Thursday, July 31, 2008

ఉద్యోగ భారతం - పూనా పర్వం

(గత టపా తరువాయి)

ఓ రోజు ఉదయం, పూనాలో చేతిలో లగేజీతో, పూనా, విమాన్ నగర్ లోని నా మిత్రుడి, అన్న గారి మిత్రుడి
రూములో దిగేను.పూనా విమాన నగర్,"నా మిత్రుడి అన్న గారి మిత్రుడి" రూము, నా లాంటి
అథితి,అభ్యాగతులతో (దండగమారి కేసులతో) కిటకిటలాడేది. నేను వెళ్ళిన సమయానికి అక్కడ మా వాడు
లేడు.వాళ్ళకు నన్ను నేను సైగలతో పరిచయం చేసుకున్నా (వాళ్ళకు హిందీ, ఇంగ్లీషు తప్ప వేరే భాషలు రావు, నాకు తెలుగు తప్ప వేరే యోగ్యత లేదు)


పూనాలో అడుగు పెట్టిన వేళా విశేషమో, లేదూ, పూనా లో మాకు ఆశ్రయమిచ్చిన వాళ్ళ ప్రార్థనలు ఫలించాయో
యేమో, సరిగ్గా 4 రోజులకో చిన్న ఉద్యోగం సంపాదించేము, నేనూ, నా మిత్రుడు ఇద్దరం ఓ ఫాక్టరీలో.పూనాకు
25 మైళ్ళ దూరంలో ఉన్న ఆళందీ అనబడే ఓ గ్రామంలో ఆ ఫాక్టరీ.నా మొదటి జీతం 955 రుపాయలు. 45
రుపాయలు, టీ కి కటింగు పోగా.


అంత వీజీగా ఉద్యోగమా అని డవుట్ వచ్చిందా? దానికి ఓ చిన్న మతలబు. మహారాష్ట్రలో, B.Tech అంటే,
ఆ అబ్బాయి IIT లో చదివాడు అని. మిగిలిన కాలేజుల్లో అంతా B.E డిగ్రీలు.నాది JNTU, B.Tech
డిగ్రీ. నా డిగ్రీ B.Tech అనగానే అక్కడ ఆ ఫాక్టరీ యజమాని ఆనందంతో మూర్చపోయి ఉద్యోగం ఇచ్చాడు. (ఆ కంపనీ తర్వాత మూతపడింది అని విన్నాను!)


ఆళంది గ్రామం గురించి కొన్ని విశేషాలు. ఇంద్రాణీ నది ఒడ్డున ఉన్నఈ గ్రామం గురించి దాదాపు మరాఠీ వారికి
అందరికీ తెలిసి ఉంటుంది. 13 వ శతాబ్దంలో మహారాష్ట్రలో ఙ్ఞానదేవుడనే గొప్ప మహానుభావుడు జన్మించాడట.
ఆయన చిన్న వయసులోనే ఙ్ఞానేశ్వరీ అని భగవద్గీత కు వ్యాఖ్యానం రాసేడు. ఈయన సమాధి, ఈ వూళ్ళో
ఉంది. ఈ ఊరి నిండా ధర్మ శాలలు.చిన్నప్పుడే, ఈ వూరికి వచ్చి మధుకరం (మధుకరం - తుమ్మెదలు
పువ్వు పువ్వునా వాలి తేనె సేకరించినట్టుగా అన్న అర్థం) చేసుకుంటూ అభంగాలు, ఙ్ఞానేశ్వరీ వల్లించే
విద్యార్థులు!


ఇంకా ఓ ఓపన్ ఎయిర్ థియేటర్/టెంట్ (స్వదేశ్ సినిమాలో లా)...ఇంద్రాణీ నదిపైని అందమైన
సాయంత్రాలు...ఊరి పక్కన పంట పొలాలు...ఆ పొలాల మధ్య, పిందెలతో విరగకాసి, తనలో తానే ముసి
ముసి నవ్వులు నవ్వుకుంటున్న పెద్ద మామిడి చెట్టూ...


