Tuesday, July 15, 2008

యెమెన్ (మినీ) ట్రావెలాగుడు!

అనగనగా పర్షియా దేశానికి సాబూర్ అనే చక్రవర్తి. ఆయనకు ఓ కొడుకూ, ఓ కూతురూనూ. ఆయన ప్రతి యేడూ జరిపే రాజ్యోత్సవాల్లో, ఓ యేడు వివిధ దేశాలకు చెందిన ముగ్గురు దేశస్తులు మూడు వింత వస్తువులను బహూకరించారు. అందులో ఒక వస్తువు కీలుగుర్రం. ఆ కీలుగుర్రం తలుచుకున్న చోటికి ఆకాశ మార్గాన ప్రయాణం చేయగలదు. ఆ కీలుగుర్రం ఇచ్చినందుకు సాబూర్ రాజు ఎంతో ఆనందించి ఆ వృద్దుణ్ణి ఏమైనా కోరుకొమ్మంటాడు. అదే తడవుగా ఆ వృద్దుడు యువరాణినీచ్చి వివాహం చేయమంటాడు. సరే నంటాడు చక్రవర్తి. యువరాణిఈ ముసలి వాడితో నా పెళ్ళా అని దిగులు చెందుతుంది. యువరాజు అక్మార్ ఈ వృద్దుని ఆట నేను కట్టిస్తానంటాడు.

యువరాజు అక్మార్ ఆ కీలు గుర్రాన్ని పరీక్షించే నెపంతో, దాన్ని ఎక్కి, ప్రయాణిస్తూ, ఓ దేశం వస్తాడు. ఆ దేశంలో ఇళ్ళన్నీ బొమ్మరిళ్ళ మాదిరి అందంగా ఉన్నాయి ఇలా.
ఆ దేశపు యువరాణి పేరు షంస్-అల్ -నహార్ తో అక్మార్ యువరాజు ప్రేమలో పడతాడు. ఆ యువరాణి ని ఎక్కించుకుని తనదేశానికి కీలుగుర్రంపై తీసుకు వస్తాడు యువరాజు.

ఇక్కడ సాబూర్ చక్రవర్తి తన కొడుకు కనబడక పోవడంతో ఆ వృద్దునిపై అగ్రహించి, వెళ్ళగొడతాడు. నగరం బయట ఆ వృద్దుడు ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తుంటాడు.

తిరిగి వచ్చిన యువరాజు నగరం బయట ఓ స్థలంలో కీలుగుర్రాన్ని దాచి, ఆ పక్కనే ఓ ఉద్యాన వనంలో తన ప్రియురాలిని విశ్రాంతి కమ్మని చెప్పి నగరంలోకి వెళతాడు. తన తండ్రి తో సంగతులన్నీ చెప్పి, తన ప్రియురాలిని కోటకు తెసుకు వద్దాం అని తన ఆలోచన. చక్రవర్తి పరమానందభరితుడవుతాడు. సరే, తోటలోకి తిరిగి వచ్చి చూస్తే తన ప్రియురాలు మాయం!

టక్కరి వృద్దుడు ఆమెను, కీలు గుర్రాన్ని అపహరించి తీసుకెళ్ళిపోతాడు.తిరిగి యువరాజు అక్మార్ కీలుగుర్రాన్ని వెదికి, తన ప్రియురాలిని ఎలా కలుసుకుంటాడు? ఈ విశెషాలు 1958 చందమామ (జూన్ నుండీ అక్టోబర్ వరకు) లో వచ్చిన కీలు గుర్రం ధారావాహిక లో చదవండి.

అక్మార్ యువరాజు చూసిన ఆ దేశం యెమెన్. ఆ నగరపు రాజధాని సనా. ప్రపంచపు అతి ప్రాచీనమైన నగరాల్లో ఒకటి.

