Friday, January 18, 2008

నా ఆటోగ్రాఫ్, సొల్లు (సెల్లు)మెమోరీస్...

నాంది.
------

"మంచి మొబైల్ ఓటి చెప్పండి సార్" వారాంతపు సెలవులకు వూరెళ్ళినప్పుడు, మా పక్కింటాయన అడిగాడు. నాకు, మా ఆవిడకూ, కొద్దిగా మొబైల్ పిచ్చి వుందని అక్కడ జనాలకు తెలిసినట్టుంది.

"మీ బడ్జెట్ ఎంత?" అడిగాను.

"ఆరు నుండీ ఆరున్నర వేల దాకా" చెప్పాడు.


"ఎల్ జీ డైనమైటు తీసుకోండి" శివలింగం సలహా (బోడి సలహా) పారేసాను.


సరిగ్గా ఓ మూడు నెలల తర్వాత....


మళ్ళీ పక్కింటాయన కనబడ్డాడు. "ఏంటి సార్ ఇది. మీకు మొబైల్ ఫోన్ల గురించి తెలుసని మిమ్మల్ని అడిగితే, ఇలాంటి పనికిమాలిన మొబైల్ అంటగట్టారు నాకు" నిరసనగా అడిగాడు.

కోపంతో అతని కళ్ళు అరుణిమ దాల్చాయి.

నా శివలింగం సలహాను అతను, శివుడి ఆఙ్ఞ లా పాటిస్తాడు అని నేను వూహించలేదు.


"ఏమయ్యిందండీ? మొభైల్ సరిగ్గా పని చేయట్లేదా?" ఆరా తీసాను.


"ఏం మొబైల్ సార్ ఇది. ఇరవై నాలుగ్గంటలూ, చార్జింగు లో పెట్టుండాలి. మంచి గేములు లేవు, సిగ్నల్ వీక్ గా వుంటే సరిగ్గా పట్టుకోలేదు...." చెప్పుకుంటూ వచ్చాడు.


తప్పు నాదే. ఎందుకంటే, నా సెల్ ఫోన్ అనుభవాలు చాలా వున్నాయి.వాటిని విస్మరించాను.
----------------------------------------------------------------------------------------------

నా మొదటి సెల్ ఫోన్, పానాసోనిక్ ది. ఓ ఐదేళ్ళ క్రితం సంగతి అది. అప్పట్లో, మార్కెట్ లో కలర్ మోడల్స్ చాలా తక్కువ. అందులో పది వేల లోపు లో వున్నవి రెండు. అందులో పానాసోనిక్ ఫోన్ ప్రపంచం లో అత్యంత తేలికైన మొబైల్ అని ప్రసిద్ది. అందుకే దాన్ని ఎంచుకున్నాను. అదో కళాఖండం.

ఓ సంవత్సరం బానే వుండింది. నాకు పెద్దగా ఫోన్లు వచ్చేవి కావు. ఎస్ ఎం ఎస్ లు బానే వచ్చేవి.

ఆ తర్వాత కొన్ని రోజులకు వున్నట్టుండి, ఎస్ ఎం ఎస్ లు రావడం ఆగిపోయాయి. ఇన్ బాక్సు క్లీన్ చేసాను. అయినా కూడా ఎందుకో ఏమో ఫుల్ అని చూపించేది. సర్వీసు సెంటర్ కు తీసుకెళితే, వాడన్నాడు, " దీన్ని చెన్నై పంపి, కొత్త సాఫ్ట్ వేర్ లోడ్ చెయాలి." అని. ఎందుకులే అని, మళ్ళీ కొన్ని రోజులు అలాగే వేగాను.