నాకు వచ్చే 1000 రుపాయలలో, 175 గది కిరాయికీ, 350 మెస్సు ఖర్చులకూ, మిగిలిన 200
అదనపు ఖర్చులకూ పోగా, దాదాపు 200 రుపాయలు నెలకు మిగిలేవి. (20 శాతం!)
(ఇప్పుడు 10 యేళ్ళ తర్వాత, జీతం అప్పటి జీతానికి ఎన్నోరెట్లయినా పొదుపు మాత్రం శూన్యం! నిజం,
సోడెక్సో మీదొట్టు!)


సరే..ఈ ఊళ్ళో నాలుగు నెలలున్నాను.మధ్యలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాను. ఆ కంపనీ రెసెప్షనిస్ట్ ను
చూడగానే కళ్ళు చెదిరిపొయాయి. పైగా, ఆమె నవ్వుతూ పలకరించింది! ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవడంతో
ఆ ఉద్యోగానికి మారేను. ఆ రెసెప్షనిస్ట్ ను మనసారా ప్రేమించసాగాను. ఆమె కూడా ఆమె
ఉద్యోగాన్ని మనసారా ప్రేమిస్తూ, వచ్చిన అందరితోనూ, నవ్వుతూ పలకరించడం చూసి, నా మనసు విరిగి
పోయింది. "ప్రేమ పాచిపోయిన పాయసం లాంటిది. అది త్యాగాన్ని కోరుతుంది" అని, నా మనసును సమాధాన
పర్చుకుని, ఆమెకు బదులుగా, నా అభిమాన నటి మమతా కులకర్ణి ని ప్రేమించసాగాను.

నా మిత్రుడు అంతకు ముందే, పూనాలో ఉన్నవాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళి ఇంకో ఉద్యోగంలో మారేడు.

పూనా అంటే, నా నిఘంటువులో అర్థం ’అందమైన అమ్మాయిలు’ అని.పూనాలో ఓ పది మంది అమ్మాయిలు
కనిపిస్తే, అందులో, కనీసం 8 మందిని తిరిగి మళ్ళీ చూడాలనిపిస్తుంది.సాయంత్రం ఉద్యోగాలనుండీ, కాలేజుల
నుండీ తిరిగి వస్తున్న వేళల్లో కూడా, యే మాత్రం అలసట కనిపించకుండా, కడిగిన ముత్యాల్లా కనిపించడం,
ఇక్కడి అమ్మాయిల ప్రత్యేకత.


నా రూం మేటు అక్కడ ఓ ప్రముఖ అమ్మాయిల కాలేజీలో లైబ్రేరియను. నాకు తీరిక ఉన్నప్పుడల్లా, వాడు
కాలేజీ లో ఉన్నప్పుడు నాకు వాడితో రూమ్ కీ ఇప్పించుకోవడం లాంటి ’అవసరం’ పడేది, వాళ్ళ కాలేజీకి వెళ్ళి
తనని కలిసే వాణ్ణి. (అక్కడ మగ వాళ్ళను లోపలకు అనుమతించరు, నా లా 'జెనుయిన్' కేసులకు ఎక్సెప్షన్!)


నా మిత్రుడి మావయ్య, Pune Film and Telivision institute of India లో మేకప్
విభాగానికి అధిపతి. ఆయన పూనా లోని ఓ మంచి సెంటర్ లో ఓ బ్యూటీ పార్లర్ తెరిచేడు. అంకుల్ బిజినెస్స్
ఒకటీ, మా బిజినెస్స్ ఒకటీనా? ఈ బ్యూటీ పార్లర్ ను కనిపెట్టుకుని ఉన్డే బాధ్యత మాది! (ఆ బ్యూటీ పార్లరు
మూతపడిందని వేరే చెప్పాలా? 6 నెలల్లో ఆ పని జరిగింది. అలానే, నా మిత్రుడూ వాళ్ళ మావయ్య ఇంటి
నుండీ వచ్చేసేడు.గెంటేశారా, లేదు లేదు తోశేసారు.అయితే, ఆయన తిరిగి మళ్ళీ ఆ బిజినెస్సు పునరుద్ధరించి, ఇప్పుడు పూనాలో చాలా ఫేమస్ అయాడు(ట) లెండి.
)

