఇక వివిధ అంశాలలో తన భావాలను పరిశీలిద్దాం.

మతం.
--------

ఓషో దృష్టిలో వ్యవస్తీకరించ బడ్డ మతం (హిందూ, కిరస్తానీ, బౌద్ధ, జైన వగైరా) ఏదైనా హానికారియే. అందుకే ప్రతీ మతంలోని మతబోధకుల మీద ధ్వజమెత్తాడు ఆయన. పూరీ శంకరాచార్యులు, దిగంబర జైన గురువులు, రాధా స్వామి సంఘ గురువు, పోప్ వగైరా అందరి మీద ఎన్నో విమర్శనాత్మక వాఖ్యలు, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా సభల్లో సవాలు చేయడాలు వంటివి చేశాడు. ప్రపంచం లో అనేక మతాల ప్రాదుర్భావనకు ఆద్యులయిన వారి మీద, వారు బోధల మీద ప్రసంగించిన ఓషో, వారి తదనంతరం జర్గిన మత వ్యవస్తీకరణ ను మాత్రం నిరశించేడు.

దార్శనికులు
-----------

దాదాపు ప్రపంచం లోని గొప్ప దార్శనికులందరి మీద ఓషో సాధికారికంగా వ్యాక్యానించాడు. బుద్ధుడు, జీసస్, పతంజలి, కృష్ణుడు,మీర, కబీర్, గోరఖ్, అష్టా వక్రుడు, లవు త్సు, డయోజినిస్, హెరాక్లిటస్, జెన్ గురువులు, సూఫీ సాధువులు, బాల్స్, చివరకు జిడ్డు కృష్ణమూర్తి (కొన్ని సందర్భాల్లో)...వీరందరి మీద ఓషో అందంగా, అద్భుతంగా, ఆలోచింపజేసేట్టుగా, సాధికారికంగా వ్యాఖ్యానించేడు. అలాగే, వీరి బోధల మీదాను. ధమ్మ పదం, ఉపనిషత్తులు, యోగ, తంత్ర, సెర్మన్ ఆన్ ద మవుంట్, తావ్ తె చింగ్, జెన్ గురువుల బోధలు ఇలా...వివిధ మతాల మీద, ఆయా మతాలకు మూల పురుషుల మీద ఓషో చేసిన వ్యాఖ్యలు, ప్రపంచంలో ఇంకెవ్వరూ చేసి ఉండరు అన్నది అతిశయోక్తి కాబోదు.


నిత్యజీవిత విషయాలు

----------------------------


ఓషో ప్రవచనల్లో కనిపించే ఓ ముఖ్య అన్శం ఏమంటే, అవి అలౌకికంగా, తాత్విక చర్చల్లా కాక, నిజ జీవిత సమస్యలకు, దైనందిన జీవితంలో మానవుడు ఎదుర్కునే మౌలిక సమస్యలకు అన్యయించి చెబుతున్నట్లు ఉంటాయి. అవీ, ఒకింత హాస్య చతురత తో కూడి ఉంటాయి. ఒక్కో సారి, తన శ్రోతలకు ఉలికిపాటు కు గురి చేసే అసభ్యమైన జోకులు చెప్పడమూ, ఈయనకే చెల్లింది. అదే విధంగా, తన బోధల్లో పశ్చిమ దేశాల మనస్తత్వానికి సంబంధించిన వస్తు ప్రపంచానికి (material world) కు, తూరుపు దేశాల మనస్తత్వానికి చెందిన ఆముష్మిక చింతన నూ అద్భుతంగా
సమన్వయ పరచడం కనిపిస్తుంది. ఓ రకంగా తన బోధల సారాన్శం "జోర్బా ద బుద్ధ" . జోర్బా ఓ గ్రీకు సుఖ పురుషుడు. బుద్ధుడు మానవీయ ఆముష్మిక చింతనకు వారధి. వీరిద్దరి సమన్వయమే ఓషో బోధ. ఇంకో కోనం లో చెప్పాలంటే, "Be a laughter un to yourself", బుద్ధుడి "Be a ight un to yourself" కి anomaly.

