Monday, January 21, 2008

గెలుపు

.....భారత్ గెల్చింది. క్రికెట్ ను గెలిపించింది.

ఆసీస్ జట్టు శిఖండి ని అడ్డుపెట్టుకున్నట్టు బక్నర్ ను అడ్డుపెట్టుకున్నా, ఎన్ని మాయోపాయాలు చేసినా, విజయం క్రీడాస్పూర్తికే అని నిరూపణ అయింది.

మాచ్ తర్వాత పాంటింగ్ ను మార్క్ హర్ష భోగ్లే ముఖాముఖి జరిపాడు. పాంటింగ్ మనసులో వున్నది యథాతథంగా చెప్పి వుంటే, ఆ ముఖాముఖి ఇలా వుండేది.

హర్ష : పాంటింగ్, నిరాశాజనకమైన ఓటమి కదా?
పాంటింగ్ : అవును. 16 సార్లు 'ఎలాగోలా' వరుస విజయాలు నమోదు చేసాం. ఇప్పుడిలా జరిగింది.

హ : ఓటమి కి కారణాలేమంటారు ?
పా: పిచ్ ఒకేరకంగా బౌన్స్ అవలేదు. ఇద్దరు జట్లలో ఎవరు శతకం సాధించలేదు. పిచ్ క్యురేటర్ 'జాతి వివక్షత ' చూపించాడు అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.

హ : హేడెన్ లేని లోటు కనబడింది అంటారా ?
పా : హేడెన్ కు అపారమైన అనుభవం వుంది. అయితే, బక్నర్, బెన్సన్ లేకపోవడం, మాచ్ ఫలితాన్ని శాసించింది. వాళ్ళు లేని లోటు పూడ్చలేనిది. (గొంతు విషాదం తో బొంగురు పోతుండగా చెప్పాడు).

హ : ఇషాంత్ శర్మ మిమ్మల్ను 2 సార్లు అవుట్ చేసాడు.
పా : ఇషాంత్ శర్మ యువకుడు. నన్ను ఎక్కువ సార్లు అవుట్ చేస్తే, ఎం జరుగుతుందో, తెలుసుకున్నట్టు లేదు. ఇషాంత్ ను కూడా శంకర గిరి మాన్యాలు పట్టిస్తాను. అయితే, దీనికి జాతి వివక్షత అస్త్రాన్ని వాడాలా లేదా మరో వినూత్న పద్ధతి లో దెబ్బ కొట్టాల అనే విషయం జట్టు సభ్యులందరితో చర్చించి, నిర్ణయం తీసుకుంటాము.

హ : భారత్ బౌలర్లు బంతి ని బాగా స్వింగ్ చేసారు. స్వింగ్ అవుతున్న బంతి ని మీరు ఆడడం లో ఇబ్బంది పడ్డారా?
పా : అదేం లేదు. ఇంతకు ముందు ఎన్నో సార్లు స్వింగ్ బౌలింగ్ ను ఎదుర్కొన్నాం. అయితే, ముందు మాచుల్లో అంతా, ప్రత్యర్థి బౌలర్, ఎక్కువగా స్వింగ్ చేస్తే, ఆ బౌలర్ ను, పచ్చి బూతులు తిట్టి, మానసికంగా నిర్వీర్యం చేసేవాళ్ళం. ఇప్పుడది కుదరలేదు.

హ : ఎందుకలా బూతులు ?
పా : ఆసీస్ జట్టు క్రికెట్ ను ధాటి గా, ధీటుగా ఆడుతుంది. ప్రత్యర్థి జట్టును వాళ్ళ కుటుంబ సభ్యులను, ఘాటుగా, పచ్చిగా, అమ్మనా బూతులు తిట్టడం మా క్రీడా సంస్కృతి లోభాగం.

హ : బూతులు తిట్టడం క్రీడా స్పూర్తి కాదు కదా? మిమ్మల్ని, ప్రపంచం లో అన్ని జట్లు ఏకుతున్నాయి, క్రీడా స్పూర్తి విషయం పై?
పా : ఎవరా మాట అంది? వాళ్ళ జిమ్మడ, వాళ్ళ బతుకులు నాశనమైపోనూ...

హ : సరే..సరే..అడిలైడ్ మాచ్ కు బ్రాడ్ హాగ్ ను మళ్ళీ తీసుకొనే అవకాశం వుందా?
పా : బ్రాడ్ హాగ్, ప్రత్యర్థి జట్టు ను బూతులు తిట్టడం లోనూ, ఆరోపణలు చేయడం లోనూ, 'ఆల్ రౌండ్ ప్రతిభ ' కనబరుస్తున్నాడు. అతణ్ణి తప్పక పరిశీలించాల్సిందే.

హ : మళ్ళీ 13 మంది తో బరి లో దిగుతారా?
పా : 13 కాదు, 14 మంది తో దిగుతాం.

హ : బెస్ట్ ఆఫ్ లక్ పాంటింగ్.
పా : వుంటా హర్ష.

------------------------------------------------------------

పాంటింగ్ సంగతి అటుంచితే, తెర వెనక ఒకాయన సన్నాయి నొక్కులు నొక్కుతునే ఉన్నాడు, మాచ్ జరిగుతున్నప్పుడంతా. ఈ నిలయ విద్వాంసుని పేరు, ఇయాన్ చాపెల్. సిడ్నీ మాచ్ లో, గంగూలీ కాచ్ ను, క్లాక్ గారు బాగానే పట్టారట. తనకు ఆ కాచ్ మీద ఎటువంటి డవుటూ లేదట. కాకపోతే, అంపైరు, పాంటింగ్ ను అడగడమొక్కటి అంత బాగా లేదట!

ఇక ఈ మాచ్ ఆఖరు రోజు ఆటలో, ఈన గారి కొన్ని నొక్కులు చూద్దాం.

పాంటింగ్ ఇషాంత్ శర్మ బౌలింగ్ ఎదుర్కుంటున్నాడు. ఓ బంతి కి ఆడకుండా పాడ్స్ అడ్డు పెట్టాడు. అప్పీల్ చేసారు, భారత్ ఆటగాళ్ళు. అప్పుడు ఇయాన్ చాపెల్ నొక్కు : " అవుట్ సైడ్ ద లైన్ అప్పీల్ చేయడం ఆస్ట్రేలియా లో అర్థ రహితం. ఇలా అప్పీల్ చేస్తూ వెళితే, ఇప్పుడు కాకపొయినా, తర్వాతైనా అవుట్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఇలా చేస్తున్నారనిపిస్తుంది"

గిల్ క్రిస్ట్ బాటింగప్పుడు ఇంకో నొక్కు : "ఇప్పుడు ఆటగాళ్ళ మొహిరింపు హాస్యాస్పదం గా వుంది. రక్షణాత్మకంగా వుంది. ఎలా ఆడినా, పరుగులు వచ్చేటట్టుగా వుంది. ఇప్పుడు కాకపోతే, ఇంకెప్పుడు అట్టాక్ చేస్తాడు? ". అయితే, బాగా గమనిస్తే, కుంబ్లే, గిల్లీ ని ప్రలోభ పెట్టి బోల్తా కొట్టించడానికే అల్ల చేసాడన్నది, అర్థం అవుతుంది.

-------------------------------------------------------------

యేదయితేనేం, నిజమైన గెలుపు మనదే. ఇందులో సందేహం లేదు.

1 comment:

  1. 'తుంటర్వ్యూ' బాగుంది

    పూలవాన రవికిరణ్

    ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.