పూనా సిటీ బస్సుల్లో ఇంకో ఫెసిలిటీ. ఇక్కడ లాగా, అమ్మయిలకు ప్రత్యేకమైన సీట్లు ఉండవు. పక్కన ఉన్న
అమ్మాయి గురించి మేము తెలుగులో మాట్లాడుకుంటున్నా, వారికి అర్థమయేది కాదు!


నా ఉద్యోగం అలా సాగిపోతోంది. 3 నెలల తర్వాత మరో ఉద్యోగం మారేను.ఇది ఓ ప్రముఖ స్టీలు సంస్థ. ఆ
అనుభవం జీవితంలో బాగా ఉపకరించింది.


నేను పని చేసేది ఫాక్టరీలో. ఓ రోజు ఏదో పని మీద కంపనీ ఆఫీసుకు వెళ్ళాను. కొరెగావ్ పార్క్, అక్షర్ ధామ్
అన్నచోట. మంచి పాష్ లొకాలిటీ అది. అక్కడ చాలా మంది ఫారీనర్స్, ముదురు రంగు దుస్తుల్లో
తిరుగుతున్నారు. కొంచెం విచిత్రమైన వాతావరణం.ఆ అక్షర ధామ్ పక్కన రజనీష్ ధామ్ అని ఓషో ఆశ్రమం.
అప్పట్లో, ఓషో గురించి పెద్దగా తెలియదు నాకు. (ఇప్పుడు నేను తనకు పంఖాని)


అలా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలా ప్రశాంతంగా సాగిపోతున్న జీవితంలో ’సాఫ్ట్ వేర్’ అన్న అవిశ్వాస తీర్మానం
ప్రవేశించింది!

(సశేషం)

11 comments:

 1. బావుంది మీ పూణే ఉద్యోగాల వేటపర్వం.
  అక్కడ ప్రస్తుతం, మా స్నేహితులు వర్క్ చేస్తున్నారు. వాళ్ల ద్వారా దాదాపు మీరు చెప్పిన విశేషాలన్నీ విన్నా. నాకూ పూణే చూడాలని మనస్సు తహతహలాడుతుందండీ. తొందరలోనే వెళ్తాను. :-D.

  ReplyDelete
 2. మళ్ళా చూడాలనిపించే అమ్మాయిలా సంఖ్య బావుంది... చాలా బావుందీ మాట. అన్నట్టు పూనా లో ఎన్ డీ ఏ లో మా కుర్ర బావ ఉన్నాడిప్పుడు ! నేను జాగ్రత్త గా ఉండాలండోయ్!

  ReplyDelete
 3. పూనే లో పూనే బెంగుళూరు హైవే లో కొండల పై హైకింగ్ చేసాను రెండేళ్ళ క్రితం ! చాలా మంచి పాత ఇళ్ళూ, బంగళా లూ.. మంచి ఊరు. లోనావాలా ఏర్ ఫొర్స్ స్టేషన్ కెళ్ళి, కళ్ళు తిరిగి పోయాయి. మబ్బుల్లో పరిగెట్టి, జల పాతాల ఒడ్డున 2 సాయంత్రాలు గడిపేను. మీరు వెళ్ళేరా ఖండాలా ? ఇంకా మహా బలేశ్వర్ చూసేరా ?

