Monday, July 21, 2008

రాయల వారి కాలంలోనే రెకమెండేషన్లు!

అష్ట దిగ్గజాలు ఎవరు అన్న ప్రశ్నకు, ఓ తెలుగోడు, 7 గజాల పేర్లు గుర్తు తెచ్చుకుని, 8 వ గజం పేరు తెలియక 'ఆచార్య ఆత్రేయ ' అని చెప్పి, తన మాస్టారు చేతిలో దెబ్బలు తిన్నాట్ట.

అది చదవగానే నాకూ ఆ 8 గజాలు ఎవరు అని డవుటు వచ్చింది.

1. అల్లసాని పెద్దన
2. నంది తిమ్మన
3. భట్టు మూర్తి (రామరాజ భూషణుడు)
4. ధూర్జటి
5. తెనాలి రామకృష్ణుడు
6. మాదయ గారి మల్లన
7. అయ్యల రాజు రామభద్రుడు
8. పింగళి సూరన

(పర్లేదే, అన్నీ ఙ్ఞాపకం వచ్చాయి!)

అయితే వీళ్ళు కాక ఇంకో గజం ఉండేవాడట. ఆ గజం పేరు, "కందుకూరి రుద్ర కవి". ఈయన గురించి ఓ చిన్న కథ చదివాను ఈ మధ్య.

అప్పట్లో భువన విజయంలో ప్రవేశించాలంటే, తాతాచార్యుల వంటి మత గురువులో, తిమ్మరుసు వంటి మంత్రి సత్తములో సిఫారసుచేయందే రాయల వారి ప్రాపకం దొరకడం దుర్లభమట.

తెనాలి రామకృష్ణ సినిమాలో ఈ విషయాలను వెండి తెరపై అందంగా మలిచారు. తెనాలి రామకృష్ణుడు మొదట తాతాచార్యుల వారు, రాధా సాని అనే ఓ నాట్యకత్తె తో ఏకాంత సేవ లో ఉన్నప్పుడు, అయనను దర్శించుకోవాలనుకోవడం, సభా ప్రవేశం దొరక్కపోవడంతో, మద్దెల వాద్యకారుడుగా ప్రవేశించడం, రాధాసాని అభినయంలో తప్పు దొర్లడం, ఆమె మద్దెల వాయిద్య కారుని కసరడం, వెంటనే, తెనాలి రామ కృష్ణుడు, "ఆడలేని సాని కి మద్దెల ఓడేలే 'అంటూ తిప్పికొట్టటం, తాతాచార్యుల వరు అగ్రహోదగ్రులై తెనాలి రామకృష్ణుని బయటకు పంపడం.....ఇలా జరుగుతుంది.

ఇంకో కథ సినిమాలో చెప్పనిది ఏమంటే, ఈయన అసలు పేరు గార్లపాటి తెనాలిరామలింగడు, తర్వాత కాలంలో భట్టరు చిక్కాచార్యులు అనే గురువు వద్ద వైష్ణవ మత దీక్ష ను స్వీకరించి, తెనాలి రామకృష్ణుడు అయాడట. అయినా కూడా తాతాచార్యుల వారికి ఈయన మీద వైమనస్యమేనట. ఎందుకంటే, తిరిగి వైష్ణవంలో వడగలై, తెంగలై అని 2 శాఖలు. అందులో తెనాలి రామకృష్ణుడు 'వడగలై ' శాఖ అయితే, తాతాచార్యుల వారిది 'తెంగలై ' శాఖ అట.

సరే అసలు కథకు వద్దాం. కందుకూరి రుద్ర కవికి ఎన్నో ప్రయత్నాల తర్వాత, రాయల వారి ఆస్థాన క్షురకుడు 'కొండోజీ ' సిఫారసు మీద రాజదర్శనం అభించిందట.


దాని మీద ఓ చాటు పద్యం 'కందుకూరి రుద్ర ' కవి చెప్పినట్టుగా చెప్పబడుతున్నది.

