Monday, March 3, 2008

అనగనగా ఓ కార్పోరేట్ శిక్ష(ణ)

నేను పని చేసే కంపనీ లో ఆఖరు వారం మాకో శిక్షణా కార్యక్రమం (ట్రైనింగ్ ప్రోగ్రాము) వుండింది.

కార్పోరేట్ సంస్థల ఆచార వ్యవహారాలు (corporate ethics and etiquettes) గ్రహించుడీ! అనే శీర్షిక లో భాగంగా "పది మంది మధ్యలో వున్నప్పుడు వూపిరి పీల్చడం ఎలా? " అనేది ఆ శిక్ష(ణ) ఇచ్చారు. శిక్షకుడు ఇలాంటి శిక్ష(ణ) ల అవసరాన్ని గురించి ఆవేశంగా ప్రసంగించాడు ఓ గంట సేపు.

తర్వాత బ్యాటింగు మొదలయ్యింది.


శిక్షణ మొదటి అంకం పూర్తి అవడమూ, నేను నా సోనీ ఎరిక్సన్ డబ్లూ 810 ఐ లో లోడ్ చేసుకున్న ' ప్రిన్స్ ఆఫ్ పర్షియా ' (సైలెంట్ మోడ్ లో) 7 వ లెవెల్ ముగించడమూ ఒకటే సారి జరిగాయి.


ఈ ట్రైనింగ్ వలన ఓ ఐదు తారల పూటకూళ్ళ ఇంట్లో ' ఊట మత్తు ఫలహార (కన్నడ)' - 'భోజనం మరియూ టిఫిన్ (తెలుగు)' ఆరగించే అవకాశం దొరికింది. శిక్షణ లో 2వ అంకం మధ్యాహ్నం మొదలయ్యింది. 'మత్తు ఫలహార ' నిజంగానే చాలా మత్తు తెప్పించింది. సర్వ శక్తులు కేంద్రీకరించి నిద్రను ఆపుకున్నాను ఎలానో.

మా కంపనీ సీ ఎం ఎం అనబడే ఓ క్షుద్ర విద్య లో ఐదవ అంకం సాధించింది. ఈ క్షుద్ర విద్య అనుసారం ప్రతీ ఉద్యోగి సంవత్సరానికి ఓ 40 గంటలు ఇలాంటి శిక్ష(ణ) కు గురవ్వాలి.

కొన్ని రోజుల కిందట మా కొలీగు ఒకతనికి లీడర్ షిప్ మెళకువలు అనబడే శిక్ష(ణ) ఇప్పించబడింది. అందులో భాగంగా తను ఓ గోడ పైకెక్కి, తల తిప్పి చూడకుండా వెనుకకు విరుచుకుని పడిపోవాలి. వెనుక అదను గా జట్టు సభ్యులు తనను పడిపోకుండా పట్టుకోవాలి. ఈ శిక్ష(ణ) వల్ల, తనకు జట్టు సభ్యుల మీద, జట్టు కి తమ నాయకుని మీద విశ్వాసం బలపడుతుంది అని మా హెచ్ ఆర్ వారి ఉవాచ.

మా కొలీగు కి ఎముకలు విరగలేదనుకోండి. అయితే తను ఆ సంఘటన తర్వాత భయం తో కంపించి, బాగా మెత్తబడిపోయాడు.

జట్టుకి, తన మీద, తన మీద జట్టు కి విశ్వాసం బలపడింది. ఐతే, తన మీద తనకు విశ్వాసం సన్నగిల్లింది!

