Thursday, January 3, 2008

భలే చెడ్డ రోజు!!

బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు.

కొన్నేళ్ళుగా కొత్త సంవత్సరం ను నేను తెలుగు సంస్మరణ దినోత్సవం గా కూడా జరుపుకుంటున్నాను. దానికి నాకో ఫ్లాష్ బాక్...తెల్లటి గుండ్రాలు చుట్టుకుంటూ వెళితే...

కొన్నేళ్ళ కిందటి సంగతి. ఇదే రోజు...

ఓ సారి మా పిన్ని ఇంటికి వెళ్ళాను. పండుగ రోజు పొద్దున తలంటుకుని, ఫ్రెష్ గా తయారై, టీవీ ముందు సెటిల్ అయాము. ఆ రోజు, ఊళ్ళో, కేబుల్ వాళ్ళ బందు అట. కేవలం దుష్ట దర్శన్ మాత్రమే వస్తుంది!

దుష్ట దర్శన్ లో "శంభో శంకర" హింది సీరియల్ తాలూకు డబ్బింగు వస్తూంది.


"బ్రహ్మ దేవుడా, ప్రత్యక్ష్యం కా..,బ్రహ్మ దేవుడా, ప్రత్యక్ష్యం కా.." పొద్దు గడవని రాక్షసుడు ఒకడు ఘోరంగా తపస్సు చేస్తున్నాడు.


తపస్సు కి మెచ్చి "శివుడు" ప్రత్యక్షం అయాడు. (బ్రహ్మ కోసం తపస్సు చేస్తే శివుడు ఎందుకు వచ్చాడు ?? మీకు అనవసరం.) వరం అనుగ్రహించి పంపేసాడు.


తర్వాత సీను, కైలాసం కి మారింది.


పార్వతి శివుడితో, " పరమేశ్వరుల వారు ఆ దుష్టునికి అట్టి వరమొసంగుట వెనుక గల అంతర్యమేమిటో ? " అంది, చిరునవ్వుతో.


శివుడు " దేవీ, మేమా అసురుణ్ణి సం హరిస్తాం. " , నొక్కి వక్కాణించాడు.

ఇంతలో నారదుడు తయారయ్యాడు. " నా...రాయణ, నా...రాయణ" అంటూ.


"నారద మహర్షుల వారికి స్వాగతం. మునీంద్రా, మీరైననూ, పరమ శివుల వారి అంతర్యమును గూర్చి వచించండి" అంది పార్వతి.


" పరమ శివుల వారు భోళా శంకరులు" అన్నాడు, నారదుడు పగలబడి నవ్వుతూ.

విరామం..వాణిజ్య ప్రకటనలు మొదలయాయి.

జీవన భీమా సురక్ష.(వుయ్యాలలో ఒకతను వూగుతున్నాడు) మీరు వున్నప్పుడూ..(వుయ్యాలలో అతను లేడు) మీరు లేనప్పుడూ...

మనిషే లేనప్పుడు వాడికి సురక్ష ఎక్కడ నుండి ఇస్తాడో అర్థం కాలేదు.
విరామం ముగిసింది.

తర్వాత సీన్ లో కొంతమంది ధృఢకాయులు మునుల వేషాల్లో కూర్చుని యేదో డిస్కస్ చేస్తున్నారు.
ఆ తెలుగు (దెబ్బ) కు మా నుదుట స్వేద బిందువులు ప్రత్యక్షం అయాయి.

సీరియల్ ఆ వారానికి ముగిసింది. వేడి గా కాఫీ లు తాగాం.
మధ్యాహ్నం సినిమా కు వెళ్ళాలి అని డిసైడు అయాము.

సినిమా థియేటర్ ఓ ముల్టిప్లెక్సు. టికెట్స్ తీసుకుని లోపలకు వెళ్ళిన తర్వాత చూస్తే, సీట్లన్నీ ఖాళీ గా వున్నాయి. ఇదేంట్రా ఇది కొత్త సినిమా కదా అనుకుంటుంటే, టైటిల్స్ స్టార్ట్ అయాయి. ఘోరమైన తప్పిదం జరిగి పోయింది. మేమనుకున్న సినిమా కాదది. హాలీ వుడ్ లో పిచ్చ పిచ్చ గా కలెక్షన్ లు వసూలు చేసి,కనీ వినీ యెరుగని గ్రాఫిక్స్ తో కూడిన చిత్రం తాలూకు తెలుగు డబ్బింగు. స్క్రీను మీద " కారడవిలో కట్లపాము " అక్షరాలు ప్రత్యక్షం అయాయి.