ఎంగిలి ముచ్చు గులాములు
సంగతిగా గులము జరుప జనుదెంచిరయా
ఇంగిత మెరిగిన ఘనుడీ
మంగలి కొండోజీ మేలు మంత్రులకన్నన్

'బ్రాహ్మణులై పుట్టి కూడా ఈ మంత్రులు కులనాశనం చేయడానికిపూనుకున్నట్లున్నారు. వాళ్ళకంటే ఇంగిత ఙ్ఞానం కలిగిన కొండోజీ ఎంతో నయం' అన్న భావంతో వాపోయడట ఆయన.

ఈ కవి గొప్పదనం, రచనలు, వీటి సంగతి తెలియదు.

10 comments:

 1. రుద్రకవి కధ బాగుంది. అప్పటికీ ఇప్పటికీ ఎవరో ఒకరి ఉత్తరమో, ఎంతో కొంత దక్షిణమో లేనిదే పని జరదన్నమాట.

  ఇంతకీ రుద్ర కవి గజమెలా అయ్యాడు? ఆయనతో కలిస్తే నవగజాలు కావాలి కదా? ఈయన వెలువరించిన ప్రముఖ సాహిత్యమేమన్నా ఉందా?

  ReplyDelete
 2. @పూర్ణిమ గారు : నెనర్లు.
  @తెలుగోడూ, రుద్ర కవి గురించిన మిగతా డీటయిల్స్ తెలియవు. ఈ కథ ఓ పుస్తకం లో చదివాను. సందర్భం వచ్చింది కాబట్టి బ్లాగాను.

  ReplyDelete
 3. రుద్రకవి రాసింది అని పేరుబడి కందుకూరి జనార్దనా అనే మకుటంతో ఎనిమిది పద్యాల మణిమాల, జనార్దనాష్టకం పేరుతో ప్రఖ్యాతి చెందినది. వీటికి రాగమాలికలో స్వర కల్పన చేసి భరతనాట్య విదుషీమణులైన దేవదాసీలు పాడి అభినయించేవారు. కొన్ని పద్యాలు అలా భరతనాట్యంలో ప్రామాణికాంశాలుగా నిలిచిపోయాయి.
  ఈ జనార్దనాష్టకం పద్యాలకి బాపు రంగుల బొమ్మలతో కొన్నేళ్ళ క్రితం ఒక మంచి ఆర్టు పుస్తకం వెలయించారు. అందులో రుద్రకవిని గురించి ఆరుద్ర, జనార్దనునిగా విష్ణుమూర్తి ప్రాముఖ్యతని గురించి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సాహిత్యంలో శృంగారం గురించి ముళ్ళపూడి వెంకట్రమణ మంచి వ్యాసాలు రాశారు. సరే, బాపు బొమ్మల గురించి ఇక చెప్పేదేముంది.
  దీన్ని గురించి మరి కొన్ని విశేషాలు వీలును బట్టి నా బ్లాగులో చెబుతాను.
  అష్ట దిగ్గజాలుగా మన వాచకం పుస్తకాల్లో పేరు బడిన కవుల జాబితా పుక్కిటి పురాణమే అని గమనించాలి. చారిత్రక పరిశోధనల్లో పింగళి సూరన, తెనాలి రామకృష్ణుడు ప్రభృతులు కచ్చితంగా రాయలి తరవాతి వాళ్ళు అని తేలింది. వివరాలకు ఆరుద్ర సమగ్ర ఆంధ్ర శహిత్యం మంచి రిఫరెన్సు.

  ReplyDelete
 4. వావ్! మంచి విశేశాలు చెప్పారు. మీ టపా కోసమ్ ఎదురు చూస్తున్నాను.

  "అష్ట దిగ్గజాలుగా మన వాచకం పుస్తకాల్లో పేరు బడిన కవుల జాబితా పుక్కిటి పురాణమే అని గమనించాలి. చారిత్రక పరిశోధనల్లో పింగళి సూరన, తెనాలి రామకృష్ణుడు ప్రభృతులు కచ్చితంగా రాయలి తరవాతి వాళ్ళు అని తేలింది. వివరాలకు ఆరుద్ర సమగ్ర ఆంధ్ర శహిత్యం మంచి రిఫరెన్సు."

