Tuesday, July 29, 2008

ఉద్యోగ భారతం - కాలేజీ పర్వం

నేను కాలేజీ చదివే రోజుల్లో దుష్ట చతుష్టయం లాగా ’లెగ్గు చతుష్టయం ’ ఉండేది. అందులో ప్రముఖ లెగ్గు నాదే.
2 వ ప్రముఖుడు నా మిత్రుడు. ఇన్కా మిగిలిన ఇద్దరిదీ అంత భీభత్సమైన లెగ్గు కాకపోయినా, అప్పుడప్పుడూ
ప్రభావం కనిపించేది. నన్ను క్యాస్ట్ ఐరన్ లెగ్గు అని అనేవాళ్ళు మా సహాధ్యాయులు.


మాలో (ప్రముఖంగా నాలో) కనిపించని ఇంకొక ఏంగిల్ ఉండేది. అదేమంటే, నాతో పాటూ, ఎవరైనా కలిసి
చదివితే (కో-స్టడీ) ఆ చదివిన వాడు జెండా ఎత్తే వాడు, మా (నా) విషయం మాత్రం ఎలాగోలా గట్టెక్కేది.
3 వ సంవత్సరం 2 వ సెమిస్టరు చదువుతున్నప్పుడు జరిగిందిది.


మామూలుగా పరీక్షలు రాగానే, మా సహాధ్యాయులు అంతా మా మిత్ర వర్గాన్ని చుట్టుముట్టే వాళ్ళు, " మీరు
ఏయే చాప్టర్లు చదువుకున్నారు " అని అడగటానికి. ఎందుకంటే, మేము (లెగ్గు చతుష్టయం)
చదువుకున్నచాప్టర్లు వదిలేసి, మిగిలిన చాప్టర్లు చదువుకుంటారు(ట) వాళ్ళు. మా (లెగ్గు)మీద అంత
నమ్మకం మా సహాధ్యాయులకు. ఈ లెగ్గు విషయం ఏదో తేల్చుకోవాల్సిందే అని, నేనూ, నా మిత్రుడూ, ఓ కుట్ర
పన్నాము.3 వ సంవత్సరం ఇంజినీరింగు లో కామర్స్, ఎకనామిక్స్ కి సంబంధించి, ఆది శంకరుల వారి
మాయా వాదం లాంటి జటిలమైన ఓ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ లో సరిగ్గా సగం నేను, మిగతా సగం నా
మిత్రుడూ పంచుకుని ఎక్సామ్స్ ప్రిపేర్ అయ్యాము.


అంటే, ఆ కామర్సు సబ్జెక్టు పరీక్షలో, వస్తే, నేను చదివిన చాప్టర్లలో ప్రశ్నలు రావాలి, లేదూ, మా వాడు
చదివిన చాప్టర్లలో చదివిన ప్రశ్నలు రావాలి. మేము చదవని చాప్టర్లలో ప్రశ్నలు పరీక్షలో రావడానికి అవకాశం
లేదు.ఈ రకంగా మా మీద పడ్డ ’లెగ్గు ’ మచ్చ ను తుడిపేసుకోవాలి అని మా ఊహ. మా సహాధ్యాయులకు
తెలియనే తెలిసింది, ఈ విషయం. ఏం జరుగుతుందో, ఏమోనని ఉత్కంఠ అందరిలోనూ.


ఆ పరీక్ష రానే వచ్చింది. మా సహాధ్యాయుల ముఖాల్లో ప్రేతకళ!

ఆ పరీక్ష ప్రశ్నాపత్రంలో, మొత్తం ప్రశ్నలన్నీ ’అవుట్ ఆఫ్ సిలబస్’! ఇంజినీరింగు సబ్జెక్ట్ అయితే, వికెట్లు
లేచిపోయి ఉండేవి. ఇది కామర్స్ కి సంబంధించిన సబ్జెక్ట్ కదా, అందరు, వాళ్ళకు తోచిన సమాధానాలు
రాశారు. క్లాసు మొత్తం మీదకు బెస్ట్ మార్క్ 22/50. దాదాపు క్లాసులో అందరికీ స్టాంపులు ముద్రించారు
(18/50 - సరిగ్గా పాస్ మార్కు). ఆ బెస్ట్ మార్క్ నాకే.


