Tuesday, June 17, 2008

నేడు భాషాసేవకుడి 95 వ జయంతి

ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ లాంటి పత్రికలలో ఎంతో కాలం పని చేసి, 'నుడి నానుడి ' లాంటి ఎన్నో శీర్షికలను సమర్థంగా నిర్వహించిన పాళీ ఎవరిది?

తిరుపతి సంస్కృత కళాశాలలో చదువుతూ, స్వతంత్ర సంగ్రామం లో పాల్గొని, గోవిందరాజుల స్వామి దేవస్థానం పై భారత జండానెగురవేసిన ధీరుడు ఎవరు ?

తిరునల్వేలి జైలు లో భగత్ సింగ్ తో పాటు ఉరిశిక్ష కు గురయిన బటుకేశ్వర దత్తా తో జైలు జీవితాన్ని పంచుకున్న తెలుగువాడు ?

ఎన్నో తెలుగు ప్రబంధాల పరిష్కర్త అప్పటి సాహిత్య వినీలాకాశంలో దేదీప్యమైన తార వేటూరి ప్రభాకర శాస్త్రి శిష్య ప్రవరుడూ, ఆయనతో పాటు ఎన్నో సాహిత్య చర్చలలో పాల్గొన్న ఈ అఙ్ఞాత పుంభావ సరస్వతి ఎవరు ?

తెలుగు లిపి తో పాటు భారతీయ లిపులన్నిటి మీద సశాస్త్రీయంగా, సమర్థంగాను, సప్రామాణికంగాను, అద్భుతమైన గ్రంథ రాజాన్ని వెలయించి, తెలుగు తల్లి కి అక్షరలక్షలు ఒసంగిన మేరు నగధీరుడు ?

కాశీనాథుని నాగేశ్వర రావు పంతులు, గాంధీ మొదలుకుని, యల్లా ప్రగడ సుబ్బారావు, మల్లం పల్లి సోమశెఖర శర్మ, మానవల్లి రామకృష్ణ కవి, డాక్టర్ రఘువీర్ మొదలయిన అనేక మంది తో తమ అనుభవాలను పంచుకుని, హంపీ నుండీ హరప్పా వరకు భారతదేశాన్ని అసాంతం చుట్టి వచ్చిన మనశ్వి, యశస్వి ఎవరు ?

'జనని సంస్కృతంబు సకల భాషలకునూ అన్న వాక్యాన్ని ప్రశ్నించడమే కాక, సంస్కృత, ప్రాకృతాల మధ్య జన్య జనక సంబంధం లేదని, ప్రాకృతం సంస్కరింపబడి సంస్కృతం అయిందనీ, ఎన్నెన్నో ఆధారాలు చూపించి, చెరుకూరి నారాయణ రావు వంటి సాహితీ ప్రముఖులచేత 'ద్రవిడ భాషా సన్నిపాత జ్వరితుడు ' అన్న తిట్టును కూడా వినయంగా భరించిన వినయశీలి?

ఆయన మా (మన) రాయల సీమ (అనంతపురం) ముద్దుబిడ్డ డాక్టర్ తిరుమల రామచంద్ర గారు. ఆయన 95 జయంతి నేడు.

తిరుమల రామచంద్ర గారు 1913 లో ఇదే రోజు జన్మించి 1997 లో అక్టోబర్ 12 వ తేదీ పరమపదించారు. ఈయనది శ్రీ కృష్ణదేవరాయల వారి ఆస్థాన పండితుడు తాతాచార్యుల వారి వంశమట.

ఈయన రచనలు కొన్ని, కింద ఉదహరిస్తున్నారు, ఔత్సాహిక బ్లాగర్ల కోసం...
1. హంపీ నుండీ హరప్పా దాకా (ఆత్మకథ..అజోవిభొ ప్రచురణ)

2. సాహితీ సుగతుని స్వగతం
3. మన లిపి పుట్టు పూర్వోత్తరాలు
4. బృహదారణ్యకం
5. అహం భో అభివాదయే
6. ప్రాకృత వాఙ్ఞయంలో రామకథ
7. నుడి - నానుడి
8. లలిత విస్తరం (అనువాదం, ఈయన బులుసు వెంకట రమణయ్య గార్లు)
9. తెలుగు పత్రికల సాహిత్య సేవ
10. గాథా సప్త సతి లో తెలుగు పదాలు

ఇంకా ఎన్నెన్నో ... తెలుగు వారు మర్చిపోయిన ఈ మహానుభావుడికి వందనాలు.