ఈ లోగా నేను కంపనీ మారటం జరిగింది. కొత్త కంపనీ లో, అందరి ముందూ, నా మొబైల్ వెలవెల బోతోంది.ఆఖరుకు మా టీం లో చేరిన ఓ ట్రైనీ కూడా లేటెస్ట్ మోడెల్ కొనుక్కోవడంతో, ఇక భరించలేక, నా కళా ఖండాన్ని, వచ్చినంత ధరకు అమ్మేసి, సోనీ ఎరిక్సన్ టీ-610 అనే (అప్పట్లో) సూపర్ హిట్ కొన్నాను.

నేను ఆ మోడల్ కొన్న కొన్ని రోజులకే, సోనీ వాళ్ళ కొత్త మోడల్ మరోటి, 3D టెన్నిస్ గేం అదనపు ఆకర్షణ గా మార్కెట్ లో వచ్చింది. టీవీ లో ఆ ఆ వాణిజ్య ప్రకటన చూసినప్పుడల్లా ఓ చిన్న సైజు దేవదాసు లాగ తయారయే వాణ్ణి. దానికి తోడు, ఇందులో లోపాలు ఒక్కొక్కటి కనిపించ సాగాయి.

ఇలా వుండగా ఓ రోజు...


ఆ రోజు, ఆటో వాళ్ళ బందు. ఆఫీసుకు వెళ్ళటానికి వెరే మార్గం లేక 201 సిటీ బస్ ఎక్కాను. ఇక్కడ ఈ బస్ గురించి కొంత చెప్పాలి. ఈ బస్ బెంగళూరు దర్శన్ గా ప్రసిద్దికెక్కింది. ఏ సమయం లోనైనా, జనాలు ద్రాక్ష గుత్తుల్లాగా వేళ్ళాడుతుంటారు ఈ బస్ వాకిలి దగ్గర. దీన్ని PPP అని కూడా పిలుచుకుంటారిక్కడ. PPP అంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కాదు. 'పిక్ పాకెటర్స్ ప్యారడైస్ ' అన్నట్టు.

రింగు రోడ్డు మొదట్లో బస్ వస్తూండగా జేబు లో చూస్తే, ఫోన్ లేదు! మెరుపు వేగం తో, నాతో బాటు వస్తున్న నా ఫ్రెండ్ సెల్ తీసుకుని, అందులోనుండి నా సెల్ కి కాల్ చేసాను. అవతల వాళ్ళు, మెరుపు కంటే వేగంగా ఆలోచించి సెల్ ఆఫ్ చేసుంచారు అప్పటికే.

రెండు రోజుల తర్వాత ఇంకో కొత్త మొబైల్ కి అంకురార్పణ జరిపాను. ఈ సారి నోకియా 6030 (అనుకుంటా...గుర్తు లేదు). ఈ ఫోన్ ఓ రాయి లాగ వుంటుంది. మా వీధిలో కుక్కను తరమడానికి కూడా ఓ సారి ఉపయోగించినట్టు గుర్తు. "అన్నీ వున్నా అల్లుని నోట్లో శని" అనే సామెత ఈ మొబైల్ కి వర్తిస్తుంది. మంచి బాటరీ, బ్లూ టూత్, ఎం ఎం ఎస్, వగైరా వగైరా అన్నీ వున్నా., వుపయోగించడానికి సౌలభ్యంగా మాత్రం లేదు. పైగా, ఓ సారి సోనీ వాడిన తర్వాత నోకియా వాడ్దం ఓ పెద్ద ఇబ్బంది. రెంటికీ కీ పాడ్ లో తేడాల వల్ల ఆ ఇబ్బంది. పైగా ఎక్స్టర్నల్ మెమోరీ లేకపోవడం ఓ పెద్ద వెలితి లాగ కనబడ సాగింది.

ఇటువంటి పరిస్థితుల్లో, ఓ ఫ్రెండ్ ద్వారా, సరసమైన ధర కు ఓ హై ఎండ్ ఫోన్ దొరికే అవకాసం రావడంతో, మళ్ళీ కొత్త ఫోన్ కు నాంది పలికాను. ఎల్ జీ ఎం-4410. ఫ్లిప్ మోడల్. కార్ మోడల్ అంటారు, దీన్నే. సాధరణంగా వుండే అన్ని సౌకర్యాలతో పాటూ, బ్లూ టూత్ హెడ్ సెట్ ఉచితంగా ఇచ్చారు దీనికి.