ఇలాంటివి శిక్ష(ణ)లో కొన్ని హై లైట్స్...ఓ బకెట్ నిండుగా నీళ్ళు. జట్టు లో మొదటి సభ్యుడు రెండు చేతులను ఓ కప్పులా అమర్చి, బకెట్ లో నీటిని తీసుకుని,జట్టులో తన పక్క సభ్యుని చేతుల్లోకి అందజేస్తాడు. ఇలా జట్టు సభ్యులు ఒకరి పక్కన ఒకరుగా వరుసలో నిలబడి, నీళ్ళను ఒకరి చేతుల మీదుగా ఇంకొకరు అందుకుని, ఇంకో చివర్న వున్న ఖాళీ బకెట్ నింపుతారు. ఈ ఆట ఇలా 2, 3 జట్ల మధ్య పోటీలా జరుగుతుంది. యే జట్టు నిర్ణీత సమయంలో ఎక్కువ నీళ్ళను నింపగలుగుతుందో, ఆ జట్టులో సభ్యులకు ఒకరి మీద ఒకరికి మంచి విశ్వాసం వున్నట్టు లెక్క.


నెస్లే పోలో పిప్పరమింట్ ను మధ్య వున్న రంధ్రానికి కట్టిపుల్ల ఊతంగా పెట్టి పుల్ల చివరను నోట్లొ వుంచుకుంటాడు. ఇప్పుడు ఆ బిళ్ళ ను ఇంకో అతని నోట్లో వున్న కట్టి పుల్ల కు మార్పిడి చేయాలి పడిపోకుండా, చేతులు వుపయోగించకుండా.

జట్టు లో సభ్యులందరు కలిసి సాలీడు గూడు అల్లడం...

వేళ్ళాడే నిచ్చెన ద్వారా నీటి బాటల్ తోటి ఓ చెట్టు పైకెక్కి అటు వైపు నుండీ దిగడం...వగైరా వగైరా..

ఈ సైమండ్స్ చేష్టలకు పరాకాష్ట, ఓ సారి మా జట్టు అందరిని బురదలో పొర్లించారు టీం బిల్డింగు ఎక్సర్సైజు అనే కారణంతో ఓ సారి .

మొత్తానికి ఈ శిక్ష(ణ) ల వల్ల ఉద్యోగులకు వచ్చే లాభాలేమో కానీ, ఐదు తారల పూటకూళ్ళ ఇళ్ళు, రిసార్ట్ వాళ్ళు, మధ్య వర్తులు బాగ లాభపడుతున్నారు అనేది స్పష్టం.

ఇంతకూ ఈ టపాకు ప్రేరణ ఇదీ.

మిస్టర్ మేధావి చూసాను మొన్నామధ్య, మా ఆవిడతో పాటు. నాకు చాలా బాగా నచ్చింది. ఐతే మా ఆవిడకు మాత్రం కొన్ని విషయాలు మింగుడు పడలేదు. మా ఆవిడ మృదులాంత్రం లో పని చేయడం లేదు.

ఈ సినిమా రెండవ సగం లో సోనూ సూద్ స్వోట్ అనలిసిస్, అదీ అనుకుంటూ దిగుతాడు. ఉద్యోగి, యజమాని మధ్య సంబంధ బాంధవ్యాలు వీటి గురించి అద్భుతమైన విశ్లేషణ చేస్తాడు.

ఇదంతా మా ఆవిడ జీర్ణించుకోలేక పోయింది పాపం. (ఆమె కు అజీర్తి ఇబ్బంది కొద్దిగా..)

ఆవిడ నన్ను అడిగింది, ఏమిటి ఇదంతా అని. నేను ఆ అవకాశం సద్వినియోగపర్చుకుని, ఆమెను ఆశ్చర్యానందాలలో ఓలలాడించాలి అనుకుని, స్వోట్ అనగా సామర్థ్యాలు, బలహీనతలు, అవకాశాలు, ఆపదలు...కంపనీ అభివృద్ధి సాధించాలంటే వీటి ఆవశ్యకత వగైరా లాంటివి ఓ చతుర్భుజం సహాయంతో విశదీకరించాను.