9 comments:

 1. చాలా సంతోషం.
  వారి ఆత్మకథ హంపీనించీ హరప్పాదాకా తెలుగు వారందరూ చదవాల్సిన పుస్తకం

  ReplyDelete
 2. చాలా కొత్త విషయాలు తెలిసాయి ఆయాన గురించి. నెనరులు. తాతాచార్యుల వంశస్తుడు మరొక ప్రసిద్ధుడూ ఉన్నారండి.. పుట్టపర్తి నారాయణాచార్యులు గారనుకుంటా!

  ReplyDelete
 3. హంపి నుంచి హరప్ప దాకా నిజంగానే సాహితీ ప్రియులందరూ చదవాల్సిన పుస్తకం! ఈ మధ్య హంపి వెళ్ళినపుడు వారి వూరు కమలాపురం(హంపి కి4 కిలోమీటర్లు)మీదుగా నాలుగైదు సార్లు తిరుగుతుంటే ఆ పుస్తకంలో కమలాపురం లోని ఆయన చిన్ననాటి స్మృతులన్నీ గుర్తొచ్చాయి. ఆ పుస్తకం చదవకుంటే కమలాపురాన్ని ఒక చిన్న గ్రామంగానే గుర్తించి ఉండేదాన్ని! వీరిది తాతాచార్యుల వారి వంశమన్న విషయం కొత్త ది నాకు! ఈ సంగతి 'హంపి నుండి.." లో లేదనుకుంటా!

  ReplyDelete
 4. @చదువరి గారు: పుట్టపర్తి నారాయణాచార్యుల వారిది రాయలసీమే (పెనుగొండ అనుకుంటాను). అయి ఉండవచ్చు.

  @కొత్తపాళీ గారు : నెనర్లు.

  @సుజాత గారు : వావ్., మంచి పనిచేసారు. కమలాపురంలో ఆయన చెప్పిన చెఱువు (కమలాలతో ఉన్న) కూడా చూసుంటారు కదూ.

  ఈయన తాతాచార్యుల వంశం వారు అన్నది 'హంపీ నుండీ...' మొదటి అధ్యాయం (ఓ గుండ్రాయి కథ) మొదటి పేజీ లోనే ఉంది. ఐతే కాస్త వెతకాలి.

  ReplyDelete
 5. మీరందరూ హంపీ హంపీ అని నాప్రాణం మీదకు తెచ్చేలా ఉన్నారే?
  మా ఆవిడ అక్కడ పుట్టింది,పెళ్ళికి ముందు వాళ్ళవాళ్లతోకలిసి కొన్ని సార్లు వెళ్ళొచ్చింది,నన్నూ తీసుకెళ్ళమని శతపోరుతుంది కానీ,ఊహూ మనం కదలం కదా!
  అప్పటికీ మంచిమనసులు సినిమాలో శిలలపై శిల్పాలు చెక్కినారూ..ఎన్నిసార్లు చూయించానో?
  ఈమధ్య అక్కడ తీసిన చందమామ సినిమా కూడా చూపించాను,కష్టపడి చూసా,అక్కడినుండి మరీ ఎక్కువయ్యింది గొడవ.అది ఎలా తట్టుకోవాల్రా బాబూ అని నేను తలపట్టుక్కూర్చుంటే ఇక్కడ మీరు మొదలు పెట్టారు.
  మా ఆవిడ ఇదంతా చదివితే ఇంకేమన్నా ఉందా?హన్నా!!!???

  ReplyDelete
 6. Hi Ravi
  These days ur blogs are abt more more informative and on some serious topics, but its missing its spice.

  ReplyDelete
 7. Hi Ravi
  These days ur blogs are abt more more informative and on some serious topics, but its missing its spice.

  ReplyDelete
 8. "హంపీ నుండీ హరప్పా దాకా.." నేను చదివా.

  హంపీ నుండీ హరప్పా దాకానే గాక రాయల కాలం నుండీ ఈ కాలం వరకూ బోలెడన్ని సంగతులు చెబుతారు రామచంద్రగారందులో.

  --ప్రసాద్
  http://blog.charasala.com

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.