సెల్లొచ్చిన వేళ, పెళ్ళొచ్చిన వేళ అన్నట్టుగా నా పెళ్ళి సంబంధం కుదరడం జరిగింది. కొత్త ఫోన్, కొత్త అమ్మాయి జీవితం లో..

పెళ్ళి కి ముందు గంటల తరబడి మాట్లాడుకుంటూ వుండే వాళ్ళం., ఫోన్ లో. రాన్రానూ, నా సెల్ ఫోన్ లో లోపాలు, నాక్కాబోయే అమ్మాయి లో లోపాలు, రెండూ బయటకు వస్తున్నాయి. ఓ విషయం లో మాత్రం మా అభిరుచులు కలిసేయి. ఆ అభిరుచి పేరు, సెల్ ఫోన్ల పిచ్చి!

పెళ్ళి రోజు మంచి గిఫ్ట్ ఇస్తానని, వాగ్దానం చేసాను. అంతర్జాలం లో తెగ వెతికి, సమీక్ష లు చదివి, iPoD లేదా W810I, ఈ రెంటి ని ఫిక్ష్ చేసి, W810I ని నిర్ధారించాను.

నా W810I మొట్టమొదటి సారి నేను ఆశించిన స్థాయి లో వున్న ఫోన్. ఇలా వుండగా ఒకానొక స్నేహితుల దినోత్సవం నాడు, మా ఆవిడా, ఆవిడ స్నేహితురాలు, తమ తమ, ఫోన్లు, W810I, నోకియా N72 లను మార్చుకున్నారు!

అలా నోకియా న్72 ను వాడే అవకాశం లభించింది. ఇందులో స్మార్ట్ మూవీ అనే ఎంపిక వుంది. మొత్తం సినిమా ను ఇందులో కుదించుకుని చూసుకోవచ్చు. మా ఆవిడ, ఇందులో పోకిరి సినిమా ను ఎక్కించడం తో, ఆఫీసులో, మీటింగులప్పుడు పనికివస్తుందని, నేను మా ఆవిడా, ఫోన్ తీసుకుని ఆవిడకు నా ఎల్ జీ ఫోన్ ఇచ్చాను.

ఓ దుర్దినం..మా ఆవిడ, వూరెళుతూ, ఎల్ జీ చార్జర్ తీస్కెళ్ళడం మర్చిపోయింది. అక్కడ ఎల్ జీ వాళ్ళ ఇంకో మొబైల్ కి ఉపయోగించే చార్జర్ వాడింది.

అంతే! గాఢాంధకారం. సర్వీసు సెంటర్ వాడు, 1500 అవుతుందని చెప్పేడు. వుహూ...

ఇక నా ఓపిక నశించింది. ఓ చిన్న మొబైల్, మోటోరోలా వాళ్ళది వాడుతున్నా, అప్పటి నుండీ.

------------------------------------------------------------------------------------

మా వూరెళ్ళినప్పుడల్లా, మా పక్కింటాయన కు కనబడకుండా, వీరప్పన్ లా తప్పించుకుని తిరుగుతున్నాను. అలానే ఇంటి ముందు ఓ బోర్డు వేలాడెసాను.

"ఇక్కడ మొబైల్ ఫోన్ గురించిన సలహాలు ఇవ్వబడవు" అని.
3 comments:

 1. హహహహ ఇంతకన్నా ఏం చెప్పలేను ఇ ప్పటికి

  ReplyDelete
 2. Keka Keko Keka

  Nenoo Bangalore lone Unnanadi. Bale baaga chepparu 201 gurinchi.

  ReplyDelete
 3. Hai story Bavundhi inthaki motorola phone edivaduthnavu.

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.