శృంగారం

-------------

ఓషో శృంగారం పై మొదటి సారి " Sex and the super consciousness" అన్న మకుటంపై కొన్ని వరుస వ్యాఖ్యానాలు చేశాడు. అది ఆ తర్వాత పుస్తకంగా వెలువడింది. ఆ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా ఓషో కు ఎంతో మంది శత్రువులను సంపాదించి పెట్టింది. ఎందుకంటే, ఓషో భావనలు తర తరాలుగా పేరుకుని ఉన్న చాందస భావాలకు గొడ్డలిపెట్టు లాంటివి. వ్యవస్తీకృతమైన ప్రేమ - పెళ్ళి (marriage) పైన ఓషో భావనలు దిగ్భ్రాంతికరంగా ఉంటాయి. (పెళ్ళి పైన JK భావనలు కూడా ఇంచుమించు ఇలాంటివే. ఇద్దరి భావనల మధ్య సారూప్యం చాలా వరకు మనం గమనించ వచ్చు). ఇక ఆ పుస్తకం ఓని super consciousness (అపూర్వ చేతన) గురించి - ధ్యానం అన్నది, నిశ్చేతన (Unconsciousness) నుంచి అపూర్వ చేతన (super consciousness) కు తీసుకెళ్ళగలిగితే, శ్రంగారం చేతన (Consciousness) నుంచి అపూర్వ చేతన (Super consciousness) కు తీసుకెళ్ళ గలుగుతుంది అని చెబుతాడు.


ధ్యానం

-------------

మన 20 వ శతాబ్దంలో మానవుని వేగవంతమైన జీవితం నుండీ కాస్త విరామం కల్పించి, విశ్రాంతి నివ్వడానికి అనేక ధ్యాన పద్ధతులను ఓషో Meditation centreలో పొందుపర్చేడు. ఓషో ధ్యాన పద్ధతులను తీహార్ వంటి జైళ్ళలో నేరస్తులపై అవలంబింప జేసి, కాస్త పరివర్తన దిశగా అడుగులు వేయినిన ఘనత కిరణ్ బేడీ కి దక్కుతుంది.


ఓషో గురించిన ఈ పరిచయం, సముద్రం లో ఓ బిందువు లాంటిది మాత్రమే. అంతర్జాలం లో (http://www.osho.com/) అనేక ప్రవచనాలు, audio, video, textగా లభ్యం అవుతున్నాయి. యు త్యూబ్ లోనూ ఎన్నో వీడియోలు దొరుకుతాయి. అయితే, ఓషో గురించి తెలుసుకోవాలంటే, మనల్ని మనం ప్రశ్నించుకునే ధైర్యం (మనం తర తరాలుగా నమ్మిన విలువలను) ఉండాలి. అలాకాకపోతే, ఓషో గురించి ఆలోచించడం అనవసరం.


చివరగా వివిధ విషయాలపై ఓషో పుస్తకాలలో కొన్నిటిని పేర్కొంటాను.


Autobiography of a spiritually incorrect mystic

Zen, Zip, Zap, Zest and Zing (జెన్ సూత్రాలపై - ఎంతో ఆహ్లాదకరంగా చదివిస్తుంది ఈ పుస్తకం)

The goose is out (చాందస భావాలపి గొడ్డలిపెట్టు)

I am the Gate(జీసస్ పై)

Krishna, the man and his phiosophy- కృష్ణున్ని సామాన్య మానవుడి గా చిత్రీకరిస్తూనే పురుషోత్తముడిగా ఆవిషరించిన ప్రవచనాల సారాన్శం)

The white lotus, Never born Never Died, A cup of Tea, Yoga-the alpha and the omega - ఇవన్నీ వరుసగా, బోధిధర్ముడు, తావ్, జెన్, పతంజలి వీరి మీద వ్యాఖ్యానాలు.
............