**************************************************
ఇది అరేబియన్ గల్ఫ్ లో ఉండడం వల్లా, ఈ దేశపు సాగర తీర నగరాలు భారతానికి దగ్గరవడం వల్లా, ఇక్కడి సంస్కృతి లో కాస్త మనదేశపు ఛాయలు కనబడతాయి. ముఖ్యంగా వీళ్ళ తిండిలో మన చపాతీలు, తందూరీ రోటీలు ఓ ముఖ్య భాగం.

ఈ దేశం మిగిలిన గల్ఫ్ దేశాల్లా కాక కాస్త సస్య శ్యామలమైనది. మొక్కాసినో అనబడే కాఫీ ఈ దేశంలోనే పుట్టిందట. ప్రపంచపు అత్యంత శ్రేష్టమైన కాఫీ గింజలు ఇక్కడే పండుతాయట. బ్రెజిల్ లో కాఫీ ఉత్పత్తి అధికం, అయితే నాణ్యత పరంగా యెమెన్ కాఫీ ఉత్తమమైనదని ఇక్కడి ప్రజలు చెబుతారు. అలానే మామిడి పళ్ళూ, సుగంధ ద్రవ్యాలు కూడా ఎక్కువే.

అలానే ఇక్కడ ఖరీదయిన కార్లు కూడా ఎక్కువే. పెట్రోలు ధర మన రూపాయల్లో అనువదించుకుంటే 12/- లీటరుకు. ఓ లీటరు నీటి ధర కూడా అంతే.

ఈ దేశంలో అడుగు పెట్టగానే మనకు అనుభవమవేవి 2 అంశాలు.

ఒకటి, ఇక్కడి ప్రజలు రోజస్తమానం నములుతూ ఉండే 'గాట్ ' అనబడే ఓ రకమైన ఆకు. ఈ ఆకు తేలిక రకం మాదక ద్రవ్యం అని అమెరికా వారు దీన్ని నిషేధించారు. ఇది యెమెన్ దేశపు సంస్కృతిలో వేల యేళ్ళుగా మమేకమైంది. అక్కడ రహదారుల్లో, ఇళ్ళల్లో, చివరకు ఆఫీసుల్లోనూ, వాళ్ళు ఈ ఆకు ను నములుతూ ఉంటారు.

రెండవది, ఇక్కడి ప్రజల అలసత్వం. మామూలుగా భారతీయుల అలసత్వం గురించి అందరూ దెప్పుతూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఓ పని జరగాలంటే వారం ముందు నుండీ చుట్టూ తిరుగుతూ ఉండాలి. పక్కన పిడుగు పడినా పట్టించుకోని మనస్తత్వం వీరిది.

భారతీయ మృదులాంత్రపు సంస్థలు (సత్యం, విప్రో, టీసీఎస్ వంటివి) ఈ మధ్య ఇక్కడి వ్యాపార అవకాశాలపై దృష్టి సారిస్తున్నాయి.

**********************************
ఇక్కడి భాష అరబిక్. ఉర్దూ కి ఇది మాతృక అని నా ఊహ. అరబిక్ సరళ సుందరమైన భాష. ఇందులో పదాలు మన హిందీ కి కాస్త దగ్గరగా ఉంటాయి అని నాకు అనిపిస్తుంది.
ఉదా :-
శుక్రాన్ (అరబిక్) - శుక్రియా (హిందీ) - ధన్యవాదాలు
ముశ్కిలా - ముశ్కిల్ - కష్టం
కుల్లు - కుల్ - మొత్తంగా వగైరా..

ఐతే ఇక్కడి అరబ్బీ కి ఆఫ్రికన్ (సూడాన్) అరబ్బీకి కాస్త వాచికంలో తేడా కనిపిస్తుంది.

ఇది చాలా ప్రాచీనమైన భాష. యెడమ నుండీ కుడికి రాస్తారు ఈ లిపి. మాకు అక్కడ అధికారులు మా పాస్పోర్ట్ నంబరు అలా వ్రాసి లేని పోని ఇబ్బందులు ఎదుర్కున్నాము.

