Friday, May 9, 2008

ఎందరో మహానుభావులు!

నా మిత్రుడు (కన్నడ కస్తూరి) ఒకతనికి జాతకాలు, న్యూమరాలజీ వీటిపైన గురి. ఓ సారి తను, మే నెల జాతకుల గురించి చెబుతూ, ఈ నెలలో పుట్టిన వాళ్ళు కళాత్మక హృదయులు, సత్య శోధకులు, ఒకింత అంతర్ముఖులు వగైరా వగైరా అంటూ చెప్పుకొచ్చాడు.

మనకంత సీను లేదు కదా (నేను మే 2 వతేదీ అఘోరించాను లెండి), కస్తూరి ఏమిటి ఇలా అంటాడు అని అనుకున్నా. వాడు, తన మాటలు నేను నమ్మట్లేదన్న ఆవేశంతో ఓ లంకె చెప్పి, అందులో వివరాలు వెతుక్కోమన్నాడు. (http://www.findyourfate.com) ఆ వెబ్ సైటు లో చాలా వరకు పచ్చి నిజాలున్నాయిష!

సరే, ఈ నెలలో పుట్టిన మహానుభావుల వివరాలు తెలుసుకుంటే తను చెప్పిన సంగతి నిజమో కాదో తెలుస్తుంది కదా..చూద్దాం లే అనుకున్నా.

తర్వాత నా వరకూ ఓ ఆశ్చర్యకరమైన సంగతి తెలిసింది. నేను అభిమానించి, ఆరాధించే వ్యక్తుల్లో చాలా మంది ఈ మాసం లోనే జన్మించారు. పై చెప్పిన లక్షణాలు కూడా అతికినట్టు సరిపోతాయి వాళ్ళకు. ఈ మహానుభావుల్లో ఒకరికి ఇంతకు మునుపు టపాలో నివాళి తెలిపాను. మిగిలిన వారి గురించి స్థూలంగా ప్రస్తావిస్తాను.

ఈ జట్టు కి కాప్టన్ నిశ్చయంగా మిస్టర్ గౌతం గారే.

గౌతమ బుద్ధుడు : ఈ మహానుభావుడు వైశాఖ పౌర్ణమి రోజు జన్మించాడు (ఈ నెల 12 వ తేదీ అవుతుంది). ఓషో, రజనీష్ ఓ ప్రసంగంలో అంటాడు., సమయాన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని క్రీస్తు ని కొలబద్ధ గా తీసుకోవడం ఓ పొరపాటు. బుద్ధ పూర్వం, బుద్ధ శకం అని ఉండాలి. అది నిజమే.

మన భారత దేశ (ఒక్క భారత దేశమే కాక, ఓ రకంగా, మొత్తం ప్రపంచానికే)పునరుజ్జీవనం బుద్ధుని తో మొదలయ్యింది అతిశయోక్తి అవబోదు. మన మొదటి లిపి పాళీ. (సంస్కృతం కేవలం వాఙ్ఞ్మయం మాత్రమే అప్పటికి). విగ్రహారాధన, లళిత కళలు, విశ్వవిద్యాలయాలు (తక్షశిల, నలందా) విదేశీ యానాలు, నాటికలు (కాళిదాసు కన్నా ముందే సంస్కృత నాటిక ఉన్నదట.అది అశ్వఘోషుని సారిపుత్ర ప్రకరణం అని ప్రాఙ్ఞుల ఉవాచ) ఇవన్నీ బుద్ధుడితో ఆరంభమయినవే. కేవలం సాంస్కృతికంగా మాత్రమే కాక సామాజిక పరంగా చూచినా మొదటి ప్రజా స్వామ్యం (లిచ్చపీ గణతంత్రం), మొదటి వర్గ రహిత సమాజం (బుద్ధుని సంఘారామాలు), ఇలా సర్వతోముఖాభి వృద్ధికి సోపానం బుద్ధుని తో సాధ్యమయింది. కాలక్రమేణా బౌద్ధం లో ఇబ్బడి ముబ్బడిగా శాఖలు బయలుదేరి, క్షీణించడం జరిగింది.