11 comments:

 1. మా కోరిక మేరకు ఓషో గురించి మీరు వ్రాసినందుకు సంతోషంగా వుంది. ఓషో గురించి కొంత అవగహన వచ్చింది. మీనుండి JK మీద రజనీష్ మీద మరిన్ని టపాల కోసం చూస్తుంటాను.

  ప్రశ్నించడమే పొరపాటయినటువంటి ఈ పరిస్థితుల్లో వారి బోధలు మనకు అనుసరణీయం. రజనీష్ మీద నాకు దురభిప్రాయం పాతుకుపోయివుంది. యోగికి భోగలాలసత్వం ఏంటా అని నాకు సందేహం వుండింది. వారి గురించి మరింత తెలుసుకొని ఆ సందేహాలని తీర్చుకోవాల్సి వుంది.

  హేతువాది, మానవతావాది అయిన మా నాన్నగారి లైబ్రరీ లో JK పెద్ద ఫోటొ ఎదురుగా కనిపిస్తూవుండేది. అలా వారి భావాలంటే చిన్నప్పటినుండీ ఇష్టం కానీ వారినీ ఎక్కువగా చదవలేకపోయాను.

  ReplyDelete
 2. మొన్నే ఓషో గురించి కాస్త తెలుసుకున్నాను. మీరు ఇక్కడ పొందుపరచిన సమాచారం ఉపయుక్తంగా ఉంది.

  ధన్యవాదాలు!

  ReplyDelete
 3. Very well written.
  Many thanks

  ReplyDelete
 4. నాకెందుకో ఇలాంటి వారి మీద ఓ predetermined opinion.

  ఈయన పేరు వింటే నాకెక్కువగా డ్రగ్స్ సంబంధిత విషయాలే గుర్తుకొస్తాయి. ఆయన ఆశ్రమంలో అలాంటివి జరుగుతాయని చదివినట్టు గుర్తు. నిజం నాకు తెలీదు.

  మీ పరిచయం బాగుంది.

  ReplyDelete
 5. అద్భుతమైన పుస్తకాలను రచించారు, కాలేజీ రోజుల్లో ఈయన కేసెట్లను విని ఎంతో ప్రభావం అయ్యాను. నెనర్లు.

  ReplyDelete
 6. @ పూర్ణిమ , @ independent , @నాగన్న గార్లు: నెనర్లు.

  @ప్రవీణ్ : అక్కడ డ్రగ్స్ వాడకపు ప్రోత్సాహం జరుగుతోంది అనడం కరెక్ట్ కాకపోవచ్చు (నాకు నిజానిజాలు తెలియవు), అయితే, ఓషో దృష్టిలో డ్రగ్స్ తీసుకోవడం అన్నది, meditation చేయడానికి ఓ Disqualification కాదు.అలా ఆంక్షలు విధించే కొంత మందిని "Holier than thou" attitude people అని తను విమర్శించడమ్ కద్దు.

  @శరత్ : నెనర్లు. ఇక పోతే, యోగి కి భోగలాలసత్వం ఏమిటి? JK "అలౌకిక స్థితి" లో ఉన్నవాడు కాబట్టి ఎన్నైనా చెబుతాడు, మేము సాధారణ భావోద్వేగాలు కల వాళ్ళం (ఇది మీరు కాదు, ఇంకొకరు చెప్పారు), బుద్ధుడు అహింస అని చెప్పి, జంతు మాంసం ఎందుకు తిన్నాడు??

  ఇలాంటి ప్రశ్నలు సహజం. ఈ ప్రశ్నలకు సమాధానం వారి ద్వారానే తెలుసుకుంటే బావుంటుంది. అయితే, నా దృక్పథం చెబుతాను. ఈ ప్రశ్నలకు సమాధానం కంటే, ప్రశ్నను కూలంకషంగా అర్థం చేసుకోవడం మంచిది. లేదూ సమాధానం కావాలంటే, చాలా సులభమైన సమాధానం, వాళ్ళు ఆత్మ వంచన చేసుకుంటున్నారు, లేదా వంచకులు. ఈ సమాధానం వల్ల వాళ్ళ సంగతేమో గానీ, మనకు ఒరిగేదేం ఉండదు.

