Saturday, September 15, 2007

నమ్మ (శక్యం కాని) బెంగళూరు - కారు కూత

మీది రాయల సీమా అడిగేడు , కొత్తగా పరిచయమైన ఓ కన్నడ అతను. నా హ్రుదయం లో కోటి వీణలు మోగలేదు కానీ ఎక్కడో టచ్ చేసినట్టు అనిపించింది.

అవును. ఎలా కనుక్కున్నారు ? అడిగాను.

రాయల సీమ వాళ్ళు చాలా ఆవేశం, పౌరుషం వున్న వాళ్ళంట కదా, మీ ముఖం చూస్తే అలా అనిపించింది, చెప్పాడు.

అతను రాత్రి సెకండ్ షో లో ఇంద్ర లేదా సమర సిమ్హా రెడ్డి చూసాడేమో తెలీదు. నా ముఖం అంత పౌరుషం తో వుందా అడిగాను.

హా, ఎదో రగిలిపోతున్నట్టు గా, కొంచెం తీవ్రంగా మండిపోతున్నట్టు వుంది చెప్పాడు, కన్నడ కస్తూరి భాషలో ఇంచు
మించు గా అదే మీనింగ్ లో.

ఎందుకబ్బా అని ఆలోచించాను. గుర్తొచ్చింది. మొన్నా మధ్య నే నేను కారు కొన్నాను.

***************************************************************************

" మంచి తరుణము మించిన దొరకదు, ఆలసించిన ఆశా భంగము, నేడే మేమందించు కారు లోను గైకొనుడి, ఈ మా ప్రయత్నము ను అభినందించుడి" కంపనీ హెచ్ ఆర్ వారు ప్రకటించారు ఇ మైలు ద్వారా.

ఇది నాంది.

***************************************************************************

ఇక కారు వస్తే, కారు పార్కింగు వున్న ఇల్లు కావాలి కదా. అందుకు ఇళ్ళ వేట మొదలయింది. ఎందుకైన మంచిదని నా ఫోను నంబర్ కొంత మందికి చెప్పి వుంచాను, అలానే కొన్ని మాత్రలు దగ్గర వుంచుక్కున్నాను. ఇళ్ళ అద్దె రేటు విని గుండె పోటు వస్తే ముందు జాగ్రత్త గా. ఎలానో చివరికి ఇల్లు దొరికింది.

"చివరికి" అంటే వూరి చివరికి అన్నమాట.

***************************************************************************

కారు వచ్చేసింది. కారు వంక ఆనందం తో చూసాను. కారు డోరు మ్రుదువుగా ఓపన్ చేసాను. కారు లోపల వేలాడదీయడానికి ఒక అందమయిన జపాను బొమ్మ వుంది చేతిలో. మరుసటి రోజు ఉదయం. 8 గంటలకు బయలు దేరాను ఆఫీసుకు. ఒక గంట సేపు ఇంచుమించు గా సరిపోతుంది అనుకుని. కారు ఏర్ పోర్ట్ రోడ్డు లో అడుగు పెట్టింది.

అంతే.

ఏవడో మినిస్టరు వస్తున్నాడట. భయంకరమయిన ట్రాఫిక్ జాము. సరె ఎలాగో బయట పడి ఇంకో గంట తర్వాత ఆఫీసుకు చేరాను. ఆఫీసు లో ఆ సరికే కారు పార్కింగ్ లాట్ నిండి వుంది, లక్కీ గా ఎదో మూల జాగా దొరికింది.

మామూలు గానే రోజంతా మీటింగులతో, ఇ మైలు, కాఫీ, ఫోను లాంటి వాటితో బిజీ గా గడిచింది.

కారు బయటికి తీద్దామని వెళ్ళి చూస్తే, పొద్దున తొందర్లో, సరిగ్గా గమనించలేదు బోయ్ నెట్ కు పక్కగా ఒక స్క్రాచ్. చిన్న నొక్కు. గుండె పగిలింది (శబ్దం రాకుండానే). సరే, ఇంటికి వెళ్ళాను. మా ఆఫీసు నుండి బయట పడి రోడ్డు చేరాలంటే 2 కె ఎం చుట్టు తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే దగ్గర్లో ఎక్కడా టర్న్ తీసుకోడానికి లేదు. ఆ సరికే రోడ్డు నిండి
వుంది. ఒకటే హారన్ల మోత. నేను చీమ స్పీడు తో వెళ్ళి, రోడ్డు చేరుకున్నా. ఇంటికి వెళ్ళే సరికి 10:30 అయింది.