ఆ దెబ్బకు నా పాదం మీద నాకు నమ్మకం బాగా బలపడింది. ఆ నమ్మకం నన్ను చాలా కాలం వేధించింది
కూడా.


ఇక కాలేజీ చదివేప్పుడు, మాకు ఫోర్ ట్రాన్ అనబడే కంప్యూటర్ భాష ఓ సబ్జెక్ట్. కాలేజీలో కంప్యూటర్ ల్యాబు లో
మాత్రం జనాలు ’సీ ’, ’బేసిక్ ’ లాంటి వాటి మీద బడి కుమ్మేసే వారు. అప్పుడప్పుడూ, నేనూ వెళ్ళే వాణ్ణి
అక్కడకు (నా బ్రాంచ్, మెకానికల్ అయినా కొన్ని ప్రత్యేక సమయాల్లో మాకు అనుమతి వుండేది ఆ లాబ్ లో
ప్రవేశించడానికి).


మొదట ఓ మిత్రుడు ఏదో చేస్తుంటే, చూడ్డం, వాడు పక్కకెళ్ళిన తర్వాత, భయపడుతూ, కీ బోర్డు కి దెబ్బ
తగులుతుందేమోనని అని భయపడుతూ నొక్కడం, ఇలా సాగింది. కొన్ని రోజుల తర్వాత ఓ మేధావి, బేసిక్ అనే
కమ్ప్యూటర్ భాషలో, యేదో ప్రోగ్రామ్ రాశాడు. ’ జనగణమణ ’ పాట వస్తుంది, ఆ ప్రోగ్రాం ఎక్సిక్యూట్ చేస్తే.,
అదీ కాస్త (కారక్టర్) గ్రాఫిక్స్ తో..ఆ ప్రోగ్రాం నాకు ప్రేరణ. ఆ అబ్బాయి పక్క కూర్చుని, తన పాస్ వర్డ్
సంగ్రహించి, తన ప్రోగ్రామ్ ను కాపీ చేసుకున్నాను. (మరి మామూలుగా చెప్పమంటే చెప్పడుగా!) ఆ ప్రేరణతో,
నేనూ, ఓ ప్రోగ్రామ్ రాసేను.


" క్రికెట్ పిచ్, ఇరువైపులా స్టంప్స్, బ్యాటు, బంతి ఇవతల పక్కనుందీ విసరబడ్డం, బ్యాటు కాస్త అటూ ఇటూ గా
ఆ బాల్ ను తాకడానికి ప్రయత్నిస్తుంది. ఒక వేళ బంతి, బ్యాటు ను తాకితే, బంతి వచ్చిన దారిన
పరిగెత్తుతుంది". ఇదీ నా మొదటి ప్రోగ్రామ్. బేసిక్ లో ఇది రాయడానికి దాదాపు రెండున్నర నెలలపైగా పట్టింది.
గ్రాఫిక్స్ లో ఇష్టం అలా అంతర్గతంగా ఉండిందేమో మరి, గ్రాఫిక్స్ లో ఓ రెండేళ్ళు పని చేయడానికి అవకాశం
దొరికింది.


ఇలా నా ఇంజినీరింగు చదువు ముగిసింది.

సరే, ఉద్యోగం పురుష లక్షణం కదా, యేదైనా ఉద్యోగం వెతుక్కోవాలి, లేదూ, ఇంకొక ఆప్షను, ఓ రెండేళ్ళు
ఉన్నత విద్య (M Tech) కి వెళితే, కాస్త ఆలోచించుకొనే అవకాశమూ దొరుకుతుంది, కాస్త స్టయిఫండ్ తో
పనీ నడుస్తుంది కదా అని ఆలోచించేను.


GATE పరీక్ష రాయడమూ, అందులో ఓ మోస్తరు స్కోర్ రావడమూ వెంట వెంటనే జరిగాయ్. అలాగే ఓ
REC లో సీట్ కూడా వచ్చేసింది. చేరేశాను.