ఇంకో విషయం. పాశ్చాత్య దేశాలలో పునరుజ్జీవనం యుద్ధం ద్వారా మాత్రమే సాధ్యమయింది. కొరియా, జపాను, జర్మనీ దేశాల అభివృద్ధి యుద్ధం తర్వాత జరిగింది.

భారత దేశంలో ఓ వ్యక్తి ద్వారా జరగడం అపూర్వం.

ఈయన జీవిత చరిత్ర అందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడ ప్రస్తావించబోవట్లేదు. ఈయన తను చనిపోయే ముందు చెప్పిన ఆఖరు వాక్యం ఇది " ఆత్మ దీపో భవ! "

జిడ్డు కృష్ణమూర్తి (మే 11) :పైన ఉదహరించిన "ఆత్మ దీపో భవ! " అనే వాక్యానికి నిలువెత్తు నిదర్శనం కృష్ణాజీ జీవితం. మనం బుద్ధుడి గురించి కథలు మాత్రమే చదువుకున్నాం. బుద్ధుడు ఇప్పుడు 21 వ శతాబ్దంలో పుట్టి వుంటే ? ఈ పృశ్న కు సమాధానం జిడ్డు కృష్ణమూర్తి.

బుద్ధుడు దుఃఖిత మానవాళి సముద్ధ్రణకై సర్వం వీడి అర్హతుడై, తథాగతుడై సత్యాన్ని బోధించాడు.
1895 లో జన్మించిన కృష్ణమూర్తి చిన్నతనం లోనే అమ్మను కోల్పోయి, అనీబిసెంట్ ద్వారా దత్తు తీసుకోబడి, తన దేశాన్ని, తండ్రి ని, భాషను, ఆఖరు తన ప్రాణం తో సమానైన తమ్ముని కోల్పోయి, విశ్వ గురువు పాత్రలో నటించి, అన్ని వదిలి సత్య పథంలో నిత్య యాత్రికుడై, కృష్ణాజీ గా మిగిలి ఎందరికో మార్గదర్శకుడయ్యాడు.


ఈయన ప్రవచనాలు గహనం, గంభీరం కావడంతో అర్థమయీ అర్థమవకుండా ... అలా మనల్ను తదాత్మ్యత కు లోను చేస్తాయి.

కృష్ణాజీ గురించి చెప్పవలసి వస్తే, ముఖ్యంగా చెప్పాల్సింది ఆయన స్థాపించిన పాఠశాల గురించి. విద్యను పరీక్షల చట్రం లో బంధించి విద్యార్థుల జీవితం ఉద్యోగం సంపాదించడానికే అన్న ఇప్పటి విద్యా విధానాన్ని ఈయన నిరసించాడు.

ఇక ఈయన ప్రవచనాల గురించి, ఈయన చెప్పదలుచుకున్న వాటి గురించి ఈయన పుస్తకాల ద్వారానే తెలుసుకుంటేనే బావుంటుంది.

త్యాగరాజ స్వామి (మే 3):ఆచార్య తిరుమల రామచంద్ర గారు తమ తమ సాహితీ సుగతుని స్వగతం అనే రచనలో త్యాగరాజు గురించి చెబుతూ, త్యాగరాజ స్వామి కీర్తనలు సంగీత పరంగానే కాక సాహిత్య పరంగానూ అమూల్యమైనవి అని విశ్వసిస్తాను. అన్నారు. అందుకు ఉదాహరణ చెబుతూ,

"రాగ సుధారస పానము చేసి రాజిల్లవే ఓ మనసా! " అనే కీర్తన 3 భ గణాలతో మొదలై పల్లకీ లో అలా అలా ఊరేగుతున్నట్టు ఉంటుంది అంటారు. ఈ కీర్తన ఆందోళిక రాగమట. ఆందోళిక అంటే, పల్లకీ అని అర్థంట.

త్యాగరాజ స్వామి సంగీత సేవ గురించి విఙ్ఞులయిన బ్లాగర్లకు తెలిసిన విషయమే. ఈ ఋషి కి నీరాజనాలు.