మరుసటి రోజు సెలవు. సర్వీసింగు కోసం కారు తీస్కెళ్ళాను, సర్వీసింగ్ వాడు ఆ స్క్రాచ్ చూసి చెప్పాడు. లాభం లేదు సార్, బోయ్ నెట్ మార్చాలంతే. ఇంత చిన్న స్క్రాచ్ కు మొత్తం బోయ్నెట్ కొత్తది మార్చాలా? ఇదెక్కడి చోద్యం ? ఇలానే పడుండనీ అని, అలా షికారు కోసం ఎం జీ రోడ్డు వైపు వెళ్ళాను.

అదే నేను చేసిన తప్పు.

దాదాపు 3 కిలో మీటర్ల పరిధి లో ఎక్కడా కారు పార్కింగ్ అవకాశం లేదు. సరే, ఎలానో చివరికి పార్క్ చేసి, అలా తిరిగి, (ప్లానెట్ ఎం లో పాటలు, వగైరా) ఆటో లో 10 రుపాయలు ఎక్స్ట్రా ఇచ్చి, కారు వద్దకు చేరి, అక్కడ నుండి ఇంటికి చేరాను.

ఇలానే ఓ రోజు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, వాడి బలవంతం మీద రాత్రి వాడి ఇంట్లొ మకాం వెసి, పొద్దునే బయటకు వస్తె ఇంకో హారర్ సీను. కారు టయరు పైన కేసింగు దగ్గర చిన్న చిన్న నొక్కులు. ఎవరో మేకులు దించినట్టుగా. ఎలా జరిగిందబ్బా అని ఆలోచిస్తే, మా వాడు సెలవిచ్చాడు. ఇది ఆ వీధి లో కుక్కల పని అట. మా వీధిలో కుక్కలు అమయకమైనవి. కేవలం అరుస్తాయి, లెదా కరుస్తాయి. కానీ ఈ వీధి లో కుక్కలు ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాయని కలలో కూడా అనుకోలేదు.

పర్సు తుప్పు బాగ వదిలిందా రోజు.

మరి కొన్ని రోజుల తర్వాత వర్షా కాలం వచ్చింది. ఆ రోజు బెంగళూరు లో కుండపోత వర్షం. బయట కారు లో ఇంటికి వెళదాం అని రోడ్డు మీదకు వస్తే, మామూలుగానే ట్రాఫిక్. అయితే ఆ రోజు ట్రఫిక్ మరో 4 గంటలకు కానీ తెమల్లేదు.

ఆ వర్షం కురిసిన రాత్రి నేను ఇంటికి చేరే సరికి 1:30.

ఈ మధ్య కారు లో రాత్రి పొద్దు పోయిన తర్వాత రోడ్డు మీదకు వెళ్ళిన వాళ్ళను అటాక్ చెయడం లాంటి వార్తలు విన్న తర్వాత బయట వెళ్ళడం కూడా మానుకున్నాను.

ప్రస్తుతం నాకున్న సమస్య ఈ కారు ఎలా వదిలించుకోవడం అనేదే.

అన్నట్టు ఈ మధ్య ఆ జపాను బొమ్మ ను చూసినప్పుడెల్ల ఎందుకో పట్టరానంత ఆవేశం వస్తుంది.యేదో ఓ రోజు ఆ బొమ్మను నేనేం చేస్తానో నాకే తెలీదు.

3 comments:

 1. http://geocities.com/chavakk19/te/kavita/bangaluru.html

  మీరు ఇలా పది సార్లు నమశక్యం కాదు అంటంటే నా గతం గుర్తు వచ్చింది.

  ReplyDelete
 2. హహ్హహ్హ! "ఇంతకంటే అధ్వాన్నంగా తయారు కాదు" అనిపించుకొనే కారయితే కొనుక్కోవచ్చన్నమాట. అప్పుడు మీది రాయలసీమ అని ఎవ్వరూ మొహం చూసి గుర్తుపట్టేసే అవకాశం ఉండదు. ఈ టపాలో "చివరికి" లాంటి చమత్కారాలు బాగున్నాయి.

  ReplyDelete
 3. maaku maro haasya blaagu dorikindanna maaTa....

  raasina teeru ,aasantam cadivincindi

  ReplyDelete

టపా స్ఫూర్తికి, ఉద్దేశ్యాలకు విరుద్ధంగా చేసే వ్యాఖ్యలు అనుమతింపబడవు. ఈ విషయంపై సర్వహక్కులు బ్లాగు యజమానివే.