ఆ సినిమా లో పాత్రధారుల తెలుగు, కట్ల పాము బుస లా వుంది. పైగా ఓ పాత్రధారి తో, తెలంగాణా యాస లో డబ్బింగు చెప్పించారు. ఆ తెలుగు కి మా చెవుల్లో రక్తాలు కారాయ్.

ఇలా రాత్రి అయ్యింది. రాత్రి భోజనాలప్పుడు తిరిగి ఇంకో ధారా వాహిక మీ, మా దుష్ట దర్శన్ లో. ఇదీనూ, హింది డబ్బింగే. దీని పేరు "శూర హనుమాన్". హనుమాన్ పాత్రధారి గాత్రం అందరికీ చిరపరిచితమైనది. కాల్గేట్, వీకో వజ్రదంతి, వగైరా ప్రకటనలలో వినిపించే కంచు కంఠం అది.

ఇది జరుగుతున్నప్పుడు మా మామ (బాగా పెద్దాయన) పక్క గది లో వున్నారు. ధారవాహిక (శూర హనుమాన్) మధ్య లో బ్రేక్ వచ్చింది. వెంటనే కాల్గేట్ ప్రకటన రాసాగింది.
" నోటి దుర్వాసన.." అంటూ ఓ గొంతు.

మా మామ వెంటనే పక్క రూం నుండీ ఘర్జించాడు. " యేం సీరియల్ రా అది. హనుమంతుడు, నోటి దుర్వాసన అంటాడు ?" అని. (హనుమంతుడి గొంతు, కాల్గేట్ ప్రకటన లో వినిపించే గొంతూ ఒక్కరివే !)

ఇంకా కాస్త రాత్రి అయిన తర్వాత నిద్ర పట్టక మళ్ళీ టీవీ ఆన్ చేసాము.

యేదో పౌరాణిక కార్యక్రమం. టీవీ లో ఓ ముసలాయన , ఆయన పక్కన ఓ నిండైన భారీ విగ్రహం ఇంకో ఆయన కూర్చుని, శ్రోతల అధ్యాత్మిక, పౌరాణిక ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నారు.

" శాస్త్రి గారూ, నా పేరు ...ఫలానా మూర్తి. అశ్వమేధానికీ, రాజ సూయానికీ తేడా యేమిటండీ ? "

శాస్త్రి గారు రియాక్ట్ అయే లోగా నిండు విగ్రహం అందుకుని, " చాలా సంతోషం మూర్తి గారూ, అంతా బాగున్నారా? " కుశల ప్రశ్నలు వేసాడు. మళ్ళీ ఇలా కంటిన్యూ చేసాడు " ఆ... శాస్త్రి గారు, అశ్వమేధానికీ, రాజ సూయానికీ తేడా వివరిస్తారా ? "

శాస్త్రి గారు శాస్త్రోక్తంగా జవాబు చెప్పేరు. శాస్త్రి గారి జవాబు కు ఆ నిండైన శాంతి స్వరూపం అర్ధ నిమీలిత నేత్రాలతో కామెంటరీ అందించింది.

తరువాత ప్రశ్న. " ధృత రాష్ట్రునికి 100 మంది కొడుకులతో పాటు, ఓ కూతురు కూడా వున్నట్టు తెలుస్తూంది. ఆమె డిటయిల్స్ చెబుతారా? "

ఇక భరించ లేక టీవీ స్విచ్ ఆఫ్ చేసి, ఝండూ బాం పట్టించి నిద్రకు వుపక్రమించా.

ఆ రాత్రి నాకో భయంకరమైన పీడ కల. కొంతమంది నన్ను కట్టేసి, నా యెదురుగా దుష్ట దర్శన్ చూపిస్తున్నట్టూ.నేను వారికి ప్రతి యేడాది, ఇదే రోజు తెలుగు సంస్మరణ దినోత్సవం గా జరుపుకుంటానని మాట ఇచ్చిన తర్వాత వదిలి పెట్టినట్టూ.

2 comments:

  1. మరి మీ యిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారా? లేక మా ఎంఫోర్సుమెంట్ టీముని పంపించేదా?

    ReplyDelete
  2. chaala bavundandi me dusta darshan...me mamayya gaari joke inka baavundi hahaha :)
    keepposting

    ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.