  ReplyDelete
 7. @ రవి: మెడీటేషనుకి డ్రగ్స్‌కీ సంబంధం తీసుకురావడం నా వ్యాఖ్య ఉద్దేశం కాదు. నేను కేవలం రజనీష్, ఓషోల గురించి వ్యాప్తిలో ఉన్న "కథనాలు" సరయినవా కాదా ? అని తెలుసుకోవడానికే అడిగాను.

  ReplyDelete
 8. ఓషో పరిచయం రాసినందుకు ధన్యవాదాలు. సంక్షిప్తంగానూ, ఆసక్తి కలిగేటట్లూ రాశారు.
  పుణేలో ఓషో ఆశ్రమం ఒక వింత ప్రదేశం. అక్కడ మిగతా ఆశ్రమలలో ఉండే లాంటి కట్టుబాట్లేమీ ఉండక పోగా, ఎవరికి నచ్చిన విధంగా వారు ఉండవచ్చు. ఎవరూ ఎవర్నీ నియంత్రించరు. అంచేత మాదక ద్రవ్యాలు కానీ, ఇఅతరత్రా సాంఘిక అనుమతి లేని కొన్ని ప్రవర్తనలు కానీ, ఇతరులెవరికీ హాని జరగనంత వరకూ, నిరభ్యంతరంగా జరిగి పోతుండేవి. సంవత్సరానికి ఒకసారి, ఒక వారం పాటు అద్భుతమైన సాంస్కృతిక కళా ఉత్సవం జరిపేవారు. ఏ ప్రభుత్వ, కార్పొరేటు సంస్థ స్పాన్సరు చేసిన కార్యక్రమం కూడా అంత అందంగా, ఆహ్ళాద కరంగా ఉందడం నేను చూళ్ళేదు.

  ReplyDelete
 9. తనను అనుసరించమని ఓషో ఎప్పుడూ చెప్పలేదు. బుద్ధుడు కూడా తనను అనుసరించమని ఎవ్వరికీ చెప్పలేదంటారు. గుడ్డిగా అనుసరించేవాళ్లను వీళ్లు వారించారు(ట) కూడా. I love disturbing people, I love shocking people, It makes them think. Consoling and comforting makes them more retarded - ఇలాంటి మాటలు మనకు సాధారణంగా కనిపించే గురువుల తత్వానికి చాలా భిన్నమైనవి. నాకర్థమైనంతలో నిజమైన స్వాతంత్ర్యంతో బ్రతకగలిగిన ధైర్యవంతుడైన వివేకవంతుడైన మనిషి ఓషో. ఓషో గురించిన రెండు మూడు పుస్తకాలను చదవడం ద్వారా నాకు కలిగిన అభిప్రాయాన్నే యథాతథంగా తక్కువ మాటల్లో చక్కగా రాశారు.

  ReplyDelete
 10. రవి గారు,
  ఓషో గురించి రాయండి అని అడిగి నేనే ఆలస్యంగా చూస్తున్నానీ టపా! క్షమించండి!రానారె కామెంట్ ని అనుసరించి వచ్చాను. ఎలా చూడలేదో అర్థం కాలేదు.

  చాలా చక్కగా, వివరంగా, at the same time సంక్షిప్తంగా ఉంది పరిచయం. తప్పకుండా ఓషో గురించి మరి కొంత తెలుసుకోవాలనిపించేలా ఉంది.

  ఒక సారి చదివితే చాలదు, మరొక సారి తీరిగ్గా చదవాలి ఈ టపాని.

  ReplyDelete
 11. Thank you for writing about OSHO.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.