సత్యజిత్ రే (మే 2):సత్యజిత్ రే నాకు మొదట కథకుడిగానే పరిచయం. ఈయన కథా సంపుటి ఆగంతకుడు, ఇండిగో వగైరా కథలు, మొదట బెంగాల్ లో తను నడిపే సందేశ్ అనే పత్రికలో ప్రచురింపబడ్డాయిట. 'సందేశ్ ' అనేది ఓ బెంగాలి స్వీటట. ఆ స్వీటు ఎలా వుంటుందో ఎమో కానీ ఈ కథలు మాత్రం వాటికంటే ఇంకా రుచి గా ఉంటాయి.

ఈ ఆగంతుక్ లో ఓ కథను అదే పేరుతో అలానే సినిమా తీసాడీయన. మానవ సంబంధాల గురించి ఓ హృద్యమైన కావ్యం ఆ సినిమా.


ఇంకో విషయం ఎక్కడొ చదివినది. స్పీల్ బర్గ్ ఈ.టీ సినిమాలో అంతరిక్ష జీవి రూప కల్పన చేసినది మన సత్యజిత్ రే అట.

సత్యజిత్ రే గురించి నేనింకా తెలుసుకోవాలి.

ఇంకా ఈ నెలలో ఉమర్ ఖయ్యాం లాంటి ఎందరో కళాకారులు, మహానుభావులు. అందరికీ నీరాజనాలు.

(ఈ టపాలో తప్పులుంటే తెలుపండి. సరిదిద్దుకోగలను. - రవి )

11 comments:

 1. చాలా బాగుందండీ ఈ టపా. ప్రతీ నెలలోనూ మహానుభావులు పుడతారనుకోండి. ఆ విషయంలో మే నెలని ప్రత్యేకంగా పరిగణించక్కరలేదు. ఆవంకతోనైనా మంచి టపా రాశారు కాబట్టి నో కంప్లయింట్స్. అయితే ఈ వైశాఖ మాసంలో (ఇది సుమారుగా మే నెలలో పడుతుంది) పుట్టిన మరో గొప్ప మహానుభావుణ్ణి మరచిపోయారే!! శంకరాచార్యులవారు. (వైశాఖ శుద్ధ పంచమి).

  ReplyDelete
 2. "నేను మే 2 వతేదీ అఘోరించాను లెండి"

  హ హ్హ హ్హ!
  "నేను అభిమానించి, ఆరాధించే వ్యక్తుల్లో చాలా మంది ఈ మాసం లోనే జన్మించారు."
  దాందేముంది లేండి, ఎవరి పుట్టినమాసం మీద వారికి ప్రేమ .. అయినా ఇలాంటీ సైట్లలోనూ, పుస్తకాల్లోనూ, హిట్లరూ, తామర్లేనూ .. ఇలాంటీ వాళ పేర్లు రాయరుగా.

  ReplyDelete
 3. మీరు జిడ్డు క్రిష్ణ మూర్తి గారి గురించి బాగా రాశారు. నాకు మొదట్లో ఆయన పుస్తకాలు అర్థమయ్యేవి కావు.వదలకుండా చదివి ఒక దారిలో పడ్డాను.(అర్థం చేసుకోవడంలో).పోయిన వీకెండుకి తిరుపతి నుండి హార్సిలీ హిల్స్ వెళ్లి, అక్కడికి దగ్గరలోనే ఉన్న ఆయన స్థాపించిన పాఠశాల 'రిషి వాలీ ' స్కూలుకి వెళ్ళాము. కొండల మధ్య చాలా బాగుంది. అనుకోకుండా మీరు ఆ స్కూలు గురించి రాశారు. హార్సిలీ హిల్స్లో కూడా ఆయన విగ్రహం ఉంది. నాకు ఆయనంటే చాలా ఇష్టం!

  మీరు చెప్పిన సైటు చూడాలి.
  అన్నట్టు పరశురామూడు కూడా ఈ నెల్లోనే పుట్టాడటండి! వైశాఖ శుద్ధ తదియ!
  ఇంకా ఈ నెల్లో....బుద్ధ పూర్నిమ రోజే అన్నమాచార్య జయంతి కూడా!

  చివరగా మా అమ్మాయి ఫేవరేట్ గాడ్..ఆంజనేయుల వారు కూడా ఇదే నెల్లో పుట్టారు! కొసమెరుపు ..మా పాప ఆ రోజే హనుమజ్జయంతి రోజే పుట్టింది. మే 25న.