  ReplyDelete
 4. బాసూ, నా ఆఫీసు సరిగ్గా ఫెర్గుసన్ కాలేజీ ఒక గేటుకి ఎదురుకుండా. చానా జ్ఞాపకాల్ని రేపి పెట్టావు. రెండేళ్ళ కాన్పూరు సహారా వాస శిక్ష తరవాత ఐదునెల పూనా నివాసం ఒయాసిస్సే నిజంగా .. అనేకార్ధాల్లో

  ReplyDelete
 5. @ప్రతాప్ : ఎంజాయ్ :-D

  @సుజాత గారు: ఖండాలా కు వెళ్ళాలంటే, గర్ల్ ఫ్రెండ్ తోనే వెళ్ళాలి అని పూనాలో నా స్నేహితులు చెప్పడం. ఆ మార్గం లో ట్రావెల్ చేసాను,కానీ అక్కడ మకాం పెట్టలేదు.

  @కొత్తపాళీ గారు : మీ బాధ నాకు అర్థం అయింది :-). ఫెర్గుసన్ అన్న పదానికి ఓ భయంకరమైన acronym వినేవాణ్ణి. ఇక్కడ చెప్పడం కుదరదు. మీకు తెలిసే ఉండాలి.

  ReplyDelete
 6. పూనా నాకిష్టం! ఎందుకంటే అక్కడికెళితే కాని మహాబలేశ్వర్ వెళ్లలేం! అందుకు! ఎన్ని సార్లు చూసినా తనివి తీరని అందాలు అక్కడివి(పూనాలోవి కాదు)ఇంక ఖండాల గురించి చెప్పక్కర్లేదు.
  మొత్తానికి మీ ప్రేమ కూడా త్యాగాన్నే కోరిందన్నమాట.

  ReplyDelete
 7. పూనా అమ్మాయిల గురించి మీరు ఉటంకించిన సమాచారాన్ని నేను అర్జంటుగా ధ్రువీకరిస్తున్నాను!

  ReplyDelete
 8. నిజం,సోడెక్సో మీదొట్టు! - అయితే నేనస్సలు నమ్మటం లేదు :-)))

  ReplyDelete
 9. నా అభిమాన నటి మమతా కులకర్ణి ని ప్రేమించసాగాను--- హ్హ్హ్ హ్హా హ్హా

  ReplyDelete
 10. ఇంకొక్క విషయం,ఒకపక్క ప్రభుత్వాఅసుపత్రి(అందలి యువమహిళావైద్యులు,నర్సులతో కలిపి)ఎదురుగా ఒక మహిళాబిఇడి కళాశాల,మరోవైపు మహిళావసతి గృహం,ఇక ఈపక్క ప్రభుత్వమహిళాకళాశాల,పైగా ఆవరణలోనే వెయ్యిమందిపైనున్న యువతీమణులున్న కళాశాలలో నా విద్యాభ్యాసం జరిగిందని తమరికి మనవిచేసుకుంటున్నా అధ్యక్షా!! :)

  ReplyDelete
 11. @సుజాత గారు : అభిలాష సినిమా లో చిరంజీవి డవిలాగు, " ప్రేమ పాచిపోయిన పాయసం లాంటిది. అది త్యాగాన్నే కోరుతుంది.". ఇది చాలా మందికి వర్తిస్తుంది.

  @మహేష్ : ఇంకో సమాచారం మరిచాను. ఆ అమ్మాయిలు చూడ్డానికి అంత అందంగా ఉన్నా, బాగా Dominating కూడానూ.

  @పూర్ణిమ గారు : మృదులాంత్రం ఇంజినీర్లను అడిగి కనుక్కోండి.యే పొజిషన్లో ఉన్న వాళ్ళయినా, జీతం అంతా EMI లకు తగలేసి,నెలాఖరుకు "పిజ్జాలో రామచంద్రా" అని అంగలార్చే వాళ్ళే!

  @రాజేంద్ర కుమార్ : హీరోవిను లను ప్రేమించడం చాలా సేఫు :-).. మీరూ కళాకారులేనండి బాబు ! :-)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.