ఇంత వీజీ గా ఎలా జరిగింది అంటారా? నాతో పాటు ఒక మిత్రుడు కో స్టడీ చేసి, తన ఙ్ఞానాన్ని నాకు పంచి,
తను మాత్రం అస్తమిస్తున్న సూర్యుడి దిశగా అలా సాగిపోయాడు.(ఇందాకే చెప్పాగా, నాతో కో స్టడీ చేస్తే
యేమవుతుందో?) అలా సాగి, రవి అస్తమించని సామ్రాజ్యం లో తేలాడు లెండి, ఓ రెండేళ్ళ తర్వాత.


చేరిన తర్వాత తెలిసింది, స్టయిఫండ్ రావడానికి కనీసం ఓ యేడాది పడుతుంది, పైగా నాకు దొరికిన
స్పెషలైజేషన్ లో కేవలం రీసెర్చ్ అవకాశాలు మాత్రమే వుంటాయి అని. యేడాది వరకు ఇంటి నుండీ డబ్బు
తెప్పించుకోవడం మా ఇంటి పరిస్థితుల కారణంగా కుదరని పని. అదే కారణం చేతే, ఇంజినీరింగు లో REC
సీట్ వచ్చినా చేరక, మా వూళ్ళోని ఇంజినీరింగు కాలేజీలో చదవడం జరిగింది.


ఆ కారణం చేత, ఆ MTech చదువుకు తిలోదకాలు ఇచ్చేను.

ఇంటి వద్ద మా నాన్న ఒకటే పోరు, మా బంధువుల వద్దకు వెళ్ళమని, నాకు ఉద్యోగం వాళ్ళే వేయిస్తారని.

అలా వెళితే, నా ’సీమ పౌరుషం ’ దెబ్బ తినదూ?

ఇంతలో కాలేజీలో నా లెగ్గు మిత్రుడు పూనాలో వాళ్ళన్నయ్య మిత్రుడి దగ్గరకు వెళ్ళి, ఉద్యోగం వెతుక్కునే
ప్రయత్నాల్లో ఉన్నాడని తెలిసింది.సరే, ఓ శుభ ముహూర్తం, నేనూ, పూనా కి మకాం మార్చేను, జేబు లో ఓ
2 వేల రూపాయలతో.


(సశేషం)

7 comments:

 1. బాగుంది మీ లెగ్గు మహిమ!! అవతల వాడు పోయి.. మీరు గట్టెక్కడం.. మరీ బాగుంది (నేనెప్పుడూ మీతో చదవలేదు.. కదా.. "మరీ" కి కారణం అది :-))

  మీ మరో టపాకై వేచి చూస్తుంటాను

  ReplyDelete
 2. హ హ మీ లెగ్గు మహిమ అదిరింది రవి గారు...:-)

  ReplyDelete
 3. "తను మాత్రం అస్తమిస్తున్న సూర్యుడి దిశగా అలా సాగిపోయాడు"..

  పకాలున నవ్వ్తా :-)(cracked up ని తెలుగులో ఏమంటారు?). ఆ వాక్యం యండమూరి తన చాలా నవలల్లో, పుస్తకాలల్లో అది ఎగతాళిగా బాగా వాడేవాడు.

  ReplyDelete
 4. బావుంది, కాలేజీ లో మీ లెగ్గు మహిమ.

  ReplyDelete
 5. కొన్ని పంచులు చాలా బావున్నాయి, లెగ్గు రవి గారు, ఊహించుకుంటుంటే చాలా నవ్వొచ్చింది

  ReplyDelete
 6. సరి సరి... మంచి ఆసక్తిగా మొదలయింది.
  పాపం ఇంకెంత మంది మీ లెగ్గుకు బలవుతారో ?

  ReplyDelete
 7. @పూర్ణిమ గారు : అది వాళ్ళ లెగ్గ, నా లెగ్గా అని నాకూ ఓ డవుటు.

  @independent గారు : యండమూరి నవలల్లో నేనూ గమనించేను దీన్ని.

  @వేణూ,@కల,@అశ్విన్,@ప్రవీణ్ : నెనర్లు

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.