నా లెక్చరు ముగిసిన తర్వాత తను అడిగింది. రవీ, పెళ్ళి కాకముందు నువ్వు కంపనీ లో సాఫ్ట్ వేర్ ఇంజినీరు అని చెప్పావు. అంటే సీ, సీ++, జావా ఇలాంటి వాటి పైన కాదా పని చేసేది? ఈ స్వోట్ అనాలిసిస్ ఇదంతా నీకెలా తెలుసు నీకు వాటితో ఏమి పని ? ఏమో బాబు, నాకేమీ అర్థం కావడం లేదు అంది.

ఆవిడ కు ఈ విషయమే తెలీదంటే, ఇక ఇక్కడ కంపనీ లో నడిచే ఈ డ్రామాలు, కార్పోరేట్ శిక్ష(ణ)లు గురించి తెలిస్తే నా గతి ఏమవుతుంది అని అనుమానం వచ్చింది.

అందుకే ఏమీ చేయలేక ఈ టపా కు శ్రీకారం చుట్టడం జరిగింది.
******************************************************************

6 comments:

 1. సూపరండీ, ఇరగదీశారు. క్షుద్ర విద్యా? - చదివి తట్టుకోలేకపోయానంటే నమ్మండి!! ఇంత నాటుగా శిక్షణ ఇస్తారని నాకు తెలియలేదు సుమండీ... ఆన్ సైట్లో ఇలాంటివి ఎరగం.

  ReplyDelete
 2. హహహ... ఇలాంటి ట్రెయినింగులు అటెండు అయినప్పుడల్లా అచ్చం మీకు కలిగినలాంటి ఆలోచనలే నాకూ కలుగుతాయి.

  కాకపోతే అప్పుడప్పుడూ పక్క టీముల్లోని అమ్మాయిలతో (మన టీములో ఎప్పుడూ మంచి అమ్మాయిలు ఉండరు గనక) కాసేపు ఎంజాయ్ చేసే అవకాశం దొరుకుతుంది ;)

  ReplyDelete
 3. Telugu writing style 101:
  తప్పు - శిక్షణా కార్యక్రమం వుండింది.
  ఒప్పు - శిక్షణా కార్యక్రమం వుంది, లేదా జరిగింది.

  కథలో నీతి - నువ్వు ఆఫీసులో చేసే ఘనకార్యాల్ని ఏకరువు బెట్టి ఇంటిదగ్గర శ్రీమతి ఇంప్రెస్ చెయ్యలేవు! :-)

  good story

  ReplyDelete
 4. ఏ మాట్ అకామాటే చెప్పుకోవాలి, కొన్ని ట్రైనింగులు మాత్రం భళే పనికొస్తాయి
  ఉదాహరణకు: మీ మేనేజర్తో ఎలా డీల్ చెయ్యాలి :)

  ReplyDelete
 5. Gr8 bhaiyya... ఇంచుమించుగా ఇదే అభిప్రాయంతో నేను హైకైనా వదులుకుంటానుగాని ఇలాంటి టుమ్రీ ట్రైనింగులకి మాత్రం చచ్చినా అటెండవనని ఇండస్ట్రీలో జాయిన్ ఐన మొదటి సంవత్సరమే ఒట్టుపెట్టుకున్నాను. కానీ అప్పుడప్పుడూ తప్పదనుకో... అదే అప్రైజల్ టైమ్ లో :P

  ReplyDelete
 6. హహహహ. ఇలాంటి బలవంతపు బ్రాహ్మణార్ధం ట్రైనింగులు ఇప్పటికీ వేగలేక చచ్చేవాళ్ళం మొదటి ఉద్యోగంలో. వెనక బెంచీల్లో కూర్చొని జోకులు, బొమ్మలు గీసుకుంటూ కూర్చొనేవాళ్ళం. ఏమిటో, కొందరికి (మేనేజర్లు) కొన్ని అలా యాంత్రికంగా జరిగిపోతూ ఉంటే అదో ఆనందం.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.