  పింగళి సూరన గురించి నేను చదవలేదు. అయితే ఆరుద్ర, కందుకూరి వీరేశలింగం గార్లు చెప్పినది రెండవ తెనాలి రామకృష్ణుడి గురించి అని (ఈ రెండవ కవి అక్కన్న మాదన్న ల కొలువులు లో ఉన్నాడట), ఈ విషయాల మీద సమగ్రంగా అధ్యయనం జరిపి "ముత్తేవి రవీంద్రనాథ్" "తెనాలి రామకృష్ణుడు, సమగ్ర పరిశీలన" అన్న ఓ పెద్ద పుస్తకంలో రాశారు. ఈ కందుకూరి రుద్ర కవి విషయం నేను, అందులో చూసే రాశాను.

  ఆరుద్ర గారి పుస్తకం కోసం వెతుకుతున్నాను. మా వూరి విశాలాంధ్రలో దొరకలేదు!

  నిజానిజాలేమో దేవుడికే తెలియాలి.

  ReplyDelete
 5. పాత నాటకాల్లో ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు ఇలా ఉన్నట్టు ఈ రుద్ర కవులు గూడా ఓ ముగ్గురో నలుగురో ఉన్నట్టుంది.
  కచ్చితంగా రాయలి ఆస్థానంలో ఒకాయన ఉన్నాడు. ఉండటమే కాదు, భువన విజయసభలో ప్రధాన ఆసనం అలంకరించే వాడుట గూడానూ.
  రుద్రకవి పేరిట నిరంకుశోపాఖ్యానము, సుగ్రీవ విజయము అని రెండు కావ్యాలు లభించాయి. అందులో తన వంశాన్ని గురించి చెప్పినది, సమకాలికులైన పాలకులను గురించి చెప్పినది చూస్తే ఈ కావ్యాలు రాసిన రుద్రకవి రాయలికి సుమారు వందేళ్ళ తరవాత వాడు అనుకుంటున్నారు. ఒక పరిశోధకుడు మాత్రం ఇవన్నీ రాసింది రాయలి ఆస్థానంలో ఉన్న మొదటి రుద్రకవే అని ఢంకా బజాయించి చెబుతున్నాడు. మొత్తానికి తమాషాగా ఉంది.

  జనార్దనాష్టకం విశేషాలు సందర్భోచితంగా మరోమాటు.

  ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం 2006 లో పునర్ముద్రణ పొందింది. విశాలాంధ్రలో దొరక్క పోతే కాచిగూడా ఆర్యసమాజ్ ఎదురుగుండా సందులో ఒక చిన్న షాపుంటుంది. ఓనరు పేరు శోభన్ బాబు. అక్కడ కనుక్కోండి.

  ReplyDelete
 6. మంచి విషయాలు తెలిసినయ్
  కొత్తపాళీ గారూ,
  మీరొప్పుకోలేదు కానీ దీన్నే అధారిటీ అంటారు సారు.
  బొల్లోజు బాబా

  ReplyDelete
 7. మొత్తం దిగ్గజాల జాబితాలో ఒక డజనుమంది క్యాండిడేట్లు దాకా ఉన్నట్టు గుర్తు. ఆరుద్ర ఎవరెవరు ఏ ఏనిమిది మందిని ఎంచుకున్నారో పట్టిక వేశారు.

  ReplyDelete
 8. @కొత్తపాళీ గారు : ఆరుద్ర గారి సమగ్ర ఆంధ్ర సాహిత్యం దొరికింది. తెలుగు అకాడెమీ వాళ్ళు ముద్రించినది. ధన్యవాదాలు.

  @బాబా గారు : అవును, అథారిటీ వున్న వాళ్ళు ఒప్పుకోరు, ఆయన్ను ఇబ్బంది పెట్టటమూ అంతా బావుండదు :-).

  @రవి వైజాపత్య గారు : ఒక్కొక్కరు ఒక్కొక్క పట్టీ వేసారు. ఈ రోజే చదివాను. (సమగ్ర ఆంధ్ర సాహిత్యం)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.