  ReplyDelete
 4. నాగమురళి గారూ, నేను మా ఆవిడ తో ఆర్గ్యుమెంట్ చేసేప్పుడు నేను పుట్టిన నెల్లో ఎవరెవరు పుట్టారు అని డబ్బా కొడుతుంటాను. అదే ఈ టపా కి ఓ రకంగా ప్రేరణ. ఎవరినో మర్చిపోయాను అని ఏదో మూల అనుకున్నా. ఒకరు కాదు ఇద్దరు. మీరు, సుజాత గారు చెప్పాక గుర్తొచ్చింది. అయితే మళ్ళీ మీకు క్షమాపణలతో ఓ విషయం. నాకు శంకరాచార్య గారి మీద కొన్ని కుశంకలు (కాళిదాసు మీద లాగే). ఈ విషయం మీద మళ్ళీ ఎప్పుడయినా ధైర్యం కూడగట్టుకుని ఓ టపా రాస్తాను.

  అన్నమయ్య ని మర్చిపోవడం పొరబాటే.

  కొత్తపాళీ గారూ, బుద్ధుడు, కృష్ణాజీ వీళ్ళ మధ్యలో వాళ్ళా? రామ రామ ..:-) జూనియర్ ఎంటీయారు, సీనీర్ ఎంటీయారు, వీళ్ళ గురించే ధైర్యం చేసి రాయలేదు.

  ReplyDelete
 5. సుజాత గారూ,
  కృష్ణమూర్తి రచనలు నాకు మొదట్లో అర్థమవలేదు. ఐతే, kRishnamoorti's notebook, krishnamurthy to himself, comentaries on livng (3 volumes) ఈ పుస్తకాల తర్వాత గాడి లో పడ్డాను. మీ పాపాయి కి జన్మ దిన శుభాకాంక్షలు.

  ReplyDelete
 6. "నిజాలున్నాయిష!"

  ఈ పద ప్రయోగమం చాలా బావుందండీ, నేను గురజాడ వారి రచనలలో ఎక్కువుగా ఈ పదం చూసేవాడిని చాలా బవుంది,

  ఇది అచ్చమైన తెలుగా?

  లేక ఓ జిల్లా వాళ్ళు వ్రాసే/మాట్లాడే పదమా?

  కొంచం సెలవీయగలరు

  ReplyDelete
 7. అశ్విన్ గారూ,
  నాకూ తెలీదండీ. మా వూళ్ళో ఎవరు వాడరు. నేనూ, గురజాడ కన్యా శుల్కం లో చూసిందే.బావుంది అని వాడాను.

  ReplyDelete
 8. Hey Ravi
  I don't know whether the cricket great Brian Charles Lara falls in ur category of great people, but i feel that his name is noteworthy. People talk about better footwork in the game but this man had an immaculate footwork.

  btw Lara is born on May 2nd and If I am correct its in the same year when u are also born :)

  ReplyDelete
 9. “అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిష” ... ఇలా గురజాడ కన్యాశుల్కంలో టకారాంతాలను షకారాంతాలుగా పలికే పాత్రలు ఇరవైనాలుగ్గంటలూ తాంబూలచర్వణం చేసేవే కావడంవల్ల సహజత్వం కోసం వారి మాటలను మహాకవి అలా పలికించాడు -- అని నాకనిపించింది.

  ReplyDelete
 10. "ఉంఛావా? .. ఉన్నాయిష!" .. ఇది తుగోజీలో కొన్ని వైదిక బ్రాహ్మణ శాఖల వారు మాట్లాడే భాష. తాంబూల చర్వణంతో ఏమీ సంబంధం లేదు, వారి మాట తీరు అదే. తుగోజీ అనంగానే మనకి రాజమండ్రి, కాకినాడ, కోనసీమ గుర్తొస్తాయి కానీ, ఈ జిల్లా ఉత్తరాన విశాఖ జిల్లాని తాకుతోందని గుర్తుంచుకోవాలి.

  ReplyDelete
 11. మంచి టపా.. కొత్తపాళీ గారి వ్యాఖ్యతో చదవగలిగాను.
  ఇంతకీ మీరు ఆ సైటులో ఎక్కదలచుకున్నారో లేదో చెప్పనే లేదు :)

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.