Thursday, February 7, 2008

అమెరికన్ ముఠా మేస్త్రి రివ్యూ

చాలా కాలం తర్వాత ఓ దమ్మున్న సినిమా, అమెరికన్ గాంగ్ స్టర్ చూసాను, ఫోరం లో పోయిన వారం.

ఈ సినిమా ఓ రాం గోపాల్ వర్మ మార్క్ సినిమా లాంటిది. నాకు దీనికి వర్మ 'సత్య 'కు కొన్ని పోలికలు కనిపించాయి. సత్య లో , ఓ వ్యక్తి, జీవిక కోసం ముంబై కోసం వచ్చి, పరిస్థితుల ప్రభావం వల్ల, మాఫియా లో చేరి, అందులో ఉచ్చ స్థితి కి చేరిన తర్వాత, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇందులోనూ, ఓ వ్యక్తి, తన వాళ్ళ కోసం, తను నమ్మిన కొన్ని సిద్ధాంతాల కోసం ఒంటరిగా మాదక ద్రవ్యాల వ్యాపారం లో ప్రవేశించి, ఉచ్చ స్థితి కి చేరుకుని, ఆఖరున, పోలీసులకు లొంగి పోయి, అప్రూవర్ గా మారడం. అలానే, సత్య లో ఓ నిజాయితీ గల పోలీసు ఆఫీసర్. ఇందులోనూ, అలాంటి పాత్ర.

అయితే, అమెరికన్ ముఠా మేస్త్రి లో, చెప్పుకోదగ్గ విషయం యేమంటే, ఈ సినిమా మెలోడ్రామా, సన్నివేసాలు మీదకన్నా పాత్రల కారక్టరైజేషన్ మీద నడుస్తుంది. ఇది ఓ రకంగా కత్తి మీద సాము. ఇదే ఈ దర్శకుని (రిడ్లీ స్కాట్) గొప్పతనం.

కథ :

ఇది నిజంగానే జరిగిన (ఓ వ్యక్తి) కథ.కథాకాలం 60 వ దశకం చివర్లో, 70 వ దశకం మొదట్లో. బంపీ జాన్సన్ అనే ఓ నీగ్రో వద్ద ఫ్రాంక్ లుకాస్ (ఇతను నీగ్రో నే) అనబడే వ్యక్తి పని చేస్తుంటాడు.జాన్సన్ చనిపోవడం తో, తన (అక్రమ) వ్యాపార వ్యవహారాలన్నీ కకావికలు అవుతాయి. ఆ సమయం లో, అనేక ప్రతికూల పరిస్థుల మధ్య, ఫ్రాంక్ లుకాస్, తను నమ్మిన కొద్ది మంది (తన బంధువుల) సహాయంతో, మాదక ద్రవ్యాల దిగుమతి వ్యాపరం ప్రారంభిస్తాడు.

ఇతనికి కొన్ని సిద్ధాంతాలు వుంటాయి. వ్యక్తి సమాజానికి జవాబుదారీ కాడు. సమాజం లో రుగ్మతలు వ్యక్తి మంచితనం తో జయించడం కుదరదు. వ్యక్తి తనకు, తన కుటుంబ సభ్యులకు, తను చేసే పని (అది యేదైనా సరే) కి మాత్రమే జవాబు దారీ.


తన మాదక ద్రవ్యాల (క్లాస్ 4 హెరాయిన్) దిగుమతి లో మధ్య దళారీలను ఆశ్రయించడు. తన సరుకు నాణ్యత కోసం యే మాత్రం రాజీ పడడు. తనకు నమ్మకమైన కొద్ది మంది కుటుంబ సభ్యులు ఇందులో భాగస్వాములు. అచిర కాలం లోనే కోటీశ్వరుడౌతాడు. తన తల్లి ని, తమ్ముళ్ళనూ, తన వద్దకు రప్పించుకుంటాడు.

ఇతనికి శత్రువులు, పోలీసులు, ఇతని సరుకు పంపిణీదార్లు వగైరా.

=======================================================

ఇతనికి కాంట్రస్టింగ్ గా నార్కోటిక్స్ విభాగం లో పని చేసే, రిచీ రాబర్ట్స్ అనబడే ఓ డిటెక్టివ్. ఇతనికి నిజాయితీ యే జీవితం. ఓ కేసు సందర్భంగా ఇతనికి అనామతు తరహా 1 మిలియన్ డాలర్లు దొరుకుతాయి. ఆ డబ్బు తను తస్కరించడానికి అవకాశం వచ్చినా, దాన్ని సరెండర్ చేస్తాడు. చేయిస్తాడు.

అతని భార్య విడాకులు ఇస్తుంది.

ఇతనికీ కొన్ని సిద్ధాంతాలు.

వ్యక్తి తన బతుకుతున్న సమాజానికి ప్రతీక. తను మొదట సమాజనికి జవాబుదారీ, తరువాత తనకు, తన జీవితానికీ.

బ్లూ మాజిక్ అనబడే హెరాయిన్ దిగుమతి కేసు తను ఆరంభిస్తాడు. తన ప్రతిభ తో ఒక్కొక్క చిక్కు ముడి ని విప్పుతూ, ఈ దిగుమతి ఫ్రాంక్ లుకాస్ వ్యాపారమే అని తెలుసుకుంటాడు. ఆఖరున ఫ్రాంక్ లుకాస్ ను అరెస్ట్ చేసి, తన ద్వారానె, ఈ మాదక ద్రవ్యాల ఉచ్చు లో వున్న మొత్తం అధికారులను, అరెస్ట్ చేయిస్తాడు.


===================================================

ఇదీ క్లుప్తంగా కథ. అయితే, మొదట చెప్పినట్టు, ఈ సినిమా లొ బలం అంతా పాత్రల కారక్టరైజేషన్. పాత్రల స్వభావాన్ని చిత్రీకరించడానికి సన్నివేశాల్ని వాడుకున్నాడు అనిపిస్తుంది.

ఈ సినిమా నిడివి 2:30 గంటలు. పెద్ద సినిమాయే, ఇంగ్లీషు సినిమాల పరంగా చూస్తే. ఇంతసేపూ ప్రేక్షకులను కూర్చోబెట్టి, కథనం లో బిగువు సడలకుండా, మనస్థత్వాలని ప్రతిబింబిస్తూ, ఉత్కంఠ గా చిత్రీకరించడం....హాట్స్ ఆఫ్.

ఇక కరడు గట్టిన ముఠా మేస్త్రి, ఫ్రాంక్ లుకాస్ గా డెంజెల్ వాషింగ్ టన్ అదరగొట్టాడు. రాబర్ట్స్ పాత్రలో రసెల్ 'కాకి '(క్రో)...గురించి చెప్పనవసరం లేదు. క్యూబా గుడింగ్ చిన్న పాత్రలో అయినా బాగా నటించాడు.

అయితే, ఈ సినిమాలో మాటి మాటికీ వినిపించే, నాలుగు అక్షరాల (ఇంగ్లీషు) బూతు పదం, కుటుంబం తో సహా చూడడానికి ఇబ్బంది పడేటట్టు చేస్తుంది.

మీరు సినిమా ప్రియులయితే, ఈ సినిమా ను మిస్ అవకండి.

1 comment:

  1. మంచి సినిమా రివ్యూ రాసినందుకు థాంక్స్.
    సినిమా చూడాలను నేనూ అనుకుంటున్నా. త్వరలోనే :)

    ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.