అరబిక్ భాషలో నీటిని 'మ్యే 'లేదా 'మోయా ' అంటారు. ప్రాచీనులు చిత్రలిపి లో నదిని తెలుపడం కోసం ప్రవాహం (తరంగాలు) గీసేవారట. అదే చివరకు M అనే ఆంగ్ల అక్షరం గా ఆరిందని తిరుమల రామచంద్ర గారంటున్నారు.
***************************************
యెమెన్ దేశానికి ముఖ్యపట్టణం 'సనా'. ఇక్కడ మన హైదరాబాదు లాగే పాత నగరం ఉన్నది. ఇది నిజంగా 'పాత ' నగరమే. ఇక్కడి దారుల్లో వెళుతుంటే యే 15 వ శతాబ్దంలోనో ఉన్నట్టు అనుభూతి చెందుతాము. రహదారులూ, చుట్టుపక్క ఇళ్ళూ, కోటగోడలు వగైరా 2000 యేళ్ళుగా రక్షించుకుంటున్నారట వీళ్ళు. ప్రపంచంలో ఇలాంటి ప్రదేశం మరెక్కడా లేదనటంలో ఆశ్చర్యం లేదు.

ముఖ్యంగా చూడవలసినది, బాబ్ - అల్ - యెమెన్ అనబడే ఓ కోట వాకిలి. (బాబ్ అంటే అరబ్బీ లో ద్వారం అట). ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ సంపద గా గుర్తించ బడ్డది.
***************************************

ఇలాంటి దేశాలకు ఆన్సైటు దొరికినప్పుడు కాస్త బాధగా ఉంటుంది, మన తోటి మృదులాంత్రపు నిపుణులు అమెరికాలూ, జర్మనీలు తిరుగుతున్నారు కదా అని. (అసూయ మగ వాళ్ళకూ శత్రువే :-)) ఐతే, ఇలా అయినా కాసిన్ని సంస్కృతులు, కొత్త విషయాలూ తెలుసుకునే అవకాశం కలుగుతున్నది కదా అని ఆనందం కూడా ఓ పక్క.

ఇవండీ నా మినీ ట్రవెలాగుడు విశేషాలు.

6 comments:

 1. ట్రావెలాగ్ విశేషాలు బావున్నాయి...
  అమెరికా, జర్మనీలు ఎప్పుడైనా వెళ్ళచ్చులెండి.. ఇలాంటి దేశాలకి మనంతట మనం వెళ్ళాలి అంటే, వెళ్ళలేము కదా...!
  అయితే అక్కడ కూడా మనవాళ్ళు ఆఫీసులు నడుపుతున్నారని, ఇప్పుడే తెలిసింది...!
  ఈ ఆధునిక కాలంలో కూడా, అలాంటి ప్రదేశాలు ఉండడం గ్రేట్!

  ReplyDelete
 2. బాగుంది. కొత్త విషయాలు చెప్పారు.

  ReplyDelete
 3. బాగున్నాయి విశేషాలు...
  మీరు మళ్ళీ ఆన్‌సైటు కి వెళ్ళారా ?

  ReplyDelete
 4. @మేధ : అప్పుడే సత్యం వాళ్ళు తమ ఆఫీసు నెలకొల్పారు అని విన్నాను. విప్రో వాళ్ళు, టీసీ ఎస్ వాళ్ళు అదే పనిలో ఉన్నారు.

  @మహేశ్ : నెనర్లు

  @ప్రవీణ్ : మళ్ళీ ఆన్సైటే? :-) లేదు. వెళ్ళాల్సింది. తప్పించుకున్నాను.

  ReplyDelete
 5. చాలా బాగున్నాయి విశేషాలు.

  ReplyDelete
 6. నెను యెమెన్ చుచాను ముిరు రాసినది బాగుంది నజంగానె ఘాత్ తెగతింటారు అదితిుంటు మరిందాలొ
  పటికిబెలల్మ్ ముకక్లువెసుకుని తాగుతారు తింటువంటె సోరగ్ంలొఉననటులు ఉంది అని చెపుతారు
  నన్ తినమని అడిగేవారు కాని నెను తినలెదు ఇపుడునెను యెమెన్ లో ఉండె రసుత్నన్ను

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.